[box type=’note’ fontsize=’16’] “తెలుగువాడు తెలుగులో మాట్లాడటానికి ఆ బెట్టేమిటి? ఆంగ్లంలో ఉన్న గొప్పేమిటి?” అని ప్రశ్నిస్తూ పాండ్రంకి సుబ్రమణి వ్రాసిన వ్యాసం ఇది. [/box]
[dropcap]నా[/dropcap]కు చిన్నప్పట్నించీ అలుపెరగని అలలవంటి ఒక చలనం-ఉత్కృష్ట చలనం చెలరేగుతుండేది. ఇంకా చెలరేగుతూనే ఉందనాలి. అలా అవడానికి ముఖ్యకారణం-దివంగతులైన మా గురుదేవులు రావాడ అప్పన్న పంతులుగారు. నన్ను అక్కున చేర్చుకుని ఉద్భోదించిన తెలుగు భాషాభిమానం (మొన్న ప్రచురించిన నా కొత్త నవల-నిన్న వీచిన సందెగాలి-ఆయనకే అంకితం చేశాను). చిన్నప్పుడు అలవడినది ఏదైనా సరే అంత త్వరగా వీడదంటే వీడదు సుమా! అదీను మరీ చిన్నప్రాయం నుండే అలవడిపోవటం వల్ల అది నా సహజ జీవన స్రవంతిలో ఒక భాగమైపోయిందనాలి. తెలుగు అక్షరం కోసం తెలుగు పదం కోసం అర్రులు చాచడమనేది ఒక విధమైన జీవన విధానంగా కూడా మారిపోయిందేమో–ఉన్నదున్నట్టు చెప్తే, భాష పట్ల నాకున్నఈ ఆరాటం ఆవేశంగా మారి నన్ను అప్పుడప్పుడు పోరాటానికి సహితం పురి కొల్పుతుండేది. ఇందులో మరొక అంశం కూడా ఇమిడి ఉంది. మాది పాండిత్య వారసత్వ సంపదకు చెందిన కుటుంబం కాదు. విజయనగర పొలిమేర్లకు చెందిన మామూలు రైతు కుటుంబం. ఇంకా చెప్పాలంటే-సరళత్వానికి సాహితీ సుకుమారత్వానికి ఆమడ దూరంగా ఉండే గ్రామీణ కుటుంబ నేపథ్యం. అంచేతనే కాబోలు-శ్రీకష్ణ దేవరాయలవారి “తెలుగు దేలయన్న దేశంబు తెలుగేను” — పద్యాన్ని కంఠతా పట్టడానికి నాకు మూడు రోజులు పైగా పట్టింది. నిజంగా మూడు రోజులంటే మూడు రోజులే సుమా–
ఇక విషయానికి వస్తాను. ఎక్కడికెళ్ళినా ఎవరితో మాట్లాడినా తెలుగు అక్షరాల కోసం తెలుగు పద గుబాళింపుల కోసం నా కళ్ళు వెతుకుతుంటాయి, చెవులు నిక్కబొడుస్తుంటాయి. ముందే చెప్పాగా-అది నాకొక సహజ జీవన సరళిగా మారిపోయిందని. నా ఆరాటానికి ప్రతిరూపంగా నా అనుభవానికి సవాలుగా నిలిచేవి ఎన్నో ఉన్నాయి. కాని నిజంగానే జరిగినవి, రెండు మాత్రం చెప్పి తెలుగు పఠితుల సమయం వృథా పాలు కాకుండా ఉండటానికి జాగ్రత్త పడతాను.
