పేరెంట్స్ – స్టూడెంట్స్

0
3

[box type=’note’ fontsize=’16’] ప్రేమకీ, గారాబానికి తేడాని వివరిస్తూ పిల్లలతో తల్లిదండ్రులు ఎలా నడుచుకుంటే పిల్లలు భవిష్యత్తు బాగుంటుందో ఈ వ్యాసంలో వివరిస్తున్నారు ఎం. వెంకటేశ్వరరావు. [/box]

[dropcap]మ[/dropcap]నం ఒక అమ్యాయికీ అబ్బాయికీ జన్మనిచ్చామంటే… ఒక జీవితకాల సంబంధానికి అంకురార్పణ చేసినట్లే. అంటే ఒక తల్లిగా, తండ్రిగా మీ పాత్ర మీ జీవితాంతం నిలిచి ఉంటుంది. మీ పెంపకం ప్రభావం మీ పిల్లల మీద, వారి పిల్లల మీద, ఇంకా చెప్పాలంటే తరతరాల మీద ఆ ప్రభావం ఉంటుంది. పిల్లల పెంకపకం ఓ మనోజ్ఞమైన కళ.. గంభీరమైన విషయం.

మీ పిల్లలు మీ రక్తం పంచుకుని పుట్టినవారు. వారి ప్రపంచాన్ని మీ ఒడి నుండే చూశారు. ఒడిలోనే వెచ్చని హాయిని, అద్భుతమైన భద్రతాభావాన్ని మీ నుండే పొందారు. ప్రతి రోజూ, ప్రతి నిమిషం వాళ్ళని గొప్ప వ్యక్తులుగా ఉన్నత విలువలు కలిగిన మనుషులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. మీ ప్రేమను సంపూర్ణంగా వారికివ్వడం ద్వారానే వారు ఉన్నత వ్యక్తిత్వం అలవర్చుకుంటారు.

నిరంతర ప్రేమ

ఎవరికీ పిల్లల పెంపకానికి కావల్సిన నైపుణ్యాలు జన్మతోనే అబ్బవు. ఎవరి పద్ధతి వారిది. ఎవరి ఇంటి పద్ధతులు వారివి.

ఇది ఒకర్ని చూసి మరొకరు అనుకరించే ఒరవడి కాదు, ‘ఇలాగే ఉండాలి’ అని నిర్దేశించే అంశాలూ కావు. మంచి పుస్తకాల ద్వారానో, తల్లిదండ్రుల ద్వారానో, స్నేహితుల ద్వారానో.. సమాజ పరిస్థితుల్ని చూసో ఎవరికి వారు ఏర్పరచుకునే ‘శైలై అది. అయినా ఈ శైలి.. చుట్టూ ‘విలువలు’ వలయంలా, రక్షణ కల్పించేవిలా ఉండాలి. మీరు మీ పిల్లల కోసం ఆస్తి కూడబెట్టనక్కర్లేదు, ఐశ్వర్యం అంటగట్టక్కర్లేదు. వారి కోసం మీరు చెయ్యల్సిందల్లా ఒక్కటే ఎల్లప్పుడూ ఒకేలా ఉండే నిరంతర ప్రేమను పంచడం.

మొక్కలకి సూర్యరశ్మి, వర్షము ఎంత అవసరమో, పిల్లలకి ప్రేమ పూరిత ‘పోషణ’ అంతే అవసరం. అది అందించాల్సింది తల్లిదండ్రులే. పిల్లలకి ఇంట్లో దొరికే ప్రేమ నాణ్యతలను బట్టి వారి మానసిక ఎదుగుదల, శారీరక ఆరోగ్యమూ ఆధారపడి ఉంటాయి.

ప్రతి బిడ్డ ఏదో ఒక ప్రత్యేకతతోనే ఈ భూమి మీదకు వస్తుంది. ప్రతివారిలోనూ ఏదో ఒక ప్రత్యేక, సమర్థత ఉంటాయి. ఎవరు ఎలా రూపొందుతారో.. పుట్టగానే తెలియదు. వారికి పరిమళించే ప్రేమ, ఆప్యాయత, వనరులు, పరిస్థితులు కల్పించటమే తల్లిదండ్రుల బాధ్యత.

