గతించని గతం-9

0
3

[box type=’note’ fontsize=’16’] “గుర్తు, మతిమరుపు బ్రతుకు పార్శ్వానికి రెండు అంచులు. నీటిపై కనిపించే ఆవృతాల ఆయువెంత? ఆ క్షణమె మనను మమైకాన ఉంచేది. ఏ గురుతయినా జీవనయానపు చివరంచున మిగిలితే అదే గతించని గతం.” రచన చావా శివకోటి. [/box]

[dropcap]”నా[/dropcap] పేరు రాజశేఖర్. అంతా నన్ను శేఖర్ బాబు అంటూ పిలుస్తుంటారు” అంటూ నా దగ్గరకు వచ్చాడు మా పక్కనున్న ఐటీ ఆఫీసరు.

కాస్త ఉలిక్కిపడి తేరుకుని, “రండి” అన్నాను.

రాత్రి తనను తాను గుర్తించుకోలేని వ్యక్తి ఇతనేనా అనిపించింది.

“నాతో ఏమయినా పనా?” అని అడిగాను కుర్చీ చూపి.

“ఊరికే” అన్నాడు నవ్వి.

“ఎంత కాలమయింది మీరిక్కడకు వచ్చి?”

“ఒక నెల పూర్తయ్యింది.”

“ఎక్కడినుంచి వచ్చారు?”

“బెల్గావ్.”

“మీరు చేస్తున్నది బాగా సంపాదన కలిగిన ఉద్యోగం” అన్నాను నవ్వుతూ.

“నిజమే… కాని నేనిప్పటి వరకు ఏమీ సంపాదించుకోలేదు” అన్నాడు.

తరువాత ఏం మట్లాడాలో తోచలేదు. పేపర్ చేతికి తీసుకున్నాను.

జయ బయటనుంచి వచ్చింది. వస్తూనే ఆయన్ని చూసి “మీరా? ఇప్పుడే వస్తాను” అంటూ లోనకు వెళ్ళింది. అయిదు నిమిషాలలో బిస్కట్‌లు టీ మా ముందు ఉంచి…. “మీ శ్రీమతిని పిలుస్తానే” అంది ఆయననే చూస్తూ.

“మీ ఇష్టం” అన్నాడు ప్రసన్నంగా నవ్వి.

“అంటే మీకిష్టం లేదా?” అంది జయ ఆయన్నే చూస్తూ.

“నేనలా అనలేదు కదా..”

“అనలేదు కానీ మీరుగా పిలుద్దామని అనవచ్చుకదా?” అంది నవ్వుతూ.

“అదేం లేదు మనస్ఫూర్తిగా చెపుతున్నాను, పిలవండి.”

ఆవిడ కోసం ఒక్క పరుగున వెళ్ళింది జయ. వెంటపెట్టుకుని మా మధ్యకు తీసుకువచ్చింది.

చాలా ఆకర్షణీయంగా ఉంది.. సింపుల్‌గా కూడా అనిపించింది నమస్కారం చెపుతూ లోనికి వస్తుంటే తెలుగుతనం నట్టింటికి వచ్చినట్లు అనిపించింది. నేను లేచి కుర్చీ చూపాను. కూర్చోనబోతూ మొగుడి వైపు ఒకసారి చూసింది. ఆవిడ చూపుల్లో చూపు కలపక తలదించుకున్నాడతను. జయ అందించిన బిస్కెట్ కొరుకుతూ టీ అందుకుంది.

వారిని చూస్తుంటే నాకు చిత్రమయిన దంపతుల లాగా అనిపించారు.

జీవితం అర్థం కానీ నుడి కట్టు లాంటిది.

ఈ జీవితానికి దీపం మాత్రం మిణుకు మిణుకుమనే ఆశ.

ఆ ఆశకు మితం లేదు అంతూ లేదు.

కొద్ది అస్తిత్వం తప్ప రూపలావణ్యాలు లేవు, అయినా ఇది లేనిదే మనిషి బ్రతకడు. మనిషిని భ్రమననుంచే మధుకలశం ఈ ఆశ.

పొద్దుగూకిన దాకా సరదాగా గడిచింది కాలం.

మామూలుగానే నేను ఆరింటికి స్టూడియోకి వెళ్లాను. మూడో ఫ్లోర్‌లో పని జరుగుతుంది. హీరోయిన్ రాక కోసం ఎదురు చూస్తున్నారు అంతా. అంతకు ముందు పాచ్ షాట్స్ ఉంటే ఒకరిద్దరితో పూర్తి చేసుకున్నారు.

