కాలనీ కబుర్లు -1

0
3

[box type=’note’ fontsize=’16’] తమ కాలనీలో జరిగే సరదా ఘటనలనూ, వేడుకలను, కాలనీవాసుల ప్రవర్తనను చమత్కారంగా వివరిస్తున్నారు ఆనందరావు పట్నాయక్ ఈ ‘కాలనీ కబుర్లు‘ కాలమ్‌లో. [/box]

[dropcap]“ఎ[/dropcap]లక్ట్రిక్ కాలనీ వాసులకు విజ్ఞప్తి. మనమందరం రాబోయే డిశంబరు 24వ తేదీన రావిగుడలో కలుస్తున్నాం. పిక్నిక్, సైటు సీయింగు ఆనాటి ఆకర్షణలు. మీ అంగీకారం తెలిపితే హోటలు రూం, రవాణా తదితర సదుపాయాలు ఏర్పాటు చేస్తాం. శుభాకాంక్షలతో… లక్కీ”.

వాట్సప్‌లో వచ్చిన మెసేజ్ చూసాను. ఎవరీ లక్కీ , కాలనీ అంటాడు, పిక్నిక్ అంటాడు. నాకేమీ అర్థం కాక అర్ధాంగిని అడిగాను.

“లక్కీని మరిచిపోయారా స్వామీ..బాలన్నయ్యగారి రెండో అబ్బాయి.” అందావిడ అతి తేలిగగా తీసుకొంటూ.

“బాలా.. ఎవరా బామ్మరిది” అన్నాను అయోమయంగా.

“సరే సంబడం. రానురాను మీకు వయసు పెరగడంతో, మతిమరుపు కూడా పెరుగుతున్నట్లుంది” అంది తనేదో చిన్నవయసు చిన్నారిలా వగలు ఒలికిస్తూ. “రావిగుడలో మనం అన్నేళ్లు ఉన్నాం. ఎలక్ట్రిక్ కాలనీలో మన పొరుగునే ఉన్న బడాబాబు బాలచంద్రన్ అన్నయ్యనే మరిచిపోయారా మహాశయా..”

 “బాలన్నయ్య అంటున్నావు. ఎవరినీ, ఏమిటీ సంగతి..” చేతులు తుడుచుకొంటూ వచ్చింది పింకీ, మా పెద్దమ్మాయి.

విషయం చెప్పాను. బ్రహ్మానందభరితురాలయిందామె.

“నాక్కూడా రావాలి మెసేజ్..” అని సెల్లు ఫోను ఆన్ చేసి చూసింది. “అవునవును. లక్కీబావ నాక్కూడా మెసేజ్ పెట్టిండు” అందామె ఆనందకందళిత స్వరంతో. “నాకేటేటో అయిపోతున్నాది.. నానేటి సేతునమ్మీ.. కుసింత కూకుంటానా” అంది. పింకీ అత్తవారిది సికాకులం.

ఎల్లప్పుడూ నిలిచిపోయే తీపి గురుతు రావిగుడ. అందులో ఎలక్ట్రిక్ కాలనీ మరిచిపోలేని మధురానుభూతి. వంద ఎకరాల విస్తీర్ణంలో, ఊరికి దూరంగా కట్టిన 132 కెవి.సబ్ స్టేషను, ఎక్జిక్యూటివ్ ఇంజనీరు ఆఫీసు, దానికి అనుబంధంగా కట్టిన కార్యాలయాలతో, క్వార్టర్సుతో నిండు ముతైదువలా ఉండేది. ఇదంతా ఒక ఎత్తయితే కాలనీ ముతైదువ ముఖాన వెలిగిపోతున్న స్వర్ణాభరణం.

ఆ రోజుల్లో క్వార్టర్సు కోసం వెంపర్లాడే ఉద్యోగస్ధులు లేరంటే నమ్మండి. జామి, మామిడి, కరివేపాకు, నేరేడు తదితర వృక్షరాజాలతో పచ్చగా పడుచుపిల్లలా పెటపెట లాడేది కాలనీ. ప్రతీ ఇంట పూలమొక్కలు, కాయగూరల  పంటతో కనుల పండువగా ఉండేది. మధ్యాహ్నం పూట మగతగా కనురెప్పలు పడుతుంటే ఆకతాయి కుర్రాళ్లు పళ్ల, కాయల కోసం వచ్చి రాళ్లు రువ్వేవారు. అర్థం కాని భాషలో బూతులు తిడుతూ వాళ్లని తరిమికొట్టి వాళ్లు. తొందరలో జారవిడుచుకొన్న పళ్లని ఆబగా తినడం గుర్తుకొచ్చి నవ్వుకొన్నాను.

“ఏమిటో మామయ్యగారు తనలో తామే నవ్వుకుంటున్నారు” అంటూ రంగప్రవేశం చేశారు అల్లుడు, మనవడు.

 “అయితే మనమంతా విహారయాత్రకి వెళుతున్నాం. 24వ నాటికి రిజర్వేసను చేసేస్తున్నానహో” అన్నాడు సిక్కోలు సిన్నోడు.

