[box type=’note’ fontsize=’16’] “అసలు ఆనాడు మనిషి కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ పయనించింది పడవలు, ఓడల్లోనే” అంటూ ‘మానస సంచరరే -13: లాహిరి లాహిరి లాహిరిలో…!’ కాలమ్‍లో నౌకావిహారం గురించి వివరిస్తున్నారు జె. శ్యామల. [/box]
[dropcap]మ[/dropcap]నసైన సాయం సంధ్య. ఇంట్లో అందరూ ఊరెళ్లగా దక్కిన అరుదైన ప్రశాంత, ఏకాంత సమయం. కర్ణాటక సంగీతం వింటున్నాను. ‘ఓడను జరిపే ముచ్చట గనరే, వనితలారా నేడు… ఓడను జరిపే…’ త్యాగరాజకృతి వీనులవిందు చేస్తోంది. త్యాగరాజును ప్రధానంగా రామభక్తుడుగానే భావిస్తాం. కానీ నౌకాచరితం (ఇరవై ఒక్కకృతుల నాటిక) ఆయనకున్న కృష్ణభక్తికి తార్కాణంగా నిలుస్తుంది. కృతులలో ఎక్కువగా వినిపించేవి (బహుశా నేను విన్నవి కావచ్చు) ఓడను జరిపే ముచ్చట కనరే, మరొకటి గంధము పుయ్యరుగా, పన్నీరు గంధము పుయ్యరుగా.. ఈ కృతులు వింటుంటే నావలో కృష్ణుడు, గోపికలు, వారి కోలాహలం, ఆటపాటలు, అతిశయం, నావకు చిల్లుపడటం.. వగైరా కథంతా కళ్లకు కడుతుంది. ఎన్నో రకాల విహారాలున్నా నౌకా విహారం ప్రత్యేకమైంది. గలగలలాడుతూ, పరవళ్లు తొక్కుతూ సాగే జలాలలో పడవలో ప్రయాణిస్తూ, ప్రకృతిని వీక్షించడం.. ఓహ్! అది ప్రత్యేకానుభూతి.
అందుకే ప్రస్తుతకాలంలో ‘బోట్ టూరిజం’కు ప్రాచుర్యం పెరుగుతోంది. కేరళ హౌస్‌బోట్‌లకు పెట్టింది పేరు. ఆ పడవల్లో ఎన్ని రకాలు, ఏంకథ! కనులకింపైన సొగసైన డిజైన్లతో ఉండే పడవలను చూస్తేనే ఎంతో ఆనందాశ్చర్యాలు కలుగుతాయి. అన్నట్లు అలప్పుఝ (కేరళ)లో హౌస్‌బోట్ పరిశ్రమ నవంబర్‌లో సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతోందట. పడవ పందేలకు కూడా కేరళ పెట్టింది పేరు. ఓనమ్ పర్వదిన సందర్భంగా పథనంథిట్ట దగ్గర ఉన్న అరన్ములలో జరిగే పడవ పందాలు ఎంతో ప్రసిద్ధికెక్కాయి. అతి ప్రాచీన కాలం నుంచి ఇక్కడ ఈ పడవ పందాలు జరుగుతున్నాయి. స్నేక్ బోట్ రేస్‌లకు అలప్పుఝ (కేరళ) పేరొందింది. ఇక కాశ్మీర్‌లో దాల్ లేక్‌లో హౌస్‌బోట్‌లకయితే సాటేలేదు, తేలియాడే పడవల ఇళ్లలో ఉండటం ఎంత బాగుంటుందీ! అన్నట్లు మన హుస్సేన్ సాగర్లోనూ ఏటా రెగెట్టా జరుగుతుంటుంది. అదీ ఎంతో సరదాగానే ఉంటుంది.