రెండుగంటలు ఆలస్యంగా హీరోయిన్ పూర్తి మేకప్‌తో సెట్లోకి ప్రవేశించింది. హంసలా నడుస్తూ నిర్మాత దర్శకులను విష్ చేసింది. అప్పటి దాకా తలపట్టుకుని కూర్చున్నవారు  ఆవిడ ‘సారీ ఫర్ ది డిలే’ అనగానే పర్వాలేదంటూ నవ్వారు. ఆవిడలో చింతాకంత బాధ కానీ, పొరపాటు జరిగిందనే భావన కానీ కనిపించలేదు. పైగా ‘ఇక ప్రారంబిద్దాం’ అని నవ్వింది.

విరిసిన మల్లెలు గుమ్మరిచ్చినట్టుగా ఉందా నవ్వు. ఆమె ప్రతి కదలికలోనూ కొత్త అందం. ఊపిరి సలపనివ్వని బిగువులు కనిపించి నోట్లో నీరూరేలా చేసింది. పిడికెట్లోకి ఇమిడే సన్నటి నడుము, పచ్చటి శరీర ఛాయా, విశాల నేత్రాలు, సగానికి పైగా కనిపించే వీపు – సెట్ లోని వారు అటునుంచి దృష్టి మరలించలేకపోతున్నారు. న్యాయానికి ఆవిడకు మేకప్పే అవసరం లేదు. అంతటి అందమే గాక, ఫోటోజనిక్ ముఖం.

కెమెరామెన్ షాట్సు ఫిక్స్ చేసుకుంటూ…. తదనుగుణంగా లైట్లను ఏర్పాటు చేసుకుంటూ, టిల్ట్ అప్.. టిల్ట్ డౌన్ అటు… ఆఁ కొంచెం కిందికి అంటూ సూచనలిస్తున్నాడు. సెట్ పైన చెక్కలపై నిలుచున్న వారు రాం తో సహా లైట్లు అమర్చడంలో నిమగ్నమయ్యారు. నాలుగు వైపులనుంచి నెమ్మదిగా కదిలి సెట్లోని షాట్‌కు అనుగుణంగా అమరాక ఆగినది.

షూటింగ్ మొదలయ్యింది. హీరోయిన్ శోకరసంలో కూడా సెక్స్‌ను గమ్మత్తుగా గుప్పిస్తున్నది. ఆ షాట్ తరువాత మరో యాంగిల్‌కు షాట్‌ను మార్చవలసి వచ్చింది. తదనుగుణంగా లైట్లు….

ఈలోపు హీరోయిన్ వెళ్లి తన చైర్‌లో కూర్చున్నది.

ఇంతలో అకస్మాత్తుగా పైన అమర్చిన లైట్ల చెక్కల నుంచి వెర్రికేక వినిపించింది. అంతా అటుగా మళ్ళేసరికి ‘దబ్’మన్న శబ్దం వినిపించింది. శబ్దమయిన దిక్కుకు అంతా పరుగెత్తారు. ఒక వ్యక్తి బొక్కబోర్లా పడి రక్తం కక్కుతూ

కనిపించాడు. అప్పటికే ఆ శరీరం చలన రహితమవుతున్నది. అనాలోచితంగా చూస్తున్నారు తప్ప ‘అమ్మో, పడిపోయాడు, రక్తం’ అనుకుంటూనే దగ్గరకు జరగలేక పోయారు.

నాకు చూడబుద్ది కాలేదు. వెంటనే డాక్టర్‌కు చూపితే బ్రతుకుతాడేమో! అన్న భావన కలిగింది. అమాంతం ఎత్తుకుని ఫ్లోర్ బయటకు చేర్చాను. అంబులెన్స్ లేదు. భేది కారు తెమ్మని కేకేసి అందులోకి చేర్చి హాస్పటల్‌కు చేరాము. అన్ని సక్రమంగా కలిసొస్తే నా ప్రయత్నం విఫలమయ్యేది కాదు. డాక్టర్ అతని చెయ్యి చూస్తూనే పెదవి విరిచాడు. ‘డాక్టర్’ అని పెద్దగా అరిచాను.

చనిపోయాడు ఇప్పుడు ఎవరేం చేయగలం? అతని అక్కడే వదలి వెనక్కి వచ్చేసాను. నిజంగా నాకు దుఃఖం ఆగలేదు. స్టూడియో మేనేజ్‌మెంట్‌కి చెప్పి ఇంటికి చేరేసరికి మూడయింది. గాడనిద్రలో ఉంది జయ. నా మనసేమో చిందర వందరగా ఉంది. మంచం ఎక్కాను. నిద్ర సరిగ్గా రాలేదు. నిద్రలా అనిపించిన కాసేపూ కలత నిద్ర.

ఉదయం లేచాక రాత్రి జరిగింది జయకు చెప్పాను.

“అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళివద్దాం పద” అంది జయ. సరే అని తీసుకెళ్ళాను. లోనికెళ్ళి వచ్చింది. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఇంటి వాతావరణం చూస్తే అర్థమయ్యింది. ఆవిడకు తోచిందేదో అక్కడ వాళ్ళ కుటుంబీకుల చేతిలో పెట్టి బయటకు వచ్చింది. ఇది జరిగాక నేను నాలుగు రోజులు స్టూడియోకి వెళ్ళలేదు. మూడో నాడు జయ స్కూల్ నుండి చాలా ఉత్సాహంగా ఇంటికి వచ్చింది. విశేషమేమిటని అడిగాను.

“ఏం లేదు. ఆనందంగా ఉంది ఎందుకో తెలియదు” అంది.

దగ్గరకు తీసుకున్నాను. అభ్యంతరం చెప్పలేదు. బాగా దగ్గరకు జరిగింది. ఉత్సాహంగా మైమరిచి తను నాలో పొదవుకున్నాను. నా కౌగిలిలో ఉక్కిరి బిక్కిరయిపోతూ పెదాలంచింది. గాఢంగా ముద్దెట్టుకున్నాను. బాహ్య ప్రపంచాన్ని మరిచి ఇద్దరం ఒకటయ్యాము. జాగ్రతావస్థ వచ్చేసరికి ఒకరి చేతుల్లో ఒకరం. అప్పుడు మాత్రం కొంచెం బిడియమనిపించింది. కొత్త అనుభంలా ఫీలయ్యాను. మానసికంగా శారీరకంగా అంతులేని తృప్తి కలిగింది. అప్పుడు నాకో విషయం గుర్తుకు వచ్చింది.

ఈ జీవజాలాన ఒక్క నెమళ్ళు మాత్రమే శారీరకంగా చుంబన మైదునాల జోలికి పోవు. మొగ నెమలి కంటి నీటిని ఆడ నెమలి తాగి తృప్తి చెంది గుడ్లు పెడుతుంది. అవి పిల్లలవుతాయి. చిత్రంగా అనిపించినా ఇది నిజం.

జయ నా ఒడి నుంచి లేచి అయిదు నిముషాల్లో కాఫీ కలుపుకొచ్చింది. ఎదురుపదురుగా కూర్చుని సరసోక్తులతో సేవించాం. ఖాళీ కప్పులు తీసుకుని లోనికెల్లింది. బయటకొస్తూ అబ్బా అంటూ పొత్తికడుపు పట్టుకుని చతికిల పడింది.

“ఏమైంది జయా” అంటూ దగ్గరకు వెళ్లాను.

నేలపై పడి మెలికలు తిరిగిపోతూ కనిపించింది. అమాంతం చేతుల్లోకి ఎత్తుకున్నాను. పక్కపై పరుండపెట్టి మెత్తలు సదిరాను. అలాగే మెలి తిరుగుతోంది బాధతో. నేనేమడుగుతున్నా సమాదానం లేదు. పెద్దగా ఏడుస్తున్నది. బాధ తట్టుకోలేకపోతున్నట్టనిపించింది. పరిస్థితి అర్థం కాక నా కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. గబగబా దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరకు పరిగెత్తాను. జయను ఒంటరిగా వదిలి వెళుతున్నానన్న ధ్యాస రాలేదు. డాక్టర్ నా మాట విని వెంటనే వెంట వచ్చాడు. పరీక్షించి మందులు వ్రాసి ఇచ్చాడు. వెళుతూ వెళుతూ పొద్దుటే ఆసుపత్రికి తీసుకు రమ్మని చెప్పాడు.

తీసుకెళ్ళాను. ఏదో పరీక్షలు రాస్తే చేయించాను. గుండెకు సంబంధించిన టెస్ట్ కూడా చేసారు. ఒక వాల్వ్ దెబ్బతిందని తేలింది. “చిన్న వయసులో ఏమిటిది?” అడిగాను డాక్టర్‌ని.

తల ఊపాడు తప్ప సమాధానం లేదు.

కడుపునెప్పిగా మొదలయ్యి ఇలా ఎందుకు అయ్యిందో అర్థం కాలేదు. జయ పక్కనే కూర్చున్నా నా మనసంతా అయోమయంగా మారింది. మూడోనాడు డిశ్చార్జ్ చేసారు. వారు చెప్పిన నియమాలన్నీ పాటిస్తూ శ్రద్ధగా చూశాను. భగవంతుని దయవల్ల తరువాత ఏ బాధా రాలేదు. మామూలు మనిషై మళ్ళా స్కూల్‌కి కూడా వెళ్ళసాగింది. అది మొదలు జయను కంటికి రెప్పలా చూసుకోసాగాను. నా మనసూ స్థిమితపడింది.

