ఆకాశవాణి పరిమళాలు-40

0
3

[box type=’note’ fontsize=’16’] అనంతపద్మనాభరావు దూరదర్శన్, ఆకాశవాణి వంటి సంస్థలలో ఉన్నత స్థాయి పదవీ బాధ్యతలు నిర్వహించారు. తన అపారమైన అనుభవాలను “ఆకాశవాణి పరిమళాలు” శీర్షికన పాఠకులతో పంచుకుంటున్నారు. [/box]

సాహిత్య పరిచయాలు:

నెల్లూరు జిల్లా:

[dropcap]’అ[/dropcap]చట పుట్టిన చిగురు కొమ్మైన చేవ’ అని మనుచరిత్రలో పెద్దన్న అన్నట్టుగా మా నెల్లూరు గడ్డపై ఎందరో ప్రసిద్ధులు ఖ్యాతి గడించారు. ముందుగా గురుస్మరణ చేస్తున్నాను. నేను బి.ఎ. స్పెషల్ తెలుగు 1962-65 మధ్య వి.ఆర్. కాలేజీ నెల్లూరులో చేశాను. మాకు తెలుగు చెప్పిన మేస్టార్లు – పోలూరి హనుమజ్జానకీరామశర్మ, పిశుపాటి విశ్వేశ్వరశాస్త్రి, కోట సుబ్రహ్మణ్యశాస్త్రి, బడి గురవారెడ్డి, తెలుగు శాఖలో వి. నారాయణ రెడ్ది తదితరులు; ఇంగ్లీషు బోధించిన దుర్భా రామమూర్తి, వేదం వెంకట్రామన్ ప్రాతఃస్మరణీయులు.

నెల్లూరులో నేను మూడు అష్టావధానాలు చేశాను. 1973 జనవరి 1న జిల్లా గ్రంథాలయ సంస్థలో అవధానానికి మరుపూరు కోదండరామరెడ్డి అప్రస్తుత ప్రసంగం చేశారు. వి.ఆర్. కాలేజీ అవధానం తర్వాత తిక్కవరపు రామిరెడ్డి సన్మానించారు. ఓరియంటల్ కాలేజీ అవధానానంతరం మాజీ గవర్నరు డా. బెజవాడ గోపాలరెడ్డి సత్కరించారు. జిల్లాలో వెంకటగిరి, దగదర్తి, దామవరం హైస్కూళ్ళలో అవధానాలు చేశాను. కావలి కాలేజీలో చేశాను.

నెల్లూరు ప్రత్యేకంగా వెళ్ళి దీపాల పిచ్చయ్య శాస్త్రిని, మరుపూరు కోదండరామిరెడ్డిని రికార్డు చేసి, ఆర్కైవ్స్‌లో ఉంచాను. జిల్లా గ్రంథాలయ సంస్థ హరిశ్చంద్రారెడ్డి, జమీన్ రైతు సంపాదకులు నెల్లూరు శ్రీరామమూర్తి, డోలేంద్ర, లాయర్ పత్రికాధిపతి తుంగా రాజగోపాలరెడ్డి, శివప్రభాతరెడ్డి, సింహపురి ఎడిటర్ సుబ్రహ్మణ్యం, యూత్ కాంగ్రెస్ ఎడిటర్ యల్.వి.కృష్ణారెడ్డి నా రచనలు విద్యార్థిగానే ప్రచురించారు.

