[box type=’note’ fontsize=’16’] “ప్రతి ప్రేక్షకుడూ ఆయన స్వరాలను మనసు నిండా నింపుకుని చలి నిండిన జనవరి మాసపు చివరి వారపు రాత్రిని నులి వెచ్చని హాయిని మోసుకుంటూ ఇంటికి చేరడం ఎంతటి గొప్ప అనుభూతి” అంటూ హైదరాబాద్‌లో పొంగిన ఏసుదాస్ స్వరఝరి గురించి వివరిస్తున్నారు సుజాత వేల్పూరి. [/box]
[dropcap]”జ[/dropcap]బ్ దీప్ జలే ఆనా” అని మధుర మైన స్వరంతో పాడుతుంటే, అంతగా అందగాడు కాని, ఆకర్షణ లేని హీరోతో కూడా ప్రేమలో పడాలనిపిస్తుంది.
షామ్ రంగ్ రంగారే అని సిచుయేషనల్ పాట పాడినా, కృష్ణుడి మీద భక్తి పొంగి పొర్లాల్సిందే.
సూర్ మై అఖియో మే అని శ్రీదేవికి జోల పాడితే, ఆ స్వరం లోని మార్దవానికి, మాధుర్యానికి మన కళ్ళు, మనసు తడుస్తాయి.
ఎవ్వరిదీ ఈ వీణ, ఎక్కడిదీ ఈ జాణ అని గంభీరంగానే కాసింత చిలిపి తనం ఒలికించినా బాగానే ఉంటుంది.
సరసాంగి నీపై మరులు గొన్నదె అని వర్ణం తో వర్ణాలు ఆవిష్కరించినా, శబరిమలను స్వర్ణ చంద్రోదయం అని అయ్యప్పను స్తుతించినా, హరివరాసనం అంటూ అంటూ జోల పాడి ఆ అయ్యప్పను నిద్ర పుచ్చినా… ఆయనకే చెల్లు! ఆ స్వరానికే చెల్లు!
హైదరాబాద్ సంగీత ప్రియులు ఎన్నాళ్లు గానో ఎదురు చూస్తున్న సందర్భం రానే వచ్చింది. అపురూప గాయకుడు కె. జె. ఏసుదాస్ మధుర గాత్రంతో వారిని జనవరి 20 న మంత్రనగరి సరిహద్దులకు ప్రయాణం కట్టించారు. దాదాపు పదేళ్ల తర్వాత ఏసుదాస్ నగరంలో తన గళాన్ని విప్పారు. 2009 లో పబ్లిక్ గార్డెన్ లలిత కళా తోరణం లో శాస్త్రీయ సంగీత కచేరీ చేసిన ఆయన ఆ తర్వాత ఇప్పుడే నగరానికి రావడం.
ఈసారి సినీ సంగీతం కావడంతో కొంత సరదాగా సాగింది కార్యక్రమం. ఆయన తనయుడు విజయ్ ఏసుదాస్, గాయని కల్పనా రాఘవేంద్ర ఏసుదాస్‌తో గొంతు కలిపి మరింత సరదాను పెంచారు.
కార్యక్రమానికి నాల్గు రోజుల ముందు కూడా బోలెడన్ని టికెట్లు కనిపించినా, ఇరవయ్యో తారీకు నాటికి పూర్తిగా అయిపోయాయి. అందునా సినీ సంగీతం కావడం వల్ల, జనం మరింత ఆసక్తిగా ఎదురు చూసినట్టున్నారు.
ఏసుదాస్ హిందీలో పాడిన అసంఖ్యాక సినిమా గీతాలకు అభిమానులు కాని వారెవరు? నాలుగు దక్షిణ భారత భాషల్లోనూ ఆయన పాడిన పాటలకు ఫిదా కాని వారెవరు? అందుకేనెమో నగరంలోని తెలుగు తమిళ కన్నడ మలయాళీ అభిమానులంతా ఆయన పాటలకు అర్రులు చాస్తూ పరిగెత్తుకొచ్చేశారు.
శాస్త్రీయ సంగీత కచేరీలలో చాలా సీరియస్‌నెస్ పాటిస్తూ గంభీరంగా ఉండే ఏసుదాస్, ఈసారి సరదా మూడ్ లోనే నవ్వుస్తూ నవ్విస్తూ, ప్రేక్షకులు కోరిన పాటలని పాడుతూ హాయిగా కనిపించారు.