ఒకసారి నేను ఉద్యోగ పర్వంలో ఉన్నప్పుడు (నేనిప్పుడు విశ్రాంత కేంద్ర ప్రభుత్యోద్యోగిని) భాగ్యనగరం నుండి హన్మకొండకు వెళ్ళాల్సి వచ్చింది. మా ప్రాంతీయ కార్యాలయానికి అనుబంధంగా ఒక పౌర సేవాకేంద్రాన్ని తెరవడానికి జరుగూతూన్న ఏర్పాట్లు చూడటానికి వెళ్తున్నాను తోటి సహోద్యోగులతో. అప్పుడు నన్నూ మా సహోద్యోగుల్నీ దారిలో ఉన్న ఒక వ్యాపార సంస్థ వారు ఆహ్వానించారు; విశాలమైన వాళ్ళ కార్యాలయ ఆవరణలో సంప్రోక్షణ చేసిన ఆలయాన్ని దర్శించి ధన్యులు కమ్మని. వాస్తవానికది ఒక ఉత్తరాది ప్రాంతపు వ్యాపార సంస్థ వాళ్ళది. మూలవిరాట్టుని చుట్టు ప్రక్కలన్న ఉపాలయాలను దర్శించుకుని హన్మకొండకి తదుపరి ప్రయాణం సాగించడానికి, వాహనంలోకి ఎక్కేటప్పుడు, ఆ ఆలయ నిర్వహణకి బాధ్యత వహిస్తూన్న ధర్మకర్తలను పిలిచి అడిగాను – ‘మీరు తెలుగువారే కదూ?’ అని. అక్కడ నన్ను సాగనంపడానికి వచ్చిన ముగ్గురూ నివ్వెరపోతూ అడిగారు- “మీకెందుకా సందేహం సార్?” అని. అప్పుడు నేను స్నేహపూర్వకంగానే నవ్వుతూ వాళ్ళ భుజాలపైన చేతులుంచి అన్నాను-“నాకోసం ఓసారి అటు తలెత్తి చూడండి—ఆ కొండల పైనుంచి వీస్తూన్న గాలి తెలుగు సంగీతపు లయాన్విత వీవెనలతో వీస్తూన్న గాలి. ఇక్కడ వెల్లి విరిస్తూన్న భక్తి పూర్వక వాతావరణమేమో తెలుగుతనంతో తొణికిసలాడుతూన్న దైవీక వాతావరణం. అంతెందుకు, గుడిని దర్శించడానికి వస్తూన్న భక్తులు సహితం నూటికి తొంభై శాతం మంది తెలుగు కుటుంబీకులే – ఔనా!” తలూపారు వాళ్లు. “కాని-అన్ని చోట్లా దేవుళ్ళ పేర్లు దేవతల పేర్లూ పలు భాషల్లో ఉన్నవి- కాని ఒక్కటంటే ఒక్కటి కూడా తెలుగులో లేదు. మీరుండగా ఇలా జరగవచ్చా! తెలుగు తల్లికి తలవంపు తేవచ్చా!” అని అక్కడ ఆగకుండా ముందుకి సాగిపోయాను. నామాట ఆలయ ధర్మకర్తల మనోఫలకాలపైన బల్లమైన ముద్ర వేసుంటుంది. వేసింది కూడాను—ఎలాగంటే–నేను ఉద్యోగవిరమణ చేసే ముందు అదే సంస్థ వారు మరొక మారు నన్ను (మా శ్రీమతిని కూడా) సాదరంగా ఆలయ దర్శనం కోసం ఆహ్వానించారు. ఏది ఏమైనా ఆలయదర్శనం కాదనలేం కదా! అప్పుడు నాకు వాళ్ళు సగర్వంగా చూపించారు తెలుగులో చక్కగా మిలమిలా మెరిసేలా చెక్కిన దేవుళ్ళ పేర్లూ దేవతల పేర్లూను–ఇందులో దాగి ఉన్న నా గోడు ఇదే- అందుబాటులో ఉన్నదానిని కూడా తెలుగు వ్యాప్తికై మనం ఉపయోగించుకోలేక పోతే ఎలా! మనం ఉండగానే మన మధ్య తెలుగు అక్షరాలు కనిపించకుండా ఉంటే ఎలా! మనకోసం మన తెలుగు కోసం మరొక మారు రాయలవారు, చార్లెస్ ఫిలిఫ్స్ బ్రౌన్ దొరగారు దివినుండి భువికి దిగి వస్తారా!