ఇక్కడి అడ్రస్‌కు నాకావేళ ఉత్తరం వచ్చింది. డా. పాండే వ్రాసాడు.

“శివా…

చాలా రోజులకు నీ ఉత్తరం ద్వారా నువ్వున్న అడ్రస్‌ తెలిసింది. చాలా సంతోషం, ఉత్తరం చదువుతుంటే నిన్ను కలిసినట్టుగా ఉంది. శివా……. ఇంకా ఏంతో కాలం లేదు నా చదువు, దాదాపు పూర్తయ్యింది. తేది కరారు కాలేదు కానీ నెలలోపే బయలుదేరి వస్తున్నాను. నేనేదో సాదించాలని పడ్డ తపన వృథా కాలేదు. నన్ను మిత్రుడిగా ఆశీర్వదించావు. నా క్షేమాన్ని కాంక్షించావు. అది నాకు చాలా బలాన్ని ఇచ్చింది.

శివా… నేనెంత విజయం సాదించానని సంతోషించినా ఇది సైన్స్ విజయంలా అనిపించినా… బాగా ఆలోచిస్తే మాత్రం మనం జీవితం చేతిలో పూర్తిగా కీలుబొమ్మలుగానే అనిపిస్తుంది. ఇక్కడ పట్టుదలతో నిర్విరామంగా కృషి చేసాను. నేను చదివిన దానిపై థీసిస్ కూడా ఇచ్చాను. అది ఇవ్వడంలోనే ఉంటుంది ప్రతిభ. ఇక్కడ నిజం అనేది మనకు అనిపించినా అనిపించకున్నా, నిజంగా లోకాన్ని నమ్మించగలగాలి. దానితో అది పూర్తవుతుంది. నేను నేర్చుకున్నది అవగాహన చేసుకున్నది మనిషి మరో మనిషిని కోసి భాగాలు చేసి అతడి శరీర నిర్మాణాన్ని, దానికి వచ్చే రుగ్మతలని గమనించి నివారించే ప్రయత్నం చేయడం. మెదడును కూడా విడగొట్టి చిన్న చిన్న భాగాలుగా చేసి చూసాను. చూస్తూ దానిని మనసు పెట్టి అధ్యయనం చేసాను. మనిషి ప్రాణంతో ఉన్నప్పటికీ, గాలిపోయినప్పటికి శరీరాన ఉన్న మార్పేమిటి? అని కూడా పరిశోదించాను. తేడా కనిపించలేదు.

ఉన్న తేడా అల్లా ఒకటే చలనం, చలన రహితం…

ప్రేమమూర్తులు, వ్యసనపరులు, అహంకారులు, దుర్మార్గులు, మంచివారు, పిచ్చివారు, అసమర్థులు, మేధావులు, వీరందరి మెదడు నిర్మాణం ఒకటే. ఇన్ని రకాల వాళ్ళ తలలను చూసాను. ప్రత్యేకత అంటూ బొత్తిగా కనిపించలేదు. సైజుల్లో, స్వరూపాలలో కొద్ది తేడా తప్ప.

ఒకసారి మా ప్రొఫెసర్‌ని అడిగాను “ఈ బ్రెయిన్ ఎలా ఉయారవుతుంది సర్” అని. ఇది తెలియదా అన్నట్టు చూసి సమాధానం చెప్పాడు. కానీ అందులో మంచి సంగీతం విన్నప్పుడు కలిగే అనుభూతి కానీ, ఇంద్రధనస్సును చూసినప్పుడు మనస్సున కలిగే భావన కానీ, దుర్మార్గుని అంతరంతరాలలోని జాలి కానీ, పసి పాప బోసి నవ్వున వెలిగే మెరుపు కానీ..

ఇది ఎట్టా? ఎక్కడి నుంచి వస్తది? అసలేమిటిది? దీని ఆంతర్యమేమిటి? అని అర్థం చేసుకోలేక చికాకయ్యాక…..

ఏమి లేదని మాత్రమే జవాబు దొరుకుతుంది.

ఫిజికల్ స్టడీలో దొరికే విభాగ విభజన విశ్లేషణా తప్ప, అంతుచిక్కని అనుభూతి మాత్రం మిగులుతది.

శివా… మనకు ఆరిజిన్ అమీబా. ఏకకణ జీవి. దానికి ప్రాణం ఉందంటారు. దాని బ్రహత్తర పరిణామ హేలే ఈ మనిషి.

ఈ ‘అమీబా’కు మనసుందా? తెలియదు. ఇలా పరిణామం చెందిన ఈ మనిషికి దేవుని ఆసరా ఎందుకు?

