సంభాషణం: బి.వి.ఎన్‌. స్వామి అంతరంగ ఆవిష్కరణ

0
3

[box type=’note’ fontsize=’16’] “నేను ఎప్పుడూ జరిగిన వాస్తవాలనీ, బతికి ఉన్న మనుషుల్ని, వాళ్ళ జీవితాలని స్టడీ చేసి మాత్రమే కథలుగా రాస్తాను” అనే సుప్రసిద్ధ కథకులు, సాహితీ పరిశోధకులు డా. బి.వి.ఎన్. స్వామి గారితో సంచిక జరిపిన సంభాషణం ఈ నెల ప్రత్యేకం. [/box]

[dropcap]డా[/dropcap]క్టర్‌ బి.వి.ఎన్‌. స్వామి గారి పూర్తి పేరు భైరవి వెంకట నర్సింహస్వామి. కోహెడ మండలం వరికోలులో లక్ష్మిదేవి-అనంతస్వామి దంపతులకు 1964 డిసెంబర్‌ 15న జన్మించారు. సుప్రసిద్ధ తెలుగు కథకులు, పరిశోధకులు.

2000 సంవత్సరం నుంచి విస్తృతంగా రాయడం ప్రారంభించారు. 2004లో తన మొదటికథా సంపుటిని ‘నెలపొడుపు’, మరో కథా సంపుటి ‘రాత్రి-పగలు-ఒక మెలకువ’ను 2013లో ప్రచురించారు. ‘అందుబాటు’ అనే పేర వెలువరించిన పరిశోధక గ్రంథం 2005లో వచ్చింది. కథలపై విమర్శనా వ్యాసాలు ‘వివరం’ పేర 2011లో, ‘కథా తెలంగాణ’ పేరుతో వచ్చిన వ్యాసాలు 2014లో వెలువరించారు. వృత్తిపరంగా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం పొందడమే కాకుండా సాహిత్యపరంగా కళాహంస పురస్కారం, పివి నర్సింహరెడ్డి సాహిత్య పురస్కారం, బొందులపాటి సాహిత్య పురస్కారం వంటి అవార్దులు పొందారు. శ్రీకాకుళం కథానిలయంలో శ్రీ కాళీపట్నం రామారావు గారి సత్కారం కూడా పొందారు.

తన కథల్లో కాల్పనికత ఉండదని, సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఆధారమని చెప్పే బి.వి.ఎన్. స్వామి – కొత్తగా రాసేవాళ్లు, రోజూ చదవడం అలవర్చుకోవాలని, అధ్యయనం కొనసాగించాలని సూచించారు.

బి.వి.ఎన్. స్వామి గారితో సంచిక జరిపిన ఇంటర్వ్యూ ఇది.

***

నమస్కారమండీ బి.వి.ఎన్. స్వామి గారు.

నమస్తే సర్.

మీ కథల గురించి, ఇతర రచనల గురించి చర్చించే ముందు మీ బాల్యం, కుటుంబ నేపథ్యం గురించి చెబుతారా? ఏయే జీవితానుభవాలు మిమ్మల్ని సృజనాత్మక రచయితగా మళ్ళించాయో వివరిస్తారా?

తప్పకుండా. మాది కరీంనగర్ జిల్లా కోహెడ మండలంలోని వరికోలు గ్రామం. తెలంగాణ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత ప్రస్తుతం మా ఊరు సిద్ధిపేట జిల్లాకి వెళ్ళింది. చిన్నప్పటి నుంచి 12, 13 ఏళ్ళ వయసు వరకూ నేను పల్లెటూరిలోనే పెరిగాను. బాల్యం పల్లెటూరిలోనే గడవడం వల్ల పల్లెటూళ్ళ ప్రభావం నా మీద ఎక్కువగానే ఉంది. మాది మధ్య తరగతి కుటుంబం. బాపు టీచర్‌గా పనిచేసేవాడు. నా మీద మా అమ్మ ప్రభావం చాలా ఉంది, అమ్మ నా చిన్నప్పుడే చనిపోయింది. ఆమె క్యాన్సర్ రోగి కావడం మా కుటుంబంపై తీవ్ర ప్రభావాన్నే చూపింది. నన్ను మా నాయనమ్మ పెంచింది. ఆమె ప్రభావం కూడా నా మీద చాలా ఉంది. నా జీవితాన్ని తరచి చూసుకుంటే ఈ ఇద్దరు స్త్రీమూర్తుల ప్రభావం అడుగడుగునా కనిపిస్తుంది.