2009లో ఆయన లలితకళా తోరణంలో చేసిన శాస్త్రీయ కచేరీ నాకు బాగా గుర్తుంది. ఆయన సరసాంగి వర్ణంతో కచేరి మొదలు పెట్టిన మరి కాసేపటికే దగ్గరలోనే నాంపల్లి రైల్వే స్టేషన్‌లో బయలు దేరుతున్న రైలు ఒకటి కూత వేయడంతో ఆయన పాడటం ఆపేశారు. నిర్వాహకులు అందరూ కొంత భయంతో నిశ్శబ్దంగా ఉండిపోయారు. కొద్దీ క్షణాలకు ఆయన తిరిగి పాడటం మొదలు పెట్టగానే మరో రైలు కూత మరో మరి కొంచెం తక్కువ శ్రుతిలో!!
“కచేరీ సాగినంత సేపూ నేనూ రైళ్ళూ పోటీ పడక తప్పేట్టు లేదు” అని తిరిగి కొనసాగించారు. రెండు రైళ్ళూ రెండు శృతుల్లో పాడాయని నవ్వుతూనే చురక వేశారు.
ఈ లోపు ఒక సినిమా హీరో రావడం, ఆయన వచ్చాడు కదాని నిర్వాహకులు కాసేపు కచేరీని ఆపేయడం, ఇదే సందని అయన ఉపన్యాసం అందుకోవడం ఇవన్నీ ఏసుదాస్‌కి చాలా చిరాకు పుట్టించినా, సహించి ఆ తర్వాత పాడటం కొనసాగించారు. నిజానికి శాస్త్రీయ సంగీత కచేరి విషయంలో ఆయన చాలా శ్రద్ధగా, నిష్ఠగా, పట్టింపుగా ఉంటారని అంటారు. ఏసుదాస్ శాస్త్రీయ సంగీతం పాడటానికి వచ్చారని తెల్సినా, చిత్ చోర్‌లో పాటలు పాడాలని ఒక ప్రముఖుడు కోరడం, నిర్వాహకులు ఆయన్ని బతిమాలడంతో, బలవంతంగా మృదంగం మీద “గోరి తేరా గావ్ బడా ప్యారా” పాడారు. హుషారైన ఆ పాట మృదంగం మీద ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఆయన చాలా ఇబ్బంది పడి “శాస్త్రీయ సంగీత కచేరిలలో సినిమా పాటలు అడగవద్ద”ని విజ్ఞప్తి చేసుకోవలసి వచ్చింది
ఇదంతా కొందరు ప్రేక్షక శ్రోతలకు కూడా అసహనంగా తోచినా, తప్పలేదు.
కానీ పదేళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరిగిన ఈ కచేరీ సినీ సంగీత కార్యక్రమం కావడంతో ఏసుదాస్ కూడా ఆహ్లాదంగా, సరదాగా కనిపించారు.
హైటెక్ సిటీ లోని శిల్పకళావేదికలో దీన్ని ఏర్పాటు చేయడంతో అధిక సంఖ్యలో ప్రేక్షకులు రావడానికి అవకాశమైతే కల్గింది కానీ, వారిలో కొందరు ఫలానా పాటలు పాడాలని కోరుతూ కేకలు పెడుతూ వీలైనంత విఘాతం కల్గించారు. ఇలాటివి కళాకారులు ఎన్నో చూసి ఉండొచ్చు గానీ, వారి ఏకాగ్రతకు, ఆసక్తి భంగం కల్గించే పనులు ప్రేక్షకులు చేయకుండా హుందాగా ప్రవర్తిస్తే ఎంత బాగుంటుంది? హైదరాబాద్ ఆడియెన్స్ నిజంగా గొప్ప ఆడియెన్స్ అని ఇక్కడికి ప్రదర్శనల కోసం వచ్చే చాలా మంది కళాకారులు అంటుంటారు (నిజానికి ప్రతి వూర్లో అలాగే లోకల్ ప్రేక్షకులని గొప్ప వాళ్ళని పొగడ్డం మామూలే అయినా, హైదరాబాద్ ఆడియెన్స్ నిజంగా రసజ్ఞులు).
ఇలాటి పనుల వల్ల ఆ పేరు మాసిపోయే ప్రమాదం లేదూ?
మహాగణపతిం తో మొదలు పెట్టిన ఏసుదాస్ తెలుగు తమిళ కన్నడ మళయాళ పాటలు చాలానే పాడారు. సాయంత్రం ఆరున్నర నుంచి రాత్రి పదకొండు గంటల వరకూ బ్రేక్ లేకుండా నిరాఘాటం గా సాగిన ఈ ప్రోగ్రామ్‌లో యేసు దాస్ మేఘ సందేశం, పాలు నీళ్లు, పెద్దరికం, రుద్ర వీణ,మొదలుకొని, గోరి తేరా గావ్ బడా ప్యారా (చిత్ చోర్) వంటి హిందీ పాటలు కూడా పాడారు.