“ద ప్రొఫెట్” అనే పుస్తకంలో పిల్లల్ని గురించి..

పిల్లలకి ప్రేమ పంచివ్వండి, మీ ఆలోచనల్ని కాదు..

వాళ్ళ ఆలోచనలు వారికుంటాయి, వికసించనీయండి,

పిల్లల శరీరాలకు మీరు ఆవాసం కల్పించండి కానీ ఆత్మలకు కాదు.

వాళ్ళ ఆత్మలు “రేపటింట్లో” ఉంటాయి. అక్కడికి మీరు కలలో కూడా వెళ్ళలేరు. వాళ్ళకి మల్లే వుండటానికి మీరు ప్రయత్నించవచ్చు.. కానీ మీలా వాళ్ళని తయారు చెయ్యడకండి. జీవితమెప్పుడూ వెనక్కి నడవదు.. నిన్నటితో నిలిచిపోదు. మీరొక విల్లు అయితే, మీ నుండి దూసకు పోయేబాణాలు మీ పిల్లలు..” అన్నారు.

పిల్లలు మనతో మనసు విప్పి మాట్లాడగలిగితేనే వారి ఊహల్ని, ఆలోచనల్ని అర్థం చేసుకోగలం. ఆ అవకాశం మనమే వారికి కల్పించాలి. చనువు సృష్టించాలి.

అప్పుడు మాత్రమే మనం వాళ్ళకి తండ్రిగా, స్నేహితుడిగా, గైడ్‌గా, ఫిలాసఫర్‌గా, సలహాల్ని ఇచ్చే అర్హత మనకు లభిస్తుంది.

సలహాలు శాసనాలుగా ఉండకూడదు. మన సలహాలు వారి ఆలోచనాల్ని ప్రభావితం చెయ్యగలగాలి. పిల్లలు ఆలోచించగలరని మనం నమ్మాలి. ఆ ఆలోచనలు సద్భావనలైతే ప్రోత్సహించండి. వారి పరిధిలోకి ప్రవేశించి మీరూ ఆలోచించండి. అవి మంచివో, చెడువో ఆలోచించి మీ అనుభవంతో విశ్లేషించండి. వాళ్ళు సన్మార్గంలో విభిన్నంగా ఆలోచింస్తుంటే ఎంకరేజ్ చెయ్యండి. అవకాశాలు వెదికి పెట్టి ప్రోత్సహించండి.

ఒక వేళ.. తప్పుడు మార్గంలో ఉన్నపుడు విడమర్చి చెప్పండి. కోపంతో కాదు. అక్కున చేర్చుకుని మరీ చెప్పండి. వారు ఆ ఆలోచనల్నుండి బయటపడే మార్గాలు చెప్పండి. దానికి తోడ్పండి. భరోసా కల్పించండి. భయాన్ని మాత్రం నింపకండి.

కౌమారంలో వంగనది.. వార్ధక్యంలోనూ వంగదు.

తల్లిదండ్రులు సాధారంణంగా తమ పిల్లలకు అన్నీ శ్రేష్ఠమైనవే ఇవ్వాలనుకుంటారు. వాళ్ళు ఆరోగ్యంలో, ఆనందంతో ఉండాలని కోరుకుండారు. మంచి విద్యావంతులుగా, మంచి ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో తమ కాళ్ళ మీద తాము నిలబడాలనీ ఆశిస్తారు. తప్పులేదు.. కానీ.. సమస్య ఎప్పుడు తలెత్తుతోందంటే.. పిల్లల్ని మన ఆస్తులుగా భావిస్తున్నప్పుడే.