ఏడవ తరగతి వరకు పల్లెటూరిలో చదివి ఎనిమిదో తరగతి చదవడం కోసం నేను కరీంనగర్ వచ్చాను. ఏడో తరగతి తర్వాత విద్యాభ్యాసం కొనసాగించడానికి మా ఊర్లో అవకాశం లేకుండె. కనుక అనివార్యంగా కరీంనగర్‌కి రావడం జరిగింది. ఆ చిన్న వయసులోనే అంటే 12  ఏళ్ళకే కరీంనగర్ వచ్చి నాకు నేను వండుకుని తింటూ చదువుకున్నాను. అమ్మని క్యాన్సర్ వైద్యానికి తీసుకురావడం వల్ల చదువు కోసం రాకముందే కరీంనగర్ నాకు తెలుసు. అమ్మని హాస్పటల్లో చేర్చడం, నేను అమ్మతోనే హాస్పటల్లో కరీంనగర్‌లో ఉండడం వల్ల ఆ సమయంలోనే పట్టణాన్ని మొదటిసారి చూడడం జరిగింది! అనుకోకుండా అదే ఊరిలో చదువుకోడం జరిగింది. ఇలా నా పాఠశాల చదువు పూర్తయింది. ఇంటర్‌మీడియట్ కరీంనగర్‌లోనే చదివాను. డిగ్రీ వరంగల్ వెళ్ళి మా పెదనాన్నగారి ఇంట్లో ఉండి చదివాను. పోస్ట్-గ్రాడ్యుయేషన్ గుంటూరులో చేశాను. ఇట్లా చదువు పేరు మీద నేను అనేక ప్రాంతాలు తిరగడం జరిగింది. ఇట్లా అనేక ప్రాంతాలలో నా జీవితం ముడిపడి ఉన్నది. కనుక అన్ని ప్రాంతాలలోని విషయాలు, అన్ని ప్రాంతాల సంస్కృతులు అనుకోకుండానే నాకు తెలిసొచ్చినాయి. నా పరిశీలన అప్పటినుండే సాగుతూ ఉన్నది. అది కూడా నాకు సాహిత్యంలో కొంత పనికి వచ్చింది. అనుకోకుండానే నాకు అది ప్లస్ పాయింట్ అయ్యింది.