‘ఒక్క సిటం ఆగు మావా. మా సెల్లి దాని కుటుమాం ఒత్తాది. ఆల్లని ఒట్టుకెలదాం. ఓలమ్మో నాకేటేటో అయిపోతన్నాది” పింకీ ఉత్సాహంతో ఉరకలు, పరుగులు పెడుతుంది.

ఈలోగా ఒకప్పుడు కాలనీలో ఉండే వాళ్లని వెతికి పట్టుకొని సంప్రదింపులు జరిపారు తల్లీకూతుళ్లిద్దరూ. ఎక్కడనుండి నో అన్న మాటే లేదు.

సాయంత్రం ఏడు గంటలయింది. అలెప్పీ-ధనబాదు ఎక్సుప్రెస్సు రావిగుడ రైల్వేస్టేషను చేరుకొంది. మమ్మల్ని రిసీవ్  చేసుకోడానికి  లక్కీ వచ్చాడు. ఆంధ్ర, తెలంగాణా, తమిళనాడు, కేరళలో సెటిలయిపోయిన కాలనీవాసులం కలిసాం.

కొత్తగా కట్టిన హోటలు ఐదొందలులో మా విడిది. ‘హోటలు పేరు తమాషాగా ఉందే’ అన్నాం. ఆ హోటలు యజమాని అసలు పేరు అప్పారావు. అతనిది వడ్డీ వ్యాపారం. ఊర్లో అనేకమంది అప్పారావులు అయితే ఐదొందలు అతనికి అచ్చొచ్చిన నంబరట. అదే సార్ధక నామధేయమయిపోయింది. ఐదు వందల చదరపు గజాలలో ఐదంతస్ధుల భవంతి అది. రూం రెంటు రోజుకి ఐదు వందల మాత్రమేనట. ఐదు వందల పూల కుండీల్లో పెట్టిన క్రోటన్సు, పూలమొకక్కలు సాదరంగా ఆహ్వానించాయి. అయితే ఆ హోటల్లో కేటరింగు సదుపాయం లేదు. బహుశా టిఫిను, మీల్సు ఐదొందలు  రేటు పెడితే జనం రారు.

రావిగుడలో చలిపులి పంజా విసిరింది, వేడినీళ్లలో జలకాలాడి ఇస్త్రీ బట్టలు వేసుకొని బయటపడ్డాం. పట్టణం పడుచుపిల్లలా పిటపిటలాడిపోతుంది. ఫోరు లేను రోడ్లు, మధ్యన డివైడర్సు, ఎల్.ఇ.డి. దీపాలకాంతిలో రజస్వలయిన రావిగుడ రమణీయంగా ఉంది. మేం పనిచేసే రోజుల్లో రైల్వే స్టేషను నుండి కాలనీకి రాత్రిపూట రావాలంటే తోడు ఉండాల్సిందే. దారిలో కిరస్తానీ స్మశానం పక్కనే జడలు విరబోసుకున్న మర్రిచెట్టును చూస్తే మరుగు వెళ్లాల్సిందే.

పంజాబీ హోటలు దగ్గర ఆగాం.

“రొట్టెలు, దాల్ ఫ్రై తిందాం” ప్రపోజ్ చేయడం నా వంతు. సానుకూలమవుతుందో లేదో చూడాలి.

“నాకు దోశ కావాలి..” అన్నాడు మనవడు.

“నాకేమో మలి పూలీ, కూల కావాలి” అంది మనవరాలు.

“అవన్నీ రేపు తిందాం. ఈవాళ్టికి పరోఠాతో సరిపెట్టుకొందాం” అని అల్లుళ్లు సర్దిచెప్పి తీసుకు వెళ్లారు అల్లరి పిల్లకాయల్ని. అందరం తింటున్నాం.

“రంగరాజుగారూ మీరేమీ తినడం లేదేమిటీ” అడిగాను.

“పార్శిలు చేయమని చెప్పాను. రూంలో తింటాం..” అన్నాడు మెల్లగా.

అతని ఆంతర్యం బోధపడింది. బుగ్గన పెగ్గులు బిగించి బుఢాబుడీలిద్దరు భువినుండి దివికి వెళతారన్నమాట.

రంగరాజు గురించి రెండు మాటలు చెప్పాలి. దొంగరాజని అతనికి నిక్ నేమ్. కట్నం తేలేదని సతాయిస్తూ, సీరియల్‌గా ఆడపిల్లలనే కంటున్నావు తప్పంతా నీదే అన్నట్లు ప్రవర్తిస్తుండేవాడు. అతగాడు పెట్టిన మానసిక హింసకు తట్టుకోలేక పాపం ఆ ఇల్లాలు కన్నవారింటికి పారిపోయింది. పిల్లలు పెరిగి పెద్దయ్యారు. పెళ్లిళ్లు అయ్యాయి. కన్యాదానం చెయ్యడానికి వాళ్లిద్దరు కలిసారు. ఇన్నాళ్ల విరహతాపం ఇప్పుడు తీరబోతుంది.

(తదుపరి సంచికలో మళ్ళీ)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here