పడవ ప్రయాణమంటే పాపికొండల టూర్ గుర్తుకొస్తోంది. రాజమండ్రి నుంచయినా, భద్రాచలం నుంచయినా వెళ్లవచ్చన్నారు. అయితే రాజమండ్రి నుంచి అయితేనే ఎక్కువ దూరం పడవలో ప్రయాణించే అవకాశం ఉంటుందనడంతో అలాగే వెళ్లాం. అది మరపురాని ప్రయాణం. ఎంత సేపు గోదావరి నీటి అందాలను, తీరాన ఉన్న ప్రకృతిని ఎంత తిలకించినా తనవితీరలేదు. ఆ బోటులో ఎంటర్టైన్‌మెంట్ ప్రోగ్రామ్ కూడా ఉంది. టూరిస్టులతో డ్యాన్సులు వగైరాలు చేయిస్తూ, సరదా కబుర్లు చెపుతున్నారు. కానీ అసలైన ప్రకృతి అందాలను చూడకుండా ఇదెందుకనిపించి అక్కడ్నుంచి కదిలి మెట్లు దిగి, సైడ్ కారిడార్లోనే బైఠాయించి గోదావరినే తిలకిస్తూ ‘వేదంలా ఘోషించే గోదావరి, అమరధామంలా శోభిల్లే రాజమహేంద్రి..’ గీతం గుర్తు చేసుకున్నాను. అలాగే శ్రీశైలం వెళ్లినప్పుడు పుట్టీలలో షికారు కూడా ఎంతగానో ఆనందానిచ్చింది. ఇంకా ఎన్నో చోట్ల బోటు షికార్లు చేసినా వీటన్నిటికన్నా ప్రత్యేక మైంది ‘న్యూపోర్ట్’. యు.ఎస్.కు వెళ్లినప్పుడు వేల్ వాచింగ్ కోసం న్యూపోర్ట్‌కు వెళ్లాను. అక్కడ పసిఫిక్‌లో వందకు పైగా పడవలు… రకరకాలు. పెద్దవి, అతి పెద్దవి.. ఎన్నో రకాల డిజైన్లలో. శాస్ డియాగోలోనూ పసిఫిక్ ఉన్నచోటల్లా బోట్ల సందడే. సంపన్నులు బోట్లను కొనుక్కుని అక్కడే ఉంచుకుంటారట. అడపాదడపా వచ్చి తమ బోటులో వినోదిస్తారేమో.
నౌకా విహారం మనిషికే కాదు, దేవుడికీ ఎంతో ఇష్టమట. అందుకే ప్రతి పుణ్యక్షేత్రాల్లో దేవుళ్లకు ఏటా కన్నుల పండువగా తెప్పోత్సవాలు నిర్వహిస్తుంటారు.
బోటు షికారు ఎంత ప్రమోదాన్నిస్తుందో, ఆ బోటే బోల్తా పడితే అదెంత ప్రమాదం! ఎన్నిసార్లు ఈ పడవ ప్రమాదాల వార్తలు వినడం లేదు. ప్రమాదానికి కారణాలు ఏవైనా కావచ్చు. నిన్న మొన్నటి వరకు రవాణా సౌకర్యాలు బాగా విస్తరించని కాలంలో.. పల్లెల్లో కాలువలు, ఏర్లు దాటి పట్నాలకు వెళ్లి చదువో, ఉపాధో చూసుకోవాలంటే పడవ ప్రయాణం తప్పేదికాదు.
‘మూగమనసులు’ చిత్రంలో సావిత్రి పడవలోనే వేరే ఊరుకు వెళ్లి చదువుకుంటుంది. నాగేశ్వరరావు పడవ నడుపుతుంటాడు. ఆమె అంటే అంతులేని అభిమానం.. అందులోనే ..
నా పాట నీనోట పలకాల సిలకా…..
పాట నువ్వు పాడాల, పడవ నే నడపాల,
నీటిలో నేను నీ నీడనే చూడాల
నా నీడ చూసి నువ్వు కిలకిలా నవ్వాల..
పరవళ్ల, నురుగళ్ల గోదారి ఉరకాల’ పాట ఎంతో పాపులర్ అయింది.
