[box type=’note’ fontsize=’16’] “నీ దేహం కోసమే కాదు, కాస్త ఈ దేశం కోసం కూడా ఆలోచించు” అంటోంది ఓ స్వరం శ్రీధర్ చౌడారపు రాసిన “జనవరిలో జండా పండుగ” కవితలో. [/box]
[dropcap]ప్ర[/dropcap]భాతభేరీల చప్పుళ్ళూ
ప్రభాతఫేరీలకై వీథులలోని నడకలూ
జై జై అంటున్న జయజయధ్వానాలూ
అమర్రహే అంటోన్న ఉద్వేగపునాదాలూ
జనవరిలో జండా పండుగనూ
పచ్చిగా మిగిలిపోయిన బాల్యపు జ్ఞాపకాలను
ఎంతెంత ఎదిగినా, నాకు
ఎప్పుడూ గుర్తు చేస్తూనే ఉంటాయి
అంతెత్తున ఎగురుతున్న
జాతీయ పతాకం మీదుగా వీచిన గాలి
అమ్మ చల్లని కౌగిట్లోని ఆప్యాయతను
నన్నల్లుకుని మరీ అందిస్తూ ఉంది
నాన్న వెచ్చని స్పర్శలోని భరోసాను
నాలోనికి నిండుగా నింపుతూ ఉంది
అక్కడెక్కడో ఎవరో పాడుకొంటూన్న
జనగణమన జాతీయ గీతం
అలవాటుగా అటెన్షన్లో నిలబెట్టేయిస్తోంటే
అలవోకగా పెదవులు కదులుతున్నాయి
గీతమంతా గుర్తుతెచ్చుకుని పాడేస్తోంటే
గుండెల్లో ఏదో తెలియని పులకరింతల గంగ
ఉప్పొంగుతోంది … ఉరకలెత్తుతోంది
“జయ జయ జయ జయహే”
అంటూ ఉద్వేగంతో పాడుతోన్న అంతంలో
ఏదో ఓ గొంతు నాతో మెల్లిగా గుసగుసలాడింది
బిడ్డా…!!
ఎదిగావు సరే సంతోషం,
మరి
నీ దేహం కోసమే కాదు, కాస్త
ఈ దేశం కోసం కూడా ఆలోచించు.