[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
యత్తార్మ్యక్షభీత్యా ప్రాప్తానం నాగానాం గుప్తయేధృవమ్।
ప్రసారిత భుజాం పృష్ఠే శైల ప్రావార లీలయాం॥
విజేయతే పుణ్యబలెర్చతైర్యత్తు న శస్త్రిణామ్।
[కశ్మీర రాజతరంగిణి (కల్హణ), 1-31-39]
[dropcap]నీ[/dropcap]లమత పురాణం తెలుసుకోవడంలో అడుగు ముందుకు వేసే ముందు ఒక్క నిమిషం ఆగి నీలమత పురాణంలో ప్రస్తావించిన పుణ్యక్షేత్రాలను ఆధునిక సమయంలో గుర్తించాల్సి ఉంటుంది. ఇందుకు రెండు కారణాలు. ఒకటి నీలమత పురాణం ఎప్పటిదయినా అప్పటికే దేశ భౌగోళిక స్థితిగతులు, విభిన్న ప్రాంతాల గురించిన విజ్ఞానం ఆ కాలంలోనే ఉండేదని అర్థం చేసుకునేందుకు. రెండవది ఇప్పటి ‘దేశం’ అన్న భావన అప్పుడు లేకున్నా ప్రజలంతా ‘ఒకటి’, ‘ఇదంతా మనది’ అన్న భావన ఉన్నదని గుర్తించేందుకు. ఈ రెండు కారణాల వల్ల మనం నీలమత పురాణంలో ప్రస్తావించిన స్థలాలు, నదులు, కొండల వంటి వాటిని గుర్తించాల్సి ఉంటుంది. ముందుగా రాజతరంగిణిలో కల్హణుడు చెప్పిన మాటలను స్మరించుకోవాల్సి ఉంటుంది. నీలమత పురాణం కశ్మీర్ నలువైపులా ఉన్న పర్వతాలను ప్రాకృతికమైన అడ్డుగోడలుగా వర్ణిస్తుంది. శత్రువులు కాశ్మీరంలో అడుగుపెట్టకుండా భగవంతుడు ప్రాకృతికంగా కట్టిన పవిత్రమైన కోటగా భావిస్తుంది. అయితే కల్హణుడి కాలం వచ్చేసరికి తురుష్కులు కశ్మీర్‌లో అడుగుపెట్టారు. కశ్మీర్‌ను రూపాంతరం చెందించడం ప్రారంభించారు. వారి ప్రభావం వల్ల కశ్మీర్ జన జీవితంలో మానసిక వ్యవస్థలో ప్రవేశించిన దిగజారుడుతనం, నైతిక విలువల పతనం, పెరుగుతున్న సంకుచితత్వం, తరుగుతున్న ధార్మికత్వం, ప్రవేశిస్తున్న దౌర్బల్యం, భీరుత్వం వంటి వాటిని ప్రత్యక్షంగా చూశాడు. తురుష్కుల సంపర్కం వలన భారతీయ సమాజం ఎలా చిన్నాభిన్నం అవుతుందో గమనించాడు, అవగాహన చేసుకున్నాడు. అయితే భారతీయ ‘ఆత్మ’ను ఎరిగినవాడు కల్హణుడు.
అందుకే నీలమత పురాణానికి భిన్నంగా కశ్మీరు వైపు శత్రువులు కన్నెత్తి చూడలేరు అనలేదు. “కాశ్మీరును శత్రువులు భౌతిక బలంతో గెలవవచ్చు కానీ ధార్మికంగా, ఆధ్యాత్మికంగా ఎవరు గెలవలేరు” అన్నాడు. ఒకసారి ఇప్పుడు కశ్మీర్‌లో జరుగుతున్నది గమనిస్తే కల్హణుడు భారతీయ ఆత్మను ఎంత గొప్పగా అర్థం చేసుకున్నాడో స్పష్టం అవుతుంది.