ఇంటర్మీడియట్ తర్వాత హనుమకొండకు వెళ్ళడమనేది నా జీవితంలో ఒక చేరుపు… నా జీవితంలో అదొక చేర్పు, ఒక మలుపు. డిగ్రీలో నేను తెలుగు సబ్జెక్టును ఐచ్ఛికంగా తీసుకున్నాను. ఆ సమయంలోనే తెలుగు సాహిత్యాన్ని ఎక్కువగా చదివాను. క్లాసు పుస్తకాల కంటే ఎక్కువగా నేను లైబ్రరీ పుస్తకాలనే చదివాను. లైబ్రరీలో దొరికిన ప్రతీ పుస్తకాన్నీ నేను చదివేది. ఈ క్రమంలో నేను ‘తెర తీయగ రాదా’ అనే చిన్న నవలిక చదవడం జరిగింది. అప్పటి నుంచి నాకు వచనం మీద ఆసక్తి పెరిగింది. చదవడమంటూ జరిగితే వచనమే చదవాలన్న ఆసక్తి… ‘తెర తీయగ రాదా’ నవలిక రాసిన రచయిత్రి పేరు గుర్తు రావడం లేదు కాని, ఆమె శైలి బావుంది. చదివించ గలిగే శైలి. అప్పట్ని నుంచి ఏది పడితే అది చదవకుండా కేవలం వచనం మాత్రమే చదవాలనే ధోరణి నాలో కలిగింది. వచనం ఏదైనా చదివేవాడిని ముఖ్యంగా గద్యం. ఈ క్రమంలో చలం రాసిన ‘ఓ పూవు పూసింది’ దొరికింది. ఈ కథ చదవడం కూడా నాకు ఒక మేలి మలుపు. అప్పట్నించి కథలు చదవాలె అనే ఆలోచనకొచ్చిన. ఏ కథలైనా, ఎవరు రాసినా చదివేవాడిని. అన్ని కథలు నాకు ఇష్టంగా అనిపించేవి. అటువంటి కథల్లో చాగంటి సోమయాజులు రాసిన ‘బండపాటు’ అనే కథ నన్ను బాగా కదిలించింది. జీవితం సాహిత్యంలోకి ఎలా ప్రవేశిస్తాది అన్నది ఆ కథ ద్వారా నేను నేర్చుకోగలిగినాను. కాని రాయడం మాత్రం నాకు తెలియదు. రాయలేకపోయేటోణ్ణి. ఎక్కువగా చదవడానికే ఇష్టపడేవాడిని. ఒకవేళ రాస్తే ఇలాంటి కథలు రాయాలి అని అనుకునేవాడ్ని. ‘బండపాటు’ కథ చదివిన తర్వాత రాయాలన్న ఆసక్తి కలిగింది. ఇట్లాంటి కథలు రాస్తే బాగుంటది కదా అనిపించింది. అప్పటికి నాకు రాయడం తెలియదు. కానీ రాయాలి అన్న తపనకి బీజం అక్కడ పడింది. కొన్నాళ్ళకి తోచింది రాయడం మొదలుపెట్టి కవితలు రాశాను. అవి కూడా ఎక్కువ రాయలేదు. ఎక్కువగా సమావేశాలకు వెళ్ళేవాడిని. ఆ కాలంలో వరంగల్‌లో జరిగే సాహితీ సమావేశాలకి వచ్చిన గొప్ప గొప్ప రచయితలని… కాళోజీ సోదరులను కలుసుకోవడం జరిగింది. ఈ రకంగా డిగ్రీ స్థాయిలోనే నేను సాహితీ వాతావరణంలోకి ప్రవేశించాను. అప్పటికీ రాయడం మాత్రం నావల్ల కాలేదు. ఇట్లా డిగ్రీలోనూ, పిజీలోనూ సాహిత్యాన్ని ఇష్టపడుతూ, సాహిత్యాన్ని చదువుతూ నా ప్రయాణం సాగింది.

మీకు అంతగా నచ్చిన చాసో కథ ‘బండపాటు’ గురించి చెబుతారా? ఆ కథ మీకు ఎలా ప్రేరణ కల్గించింది?

‘బండపాటు’ కథలో కొండలు బ్లాస్ట్ చేస్తుండగా రామిగాడు అనే కూలీ చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతని కుటుంబానికి కాంట్రాక్టర్ డబ్బులివ్వడం జరుగుతుంది. ఆ డబ్బు ఎవరికి చెందాలి అనే అంశంలో – అతని భార్య, తల్లి పాత్రలు ప్రవేశిస్తాయి. ఈ కథలో ఆ పాత్రలకి సంబంధించిన జీవితం, ఆ పాత్రల కుటుంబ నేపథ్యం కనబడుతుంది. డబ్బు కోసం జరిగిన గొడవలో చనిపోయిన వ్యక్తి సైడ్ అయిపోవడం నాకు షాకిచ్చింది. జీవితాలు ఇంత పచ్చి వాస్తవంగా ఉండడం నివ్వెరపరిచింది. మనకు కనబడదాని వెనుక ఎంత పచ్చి వాస్తవముంటుందో కదా అనిపించింది. అది కదా రాయాల్సింది… మామూలు కళ్ళకి కనబడేది వేరు… దాని వెనుక ఉండేది వేరు. వెనుక ఉన్న వాస్తవాలు వేరుంటాయి కదా ఆ వాస్తవాలు పట్టుకుని రచయిత కథ రాసిండు కదా, అట్లా కదా రాయల్సింది అనిపించింది.