మేధావంతులైన పిల్లల్ని, విలువలు కల్గిన విద్యావంతులుగా మీ పిల్లల్ని మీరు తయారు చేయాలని మీరు ఆశిస్తున్నపుడు మొట్టమొటగా తల్లిదండ్రులు తెల్సుకోవాల్సిన విషయం ఏమిటంటే.. మీ పిల్లలు మీకు చెందరు. వాళ్ళు వాళ్ళకే చెందుతారు. ఈ విషయం గ్రహించలేక.. ఎంతో మంచి తల్లిదండ్రులు.. తమ పెంపకాన్ని కట్టళ్ళు, ఆరళ్ళ మధ్య బంధించి, అనుక్షణం పిల్లల కోసం వారేదో త్యాగం చేస్తున్నట్టు పదే పదే చెబుతూ.. పిల్లల మనసులో తమ స్థానాన్ని కోల్పోటం, తమ పిల్లలు పెద్ద వాళ్ళై పెళ్ళిళ్ళై, వాళ్ళ పిల్లలు పుట్టినా సరే.. వాళ్ళింకా తమ చెప్పు చేతల్లోనే ఉంటాలనుకుంటారు.

మీ దగ్గర కొంత కాలమే ఉండే విలువైన వరాలుగా మీరు మీ పిల్లల్ని చూసినట్లైతే మీ జీవితాంతం వరకూ మీ పిల్లలు మనసుల్లో ప్రత్యక్ష దైవాలుగా నిలిచిపోతారు.

మీ పిల్లలలోని ప్రత్యేకతల్ని గుర్తించి ప్రోత్సహిస్తేనే వారు సూర్యరశ్మికి వికసించే కలువల్లా వికసిస్తారు. కానీ వాళ్ళలో సహజంగా లేని అంశాలపై మీరు వాళ్ళని బలవంతం చేస్తే వాళ్ళల్లో ఉత్సాహం నశించి.. వాళ్ళ ఆలోచనాంకురాలు ఆదిలోనే రాలిపోతాయి.

కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని అనుసరించే మీ పిల్లలు తయారవుతారు. పిల్లలతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మీరు ముందు ఒక ప్రశ్న వేసుకోండి..

“ఇటువంటి పరిస్థితి రావటానికి నా బాధ్యత ఎంత?”

తల్లిదండ్రులు తమకు నచ్చని పనేదైనా పిల్లలు చేసినపుడు, చాలా మంది పిల్లల్ని విమర్శిస్తారు. హింసిస్తారు.. తిడతారు, కొడతారు. కానీ వ్యక్తిత్వం ఉన్న తల్లిదండ్రులు.. పిల్లల ప్రవర్తనకు తామే మూలమని.. తమని తాము మార్చుకోడానే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఏ పండు ఆ చెట్టు కిందే రాలి పడతుంది కానీ దూరంగా విసిరి వేయబడదు.. కదా.

సహజంగా తల్లిదండ్రులకీ, పిల్లలకీ స్పర్థలు, గొడవలు, కోపతాపాలు తలెత్తేదే.. చదువు దగ్గర. క్రమశిక్షణ, పిల్లలపై అధిక అంచనాలు.. ఇవి విపరీత ధోరణిలో.. బాల్యం వీడని పసి పిల్లలపై అత్యుత్సాహంతోనే.. పిల్లలు భూమ్మీదకి రాకముందే ఇంటర్నేషనల్ స్కూళ్ళలో తమ పిల్లలకి లక్షలు కట్టి సీట్లు రిజర్వ్ చేయించుకుంటున్నారు.

పువ్వు పుట్టక ముందే వికసించాలని, పరిమళాలు వెదజల్లాలనే ఆశించడం అత్యాశే కాకుండా, అనర్థాలకూ దారి తీస్తున్నాయి.

బాల్యం వీడని పసికందుల్ని క్రెచ్‌లలో, ప్లే స్కూళ్ళలో వేలు, లక్షలు ధారపోసి బంధిస్తున్నారు.

దేని కోసం? ఎవరి కోసం?.. అని ప్రశ్నిస్తే ఏ తల్లిదండ్రులైనా చెప్పే సమాధానం ఒక్కటే..