‘మాన్ ఈస్ సుప్రీం ఇన్ దిస్ వరల్డ్’ అని మనం అనుకుంటుంటాం. మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ మనిషి నిజంగా సుప్రీం అయినా ఇదెంత నిజం? అంటే అర్థం కాదు. మనకు అనిపించేదంతా నిజం కావాలని లేదు.

అసలు మన మనస్సు దాని అవగాహనా శక్తికి మాత్రమే స్పందిస్తుంది. అంతకు మించి కదలదు. కారణం ఏమీ లేదు. దాని స్థాయది. ఈ స్థాయి పలువిధాలుగా ఉంటుంది. ఇక్కడ మరేదో సత్యం గోచరిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఏ భావనా స్పందనా లేని మనిషి, అసలు మనస్సే మృగ్యమయిన మనిషి, సుఖపడగలడని అనిపిస్తుంది.

శివా…. ఈ సైన్స్ న నీ ఉద్రేకాలని, ఉద్వేగాలని ఏమంటారో తెలుసా?

మనిషి ఏడుపు + నవ్వు =గ్లాన్స్ = స్టిమ్యులేషన్.

ఆకలిని స్టమక్ పెరిస్టాలసిస్.

గుండె రక్తపు బుగ్గ. మిగిలిన శరీరం నరాల కుప్ప. వీటికి తోడు కొన్ని కండరాలు. ఇవి కనిపించే నిజాలు.

కానీ బాగా ఆలోచించిన మీదట కళ్ళతో చూసినదయినా నిజమని అనిపించదు. ఏది ఏమయినా ఒక్క మనిషి మనస్సు నిజం కావచ్చునేమో?

అమ్మ, మదర్.

పవిత్రతకు మరో పేరు. గౌరవనీయమయినదీను.

ఈ అమ్మ అంటే ఏమిటి? ఆవిడ అమ్మ ఎలా అయ్యింది. ఆమె తన ఉద్రేకాన్ని తీర్చుకునేందుకు జరిగిన ప్రయత్నాన అప్రయత్నంగా వచ్చి పడిన మనకు అమ్మ అయ్యింది. ఇది కనిపించే కటిక నిజం.

ఈ మమతలు అనుభూతులూ… ఆశలు.. ఈ భూమిపై గాలి ఉన్నంత వరకే. అయితే మనం ఇలా ఆలోచించే సుఖపడటం లేదు.

హృదయం… యంత్రమనీ, స్నేహం… బిజినెస్ డీలింగ్ అనీ, వ్యాపారం అంటే చీటింగ్ అనీ, రాజకీయం అంటే నయవంచన అనీ, ప్రేమంటే సెక్సువల్ యాక్ట్ అనీ ఎంత శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించినా నిజం అనిపించదు. మరి దీనికి మించిన మార్గం ఏదయినా ఉందా?

శివా…. ఇది నీకు ఎందుకు రాస్తున్నానంటే నేను మానసికంగా పడ్డ వేదన అర్థం కావాలి. నా భార్య నిజంగా ఆ చనిపోయిన రాత్రి నన్ను కలిసింది, నాతోనే ఉంది అని చెప్పి వెర్రి వెధవనై నలుగురిలో నిలబడ్డాను. భరించాను. చివరగా వాస్తవానికి ఇది నా విజయమే. ప్రేతాత్మలకు సజీవులయిన వారితో మాటాడే శక్తి ఉందనేది నిరూపితమయిన సత్యం. నీకీ విషయం తెలుసా?

సశరీరులయి ఉండిన ప్రేతాత్మలు మనుషులతో కాపురాలు చేసినట్టు దాఖలాలున్నాయి. ప్రేతాత్మలతో మాట్లాడవచ్చు అని నిర్ధారించారిక్కడ. ఇవి వినేందుకు అంత బాగా అనిపించవు. కానీ వాస్తవాలు. నా అనుమానం మాత్రం చాలా వరకు నివృత్తి అయ్యింది. ఆ రాత్రి నా దగ్గరకు వచ్చింది నా భార్యే. ఇప్పుడు ఆవిడ కోసమే నా మనస్సు పరితపిస్తుంది. ఆవిడ ఆత్మ పునఃప్రవేశం దొరక్క, తిరుగులాడుతూ ఉంటే దక్కించుకునే ప్రయత్నం చేయొచ్చు.

ఇక నువ్వెలా ఉన్నావ్? నేను వచ్చే దాకా మాత్రం అడ్రెస్ మారకు. మారితే తెలియచేయి.

ఇక ఉంటాను.

-పాండే.