కశ్మీరు తురకల వశం అయింది. అక్కడ పండితుల జీవనం దుర్భరం అయింది. కానీ కశ్మీర్ ప్రజల నడుమ ఉన్న బాంధవ్యం చెదరలేదు. కానీ ఆధునిక రాజకీయాలు అంతర్జాతీయ కుట్రలు కశ్మీర్లో సామాన్యుల నడుమ ఎల్లలు సృజించాయి. సామాన్యులను భీతిభ్రాంతులను చేస్తూ ఆయుధాలు ధరించిన విదేశీ తీవ్రవాదులు తాము ప్రజల స్వరం అయినట్టు ప్రచారం చేసుకున్నారు. పండితులను కశ్మీర్ నుంచి తరిమి వేసి తమ సంఖ్యాబలాన్ని పెంచుకున్నారు. కశ్మీర్ ప్రజలకు భారత దేశంతో కలిసి ఉండడం ఇష్టం లేదంటూ ప్రచారం చేశారు. మన ‘మీడియా’ కూడా దాన్నే ప్రచారం చేసింది. భారతీయ సైన్యంపై రాళ్లు రువ్వుతున్న ప్రజలను పదేపదే చూపిస్తూ దేశంలోని ఇతర ప్రాంతాల వారికి కాశ్మీరు ప్రజల పట్ల ద్వేషం కలిగేట్టు చేసింది. కశ్మీర్ ప్రజలు భారత్‌ను ద్వేషిస్తున్నారు వారిని పట్టి ఉంచడం కుదరదన్న భావనను కలుగ చేసింది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం దృఢనిశ్చయం ప్రదర్శించిందో, సామాన్యుడికి తీవ్రవాదుల తుపాకుల నుండి రక్షణ కల్పించిందో అప్పుడు తల లోని పేలను ఏరి ఏరి చంపినట్టు తీవ్రవాదుల ఏరివేత జరిగింది. భారతదేశంతో ఆత్మిక సంబంధం అనుబంధం కలిగి మౌనంగా ఉన్న సామాన్య పౌరుల సహాయం లేకపోతే ఈనాడు ‘బారాముల్లా’ తీవ్రవాద రహితం అయ్యేది కాదు. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొన్నాళ్లకు కశ్మీర్‌లో శాంతి నెలకొనే వీలుంది. మళ్లీ పండితులు కశ్మీర్‌లో ప్రశాంత జీవనం సాగించే వీలు కలుగుతుంది. ఇది భారతీయ ఆత్మ స్వరూపం. తుఫాను వచ్చినప్పుడు క్రుంగదు, వంగుతుంది. తర్వాత మళ్ళీ తలెత్తుతుంది. కల్హణుడు చెపుతున్నది ఇదే. భౌతిక బలంతో తాత్కాలికంగా కశ్మీరును అణచవచ్చు కాని ఆధ్యాత్మిక బలంతో కశ్మీర్ తిరిగి తల ఎత్తుకొని నిలబడుతుంది. తుపాకి నీడ తొలగితే అసలు ప్రజల స్వరం వినిపిస్తుంది.
ఇది కాశ్మీర్‌కే కాదు, సమస్త భారతదేశానికి ఈ దేశానికి ఆత్మ అయిన భారతీయ ధర్మానికి వర్తిస్తుంది. ఇది ఒక సజీవనది. బండ రాళ్ళు అడ్డు వచ్చినప్పుడు వాటిని కోయలేనప్పుడు వంగి పక్కనుంచి ప్రవహిస్తుంది, కానీ దాన్ని కోస్తూ పోతుంది. కొన్నాళ్ళకి బండరాయి కరిగిపోతుంది. నీరు ప్రవహిస్తూనే ఉంటుంది!
నీల మత పురాణం ‘బాహిరిగిరి’ ‘అంతర గిరి’ అన్న రెండు హిమాలయ శ్రేణులను ప్రస్తావిస్తుంది. వీటిని లెస్సర్ హిమాలయాస్, గ్రేటర్ సెంటర్ హిమాలయాస్ అని ప్రస్తుతం అంటున్నాము. ‘పాలి’ సాహిత్యంలో వీటిని ‘చుల్లా హిమవంత్’, ‘మహా హిమవంత్’ అంటారు. నీలమత పురాణంలో ‘ద్వార్వా’ దేశంలోని ‘ఉశీరక్’ పర్వతం ప్రస్తావన ఉంటుంది. దీన్ని కశ్మీరు దక్షిణాన ఉన్న ‘శివాలిక్’ పర్వత శ్రేణులలో ఒకటిగా భావిస్తున్నారు ఇప్పటికీ దీన్ని ‘ఉశీరగిరి’ అంటారు. పీర్ పంచాల్ పర్వత శ్రేణులని నీలమత పురాణం ‘బ్రహ్మ విష్ణు మహేశ్వర’గా ప్రస్తావిస్తుంది. వీటిల్లో పశ్చిమాన ఉన్న అత్యున్నత శ్రేణి ‘నౌబంధన’ అంటుంది. సకల జీవుల జీవం ఉన్న పడవను విష్ణువు ఈ పర్వతానికే బంధించాడని నమ్మకం.