మేం బాల్యంలో పడ్డ కష్టాలు.. మా పిల్లలు పడకూడదు. వాళ్ళకి బంగారు భవిష్యత్తు ఏర్పరచడానికే.. ఇవన్నీ.. అంటున్నారు.

ఇందులో.. కలెక్టెర్ స్థాయి.. అయినా కూలి కార్మికుడి స్థాయి అయినా.. ఇదే సమాధానం వినిపిస్తోంది.

అంటే.. మీ అభిప్రాయాల్ని, ఆలోచనల్ని, ఆశయాల్ని, మీ పిల్లల మీద బలవంతంగా ఆపాదిస్తారు. వాళ్ళు నాకిది కావాలని మాటలు నేర్చుకుని, ఆలోచించుకుని అడిగే లోపలే.. మీరు ఆ అవకాశాన్ని వాళ్ళ కివ్వకుండా.. బలవంతంగా మీ చేతుల్లోకి, చేతల్లోకి తీసేసుకుంటున్నారు.

పిల్లలకి ఏది ఇష్టమో వాళ్ళ అభిరుచులు ఏమిటో, వాళ్ళని చెప్పనివ్వకుండా.. మనకిష్టమైన వసతులు, చదువులు వాళ్ళకి కల్పించినంత మాత్రాన మీరాశించిన స్థాయికి వాళ్ళు ఎదగగల్గుతున్నారా?

ఒక్కసారి ఆలోచించండి. ఉన్నత స్థాయిల్లో ఉన్న వాళ్ళంతా.. ఏ ఏ నేపథ్యాల నుండి వచ్చారో.. పరిశీలించండి.

ప్రతి తల్లి తండ్రి తమ పిల్లలకి ఇవ్వవలసిన దేమిటి. ఏది మఖ్యం.. అని ఆలోచిస్తే.. మీరు మీ పిల్లలలో ఆత్మవిశ్వాసము, ఆత్మగౌరవమూ, ఆనందం, ఆరోగ్యం కోరుకోవాలి.

ఇవే వారిలో సహజ సిద్దంగా విజ్ఞానాన్ని వికసింపజేసి.. వివేకవంతులుగా తయారుచేస్తాయి.

పిల్లల ప్రవర్తన మీద ఇంటి వాతావరణం ఎంతో ప్రభావాన్ని చూపుతుంది.

డేవిడ్ మెక్లెలాండ్ అనే పరిశోధకుడు పిల్లలు పెంపకం పై రాసిన “ద అచీవింగ్ సొసైటీ” అనే పుస్తకంలో.. పిల్ల పెంపకం తీరులు, వారి సాఫల్యతపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయో వివరించాడు. బాల్యంలోనూ, యవ్వనం(ఇరవైలలో) విజయం సాధించి, ఉన్నత శిఖరాలు చేరిన పిల్లలు పెరిగిన ఇంట్లో ఉండాల్సిన లక్షణాలు, వాతావరణాన్ని వివరించారాయన.

స్వేచ్చా వాతావరణం

ఇంట్లో పిల్లలు బాల్యం నుండే తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వెలిబుచ్చే వాతావరణం ఉండాలి. పిల్లలు ఏం ఆలోచిస్తున్నారో, ఏం భావిస్తున్నారో.. తల్లిదండ్రులు అడిగి తెల్సుకోవటమే కాకుండా వాటిని పరిగణనలోనికి తీసుకోవాలి. బాల్యంలో పిల్లల్లో తమ అభిప్రాయాల్ని తల్లిదండ్రులు గౌరవిస్తున్నారన్న సంగతి బీజాలు పడితే, వారిలో ఆత్మ విశ్వాతం అంకురం వేస్తుంది. వాళ్ళలో ఆత్మగౌరవాన్ని ఇనుమడింపజేస్తుంది.