ప్రాచ్య కళాశాల ప్రిన్సిపల్ ఉడలి సుబ్బరామశాస్త్రి, వారి కుమారులు నరసింహశాస్త్రి, అధ్యాపకులు రాజేశ్వర శర్మ, చిదంబర శాస్త్రి సుపరిచితులు. రచయితలైన యన్. యస్. కృష్ణమూర్తి, అగస్త్యరెడ్డి వెంకురెడ్డి, గోసుకొండ వెంకటసుబ్బయ్య, బి.వి.నరసింహం, వొమ్మిన సుబ్రమణ్యం, నటులైన పొన్నాల రామసుబ్బారెడ్డి, గూడూరు సావిత్రి, రేబాల రమణ, గ్రంథకర్తలైన వాకాటి పెంచలరెడ్ది, రామిరెడ్డి నారాయణ రెడ్డి, పద్యకవి శివారెడ్డి, ఊరుచిండి వెంకట సుబ్రమణ్యం, పాత్రికేయ పరిశోధకులు బం.గొ.రె, గోపి, డా. కాళిదాసు పురుషోత్తం, మోపూరు వేణుగోపాలయ్య, రామచంద్ర ప్రసాద్ మంచి మిత్రులు. నేలనూతల కృష్ణమూర్తి ప్రముఖులు.

కావలిలో అవధానం చేసినప్పుడు పరిచయమైన ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి, యస్.వి. భుజంగరాయశర్మ, ఇంద్రగంటి భానుమూర్తి, జె.వి. సుబ్బారాయుడు, కరవది రాధాకృష్ణమూర్తి, కేసరి సుందర రామశర్మ ప్రసిద్ధులు. కె.వి. గోపాలస్వామి, దొడ్ల రామచంద్రారెడ్డి, వేదుల సత్యనారాయణ ఆ కళాశాల కీర్తి శిఖరాలు.

ప్రకాశం జిల్లా:

నేను కందుకూరు కళాశాల అధ్యాపకుడిగా 1967 డిసెంబరు 16న చేరిన నాటికి కందుకూరు నెల్లూరు జిల్లాలో భాగం. 1970లో ప్రకాశం జిల్లాలో కలిపారు. 1970లో కందుకూరు రచయితల సంఘం స్థాపించి దాని అధ్యక్షుడిగా పదేళ్ళు పనిచేశాను. 1974లో రచయితల సహకార సంఘం ఉపాధ్యాక్షుడనయ్యాను. మా రచయితల సంఘంలో ప్రముఖులు – విక్రాల శేషాచార్యులు, శ్రీదేవమ్మ దంపతులు, కొమాండూరి రామానుజార్యులు, పవని శ్రీధరరావు, నిర్మల ప్రభావతి దంపతులు, బి.వి.వి.హెచ్.వి. ప్రసాదరావు, జంధ్యాల లక్ష్మీ నారాయణ శాస్త్రి, ఆర్.ఎస్. సుదర్శనాచార్యులు, కేతు విశ్వనాథరెడ్ది, యల్లంరాజు శ్రీనివాసరావు, నడిపినేని సూర్యనారాయణ, గుడి నారాయణ బాబు, అల్లం కోటంరాజు ప్రభృతులు. మేం రుద్రకవి జయంతి, గుడ్లూరులో ఎర్రన జయంత్రి, సింగరాయకొండలో పిల్లలమర్రి వీరభద్ర జయంతి జరిపాము. వాసా లక్ష్మీ నారాయణ రైతు కవి.

ఒంగోలులో అప్పటి ప్రముఖులంతా నాకు పరిచితులే. వారిలో నాట్యావధాని ధారా రామనాథ శాస్త్రి, యం.వి.యస్. శర్మ, నాగభైరవ కోటేశ్వరరావు, ఈమని దయానంద, కొలకలూరి స్వరూపరాణి, బి. హనుమారెడ్డి, మల్లవరపు జాన్, జె. వీరాస్వామి, కనిగిరికి చెందిన శతావధానులు కోట సోదర కవులు, అగస్త్యరాజు సర్వేశ్వరరావు, చీమలమర్రి వెంకట్రామయ్య ప్రముఖులు.