గడిచిన క్షణం తరిగిరాని ఈ కాల గమనాన ఇన్ని సంవత్సరాలు. నా బ్రతుకున అసలిలా ఎందుకు జరుగుతున్నట్టు. గాలికి ఎదురు తిరగలేని మనస్తత్వం గనక దాని పాటున కొట్టుకుపోతున్నానా? ఇలాంటి ఆలోచనలతో అంతుమాలిన అసహనం. రాత్రి ఒక గంట దాకా అటు ఇటు తిరిగాను. అట్టాగే స్టూడియోకి వెళ్ళాను. స్టూడియోలో పని పూర్తయ్యింది. బాటన వస్తుంటే ఓ బిచ్చగాడు బాగా వృద్ధుడు కుంటు కుంటూ వెళుతూ కనిపించాడు. నన్ను చూసి ఆగి “ఏక్ పైసా దేదో బాబూజీ, భగవాన్ ఆప్ కా భలా కరేగా” అన్నాడు. ఓ క్షణం ఆగి అతన్ని చూసాను. గడ్డం మాత్రం ఎదురు రొమ్ము దాటి కనిపించింది. నుదిటి ముడతలు వయసును అనుభవసారాన్ని తెలుపుతున్నవి. శరీరం మంచి ఛాయే అయినా మసకబారి మట్టి కొట్టుకుని ఉంది. అతని అభ్యర్ధన జాలి కలిగించింది. ఏదో ఒకటి ఇవ్వబుద్దయింది. “ఇదే వృత్తా” అన్నాను దగ్గరికి జరిగి ఒక రూపాయి వేసి.. ఎదురుగా కనిపిస్తున్నా ఏమిటి ప్రశ్న? అన్నట్టుగా నవ్వాడు. అతగాని నవ్వులో చిత్రమయిన అందం ఉంది. అయితే ఆ నవ్వు ముద్ర అట్టేసేపు అతని మొహంపై నిలవలేదు. నా మనసును మాత్రం వదలలేదు.

నడిచాను. ఇంటికి వచ్చాక బిచ్చగాని సంగతి జయతో చెప్పాను.

“ఎక్కడుంటున్నాడట?” అడిగింది.

“తెలియదు.”

“ఈ దఫా కనపడితే తీసుకురా. కడుపారా భోజనం పెట్టి పంపుదాం” అంది. తలూపాను.

మళ్ళా నాలుగవ నాడు అతను కనిపించాడు. నేనతని గుర్తుపట్టలేదు. నా ధ్యాసలో నేను నడుస్తుండగా “బాబూజీ” అని పలకరించాడు.

ఆగి, “నువ్వు బాగున్నావా?” అని అడిగాను.

తలూపాడు.

“మూడు రోజులుగా కనిపించలేదు?” నడుస్తూ అడిగాను.

“కాలు బాధ పెడుతుంది. అంతగా తిరగలేక బయటకి రాలేదు.”

“నువ్వు ఎక్కడ పడుకుంటున్నావ్?”

“వెనక వీధినున్న దివాన్‌గిరి సత్రంలో.”

“మా ఇంటికెళదాం. వచ్చేదాకా ఉంటావా?” అడిగాను.

ఆశ్చర్యంగా నావైపు చూసి అంతటి భాగ్యమా అన్నట్టు తలూపాడు,

నిజంగానే నేను వచ్చిందాక అక్కడ కూర్చుని ఉన్నాడు. వీధిలో అంత జనసంచారం కూడా లేదు. అతని దగ్గరకు వెళ్లి “ఇహ వెళదాం” అన్నాను. లేచి వెంట నడిచాడు.

ఇంటికొచ్చాక వరండాలో ఉన్న కుర్చీపై కూర్చోమన్నాను. వద్దంటూ చప్టాపై కూర్చున్నాడు.

లోపలికి చూసాను. జయ మంచి నిద్రలో ఉంది. ఇప్పుడెందుకు లేపాలిలే అనుకుని అతనికి మొదట మంచి నీళ్లిచ్చాను. తాగాడు,

“నీ పేరేమిటి?” అడిగాను. చెప్పాడు.

“లోగా ఏం చేసేవాడివి?”

మాటాడలేదు…

“భార్యా పిల్లలున్నారా?”

మౌనం.

“చేసేందుకు వేరే పని దొరకలేదా? అడుక్కోవటం మంచి వృత్తిగా అనిపించిందా?”

“కాలికి దెబ్బతగిలిన దగ్గరనుంచి ఎవరి దగ్గరకు పనికి వెళ్ళినా న్యాయం చేయలేనేమో అనుకుని ఏ దారి తోచక ఆకలి భాదలు తట్టుకోలేక…”

“రోజు ఎన్ని పైసలు దొరుకుతవి?”