సానుకూల వాతావరణం

‘ఈ పని నువ్వు చెయ్యగలవు’ అని తల్లిదండ్రులు ప్రోత్సహిస్తే, పిల్లలకి “ఎస్.. ఇది నా వల్ల అవుతుంది” అనే నమ్మకం ఏర్పడతుంది. ‘నువ్వు సాధిస్తావు’ అని తల్లిదండ్రులు కల్గించే నమ్మకమే.. వారి రేపటి విజయాలకు సానుకూల వాతావరణాన్ని ఏర్పరుస్తుంది.

భరోసా ఇవ్వాలి

మీ పిల్లల విజయాన్ని మార్కులతో, చదువుతోనో అంచనా వెయ్యకండి. చదువులో విజయం సాధించకపోతే వారికోసం మరో విజయద్వారాలు తెరచి ఉంటాయనీ, వారి ఆలోచనల్ని ఆశయాన్ని గౌరవించి ప్రోత్సహిస్తే.. వారు సాధించబోయే విజయం ముందు చదువు, మార్కులు రెండవ స్థానంలో ఉంటాయన్న భరోసా కల్పించండి.

మీరు మీ పిల్లల్ని ప్రేమిస్తున్నారో, శాసిస్తున్నారో.. వాళ్ళు సులభంగా అర్థం చేసుకోగలరు.. అనే విషయాన్ని తల్లిదండ్రులు గ్రహించాలి.

పాత తరంలో తల్లిదండ్రులు పిల్లలకి స్వేచ్ఛనిచ్చేవారు. ప్రేమించేవాళ్ళు. మీరు నేనూ ఆ వాతావరణం నుండి వచ్చిన వాళ్ళమే. కాల్పనిక మార్పుల్లో.. స్వేచ్ఛ స్థానంలో, కట్టళ్ళు, ఆరళ్ళు, నియమాలు, నిబంధనలు,.. ప్రేమ స్థానంలో గారాబం పాళ్ళెక్కువయ్యాయి.

“Love is different from pampering” అనే విషయాన్ని విస్మరిస్తున్నారు తల్లిదండ్రులు.

ప్రేమ.. తప్పుని చెప్పి.. ఖండిస్తుంది, దండిస్తుంది. ఏది ఎంత వరకు అవసరమో.. అంత వరకే అందిస్తుంది. కాని గారాబం అలా కాదు.. పిల్లల అవసరాలతో నిమిత్తం లేకుండా.. నువ్విన్ని మార్కులు తెచ్చుకుంటే.. నీకు ఫలాన వస్తువు కొనిస్తానంటూ లంచంపై ఆశలు పెంచుతున్నారు. వాళ్ళేదైనా తప్పు చేస్తే.. దండించడానికి భయరపడుతున్నారు. వాళ్ళేదైనా చేసుకుంటే అని తల్లిదండ్రులు పిల్లలపై గారాబం వల్ల భయానికి లోనవుతున్నారు. ఆఖరికి పిల్లల గదిలో టవర్ బోల్ట్ కూడా తీసేస్తున్నారు. నేటి తల్లిదండ్రులు.. మీరు పిల్లపై నమ్మకాన్ని కోల్పోయి.. మీకు మీరే అభత్రత కల్పించుకుని, మీకు తెలియకుండానే పిల్లల్లో భయానికి పునాదులేస్తున్నారు.

ఆ కాలంలో పిల్లలు తప్పు చేస్తే లాగి చెంపమీదొక్కటేసే వాళ్ళు. కానీ నేటి తల్లిదండ్రులు అధిక గారాబంతో.. స్కూల్లో తమ పిల్లలు తప్పు చేస్తే దండించిన అధ్యాపకుణ్ణి.. చితక బాదుతున్న దృశ్యాలు మనకు మీడియా పుణ్యమా అని.. దృశ్యాగోచరాలవుతున్నాయి.

తప్పు చేసిన పిల్లలు మారాలన్న ఉద్దేశ్యం దండించిన ఉపాధ్యాయుణ్ణి పిల్లల ముందు అవమానపరిస్తే.. ఆ పిల్లలు.. భవిష్యత్తులో ఎలా తయారవుతారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు.