ఆ కథ చదివిన తర్వాత చాసో కథలన్నీ చదివినా. చిన్న విషయాన్ని కథగా మలచడమెట్లా అన్నది చాసోని చూసి నేర్చుకోవచ్చు. ‘ఏలూరెళ్లాలి’ కథ కూడా ఇందుకు ఉదాహరణ. చలం వల్ల నేను కథకు దగ్గరయితే, చాసో వల్ల కథ రాయాలె అన్న కోరిక కలిగింది. కాని వెంటనే రాయలేకపోయాను. కారణం.. నా కుటుంబానికి చెందిన సమస్యలు కావచ్చు. చదువు ముఖ్యం, చదువుకుంటూనే సంపాదించుకోవాల్సిన అవసరంతో ట్యూషన్లు చెప్పడంతో సమయం గడిచిపోయేది. ఆ సమయంలో రాయలేకపోయినా, రాయాలన్న ఆలోచనకి ఒక బీజం మాత్రం పడింది. తర్వాతర్వాత ఆ బీజం మొలకెత్తింది.

సమాజాన్ని అధ్యయనం చేసే క్రమంలో మీకెటువంటి అనుభవాలు కలిగాయి?

డిగ్రీ, పీజీలలో నా విద్యాభ్యాసం కొనసాగుతున్న రోజులలో సమాజంలో వస్తున్న మార్పులు కదిలించేవిగా ఉండేవి. నేను హైస్కూలు చదువులో ఉండగా రమీరా బీ కేసులో ఒక ఊరేగింపు తీయడం జరిగింది. ఆ ఊరేగింపులో నేను అనివార్యంగా పాల్గొనాల్సి వచ్చింది. అంటే బడి పిల్లలందరం రోడ్డు మీదకు రావల్సి వచ్చింది… అసలు బడి పిల్లలు రోడ్ల మీదకి రావడం ఏంది, ఈ ఊరేగింపు ఏంది అనేది అప్పట్లో నాకు తెలియకపోయేది. కానీ అదొక కొత్త అనుభవం. అసలా కేసు ఏమిటి? పోలీస్ స్టేషను, అత్యాచారము, ఆమె భర్త చనిపోవడం, మనుషులు ఒకర్నొకరు చంపుకోవడం ఏంటి, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అన్న ఒక చింతన నాలో కల్గింది. కాని అర్థం కాలేదు. చంపడం చంపబడడం అనేవి నన్ను ఎప్పుడూ వెంటాడుతుండేవి. డిగ్రీలో ఉండగా… హనుమకొండ వరంగల్ అంటే… అందరికీ తెలిసినదే.. అది ఉద్యమాల గడ్డ. అక్కడ కూడా చంపడం… రామనాథం సార్ హత్య కావచ్చు… లేకుంటే విద్యార్థి సంఘాల మధ్య గొడవ కావచ్చు.. వీటన్నిటి గురించి ఆలోచన చేసేవాడిని. ఎదిగే కొద్దీ ఇలాంటి సంఘటనలు ఎక్కువగా కనబడ్డాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌లో ఉండగా కారంచేడు ఘటన జరిగింది. కారంచేడు ఇస్యూ వల్ల నాగార్జున యూనివర్శిటీ చాలా అలజడికి గురయింది. వీటన్నిటినీ నేను దూరం నుంచి పరిశీలించేవాడిని.  వాటి మూలాలను, వాటి వెనుక ఉన్న విషయాలను అర్థం చేసుకోడానికి ప్రయత్నించాను. అయితే రాయడానికి ప్రయత్నించలేదు. ఆసలు నేను నా స్టూడెంట్ లైఫ్‌లో రాయనేలేదు. కారణం… అంత విశ్రాంతి దొరకకపోవడమే. విశ్రాంతి దొరకకపోవడమంటే ఎక్కువ చదివినట్టు కాదు (నవ్వులు). జీవనోపాధి కోసం ట్యూషన్స్ చెప్పడంతో సమయం చిక్కేది కాదు. ఒకవేళ సమయం దొరికితే లైబ్రరీకి వెళ్ళి చదువుకునేటోణ్ణి. ఇప్పటికి కూడా నేను లైబ్రరీకి వెళ్తాను. అట్లా లైబ్రరీలు కూడా నన్ను సాహితీ వ్యాసంగానికి దగ్గర చేశాయి. ఇవన్నీ నా స్టూడెంట్ లైఫ్‌లో జరిగినవి. పీజీ పూర్తయిన తర్వాత… మిగతావి!