నీల మత పురాణంలోని ‘హరముక్త్’ పర్వతం ప్రస్తుతం ‘హారముఖ్’ పర్వతం. ఉత్తర మానస సరస్సు, నంది క్షేత్ర, భూతేశ్వర తీర్థాలు ఈ పర్వతానికి ఈశాన్యంలో ఉన్నాయి. ‘మందకోల్- కాళోదర్’ సరస్సులకు నీరందించే హిమానీనదం, నంది పర్వతం, నంది క్షేత్రానికి వెళ్లే వారు దారిలో దర్శించే పర్వతం ‘భరతగిరి’, అమర్నాథ్ పర్వతంపై ఉన్న తీర్థం ‘అమరేశ్వర’. సింధూ లోయకు తూర్పు హిమాలయ శ్రేణుల నడుమ ఉన్న పర్వతం మహాదేవగిరి. నీల మత పురాణంలో ప్రస్తావించిన ఇంద్రకీల, గౌరీ శిఖరాలు, వాటిపై ఉన్న దుర్గ గుడి ప్రస్తుతం శారదాపీఠంకు దగ్గరగా ఉన్న పర్వతాలుగా భావిస్తున్నారు.
నీలమత పురాణంలో కశ్మీర్‌కు చెందిన 60 నదుల ప్రస్తావన ఉంది. ఇక పవిత్ర స్థలాలకు కొదువే లేదు. నీలమత పురాణంలో ప్రస్తావించిన పవిత్ర స్థలాలు వాటి ప్రస్తుత నామాలు కొన్ని.
సింధూ లోయ నుంచి శ్రీనగర్‌కు వెళ్లే దారిలో ఉన్న ‘విచార్ నాగ’ గ్రామం, నీల మత పురాణంలోని ‘ఇలాపత్ర నాగ’. ఇప్పటి ‘అచ్‌చల్’ అప్పటి ‘అక్షిపాల నాగ’. ఇప్పటి ఇస్లామాబాద్ అప్పటి ‘తంత్ నాగ’. ఇప్పటి ‘బీరు’ అప్పటి ‘బహురూప’. ఇప్పటి ‘బుదాబ్రార్’ అప్పటి ‘భేదాదేవి’. గంగోద్భేద తీర్థం ఉన్నది ఇక్కడే. ‘సావాధర్ ధూర్’ అప్పటి చక్రధర తీర్థం. ఇప్పటి ‘చందుల్ సార్’ అప్పటి ‘చంద్రసార’. ఇప్పటి ‘గణేశ బల్’ అప్పటి గణేశ తీర్థం. ఇప్పటి ‘వాగ హోమ్’ అప్పటి ‘హస్తికర్ణ నాగ’. ఇప్పటి ‘రామార దాన్’ అప్పటి ‘ఇష్టికా పథ్’. ఇప్పటి ‘కోథేర్’ గ్రామం అప్పటి ‘కపాలేశ్వర’. బారాముల్లా దగ్గరి ‘కోటీసర్’ అప్పటి ‘కోటి తీర్థం’. త్రాల్ లోయలోని ‘నారాస్తాన్’ అప్పటి ‘నారాయణ స్థానం’. ఇప్పటి ‘పంజా’ అప్పటి ‘పంచ హస్త’. ఇప్పటి ‘పాన్ చక్’ అప్పటి ‘పాండవ తీర్థం’. ఇప్పటి ‘రామూష్’ అప్పటి ‘రామతీర్థం’. ఇప్పటి ‘సూయమ్’ అప్పటి ‘స్వయం భూ’. ఇప్పటి ‘సుందర్ బాల్’ అప్పటి ‘సోదర నాగ’. ఇప్పటి ‘త్రిఫర్’ అప్పటి ‘తిప్రదేశ’. ఇప్పటి ‘విజబ్రూర్’ అప్పటి ‘విజయేశ్వర’.
ఈ రకంగా నీలమత పురాణంలో ప్రస్తావించిన పేర్లను ఇప్పటి స్థలాలుగా గుర్తించడం కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని నిరూపించడమే కాదు, కాశ్మీర్ భారతదేశంలో ప్రత్యేకంగా లేదని, దేశంలోని ఇతర భాగాలతో ధార్మికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా కలిసి ఉందని స్పష్టం అవుతోంది. కాశ్మీరు రాజులు ఇతర ప్రాంతాలపై రాజ్యం చేయడం, కశ్మీర్ కు సరైన రాజు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి రాజులను తీసుకువచ్చి కాశ్మీరు పాలనా బాధ్యతలను అప్పగించడం ‘రాజతరంగిణి’ ద్వారా తెలుస్తుంది. కాబట్టి కశ్మీరు చరిత్రను తెలుసుకోవడం అంటే మనల్ని మనం తెలుసుకోవడమే.
నీలమత పురాణంలో కశ్మీరును కీలకమైన ఘట్టంలో విడిచి మనం పుణ్య స్థలాలను పర్యటించి కశ్మీర్ విహంగవీక్షణం చేశాం. ఇప్పుడు పిశాచాలతో సతమతమవుతున్న కాశ్మీరుకు నీలుడు ఆహ్వానించగా వచ్చిన కశ్యపుడి దగ్గరకు వెళ్దాం. ముందుకు సాగుదాం.
(మళ్ళీ రెండు వారాల తరువాత)