అసలు పడవ ఈనాటిదా? ఆదిమ మానవుడు తన శక్తియుక్తులను ప్రయోగించి తయారుచేసిన నీటి రవాణ – సాధనం ‘పడవ’. సింధునాగరికత కాలం నుంచే వాణిజ్యంలో పడవలు ప్రముఖపాత్ర వహించాయి. వర్తకులు సరుకులతో పడవల్లో, ఓడల్లో ప్రయాణించి పొరుగు దేశాల్లో సరుకులమ్ముకోవటం ఆనాడు సాధారణమే. అతి ప్రాచీన ఓడ నెదర్లాండ్స్‌కు చెందింది. ప్రస్తుతం మ్యూజియంలో ఉంది. అసలు ఆనాడు మనిషి కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ పయనించింది పడవలు, ఓడల్లోనే. పడవ.. ఓడ.. పెద్ద తేడా ఏం లేదు. ఓడ పెద్దది.. నిర్మాణంలో మరింత పటిష్టంగా, విశాలంగా ఉంటుంది. క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాను కనుగొన్నది ఓడలో ప్రయాణం సాగించేకదా. సింద్‌బాద్ యాత్రలు కథలన్నీ ఓడ ప్రయాణగాథలేగా. దొంగల్లో ఓ రకం పైరేట్స్.. అదే ఓడ దొంగలు లేదా సముద్రపు దొంగలు. అతి పెద్ద ప్రసిద్ధ ఓడ ‘టైటానిక్’ మునక విషాద ఘటనల్లో ఒకటిగా చరిత్రలో మునిగిపోయింది. ‘టైటానిక్’ సినిమా చూడనివారు అరుదేమో. మొక్కపాటివారి బారిష్టరు పార్వతీశం నవల అతడి ఇంగ్లండ్ ప్రయాణం హాస్యనవలాభిమానులెవరూ మరిచిపోలేరు.
పడవలు పిల్లలకెంత ఇష్టమో! కాగితంతో పిల్లలు మొదటగా చేసేవి రాకెట్, పడవలే. పడవలో మళ్లీ మామూలు పడవ, కత్తిపడవ. వాన వస్తే ఇంటిముంగిట సాగే నీటి ప్రవాహంలో కాగితపు పడవలేసి, అవి కదిలిపోతుంటే పిల్లల ఆనందానికి హద్దులే ఉండవు. పైగా ‘నా పడవ చూడు స్పీడుగా నీ పడవను దాటిపోయిందో’ అంటూ గర్వపడటం కూడాను. అంతేకాదు, చిన్నప్పుడు ‘బోట్స్ సెయిల్ ఆన్ ది రివర్స్, అండ్ షిప్ సెయిల్ ఆన్ ది సీస్..’ అంటూ క్రిస్టినా జార్జినా రోసెట్టి పొయెమ్ అదేపనిగా బైహార్ట్ చేసేదాన్ని. అసలు నౌకా విహారం అనగానే ‘మాయా బజార్’ సినిమా గుర్తిస్తుంది. అందులో అభిమన్యుడు, శశిరేఖ నౌకా విహారానికి వెళ్లి ‘లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా’ పాటందుకుంటారు (ఇప్పటి తరమైతే సాంగేసుకోవడమంటున్నారు). ఈపాట ఎంతో మధురంగా ఉండటం ఒక ఎత్తయితే అందులో మధ్య చరణం మరింత అర్థవంతంగా ఉంటుంది. అది..
‘అలల ఊపులో తీయని తలపులు చెలరేగే ఈ కలకలలో…
మిలమిలలో మైమరపించే ప్రేమనౌకలో హాయిగ చేసే విహరణలో..’