నేను కందుకూరులో మూడు సార్లు; కనిగిరి, పొదిలి, వేటపాలెం కళాశాలల్లోనూ అష్టావధానాలు చేశాను. “ఏనుగునెక్కినాము, ధరణీంద్రులు మొక్కగ నిక్కినాము” అని తిరుపతి వెంకట కవులు చెప్పినట్టు బెంగుళూరు ఆంధ్ర సారస్వత సమితి పక్షాన 1976 జనవరి 26న అవధానం చేశాను. శతావధాని నరాల రామారెడ్డి ముఖ్య అతిథి. హైకోర్టు రిజిస్ట్రారు కృష్ణమూర్తి సభాధ్యక్షులు. బాలాంత్రపు రజనీకాంతరావు ఆకాశవాణి రికార్డింగుకు యల్.జి. సుమిత్రను పంపి గంటసేపు బెంగుళూరు నుండి ప్రసారం చేశారు.

గుంటూరు జిల్లా:

నేను విజయవాడ ఆకాశవాణిలో రెండు మార్లు 1978-80, 1995-97 మధ్య పని చేశాను. గుంటూరు కవి పండితులు నన్ను ఆదరంగా చూశారు. కరుణశ్రీ జంధ్యాప పాపయ్య శాస్త్రి, ప్రసాదరాయ కులపతి, జమ్మలమడక మాధవరాయ శర్మ, విశ్వయోగి విశ్వంజీ, తుమ్మల సీతారామమూర్తి, మైలవరపు శ్రీనివాసరావు, ఏలూరిపాటి అనంతరామయ్య, శ్రీరామనామక్షేత్ర కుందుర్తివారు, అమరేంద్ర, స్ఫూర్తిశ్రీ, ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, తెనాలికి చెందిన వెలగా వెంకటప్పయ్య, హితశ్రీ, పోలాప్రగడ దంపతులు, డాక్టర్ కొర్రపాటి గంగాధరరావు, కె.వి. సత్యనారాయణ, సూరం శ్రీనివాసులు, రామమోహనరాయ్, కుమారస్వామి, పాపినేని శివశంకర్, జూపూడి యజ్ఞనారాయణ, కొండా పార్వతీదేవి, ప్రముఖ సినీనటులు ధూళిపాళ, జగదీశ్వరరావు (చీరాల) ఇలా ఎందరెందరో. వారికి అభివందనాలు.

నాగార్జున విశ్వవిద్యాలయంలో నేను పి.హెచ్.డి. పరీక్షాధికారిని. వైస్-ఛాన్స్‌లర్లు బి. సర్వేశ్వరరావు, కె.జె. లక్ష్మణ్, డి.యస్. రెడ్ది, అంజజప్ప (రిజిస్ట్రారు), తెలుగు ఆచార్యులు తూమాటి గోణప్ప, యస్. గంగప్ప, యార్లగడ్డ బాలగంగాధరరావు, ఆకురాతి పున్నారావు, బొడ్డుపల్లి పురుషోత్తం, టి. నిర్మల ఆత్మీయ మిత్రులు. ఎన్నో ప్రసంగాలు వారి చేత చేయించాను.

  

కృష్ణాజిల్లా:

ఆంధ్రుల సాంస్కృతిక రాజధాని విజయవాడ. అక్కడ రెండు దఫాలుగా పని చేయడం వల్ల ఎందరో పరిచితపూర్వులయ్యారు. రెండేళ్ళు నేను ‘ఉషశ్రీ’ స్థానంలోనూ, రెండేళ్ళు ‘రజని’ స్థానంలోనూ పనిచేసే అదృష్టం లభించింది.  విశ్వనాథ సత్యనారాయణ గారిని కలిశాను. యం.ఆర్. అప్పారావు, యం.వి.యల్. నరసింహారావు (నూజివీడు) మా ప్రసంగాలకు వచ్చారు. స్థానికులైన పైడిపాటి సుబ్బరామశాస్త్రి, ప్రకాశచంద్ర శతపథి, కోటగిరి విశ్వనాథరావు, జంధ్యాల మహతీ శంకర్, పరదేశి బాబు, చిలకపాటి విజయరాఘవాచారి, వింజమూరి శివరామారావు, శనగన నరసింహ స్వామి, చివుకుల సుందరరామశర్మ, పింగళి వెంకటకృష్ణారావు, పి. సత్యవతి, వి. కోటేశ్వరమ్మ, జి.వి.పూర్ణచందు, పుచ్చా పూర్ణానందం, డా. సమరం, చెన్నుపాటి విద్య, లక్ష్మణ యతీంద్రులు, కుందుర్తి సత్యనారాయణ మూర్తి, పురాణపండ రంగనాథ్, యర్రోజు మాధవాచార్యులు మున్నగువారిని ప్రముఖంగా ప్రస్తావించాలి. మరెందరో డ్రామా ఆర్టిస్టులు తరచూ కలిసేవారు.