ఇక రెండవది – సనత్ నగరులో నేను కొత్తగా కొనుగోలు లావాదేవీలు ముగించుకుని గృహ ప్రవేశం చేసిన బహుళ నివాస సముదాయం. చాలా విశాలమైనది. అలా గృహ ప్రవేశం చేసుకుని వెళ్ళింతర్వాత ఏమి జరిగిందంటే, కట్టడ వాణిజ్య సంస్థవారితో వచ్చిన తగవుల వల్ల ఇక్కడి ఇండ్ల స్వంతదారులు (నేను కూడా స్వంతదారునే–) మాటిమాటికీ నిరసన సమావేశాలు జరిపేవారు. నగర పౌరులందరికీ తెలిసేలా బైట నడిదారమ్మట నిరసనోద్యమాలు చేసేవారు. కట్టడ సంస్థవాళ్లతో తరచుగా చర్చోపచర్చలు జరిపేవారు. నిజం చెప్పాలంటే మేమందరమూ రహదారి దిమ్మ పైకెక్కి నినాద ఫలకాలు చేతబూని పదిరోజుల పాటు కట్టడ సంస్థకి వ్యతిరేకంగా వీధి పోరాటాలు కూడా చేసాం. ఐతే ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం ఇది కాదు. ప్రస్తావించాల్సిన విషయం మరొకటి–ఇక్కడ ఇండ్లు కొనుక్కున్న వాస్తవ్యులందరూ దాదాపు నవీన బహుళ జాతి వ్యాపార సంస్థలకు విదేశీ బ్యాంకులకు చెందిన వారే. వాళ్ళలో చాలామంది విదేశాలకు వెళ్లి వచ్చిన వాళ్ళే – కాని ఉన్నదున్నట్లు చెప్తే, వీళ్ళలో అత్యధికులు తెలుగువారు. తెలుగు మాతృభాష గలవారు. అంచేత కొన్నాళ్ళ పాటు నిదానంగా ఉండిపోయి, ఓర్పు వహించి, ఇక ఉండబట్టలేక వినమ్రంగా మొరపెట్టుకున్నాను అక్కడున్న కుర్రవయసులో ఉన్న స్వంతదార్ల సమాఖ్య కార్యకర్తలతో- “అయ్యా! ఎప్పుడు చూసినా మీరందరూ ఆదినుండి అంతం వరకూ ఆంగ్లంలోనే మాట్లాడుతున్నారు. ఆ తరువాత మీకు అనుకూలమైన మరొక భాషలోకి రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరి వెళ్లిపోతున్నారు. కాని తెలుగులో మీరు ఒక ముక్క కూడా మాట్లాడకుండా దాటవేస్తున్నారు. మరి మీరు మాట్లాడకుండా చుట్టు ప్రక్కలనున్న వారు కూడా తెలుగుని ఉచ్చరించకుండా తరలిపోతే–మరి ఇంకెవరు తెలుగులో మాట్లాడతారని, ఎప్పుడు మాట్లాడతారని. జపాన్ నుండి జపాను వాడు – చైనానుండి చైనా వాడా వచ్చి తెలుగులో మాట్లాడతాడు?” అని దిమ్మతిరిగేలా అడిగాను. అలా నాకు నేను మనసున పొంగిపోతూ అనుకున్నానంతే– కాని–మళ్లీ అదే తంతు. ఆంగ్ల ఉచ్చారణల తంతు. దానితో నాకు చిర్రెత్తుకు వచ్చి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ తారసిల్లినా పలకరించడం మానుకున్నాను. నవ్వడం కూడా మానుకున్నాను. క్రమక్రమంగా వాళ్ళు యేర్పాటు చేసే సర్వసభ్య సమావేశాలకు హాజరు కావడం కూడా తగ్గించాను. కాకపోతే మరేమిటి-తెలుగువాడు తెలుగులో మాట్లాడటానికి ఆ బెట్టేమిటి? ఆంగ్లంలో ఉన్న గొప్పేమిటి? ఐతే నేను చల్లబడ్డట్టు కనిపించానే గాని నా ఉద్యమాన్ని అంతటితో ఆపలేదు. ఏదో ఒక సందర్భంలో నాకంటూ ఏదో ఒక అవకాశం రాకపోదు. అప్పుడు నా తడాకా చూపిస్తూ దెబ్బకు దెబ్బ తీయాలని తీర్మానించాను. నిజానికి అటువంటి సమయం తానుగా నన్ను