పింగళి నాగేంద్ర ఎంత గొప్పగా రాశారో.. ఇంక సన్నివేశం ఇంకా మహత్తరంగా ఉంటుంది. శశిరేఖ, అభిమన్యుణ్ని కలవటం, బలరాముడి భార్య రేవతికి అస్సలు ఇష్టం ఉండదు. వీరి నౌకా విహారం సంగతి భటుడు వచ్చి చెప్పడంతో బలరాముడు, రేవతి ఆగ్రహంతో నది వద్దకు బయలుదేరుతారు. మాయా గోపాలుడు వెంటనే వ్యూహం పన్ని శశిరేఖ, అభిమన్యులను అక్కడ్నుంచి తప్పించి, రుక్మిణితో తానే లాహిరి లాహిరి పాట పాడుతుంటాడు. చూడవచ్చిన బలరాముడు, రేవతి తాము విన్నది తప్పనుకొంటారు, తమముందు నుంచే కృష్ణుడు, రుక్మిణి వెళ్లిపోతుండగా, ‘కాలమహిమ కాకపోతే చిన్నపిల్లకు మల్లే రుక్మిణికి ఇంకా ఈ విహారాలేమిటండీ’ అంటుంది రేవతి. ‘కాలమహిమ కాదు, ప్రకృతి మహిమ. ఈ వెన్నెలలో, ఈ చల్లగాలిలో.. ఆహా… ఎలాగూ ఇంతదూరం వచ్చాంకదా. రా, కాస్త నౌకా విహారం చేసివెళ్దాం’ అంటాడు బలరాముడు. రేవతి అంతకుముందు తాను రుక్మిణి గురించి చేసి వ్యాఖ్యను మరిచి, ‘రండి’ అంటూ అనుసరిస్తుంది. నవ్వొచ్చే చక్కటి సన్నివేశం. ఒకే పాట మూడు జంటలు.. గొప్ప క్రియేషన్ ‘మాయాబజార్’ చిత్రం. ‘మర్మయోగి’ చిత్రంలో మరో మధురమైన యుగళగీతం..
‘నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే
ఇది మైమరపించే హాయి, ఇక రానీ రాదీ రేయి..’
“శభాష్ రాముడు” చిత్రంలో
‘ఆశలే అలలాగా… ఊగెనే సరదాగా
ఓడలాగా జీవితమంతా ఆడేముగా…’
అనే పాట సైతం గొప్పగా ఉంటుంది. అందులో ఓ చరణంలో.. ‘తుఫానులోని పడవవలె, ఊపివేయును కష్టములే’ అంటూ చక్కటి పోలిక చెపుతాడు.
రామాయణంలోనూ పడవ ప్రస్తావన ఉండనే ఉంది. గుహుడు అరణ్యవాసానికి బయల్దేరిన సీతారామలక్ష్మణులను తన పడవలోనే గంగానది దాటించి, చిత్రకూటానికి చేరుస్తాడు. “సంపూర్ణ రామాయణం’ చిత్రంలో ఈ సందర్భంలోనే ఓ చక్కటి పాట ఉంది.
‘రామయ్య తండ్రీ.. ఓ రామయ్య తండ్రీ..
మా నోములన్ని పండినాయి రామయ్య తండ్రీ
మా స్వామివంటే నువ్వేలే రామయ్య తండ్రీ..’ అంటూ
‘నీ కాలిదుమ్ము సోకి రాయి ఆడది అయినాదంటా…
నాకు తెలుసులే నా నావమీద కాలు పడితే ఏమవుతుందో తంటా..’ అంటూ
‘నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రీ..
మమ్ము దయచూడగ వచ్చావు రామయ్య తండ్రీ..’ అంటాడు గుహుడు.
రామాయణమే కాదు, మహాభారతంలోనూ పడవ ప్రాముఖ్యానికేమీ తక్కువ లేదు. శంతనుడు బెస్త పడుచు సత్యవతిపై మనసుపడటం తెలిసిందే. ‘భీష్మ’ చిత్రంలో ఈ ఉదంతాన్ని చక్కగా చిత్రీకరించారు. సత్యవతి శంతనుడిపై ప్రేమ వల విసురుతూ..
‘హైలో.. హైలెస్సా హంసకదా నా పడవ.. హైలో..
ఉయ్యాలలూగినది, ఊగిసలాడినడి.. హైలో…’ అంటూ
‘నదిలో నా రూపు నవనవలాడినది
మెరిసే అందములు మిలమిలలాడినవి
వయసు వయారము పాడినవి పదేపదే…’ అని అనటమే కాదు,
‘ఎవరో మారాజు ఎదుట నిలిచాడు
ఏవో చూపులతో చెంతకు చేరాడు.
మనసే చలించునే మాయదారి మగాళ్లకి’
అంటూ.. తీర్మానం కూడా చేసేస్తుంది. శంతనుడి ప్రేమ, భీష్మ ప్రతిజ్ఞకు దారి తీయటం, ఆ తర్వాతి కథ అందరికీ తెలిసినవే.
