గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 24: సంగం జాగర్లమూడి

0
4

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 24” వ్యాసంలో సంగం జాగర్లమూడి లోని శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయం గురించి, అంగలకుదురులో దాసకుటిలోని రామాలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]రెం[/dropcap]డు రోజులు వరసాగ్గా తిరిగామేమో చాలా అలసటగా అనిపించి 31వ తారీకు ఇంట్లోనే పూర్తి విశ్ర్రాంతి తీసుకుందామనుకున్నాం. సాయంకాలం అయ్యేసరికి దుర్గమ్మ మీద గాలి మళ్ళి విజయవాడలోని కనక దుర్గాలయానికి వెళ్ళి వచ్చాము. ఇదివరకటికీ ఇప్పటికీ ఎన్ని మార్పులో. మెట్లు ఎక్కాలంటే ఏడు అంతస్తులు ఎక్కాలట. అయితే లిఫ్టు సౌకర్యం బాగా వుంది. కనుక ఇబ్బంది లేకుండా అమ్మవారి దర్శనం చేసుకొచ్చాము.

ఇక్కడితో ఈ ప్రయాణాలకి కామా పెట్టి హైదరాబాద్ వెళ్ళాలనుకున్నాను. ఇప్పటిదాకా నేను వేసుకున్న ప్రోగ్రాం ప్రకారమే అన్నీ చూశాం. కానీ జాగర్లమూడి, అంగలకుదురు మిగిలిపోయాయి. అవి చూడకుండా వెళ్ళటానికి మనసొప్పలేదు. వెళ్దామంటే వెళ్దామనుకుని మా విమల, రాధిక నేను ఆగస్టు 1వ తారీకు పొద్దున్న 7-30కల్లా బస్ స్టాండ్ చేరుకున్నాం. మా రాధికకి జాగర్లమూడి గుంటూరు నుంచీ తెనాలి వెళ్ళే రూట్ లో వుంటుందనీ, గుంటూరునుంచీ దగ్గరని ఎవరో చెప్పారుట. అందుకని గుంటూరు బస్ ఎక్కాం. 8-40 కల్లా గుంటూరు చేరాం. అక్కడ నుంచి తెనాలి వెళ్ళే బస్ ఎక్కి జాగర్లమూడి మెయిన్ రోడ్డులో దిగాం.

గుడికి వెళ్ళాలంటే అక్కడనుంచి లోపలకి చాలా దూరం నడవాలి. ఎవరికీ ఓపిక లేదు. ఏమిటా దోవ అని అటూ ఇటూ చూస్తుంటే తెనాలి నుంచి వస్తున్న ఖాళీ ఆటో కనిపించింది. ఆపాము. చిన్న కుర్రాడే. భోజనానికి ఇంటికి వెళ్తున్నాడుట. ఆ అబ్బాయిని బతిమాలుకుని ముందు కొంచెం గుడి దగ్గర దింపి వెళ్ళమన్నాము. అక్కడికెళ్ళాక చూస్తే అంతా నిర్మానుష్యంగా వుంది. మళ్ళీ అక్కడనుంచీ వెళ్ళటానికి ఏ వాహనమూ దొరకదని గ్రహించినవారమై ఆ అబ్బాయినే కొంచెం సేపు వుండయ్యా వీలయినంత త్వరగా వస్తాము, తెనాలి బస్ స్టాండు దగ్గర దింపి వెళ్ళమని రిక్వెస్ట్ చేశాం. పాపం భోజనానికి వెళ్తున్నతనని ఆపటం పాపం అనిపించినా అంత పొద్దున్నే భోజనమేమిటని మళ్ళీ సర్ది చెప్పుకున్నాం. దోవలో ఎక్కడన్నా టిఫిన్ దొరికితే తిందాం అని చెప్పాం. ఆ కుర్రాడు మంచివాడు. పాపం సరేనన్నాడు. హమ్మయ్య..భగవంతుడున్నాడు అనుకుంటూ ఆలయ ప్రవేశం చేశాం.

ఈ జాగర్లమూడిలో మా చిన్నప్పుడు శివరాత్రి తిరణాలకి వెళ్ళాను ఒకటి రెండుసార్లు. చాలా చిన్నప్పుడు. అప్పుడు అమ్మా, నాన్నా తీసుకెళ్ళారు గనుక ఏ వాహనం మీద, ఎలా వెళ్ళామో కూడా గుర్తు లేదుగానీ, అరటి తోటల మధ్య చిన్న గుడి, కొంచెం దూరంలో కాలువ, తిరణాల సందడి, బోలెడంత చిరుతిండి ఇవి గుర్తున్నాయి. అందుకే మళ్ళీ ఆ ప్రదేశం ఇప్పుడెలా వుందో ఒకసారి చూడాలని కోరిక..

