[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]
[dropcap]మ[/dropcap]హా మహా నగరాల్లో చాలా మంది వాసం ఎపార్టుమెంటుల్లోనే. స్థలాలు దొరకడం, వాటిని కొనుగోలు చేయడం గగన కుసుమమే అవుతుంది సామాన్యులకి. అవి కూడా ఈనాడు అందుబాటుల్లో లేని ధరలకే చేరాయి.
కొందరు తమ ఇళ్ళని అంత నిర్దయగా పగలగొట్టించడానికి మనసొప్పక, వాటిల్లోనే వున్నా అటు యిటూ కోటల్లా లేచిన బహుళ అంతస్తుల మధ్య వెలుగుకి నోచక, ఎండ లేక యింతకాలం పెంచిన చెట్లు, మొక్కలు చచ్చిపోతుంటే సహించలేక, పై అంతస్తుల నుండి తమ యింట్లోకి విసురుతున్న చెత్తా చెదారాలు ఎత్తలేక విసిగిపోయి బిల్డర్‌లకి యిచ్చేస్తున్నారు. పూర్వజన్మలో రాక్షసులే యిలా బిల్డర్‌లగానో, దళారులగానో పుట్టి మానవ జాతిని ఏడిపిస్తున్నారని ఏడుస్తూ తమ యిళ్ళని, అవి కట్టుకుంటున్నప్పుడు పడిన కష్టాలని తలచుకుంటూ యిచ్చేస్తున్నారు.
ఇలాంటి వ్యవహారాల్లో మన తెలుగువారు యమ స్పీడు కాబట్టి రేపొచ్చే నీటి ఎద్దడిని ఏ మాత్రం దృష్టిలో పెట్టుకోకుండా తమ యిళ్ళని యిచ్చేసి బిల్డర్ యిచ్చే రెండు మూడు ఎపార్టుమెంటులని ఈస్టమన్ కలర్‌లో వూహించుకుని, ఒక దాంట్లో వున్నా మరో రెండు అద్దెకిచ్చి కాలు మీద కాలేసుకుని బ్రతకొచ్చని యిచ్చేస్తున్నారు.
ఇక ఆ దెబ్బకి నిలువెత్తు చెట్లు నిలువునా కూలిపోతున్నాయి. కాంక్రీటు గోడలు ఆకాశానికి లేస్తున్నాయి.
ఇప్పుడసలు గొడవ ప్రారంభమవుతుంది. కొందరు బిల్డర్‌లు కొన్ని పనులు తర్వాత చేస్తానంటూ కొన్న వారికి పొసెషన్ యిచ్చేస్తారు. తీరా దిగేక ఆ పనులు ఏ మాత్రం చేయరు.
అంతే కాక పెంట్ హౌస్ అనే పేరుతో పైన ఒక అంతస్తు ఆక్రమించి కట్టుకుంటాడు.
ఇక స్థలం యిచ్చినవాడు లేండ్‌లార్డ్ అనే పేరుతో చీటికి మాటికి కొన్నవారి మీద కర్రపెత్తనం చేస్తుంటాడు.
బిల్డర్ టెర్రస్ మీదకి రానివ్వడు. లాండ్‌లార్డు నాదీ స్థలం అని అఘాయిత్యాలు చేస్తుంటాడు.
మొత్తంగా బిల్డింగ్ వాళ్ళద్దరి చేతుల్లోనూ మిగిలిపోతుంది.
రిపేర్లు చేయించాలన్నా, నీళ్ళు రాలేదన్నా, మరే యితర సమస్యలకైనా వారి దయాదాక్షిణ్యం మీదనే అందరూ బ్రతకాలి.
తన స్థలం యిచ్చినందుకే తనకి రెండో మూడో ఎపార్టుమెంటులిచ్చేరన్న ఇంగితం వుండదో, జూలుమో కాని వాళ్ళు మిగతా ఎపార్టుమెంటులు కొనుక్కున్న వారు తమ భృత్యులుగా భావించి మాట్లాడుతుంటారు.
ఇక బిల్డర్ సరే సరి. మెయింటెనెన్స్ కూడా చేతిలో పెట్టుకుని, ఎన్నేళ్ళయినా రంగులు వేయించకుండా జులుం చేస్తుంటాడు. కొన్ని సంవత్సరాలకి బిల్డింగ్ కళా విహీన మయిపోతుంది. దెయ్యాల కొంపలో వున్నట్లుగా వుసూరుమంటూ మనం మన జీవన యాత్ర కొనసాగించాలి. ఈ బిల్డర్‌లకి కాస్తా కూస్తో పోలిటికల్ ఇన్‌ఫ్లూయన్స్ వుంటుంది. పేరుకి చట్టాలున్నా అలా రౌడీలతో పోరాడే శక్తి లేక పక్కకి తప్పుకుంటారు కొనుక్కున్న వాళ్ళు.