అసలు ప్రధానమైన కథంతా పడవలోనే చిత్రీకరించిన సినిమాలు అందాల రాముడు, గోదావరి.. రెండూ ఎంతగానో హిట్టయ్యాయి.
సత్యనారాయణ వ్రత కథల్లో వర్తకుడైన కళావతి భర్త పడవ మునిగి గల్లంతవడం, ఆమె ఇంటికి వెళ్లి సత్యదేవుని ప్రసాదం స్వీకరించి వచ్చాక పడవ, భర్త క్షేమంగా ప్రత్యక్షం కావడం.. సత్యదేవుని మహిమ తెలిపే కథ తెలుగునాట అందరికీ తెలిసిందే.
బెస్తలకు పడవ, వల తోడిదేకదా జీవనం. పడవ మీద చేపల వేటకు వెళ్లిన వారు ముఖ్యంగా వాతావరణం బాగా లేనప్పుడు వారు తిరిగి గూడు చేరే వరకు ఇంటివారికి దిగులే.
పడవ సరంగులుగా జీవితం సాగించే వారెందరో. వారు భద్రంగా నడిపితేనే కదా పడవలో ప్రయాణించేవారో, షికారు చేసేవారో భద్రంగా ఉండేది. ‘ఏరు దాటే దాకా పడవ మల్లయ్య, ఏరుదాటాక బోడి మల్లయ్య’ అని అవసరం ఉన్నప్పుడు, అవసరం తీరాక మనుషుల వైఖరిని తెలిపే సామెత ఒకటుంది
పడవ నడకకు, మనిషి జీవితానికి ఎంతో సామ్యం ఉంది. పడవ జీవితమయితే, హోరుగాలులు, తుపానులు, వరదలు కష్టాలకు ప్రతీకలు. స్వయంవరం చిత్రంలోని పాట ఇదే అంశాన్ని ఎంతో చక్కగా వివరించింది..అది..
‘గాలివానలో, వాన నీటిలో పడవ ప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం
ఇటు హోరుగాలి అని తెలుసు
అటు వరద పొంగు అని తెలుసు
హోరుగాలిలో.. వరద పొంగులో
సాగలేననీ తెలుసు..
అది జోరు వాన అని తెలుసూ
ఇది నీటిసుడు లనీ తెలుసూ
జోరువానలో, నీటి సుడులలో మునక తప్పదని తెలుసు
అయినా, పడవ ప్రయాణం..
తీరమెక్కడో, గమ్యమేమిటో తెలియదు పాపం..’
దాసరి పాట, జేసుదాసు నోట అద్భుతంగా పలికింది..
అసలు పాటల్లో పడవ పాటలు ప్రత్యేకం. పడవ సరంగులు పాడే పాటల్లో తత్వం కూడా ఉంటుంది. భక్త తుకారాం చిత్రంలోని పాట ఇందుకు ఓ మచ్చుగా చెప్పుకోవచ్చు.
‘హైలెసా.. హైలెసా.. హైలెసా
పడవెళ్లిపోతుందిరా… ఓ మానవుడా దరిజేరే దారేదిరా,
నీ జీవితము కెరటాల పాలాయెరా.. పడవెళ్లిపోతుందిరా…
బుడగవంటి బ్రతుకు
ఒక చిటికెలోన చితుకు
ఇది శాశ్వతమని తలచేవురా
నీవెందుకని మురిసేవురా
నువ్వు దరిచేరే దారి వెతకరా ఓ మానవుడా
హరినామం మరువవద్దురా..’ అంటాడు.
‘సింకింగ్ బోట్’ పద ప్రయోగం తరచు వినిపిస్తూంటుంది. పడిపోయే పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వాలను కూడా సింకింగ్ బోట్ తోనే పోలుస్తారు. తెలిసి తెలిసి సింకింగ్ బోట్‌లో ఉండటమెలా అని పార్టీ ఫిరాయింపులకు పాల్పడడమూ కద్దు. చుట్టూ ఉండే నీరు ఓడను ముంచివేయలేదు. ఆ నీరు లోపలికి చేరితేనే ప్రమాదం.