“దానికి లెక్కేమి ఉంటది? నౌకరీ కాదుగా? దొరికిన నాడు బాగానే దొరుకుతాయి. జనం ఎప్పటి లాగానే ఉరుకుల పరుగులతో తిరుగుతుంటారు. నా వైపు చూసే వాళ్ళు కూడా కనపడాలి కదా” అని నవ్వాడు.

“నువ్వు ఒంటరి వాడివేనా? ఎవరయినా ఉన్నారా?”

“ప్రస్తుతం లేరు.”

“అయితే నీ ఆదాయం నీకు బాగానే సరిపోతుందన్న మాట.”

తలూపాడు.

చేతులు కడుక్కునేందుకు నీళ్ళిచ్చి భోజనం పెట్టాను. ఆరాంగా కూర్చుని తిన్నాడు తృప్తిగా.

“బాగా ఆలస్యమయ్యింది కదా ఇక పడుకుంటావా?” అడిగాను.

“వెళ్తాను” అన్నాడు లేచి కర్ర సవరించుకుంటూ..

“ఒక్క నిముషం ఉండు మా జయ నిన్ను చూడాలని అన్నది” అన్నాను.

ఆగాడు. లోలికి వెళ్లి జయను కదిపి లేపాను. గాఢనిద్రలో ఉంది. అదాట్టుగా లేచి నా మెడను వాటేసుకుంది.

“జయా నేను చెప్పిన బిచ్చగాడు వచ్చాడు” అన్నాను.

“ఇప్పుడా?” అంది లేస్తూ.

వరండా వైపు చూస్తూ.. “భోజనం పెట్టావా?” అని అడిగింది.

తల ఊపాను.

లేచి మంచం దిగి గది బయటకు వచ్చింది. కనిపించాడు.

అలాగే ఆ బిచ్చగాడ్ని బాగా పరిశీలనగా చూసింది.

మెట్లు దిగి వెనక్కు మళ్లాడు. ఆగి జయను చూసాడు. కళ్ళు చికిలించి మరీ….. ఏదో సణుక్కుంటూ… “ఇహ వెళతాను” అని నడిచాడు.

జయ అతన్ని ఆగమని చెబుతుందేమో అని చూసాను. కానీ కదలక మెదలక అతన్నే చూస్తూ ఉండి పోయింది. జయ ప్రవర్తన నాకు అంతు పట్టలేదు.

ఇంతోటి దానికి అతన్ని పిలుచుకు రావడం దేనికి అని అనిపించింది నాకు.

జయను పలకరించాను.

ఉలికిపాటుగా నా వైపు చూసింది. ఏవేవో ఆలోచనలు ఆవిడను ఉక్కిరి బిక్కిరి చేసిన జాడ మొహంలో కనిపించినది. కుంటుతూ వెళుతున్న అతన్ని మలుపు తిరిగిన దాకా చూసింది.

“శివా…. అతను మా నాన్న పోలికలో ఉన్నాడు. కాకపోతే ఆ గడ్డం మీసాలు కుంటి నడక రంగూ నన్ను అనుమానంలో పడకుండా ఆపినవి.”

ఈ మాట చెపుతున్నప్పుడు జయ తండ్రి గుర్తులోకొచ్చి కళ్ళ నిండా నీళ్ళు నిండినవి.

“పేరేమిటో అడిగావా?” అంది.

“ఆఁ…”

“ఏమిటది?”

“చెప్పాడు. కానీ గుర్తులేదు” అన్నాను ఆలోచనలో పడి. ఇంతకీ అతను చెప్పిన పేరు మనసులోకి రాలేదు. అతని చెప్పినది శ్రద్ధగా విని ఉండక పోవచ్చు.

“జయా నేను వెళ్లి తీసుక వస్తాను. అతను ఎంతో దూరం పోలేడు” అన్నాను.

“అవసరం లేదు. అతను నన్ను చూసాడు కదా. నా తండ్రి అయితే తప్పక గుర్తిస్తాడు. గుర్తించాక వెళ్ళలేడు” అంది.

కాసేపు వరండాలో కూర్చుని లోనకి వెళ్ళింది.

ఆ రాత్రంతా జయకు తన ఊరు, తండ్రి, ఆయన పెంచిన పద్ధతి మనస్సును వదలనట్టుంది.  నిద్రపోయిన జాడలేదు.

అయితే ఆ తరువాత అతను నాకు ఎక్కడా మళ్ళీ కనిపించలేదు. పదిరోజుల దాకా జాగ్రత్తగా గమనిస్తూ వెళ్లాను.

జయ అనుమానం నిజమా? అనిపించింది ఒకసారి నాకు.