ఈ సందట్లో వాచ్‌మాన్ హల్‌చల్ మొదలవుతుంది. అతను మెయింటెనెన్స్ చేసే వారి గుప్పెట్లో వుంటాడు. భార్యాభర్తలు వాళ్ళకి అడుగులకి మడుగులొత్తుతూ వాళ్ళ పనులు చేస్తూ బిల్డింగ్‌కి చేయవలసిన పనిని ఎగ్గొడుతుంటారు. ఇక ఈ మూడో వ్యక్తి చేతులోకి బిల్డింగ్ వెళ్ళిపోతుంది.
ఒక కుటుంబం వుండే చోట ఇరవై కుటుంబాలు చేరడంతో నీటి ఎద్దడి వచ్చేస్తుంది. చలికి ఎంత అవస్త పడ్డామో, సమ్మర్ వస్తుందంటే అంత వణుకుతున్నాం. చుట్టూ ఒక నియమ నిబంధనలు లేకుండా, ముందు చూపు లేకుండా కేవలం డబ్బులకి కక్కుర్తి పడి కార్పోరేట్ ఆస్పత్రులకి, మల్టీప్లెక్సులకి అనుమతి యివ్వడంతో వాళ్ళు చాలా లోతులకి వేసిన బోర్‌లతో విపరీతమైన నీటి ఎద్దడి వచ్చి వుసూరుమంటున్నారు ఎపార్టమెంటు వాసులు.
ఇంత కన్నా యిల్లు లేకపోవడమే నయమనుకునే స్థితి అందరికీ వచ్చేస్తున్నది. నచ్చకపోతే మరో చోటకి వలస పోవచ్చు.
సరే.. ఇలాంటి నగరంలో ఇలాంటి స్థితిలో నేను కూడా ఒక ఎపార్టుమెంటు నా డబ్బుతో కొనుక్కున్నాను. నాకు యిష్టమైన విధానంతో దాన్ని తయారు చేసుకున్నాను. సంతోషంగా అందులోకి షిఫ్టయ్యేము.
కారిడార్లు విశాలంగా వున్నాయి. గాలి, వెలుతురూ బాగానే వున్నాయి. నీళ్ళు యిబ్బంది లేదు. అంతకన్నా సామాన్యులకి ఏం కావాలి ?
కాని అసలు యిబ్బంది ఇక్కడే మొదలయ్యింది.
మేము కొనగానే వెంటనే వెళ్ళలేదు.
రెండు మూడేళ్ళు తర్వాత వెళ్ళాం.
ఎవరినీ ఇబ్బంది పెట్టకుండా జీవించాలన్నది నా సిద్ధాంతం.
ఎవరైనా మనల్ని నొప్పిస్తే ఎలా బాధపడతామో తెలిసి అలా ప్రవర్తించకుండా వుండాలని నేననుకుంటాను.
ఎపార్టుమెంటులన్నీ కొత్తగా పెళ్ళయిన వారితో, లేదా ఒకరూ ఇద్దరూ చిన్న పిల్లలున్న దంపతులతో ఆక్రమింపబడి వున్నాయి. కొందరు అద్దెకు, మరి కొందరు స్వంతంగా కొనుక్కున్న వారు వున్నారు. ఎక్కువ మంది హౌస్‌వైఫ్‌లే.
పది పదకొండు గంటల ప్రాతంలో వీరందరూ కారడార్స్‌లో చేరేవారు. నవ్వుతూ, కబుర్లూ మొదలు పెట్టేవారు.
వయసు పాతిక, ముప్పయిలోపు వారే.
చేతిలో కనీసం డిగ్రీ వున్నవారే.