కాని ఒక్క విషయం.. తప్పు చేసిన పిల్లల్ని అటు తల్లిదండ్రులో, ఇటు ఉపాధ్యాయుడో.. వారిని సరిదిద్దడానికి దండించినచో పిల్లలు.. తప్పు త్రోవ పట్టేవాళ్ళేవరూ ఉండరు. అలా ఉన్నా నూటికో కోటికో ఒక్కడుంటాడు.

తండ్రి పిల్లలు తప్పు చేస్తే.. ఖండించేటప్పుడో, దండిచేటప్పుడో తల్లులు పిల్లలపై మమకారంతో, గారాబంతో.. మధ్యలో చోరబడి వాణ్ణెందుకు దండిస్తున్నారని మీ భర్తని ప్రశ్నించకండి.

తప్పు చేసిన పిల్లాడితో తండ్రి కఠినంగా ప్రవర్తించడం, దండించడం వెనక ఉన్న ఆలోచన ఒక్కటే.. ఆ తప్పు వెనక తన పిల్లాడు తప్పు నడవడిక నేర్చుకోరాదని. తప్పటడుగు వెయ్యరాదన్న ఉద్దేశం మాత్రమే ఉందని.. భాగస్వామి గ్రహించాలి.

ఒక వేళ పిల్లాడు తల్లికి తండ్రి కొట్టాడనీ, తిట్టాడనో తల్లికి కంప్లయింట్ చేస్తే నువ్వు చేసిన తప్పుడు పనికి నేనే నిన్ను దండించాలనుకున్నాను. నోర్ముసుకుని నాన్న చెప్పినట్టు విను.. ఇంకోసారి ఇదే తప్పు చేసావంటే మీ నాన్న కంటే ముందు నేనే ఆ పని చేస్తాను అని చెప్పండి.

అలాగే.. ఆడపిల్లని తల్లి దండిస్తుంటే.. నాన్నలు కూడా మధ్యలో జోక్యం చేసుకోకండి. ఎందుకంటే.. ఆడపిల్ల ఏ దుస్తులు ధరిస్తుందో ఎవరితో స్నేహం చేస్తోందో ఎలా మాట్లాడుతోందో అన్నీ అమ్మకి తెల్సినంతగా నాన్నకి తెలియవు కాబట్టి.

భార్య భర్తలు పిల్లలపై తమకు గల ప్రేమ, గారాబాల్ని అమ్మ నాన్నా స్థానాలకి తీసుకొచ్చి వాళ్ళని ఒకరి ముందొకరు పోటిపడి వెనకేకొచ్చి.. వాళ్ళు ఎదుగుదలకు వ్యక్తిత్వానికి అవరోధాలుగా మారటమే కాకుండా.. అనుబంధాలకి దూరం కాకండి.

ప్రేమకి గారాబానికి గల వ్యత్యాసాన్ని గుర్తించండి. ప్రేమ ప్రేమిస్తుంది. శాసిస్తుంది, దండిస్తుంది.. మార్గదర్శనం చేస్తుంది.

గారాబం.. భయం నూరిపోస్తుంది. భయపడుతుంది, ఆశింపచేస్తుంది. ఆలోచనల్ని నశింపచేస్తుంది. ఎదుగుదలకు.. అడ్డుపడుతుంది. పిల్లల్ని పక్కత్రోవలు పట్టిస్తుంది. మొండివాళ్ళుగా మారుస్తుంది.

చదువు పేరుతో పిల్లల బాల్యాన్ని యవ్వనాన్ని మనం వసత గృహాల్లోనో, హాస్టళ్ళలోనో.. బందిస్తే.. రేపు మన వార్ధక్యాన్ని వాళ్ళు వృద్ధాశ్రమాలకో, అనాథాశ్రమాలకో తరిమేస్తారు.