గుంటూరు తెనాలి మెయిన్ రోడ్ మీదనుంచి లోపలకి ఒక కిలోమీటరు దూరంలో వుంది ఆలయం. సిమెంటు రోడ్డు, పక్కనే పారుతున్న కాలువ, బాల్య స్మృతులు, అన్నింటితో సురేష్ (ఆటో డ్రైవర్) పుణ్యమాని, ఏ ఇబ్బందీ లేకుండా ఆలయాన్ని చేరుకున్నాం. ఆలయంలో జనం లేరు. ఆలయానికి సంబంధించిన పూజారిగారు శ్రీ కె.వి.యన్. రాజుగారు ఎవరితోనో ఆలయంలో చేయాల్సిన మరమ్మత్తులు గురించి ఏదో మాట్లాడుతున్నారు. దర్శనం చేసుకుంటూండండమ్మా, ఈయన్ని పంపించి వస్తాను అన్నారు. ఆలయ దర్శనంలో పడ్డాము.

ఆలయం

నా చిన్నప్పుడు చాలా చిన్న ఆలయం. ఇప్పుడు ముందు మంటపాలతో విలసిల్లుతున్నది. విశాలమైన ఆలయ ప్రాంగణం. చుట్టూ ప్రహరీ గోడ. ఆలయమంతా కొత్తగా రంగులు వేసినట్లు, పరిశుభ్రంగా, కళకళలాడుతోంది. గర్భాలయంలో శ్రీ సంగమేశ్వరుడు కొలువు తీరాడు. పక్క ఉపాలయంలో దేవేరి శ్రీ బాలాత్రిపుర సుందరి. ఈ ముఖ్యాలయానికి కొంచెం దూరంలో దక్షిణంగా వున్న ఉపాలయాలలో విఘ్నేశ్వరుడు, శ్రీ వీరభద్రస్వామి, శ్రీ పాపవినాశనస్వామి, శ్రీ పార్వతీదేవి, నవగ్రహాలు పూజలందుకుంటున్నారు. సంగమేశ్వరునికి ఎదురుగా కొంచెం దూరంలో రావి చెట్టు కింద నాగ ప్రతిమలు, పక్కనే గోశాల. అన్నింటికన్నా మమ్నల్ని బాగా ఆకర్షించింది మెయిన్ రోడ్ నుంచి లోపల ఆలయం, గోశాల అన్నీ ఎంతో శుభ్రంగా వున్నాయి.

 

కృష్ణ కాలువ

ఆలయం ముందు కాలువ వున్నదన్నానుకదా. ఇది విజయవాడనుంచి చెన్నైవరకు ప్రవహించే కృష్ణానది పాయ. అందుకే బాలకృష్ణానది అంటారు. దీనినే కొమ్మమూరు కాల్వ, బకింగ్ హామ్ కెనాల్ అని కూడా అంటారు. దీని ఒడ్డున గంగమ్మ దేవాలయం వుంది.

 

సంగమేశ్వరస్వామి ఆలయానికి తూర్పున తుంగభద్ర పాయ వుంది. తుంగభద్ర పాయ ఇక్కడ కృష్ణ పాయలో కలుస్తుంది. అందుకే ఈ ఊరికి సంగం జాగర్లమూడి అనే పేరు వచ్చింది అంటారు.

శ్రీ సంగమేశ్వరస్వామి దర్శనం చేసుకునేసరికి రాజుగారు వచ్చి అభిషేకం చేశారు. జనం లేకపోవటంతో ప్రశాంతంగా జరిగిని ఆ అభిషేకం మనసుకు హత్తుకుంది. నా వివరాలు చెబితే చాలా సంతోషించి, క్షేత్ర మహత్యం పుస్తకం వెతికి తీసి ఇచ్చారు.

క్షేత్ర పురాణం

దీని ప్రకారము ఈ క్షేత్రము ద్వాపర యుగాంతంలో అత్రి మహామునిచే స్ధాపించబడింది. 1825లో బ్రహ్మశ్రీ వారణాసి పట్టాభిరామశాస్త్రిగారు రాసిన దాని ప్రకారం ఈ క్షేత్ర వృత్తాంతం బ్రహ్మవైవర్తి పురాణంలో వున్నది. ఈ సంగమేశ్వర చరిత్రను పూర్వం వ్యాస మహర్షి తన కుమారుడగు శుకమహర్షికి చెప్పగా, వారి శిష్యుడగు సూత మహాముని శౌనకాది మునులకు చెప్పారు.