మచిలీపట్నం నుండి పువ్వాడ తిక్కన సోమయాజి, వారి తండ్రి శేషగిరిరావు, గుత్తికొండ సుబ్బారావు, విహారి, శాలివాహన, కాశీనాథుని పూర్ణమల్లికార్జునుడు.

విజయవాడ శాతవాహన కళాశాలలో నేను అవధానం పూర్తి చేయగానే కళాశాల ప్రిన్సిపాల్ ప్రజాపతిరావు నాకు వేదికపై సాష్టాంగ నమస్కారం చేయడం సాక్షాత్తు సరస్వతీ కటాక్షంగా భావిస్తాను. అప్పుడు నా వయస్సు 26 ఏళ్ళు.

విజయవాడలోని పత్రికా సంపాదకులందరూ నా కవితలు, వ్యాసాలు ప్రచురించి ఆదరించారు. ఆంధ్రజ్యోతి నండూరి రామమోహనరావు, పురాణం సుబ్రహ్మణ్యశర్మ, తుర్లపాటి కుటుంబరావు, సత్యనారాయణ, శశికాంత్ శాతకర్ణి, ఆంధ్రప్రభ సంపాదకులు – కూచిమంచి సుబ్రమణ్యం, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంపత్, విశాలాంధ్ర రాఘవాచారి, ఏటుకూరి బలరామమూర్తి, స్వాతి బలరాం, తులసీకృష్ణ, ఆనందజ్యోతి తదితర పత్రికలు మరువరాని మధురస్మృతులు.

ఉభయగోదావరులు:

ఏలూరు కళాశాలలో మా సహాధ్యాయి బండ్లమూడి సత్యనారాయణ, కొండముది శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణి దంపతులు, సాహితి పత్రికా సంపాదకులు సామవేదం జానకిరామ శర్మ, సంగీత నాటక అకాడమీ అధ్యక్షులు పసల సూర్యచంద్రరావు, కార్యదర్శి కె.వి. సుబ్బారావు, కడిమెళ్ళ వరప్రసాద్, వద్దిపర్తి పద్మాకర్, వెదురుపాక గాడ్, ఏలూరు ప్రాచ్య కళాశాల ప్రిన్సిపాల్ నరసింహారావు, కపిలేశ్వరం జమీందార్లు పట్టాభిరామారావు, సత్యనారాయణ రావు (కేంద్రమంత్రులు), బోళ్ళబుల్లి రామయ్య, హరిశ్చంద్ర ప్రసాద్ (తణుకు) సుప్రసిద్ధ నతులు షణ్ముఖ ఆంజనేయరాజు, అంతర్వేది ప్రసాదరాజు, రసరాజు, యస్.టి. జ్ఞాననంద కవి ప్రముఖులు.

రాజమండ్రి అనగాఏ వొళ్ళు గగుర్పొడుస్తుంది. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, క్రొవ్విడి లింగరాజు, డా. ఏ.బి. నాగేశ్వరరావు, ఇస్మాయిల్, స్మైల్, గాడేపల్లి కుక్కుటేశ్వరరావు, కనక్ ప్రవాసి, కరుటూరి సత్యనారాయణ, వై.యల్. నరసింహారావు, మహాదేవమని యర్రాప్రగడ రామకృష్ణ, పురాణపండ రాధాకృష్ణమూర్తి, మృదంగ విద్వాన్ కమలాకరరావు, జొన్నలగడ్డ మృత్యుంజయరావు… ఇలా ఎన్ని జ్ఞాపకాలో. అందరితో కవి సమ్మేళనాలు, ప్రసంగాలు నిర్వహించాను.

