[box type=’note’ fontsize=’16’] “మనసాక్షికి ఒకసారి అనుకూలంగా ఒకసారి వ్యతిరేకంగా సాగేదే జీవితం” అంటూ జీవితసారాన్ని వివరిస్తున్నారు కారుణ్య ఈ కవితలో. [/box]
[dropcap]ప[/dropcap]రవశించే పరవళ్ళ పండుగే కాదు
విలయ జాగరణల రాత్రులే జీవితసారం
వికసించే విరుల దరహాసల నవ్వులే కాదు
జడివాన అశ్రువుల సాగరమే జీవితసారం
గలగల సాగే నదుల పలుకులే కాదు
మూగబోయిన వీణ మౌనమే జీవితసారం
సుగంధాల వికసిత సుమదారులే కాదు
కఠిన కసాయి కంటకాల మార్గమే జీవితసారం
అమరేంద్ర విలాసాలపుర స్వర్గమే కాదు
సూర్యపుత్రుడి కఠినన్యాయ శిక్షల నరకమే జీవితసారం
అద్దాలమేడల హోయల సౌఖ్యాలమేడలే కాదు
దారిద్ర నిలయాల కుఛేలుని గుడిసెలే జీవితసారం
పలుకరించే పచ్చని ప్రకృతి వనాల సుఖమే కాదు
రాశిపోసిన ఎడారి ఇసుక దిబ్బల దుఃఖమే జీవితసారం
జీవనదులతో పొందే అమృత ప్రాణధార ఆనందమే కాదు
భగభగలాడే హాలాహల విషవాయువు వేదనే జీవితసారం
వైభోగపు ఆడంబరాల అట్టహాస విందులే కాదు
ఎగసిపడే ఆకలిడొక్కల ఆక్రందనలే జీవితసారం
ఓంకారనాదంతో పవిత్ర మంత్రాల వేదోచ్చారమే కాదు
శ్మశానంలో సాగే క్షుద్రపూజల కఠోరఘోషయే జీవితసారం
కాలంతో నిత్యం సాగి ఆగిపోవడమే కాదు
నిరంతర భ్రమణంలో క్షణంక్షణం మారిపోయేదే జీవితం
మనసాక్షికి ఒకసారి అనుకూలంగా ఒకసారి వ్యతిరేకంగా సాగేదే జీవితం.