కాబట్టి.. చదువులు, పరీక్షలు పేరుతో.. మనం పిల్లలపై చూపించేది.. ప్రేమో, గారబమో.. అర్థం చేసుకుని వాళ్ళని వాళ్ళ ఆలోచనల్ని గౌరవిస్తే.. చదువేంటి సప్త సముద్రాలనైనా సునాయాసంగా ఈదెయ్యగలమన్న ధైర్యం వాళ్ళ మనస్సులో నిరంతరం స్రవించే ఊటలా ఊరుతుంటుంది. స్వచ్ఛమైన ఆ ఊటలో అలజడులు భయాలు అనే కాలుష్యాలకి తావే ఉండదు.

పరీక్షలంటే పిరికితనం ఉండదు.

జనవరి వచ్చిందంటే చాలు అటు విద్యార్థుల్లో వారి తల్లిదండ్రుల్లో పరీక్షల ఫీవర్ మొదలవుతోంది.

ఆడుతూ పాడుతూ చదవాల్సిన చదువు.. ఆరళ్ళ మధ్య (తల్లిదండ్రులు కావొచ్చు కాలేజీలు, హాస్టళ్ళూ కావొచ్చు) విలపిస్తూ సాగుతోంది.

నేటి పోటీ ప్రపంచంలో మార్కులే పరమావధిగా సాగే విద్య భవిష్యత్తులో ఎంత మందికి పునాదులేస్తోంది. చదివిన విద్యకు, చేసే ఉద్యోగాలకు పొంతనే ఉండటం లేదు.

పాదరసం లాంటి మొదడులో ప్రపంచాన్ని అబ్బురపరచే ప్రతిభలో యువత స్త్రీ పురుష బేధం లేకుండా అన్నిరంగాల్లో దూసుకుపోతోంది.

మేకిన్ ఇండియా కల సాకార దిశలో యువత దూసుకుపోవడానికి కారణం.. ఇష్టమైన రంగాల్ని ఎంచుకోవడమే. హద్దులు చెరిపేస్తున్నారు, ఆకాశానికి నిచ్చెనలు వేస్తున్నారు. ఉపాధి కల్పిస్తున్నారు. పిన్న వయసులోనే కోట్లు గడిస్తూ ప్రతిభను ప్రపంచానికి చాటుతున్నారు.

అమెరికాలో ఉద్యోగాల్ని సైతం కాదనుకుని వివిధ రంగాల్లో అభిరుచి ఉన్న రంగంలో.. దూసుకుపోతూ.. ఔరా అన్పిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు.. ల్యాండ్రీ సర్వీసెస్, వ్యవసాయం, ఫుడ్ కోర్టులు ఒకటేమిటి కాదేదీ వ్యాపారానికి కనర్హమంటూ.. చొచ్చుకుని పోతున్నారు.

చదివిందొకటి చేసేదొకటిలా కాకుండా.. వాళ్ళ అభిరుచిని పిన్న వయసులోనే గ్రహించి గౌరవించి తల్లిదండ్రులు వారిని ప్రోత్సహిస్తూ.. అభిరుచి ఉన్న రంగంలోనే వారిని ప్రావీణ్యుల్ని చేస్తే.. ఏ విత్తనం నాటుతామో అదే వృక్షంలా ఎదిగి అవే పళ్ళని అందిస్తుంది.

ఇదంతా ఒక ఎత్తయితే.. ఏ రంగంలో రాణించాలన్నా కనీసపు విద్యార్హత అవసరం.. ఆ చదువును అలక్ష్యం చెయ్యకుండా.. చుట్టూ ఉన్న అంతస్తుల మాయలోపడి భవితవ్యాన్ని పాదులోనే అంతం చేసుకోకుండా, తల్లిదండ్రుల ఆశల మీద నీళ్ళు జల్లి, ఆత్మహత్యలతో అందమైన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించకుండా.. అభిరుచి ఉన్న రంగంలోకి దూసుకెళ్ళాలంటే చదువు కొనే రోజు పోయి చదువుకునే రోజులు రావాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here