ఉత్తరాంధ్ర కవిపండితులు:

నేను కడప, విజయవాడ, కొత్తగూడెం, హైదరాబాదు, ఢిల్లీ, కాన్పూరు కేంద్రాలలో పనిచేశాను. విశాఖపట్టణంలో చేయలేదు. అందువల్ల ఉత్తరాంధ్ర కవిపండితులు తక్కువ పరిచయం.

విశాఖపట్టణానికి చెందిన భమిడిపాటి రామగోపాలం బాగా పరిచయం. వారితో ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. దివాకర్ల రామమూర్తి, గణపతిరాజు అచ్యుతరామరాజు, అయల సోమయాజుల గోపాలరావు, మానాప్రగడ శేషశాయి, విజయనగర సంగీత కళాశాల ద్వారం భావనారాయణ, ఇటీవలి ప్రిన్సిపల్ శ్రీమతి పరిచితులే.

చాగంటి సోమయాజులుగారి కుమార్తెలు తులసి, కృష్ణకుమారి, కుమారుడు శంకర్ బాగా పరిచితులు. 2008లో విజయనగరంలో జరిగిన చాగంటి వారి పురస్కార సభకు తులసి నన్ను పిలిచారు. నా చేతుల మీదుగా సలీమ్‍కి అవార్డు ప్రదానం చేశాను. బరంపురంలో పని చేసిన కృష్ణకుమారి వ్యాస సంపుటికి పీఠిక వ్రాశాను. పీఠికలంటే గుర్తుకువచ్చింది – గత 50 సంవత్సరాలలో వందకుపైగా పుస్తకాలకు పీఠికలు వ్రాశాను.

ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ ఆచార్యులు సుప్రసిద్ధులు. వారి పరిచయ భాగ్యం నా అదృష్టం. నా పి.హెచ్.డి.కి థీసిసి వ్రాసే సమయంలో ఆచార్య యస్వీ జోగారావును కలిశాను. కొర్లపాటి శ్రీరామమూర్తి, మలయవాసిని, వేదుల వారు పరిచితులు. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి కందుకూరులో మా ఆతిథ్యం తీసుకున్నారు.

ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి వద్ద విజయవాడలో జ్యోతిష్యం క్లాసులకు హాజరయ్యాను. సంస్కృతాధ్యాపకులు మద్దులపల్లి దత్తాత్రేయశర్మ, వెలమల సిమ్మన్న, పి.వి.సుబ్బారావు, జర్నలిజం ప్రొఫెసర్ బాజ్జీ నా హితైషులు.

ఎయిడ్స్ డాక్టరుగా ప్రసిద్ధులైన డా. కూటికుప్పల సూర్యారావు ఆకాశవాణి సలహాదారు. వారి కుమారుడు శ్రీచరణ్ సివిల్స్ పరీక్షలకు హాజరవుతూ నా వద్ద శిక్షణ తీసుకుని ఇప్పుడు భువనేశ్వర్‌లో కస్టమ్స్ శాఖలో డిప్యూటీ కమీషనర్‌గా పనిచేస్తున్నాడు.

పురిపండా అప్పలస్వామి, కాళీపట్నం రామారావులు ప్రసిద్ధ రచయితలు. వారు ఆకాశవాణి ఆహుతుల సమక్ష కార్యక్రమాలలో, రికార్డింగులలొ పాల్గొన్నారు.

ఆధునికులలో కాకరపర్తి సత్యనారాయణ, రాంభట్ల నృసింహశర్మ నాకు ఆత్మీయులు. శారదాపూర్ణ శొంఠి, ప్రజల జానకి మిత్రద్వయం ఆకాశవాణి ద్వారా సుపరిచితులు. శారద తండ్రి సుసర్ల గోపాలశాస్త్రి సుప్రసిద్ధులు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here