చుట్టూ ఉండే సమస్యలు మనిషిని కుంగదీయలేవు. వాటిని మనసులోకి తీసుకుంటేనే ప్రమాదం అని ఈ మధ్య ఓమంచి వాట్సప్ మెసేజ్ చూశాను. నౌకల గురించి ప్రస్తావించుకునేటప్పుడు భారత నావికాదళం గురించి తప్పకుండా స్మరించుకోవాలి. త్రివిధ దళాలలో నావికాదళం ఒకటి. సరిహద్దుల్ని కాపాడటంలోనూ, ప్రకృతి విపత్తులు, ఇతరత్రా భారీ ప్రమాదాలు తలెత్తినపుడు నావికాదళం అందించే సేవలు అనుపమానం.
విశాఖ షిప్ యార్డు మన తెలుగువారికి పరిచితమే. మనదేశ ఆర్థిక వ్యవస్థలో ఇండియన్ షిప్పింగ్ ఇండస్ట్రీ ప్రముఖ పాత్ర పోషిస్తోంది. తొంభై శాతం వర్తకం షిప్పింగ్‌తోనే జరుగుతోంది. నౌకల తయారీ పరిశ్రమలు మజగాస్, కొచ్చిన్, కోల్‌కతా, విశాఖల్లో నెలకొన్నాయి. మన విశాఖలో పందొమ్మిది వందల నలభై ఒకటిలో స్కిండియా స్టీమ్ నావిగేషన్ కంపెనీగా షిప్ బిల్డింగ్ కంపెనీని స్థాపించగా, పందొమ్మిది వందల యాభైరెండులో దీనికి హిందుస్తాన్ షిప్ యార్డ్‌గా నామకరణం జరిగింది. ఆదిమకాలం నుంచి ఆధునిక కాలం వరకు ‘నౌక’తో మనిషి అనుబంధం అధికమవుతూనే వస్తోంది. నాటుపడవలు, మరపడవలు, స్ట్రీమ్ బోట్లు, తెడ్లతో నడిపేవి, పెడల్‌తో నడిపేవి.. నలుగురు ఎక్కేవి, పదుగురు ఎక్కేవి, ఇద్దరే ఎక్కేవి ఇలా ఎన్నెన్నో. అన్నట్లు గూటి పడవలు కూడా ఉన్నాయి. ‘ముత్యాలముగ్గు’ చిత్రంలో ‘ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు, గూటి పడవలో విన్నది కొత్త పెళ్లి కూతురు’ చక్కటి పాట ఉంది.
అయితే పడవ ప్రయాణాలు, షికార్లు ఎంత ప్రమోదాలో ఆ బోటే బోల్తా పడితే అంత ప్రమాదాలు కూడా. ప్రకృతి సహాయ నిరాకరణ, సాంకేతిక వైఫల్యం ఇలా ప్రమాదానికి ఎన్నో కారణాలు. కొన్నిసార్లు నాటు పడవలో పట్టనంత ఎక్కువమంది ఎక్కటం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. కనీసం అలాంటి స్వయంకృతాపరాధాలకైనా దూరంగా ఉండాలి. జీవితం నావ లాంటిదే. ఓర్పుతో నేర్పుగా, ఒడుపుగా నడిపించుకోవాలి. అందుకే కాబోలు ఓ సినీకవి..
‘బంగరు నావ.. బ్రతుకు బంగరు నావ దాన్ని నడిపించు నలుగురికీ మేలైన త్రోవ.. బంగరునావ..’ అన్నాడు.
ఎంత చక్కటి సందేశం.. అనుకుంటుండగానే ఫోన్ మోగింది. ఉలిక్కిపడ్డాను. చూస్తే అన్‌నోన్ నంబర్. అసంకల్పితంగా లిఫ్ట్ చేసే లోపే హఠాత్తుగా ఆగింది. కానీ ఆ అంతరాయం నన్ను మెల్లగా ప్రస్తుతానికి తెస్తోంది. ‘ఓడను జరిపే ముచ్చట గనరే..’ పాట ఎప్పుడాగిపోయిందో.. అర్జెంటుగా ఓ కప్పు టీ తాగాలనిపించటంతో నా మనో సంద్రంలో అతి వేగంగా పయనిస్తోన్న ఆలోచనల నావకు లంగరు వేయక తప్పలేదు.