మా ఎపార్టుమెంటు మెయిన్‌డోర్ పక్కగా టెర్రస్ మీదకి మెంట్లుండేవి. నేను పైన స్టీల్‌రాడ్స్ వేసి బట్టలారేసుకోడానికి తీగెలు కట్టించాను. ఎప్పుడయినా బెడ్‌షీట్స్ లాంటివి ఆరెయ్యడానికి పనికొస్తుందని. నా కన్నా ఎంతో ముందుగా వచ్చిన వీళ్ళు ఎలాంటి ఎరేంజ్‌మెంట్సూ చేసుకోక పోగా నేను ఆరేసిన బట్టలు తీసి క్రింద పడేసి వాళ్ళు ఆరేసుకుని క్లిప్స్ దర్జాగా పెట్టుకుని వెళ్ళిపోయేవారు.
వెళ్ళే వాళ్ళు వెళ్ళకుండా విజయవాడ జంక్షన్‌లా మా యింటి పక్కన జేరి మెట్ల మీద కూర్చుని కేరింతలు కొడుతూ కబుర్లు మొదలెట్టేవారు.
అందులో ఎక్కువ దొర్లేవి – వాళ్ళ వయసులు, వారి భర్తల జీతాలు, వూళ్ళలో వాళ్ళకున్న ఆస్తిపాస్తులు. అవన్నీ పూర్తిగా బడాయి మాటలు, అబద్ధాలతోనే దొర్లుతుండేవి.
ఒకమ్మాయి బికామ్ చదివిందట. ‘మా ఆయన జీతం లక్షరూపాయలు. తెచ్చి నా వళ్ళో పోస్తాడు’ అని అంటే మరోకమ్మాయి ‘మీ ఆయన జీతమంతేనా, మా వారికి రెండు లక్షలు’ అనేది. ఇక నగల సంగతి వాళ్ళ జహ్వరి ఎలా బుట్టల్తో తెచ్చుకున్నది ఒకమ్మాయి చెబితే మరోకమ్మాయి సూట్‌కేసులనేది.
ఇక వయసుల సంగతి వస్తే పట్టనేలేం.
రోజూ డేటాఫ్ బర్త్‌లు మారిపోతుండేవి.
నిన్న తప్పు చెప్పేను అంటూ మర్నాడు మళ్ళీ సవరణలు.
ఇదంతా ఒక ఎత్తయితే పిల్లలకి అన్నం తినిపించడానికి లిఫ్ట్ వాడేవారు.
లిఫ్ట్‌లో వుండి పైకి కిందకి తిప్పుతూ అన్నాలు తినిపించేవారు. ఇక భర్తలు కూడా ఏమీ తీసిపోలేదు.
ఇంటి కొచ్చిన గెస్టు లిఫ్ట్‌లో నిలబడితే, ఇతను నిలబడి డోర్ తెలిచి కబర్లు చెప్పేవాడు.
ఒకమ్మాయి మా ఫ్లోర్‌లో కొచ్చింది.
ఆమెది చీరాలట.
మెట్ల మీద కూర్చున్నట్లు కూర్చుని కుండీలలో మొక్కలు పైకి లాగేసి ఎరగనట్లు పెట్టి వెళ్ళేది. శుక్రవారం వాచ్‌మాన్ కారిడార్ కడిగితే అందులో ఎవరైనా పడిపోవాలని నూనె పోసేది.
ఇక వేసుకున్న చెప్పులయితే పైకి రాగానే ఆ కాలు యిటు ఈ కాలు అటు అని విప్పి విసిరితే మా గుమ్మంలో పడి వుండేవి. చెప్పులు ఎలా ఒక పక్కకి సర్దిపెట్టుకోవాలో, ఎలా బిహేవ్ చెయాలో తెలియని ఈ తరం నాగరికమైన డిగ్రీలు చేతిలో వున్న అమ్మాయిలు.
ఇక ఎప్పుడంటే అప్పుడు పిల్లల్ని చంకనేసుకుని తలుపులు కొట్టి లోనికొచ్చేయడం, ఏదన్నా వస్తువు పగలగొట్టి తెలియనట్లు నిష్క్రమిచడం, ఇలాంటి లెక్కలేనన్ని దారుణాలు చూసి పిచ్చెక్కి తిరిగి వెనక్కొచ్చేసాం. ఇందులో నేను ఇంకా చాలా కుదించి రాసాను.
ఎపార్టుమెంటుల్లో ఒకే ఒక రూఫ్ క్రింద మనమంతా వుంటున్నాం అనే ఇంగితం లేకుండా పగలూ రాత్రి చేతిలో సెల్ పట్టుకున్నంత మాత్రాన నాగరికులు కారు. గడప బయటకి వచ్చాక ఎలా ప్రవర్తించాలో తెలుసుకున్న వారే నాగరీకులు.