ఆయనతో పాటు వచ్చిన ఆయన కొడుకు విజయ్ ఏసుదాస్ ఎంతో హుషారైన యువకుడు. అచ్చు తండ్రి గాత్రాన్ని పుణికి పుచ్చుకుని అనేక తెలుగు పాటలు ఇతర భాషల పాటలూ పాడారు. వీరిద్దరికీ జతగా కల్పన! ఒక్క నోట్ కూడా తప్పు పడకుండా టెక్నీకల్లీ కరెక్ట్‌గా పాడే కల్పన మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చింది
79 ఏళ్ల ముదిమిలో ఏసుదాస్ చురుకుతనం, పాటల పట్ల ఆయన ఉత్సాహం, చెప్పనలవి కాదు. అక్కడక్కడా కొన్ని పాటల్లో కంఠంలో వృద్ధాప్య ఛాయలు కనపడినా, ఏ మాత్రం మాధుర్యం తగ్గని, తారాస్థాయిలో పాడగలిగిన శక్తి అబ్బురపడేలా చేశాయి. ఆయన పాటల్లో ప్రేక్షకులంతా తడిసి ముద్దయిపోయారు
కార్యక్రమం మధ్యలో కొద్దీ నిమిషాల పాటు మెరుపులా మెరిసిన బాలు ప్రత్యేక అతిథి అనుకుంటే, బాలు, ఏసుదాస్ కల్సి దళపతి సినిమాలోని పాట పాడటం మరో ఆకస్మిక ఆకర్షణ.
నటుడు కూడా అయిన విజయ్ ఏసుదాస్ గాయకుడుగా తన గళంలో పలికించిన మధురిమలు, ఒలికించిన పరిమళాలు ఎన్నెన్నో !
ఒకప్పుడు సంగీత కచేరి అంటే సంగీతమే! ఇప్పుడు మీడియా ప్రాబల్యం, స్పాన్సర్స్ ప్రాబల్యం ఎక్కువ కావడం, టెక్నాలజీ మరింత పెరగడంతో, ఫోకస్ లైట్ల మెరుపులు, స్పాన్సర్ల ప్రకటనల జిలుగులు, పాటల దారిలో గతుకుల్లా అడ్డం పడినా తప్పని సరి కాబట్టి భరించడమే.
ఇలాటి గొప్ప కళాకారులను పిలిచినప్పుడైనా కనీసం తెలుగు సరిగా మాట్లాడగలిగిన యాంకర్లను పెట్టుకోకపోవడం మొహమాటమో, నిర్లక్ష్యమో అర్థం కాదు. యాంకర్ భార్గవి అచ్చ తెలుగు మహిళ అయి ఉండి పంటి కింద రాళ్లు లాంటి పదాలతో నిస్సారమైన భావ ప్రకటనలతో విసుగు పుట్టించింది. నిజానికి ఇలాటి ప్రోగ్రామ్స్‌లో యాంకర్లు మరింత హుషారు పుట్టించేలా మాట్లాడగలైయ్ ఉండొద్దా?
ఏసుదాస్‌ని కేరళ ప్రభుత్వం “ఆస్థాన గాయకన్” అనే బిరుదుతో సత్కరించింది. పదవికీ బిరుదుకీ తేడా తెలీదనుకోవాలా?
ఆర్కెస్ట్రాని పరిచయం చేయడానికి “ఈ వాగ్గేయకారుల్ని పిలుద్దాం” అని మరో చెణుకు!!!
పాపం, వాయిద్య కారులకు, వాగ్గేయకారులు ఉన్న తేడా ఏమిటో, ఎంతో ఆమెకు తెలిస్తే ఎంత బాగుండేది.
తిరిగి ఎపుడు హైదరాబాద్ ఏసుదాస్ స్వరాల విందుకు నోచుకుంటుందో చెప్పలేం గానీ, ప్రతి ప్రేక్షకుడూ ఆయన స్వరాలను మనసు నిండా నింపుకుని చలి నిండిన జనవరి మాసపు చివరి వారపు రాత్రిని నులి వెచ్చని హాయిని మోసుకుంటూ ఇంటికి చేరడం ఎంతటి గొప్ప అనుభూతి?
ఇటువంటి అనుభూతి మళ్ళీ మళ్ళీ హైదరాబాద్‌కి దక్కాలి, మళ్ళీ మళ్ళీ సంగీతాభిమానులు ఆ స్వరఝరిలో తడవాలి.