ఇంతకుముందు పొన్నూరు భావనారాయణ క్షేత్రం గురించి చెప్పేటప్పుడు, కాశీనుంచి భావనారాయణ స్వామి గూని గోవిందయ్యకు సాక్ష్యం చెప్పటానికి కాశీ విశ్వేశ్వరుడు, అన్నపూర్ణ, ఇంకా వివిధ వృక్షములతోసహా ఈ ప్రాంతానికి వచ్చాడని, గోవిందయ్య వెను తిరిగి చూడటంవల్ల పొన్నూరు దగ్గర శిలా విగ్రహంలా ఆవిర్భవించాడని స్ధల పురాణం చెప్పాను. అదే కథ ఇక్కడకూడా. కాశీనుంచి భావనారాయణస్వామితో వచ్చిన విశ్వేశ్వరుడు ఇక్కడ వెలిశాడంటారు.

ఎప్పటినుంచో చూడాలనుకున్న సంగమేశ్వర స్వామి దర్శనమయిందన్న తృప్తితో అక్కడనుంచి బయల్దేరాము.

దర్శన సమయాలు

ఉదయం 6 గం.లనుంచి 12-30 దాకా తిరిగి సాయంత్రం 4 గం. ల నుంచి 8 గం.లదాకా. పండుగలు, పర్వదినాలలో ఉదయం 4 గం. నుంచి రాత్రి 8 గం. ల దాకా.

అంగలకుదురు

అంగలకుదురు అక్కడికి చాలా దగ్గరని చూశాను. సురేష్‌ని అడిగితే ఇక్కడే అన్నాడు. మంచివాడు. అక్కడికి కూడా వెళ్దామయ్యా, ఎక్కువ సమయం తీసుకోములే అంటే తీసుకెళ్ళాడు. ఇదివరకు నా పుస్తకాల గురించి ఫోన్ చేసిన ఒక మహిళ (పేరు మర్చిపోయాను) అంగలకుదురులో శ్రీ కోదండరామ సేవక ధర్మసమాజం, దాసకుటి అనే ఆశ్రమం గురించి చెప్పారు.. చాలా బాగుంటుందని, వాళ్ళు అక్కడికి తరచు వెళ్తూవుంటామనీ, నన్ను కూడా ఒకసారి రమ్మని చెప్పారు. అక్కడిదాకా వెళ్ళాంకదా అని ఆ ఆశ్రమం కూడా దర్శించాం. అక్కడ శ్రీ రామానుజదాసస్వామి వున్నారు. ఆశ్రమంలో సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేత శ్రీ శ్రీరామచంద్రునికి నిత్య పూజలు జరుగుతాయి.

కడప జిల్లాలోని ఒంటిమిట్ట రామాలయం గురించి తెలిసినవారికి ఆ ఆలయ పునర్నిర్మాణానికి అత్యంత కృషి చేసిన శ్రీ వావిలికొలను సుబ్బారావుగారి గురించి కూడా తెలిసే వుంటుంది. ఆయనని ఆంధ్ర వాల్మీకి అని కూడా అంటారు. ఆయన మిత్రుడు శ్రీ ముడిపిరి సుబ్బారాయుడు ఒక టెంకాయను రంపంతో కోసి కమండలాకృతిగా చేసి ఇచ్చారుట సుబ్బారావుగారికి. ఆయన దానిని చేతబట్టుకుని అందరి దగ్గర భిక్షాటన చేస్తూ ఆ వచ్చిన ద్రవ్యంతో ఒంటిమిట్ట రామాలయాన్ని పునర్నిర్మించారు. ఆ టెంకాయ చిప్ప ప్రస్తుతం అంగలకుదురులోని ఈ దాసకుటిలో పూజామందిరంలో వున్నది.

 

స్వామివారి ఆశీస్సులతో అక్కడనుండి బయల్దేరి తెనాలి బస్ స్టాండుకి చేరాము. అంగలకుదురునుంచి 5 కి.మీ.దూరం. ఇంటికి వెళ్దామని బయల్దేరిన సురేష్ అక్కడిదాకా మాతో వుండి ఆటోలో తిప్పాడు కనుక అనుకున్నవన్నీ చూసి, సురేష్‌కి అడిగిన డబ్బిచ్చి (అవకాశం తీసుకుని ఎక్కువేం అడగలేదు.. రూ. 200), ధన్యవాదాలు తెలియజేసి విజయవాడ బస్ ఎక్కాము.

ఈ ట్రిప్ ఇక్కడితో అయింది. మళ్ళీ గుంటూరు జిల్లా యాత్ర ఎప్పుడో అనుకుంటూ మర్నాడు హైదరాబాద్ వచ్చాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here