జయను గుర్తించే ఏటయినా కనపడకుండా వెళ్ళిపోయాడా? అన్న అనుమానమూ వచ్చింది. ఎందుకయినా మంచిదని ఒకనాడు ఆ పరిసరాలలో వాకబు చేసాను. ఫలితం కనిపించలేదు. చివరకొక విషయం తెలిసింది. అతను ఉండి అడుక్కునే అడ్డాను ఓ గుడ్డి వాడికి ఇచ్చి వెళ్ళిపోయాడట. ఎవరికీ చెప్పలేదు కనుక ఎటు వెళ్ళింది ఎవరికి తెలియదు.

ఆ తరువాత అతని గురించి నేను దాదాపు వదిలేసాను.

మనిషి జీవితాన ప్రతి అనుభవం ఒక ముద్ర వేసి వెళుతుంది. కొన్ని అనుభావాలు అల్లకల్లోలాలు రేపితే, కొన్ని ప్రశాంతత నిస్తాయి. కొన్ని నిరాశను కలిగిస్తాయి. ఏదేమయినా మనసుపై పడిన ముద్ర మాత్రం పోదు. గుర్తులోకొచ్చినప్పుడల్లో ఇలా జరిగిందేం అనిపిస్తుంది.

నేను నా బ్రతుకున నాకు నచ్చిన పిల్లను ప్రేమించాను. ఆవిడా నేను కావాలని కోరుకున్నది. సుఖంగా ఉందామనుకున్నాము. కానీ కుదరలేదు. ఆ క్షణాన తెగింపూ రాలేదు. విచక్షణ ఆపింది. చెరో దారి అయ్యాము. జీవితంలో నేనుగా ఎన్నుకున్న మంచి మార్గంలో నడుద్దామని అనుకున్నాను. నా బ్రతుకేమో కాని ఇప్పటి దాకా కుదరలేదు. మా నాన్న కుదిర్చిన సంబంధం చేసుకోకూడదనుకున్నాను. చేసుకోవాల్సి వచ్చింది. ఇల్లు వదిలి పారిపోవాలనుకున్నాను. అప్పట్లో అదీ కుదరలేదు. ఇష్టాలతో పనిలేకుండా కాపురమూ అరకొరగా చేసాను. కన్న తల్లి తండ్రులను చూసుకుంటూ…. అక్కడే బ్రతుకుదామనుకున్నాను. కానీ ఉన్న కాస్త మనశ్శాంతి హరించడంతో అందరినీ వదలి పారిపోయి వచ్చి ఇలా మిగిలాను.

జయను గురించి అసలు ఆలోచించలేదు. ఇది ఇప్పుడు విడదీయలేని అనుబంధం అయ్యి కూర్చుంది.

ఎందుకిలా జరుగుతున్నట్టు.

అసలు మనిషి బ్రతుకే ఇలా ఉంటుందా? నా బ్రతుకు ఒక్కటే ఇలా ప్రశ్నార్థకమయ్యిందా? ఇవేవి మన ఆలోచనకందవు. తలనుంచి ఈ ఆలోచనలు తెగవు.

కాలం దొర్లిపోతుంది. ఆగే లక్షణం దానికి లేదు కదా! నేను ఏమౌతున్నాననేదే చిక్కు ప్రశ్న. ఇదింకా జటిలం కాబోతుందా?

ఇలా మరో సంవత్సరం మరుగున పడింది.

జయ ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంటున్నది. ఎదుటనున్న ఆఫీసర్ గారికి ఢిల్లీ ట్రాన్స్‌ఫర్ అయ్యింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం చేయడమంత బుద్ది తక్కువపని లేదని తిట్టుకుంటూ వెళ్లాడతను. ఒక్కసారి అయన జీవితమే బాగుందేమో అనిపించేది. అతనికి ఏం కావాలనిపించినా ఆగడు. వెనక్కి తిరిగి చూడడు. అదురూ బెదురు లేకుండా జీవితాన్ని ఆనందంగా అనుభవిస్తాడు. అన్ని వ్యసనాలున్నా మనిషిగా మిగిలే ప్రయత్నం ఎప్పుడు చేయడు. కొన్ని పొరపాట్లు తెలియని దిశన చేసినా చాలా మందికి మంచినే మిగిల్చిపోయాడు. ఆ ఇల్లాలితో మాత్రం అతని ప్రవర్తనలో పెద్ద మార్పు కనిపించలేదు. అయినా అతను వెళ్తుంటే ఎందుకో బాధనిపించింది.

ఆయన ఇల్లాలు చాలా మంచి పొరుగుగా, మంచి స్నేహశీలిలా మెలిగింది. అవసరం అనిపించినప్పుడల్లా ‘భయ్యా’ అంటూ నిండుగా పిలిచేది. అరమరికలు లేకుండా ప్రవర్తించేది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here