వెతుక్కుంటూ రానే వచ్చింది. ఇండ్ల స్వంతదార్ల సమాఖ్య కార్యకర్తల ఎన్నికలు వచ్చిపడ్డాయి. మొదట చాలా మందిలాగే అది మామూలు తతంగమే అనుకున్నాను. కాని అది అటువంటి సాదా సీదా వ్యవహారంగా ముగియలేదు. సమాఖ్య ఎన్నికలు ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అప్పుడు పట్టుకున్నాను మా నివాసానికి ఓట్ల కోసం వచ్చిన వాళ్ళందరి పిలకలూను. గుంజీలు తీసేటట్లుగా వాళ్ళను నిలదీసాను. ఎలాగని – “ఇకపైన మీరెప్పుడు సర్వ సభ్య సమావేశాలలో మాట్లాడినా మొదట మన మాతృభాష తెలుగులోనే ఆరంభిస్తారు. ఆ తరవాతనే మిగతా భాషల్లోకి వెళ్తారు. అంతేకాదు-నిరసన తెలియ చేసే ఫలకాలు అధికంగా తెలుగులోనే ఉండాలి. ఏనో తానోగా ఒకటి రెండు కాదు. ఔనా కాదా? దీనికి మీరందురూ కలసి బదులిచ్చిన తరవాతనే నేను ఓటు వేయడానికి రావాలా వద్దా అన్నది తీర్మానిస్తాను” అని బాహాటంగానే యుధ్ధ భేరి మ్రోగించాను. అందరూ బసవన్నల్లా తలలూపారు. మాటిచ్చారు. ఇది మన తెలుగు తల్లి చరణాల వద్ద చేరిన చిన్నపాటి విజయమే కదా! ఇటువంటి విజయాలు మరికొన్నిటిని చేరిస్తేనే కదా మన తెలుగు తల్లికి తలవంపనేది రాదు!
ఉన్నదున్నట్లు చెప్తే ఇప్పడు మా అపార్టుమెంట్ల స్వంతదార్ల సమాఖ్య సమావేశాలలో కార్యకర్తలు తెలుగులోనే ఆరంభిస్తున్నారు. అంతేకాదు- నినాద వస్త్ర ఫలకాలు కూడా ఆంగ్లంతో సమానంగా తెలుగులోనూ ముద్రించారు.
ఇంతకీ నేను వెల్లబోసుకునే గోడు ఒక్కటే – మన అందుబాటులో ఉన్నప్పుడు కూడా తెలుగుని విస్మరించడం పొరపాటు కదా! మాతృభాషను విస్మరించడమంటే స్వంత తల్లిని నగుబాట్లు చేయడం వంటిది కాదా! తల్లిదండ్రులు తెలుగువారై ఉండి కూడా పిల్లలకు తెలుగు నేర్పించకుండా మార్కుల కోసం పరభాషల్ని నూరిపోయడానికి ప్రయత్నించడం నేరం కదా!
చదువగ వలదని చెప్పము
చదువుము నీయిచ్ఛ వచ్చు సంస్కృతమైనన్
వదులుము నీ భానిసభావము గదియించుము
నీ జాతి పెంపొకవనమున కవీ!
***
మా తెలుగు తల్లికి మల్లె పూదండ-మాకన్న తల్లికి మంగళారతులు-
కడుపులో బంగారు కనుచూపులో కరుణ-చిరునవ్వుల్లో సిరులు దొరలించు మా తల్లి
గలగల గోదారి కదలి పోతుంటేను
బిరబిర కృష్ణమ్మ పరుగులిడుతుంటేను
బంగారు పంటలే పండుతాయి
మురిపాల ముత్యాలు దొరలుతాయి
అమరావతీ నగర అపురూప శిల్పాలు
త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు
తిక్కయ్య కలములో తియ్యందనాలు
నిత్యమై నిఖిలమై నిలిచి యుండేదాక
రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతి భక్తి
తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయల కీర్తి
మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక
నీ ఆటలో ఆడుతాం-నీపాటలే పాడుతాం
జై తెలుగు తల్లీ!జై తెలుగు తల్లీ!
– శ్రీ శంకరంబాడి సుందరాచారి