అమ్మ చనిపోవడం, నాయనమ్మ వృద్ధాప్యము, నాయనమ్మ చనిపోవడము, దాని వల్ల కుటుంబంలో కాస్త బరువు బాధ్యతలు భుజాలకెత్తుకోవాల్సి రావడం, పెళ్లి…. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కాకముందే పెళ్ళి చేసుకోవడం పిల్లలు కలగడం… తర్వాత కుటుంబ బాధ్యతలు మీద పడడం… వీటి వల్ల సాహిత్యం మీద ఇష్టమున్నా రచనలు చేయలేకపోవడం జరిగింది. అయితే బరువులు పెరుగుతున్న కొద్దీ రాయాలన్న కోరిక కూడా అంతే బలీయమవుతూ వచ్చింది.

జీవిక కోసం ప్రైవేటు స్కూల్లో టీచర్‌గా చేరడం, పనిచేయడం.. టీచర్ ఉద్యోగం వచ్చాకా నాలుగైదేళ్ళ పాటు కూడా రాయడానికి వెసులుబాటు దొరకని స్థితి. ఎప్పుడైతే వెసులుబాటు దొరికిందో, అప్పట్నించి రాయడం ప్రారంభించాను. 1999 – 2000 సంవత్సరం నుండి నా రాతలు మొదలయ్యాయని చెప్పవచ్చు.

మీ తొలి సంకలనాన్ని మీరు నలిమెల భాస్కర్ గారికి అంకితమిస్తూ… “సాహిత్యానికి దూరమైన నన్ను కథామార్గం పట్టించిన నలిమెల భాస్కర్ గారికి అంకితం” అని, “నా మార్గాన్ని, గమ్యాన్ని, గమనాన్ని నిర్దేశించిన జయధీర్ తిరుమలరావు గారికి” అన్నారు. వీరిద్దరి ప్రోత్సాహం గురించి చెబుతారా?

నేను ఉద్యోగం చేస్తున్న రోజులలో కరీం‍నగర్‌లో సాహిత్య వాతావరణం ఉండేది. సాహితీ సంఘాలు ఉండేవి. ఎప్పుడూ సాహితీ సమావేశాలకు వెళ్ళడం, ఆ సమావేశాల్లో పాల్గొనేవారిని చూడడం, వారి మాటలు వినడం.. ఆ క్రమంలో నలిమెల భాస్కర్ గారితో పరిచయం ఏర్పడింది. నాకు ఏ చిన్న సందేహం ఉన్నా కూడా ఆయన దగ్గరికి వెళ్ళి, అడిగి క్లారిఫై చేసుకునేవాడిని. భాస్కర్ సార్ దగ్గర నుండి ఎన్నో కథల పుస్తకాలు చదివాను. కథలు రాయాలన్న నా ఆసక్తి సార్ వల్ల మళ్ళీ బయటకు వచ్చింది. ఇక్కడ ఓ చిన్న విషయం చెప్పుకోవాలి. నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ తెలుగులో చేస్తున్నప్పుడు.. అంతకు ముందు హిస్టరీలో చేసినా.. నాకు కథలను చదివి సమీక్షించడం అలవాటయింది. ఎవరి కథ చదివినా దాన్ని విశ్లేషించేవాడిని. అప్పటికింకా నేను రాయడం మొదలుపెట్టలేదు, ఇతరుల కథలు ఎక్కువగా చదివేవాడిని. సమీక్షలు రాసేవాడిని. ఈ క్రమంలో అనేక కథలు, కథాసంపుటాలు దొరకబట్టుకుని వాటిని విశ్లేషించేవాడిని. ఈ క్రమంలో నా నడక అనుకోకుండానే పరిశోధనవైపు సాగింది. ఎప్పుడైతే నా మార్గం నాకు స్పష్టంగా కనబడుతున్నదో… ఆ సమయంలో నా మిత్రులు, నా శ్రేయోభిలాషులు.. నన్ను పరిశోధన వైపు ప్రోత్సహించడం జరిగింది. అప్పుడే పిహెచ్.డి. కోసం రిజిస్టర్ చేసుకున్నాను. తెలుగు యూనివర్శిటీలో పరిశోధన చేయడానికి నాకు అవకాశం దొరికింది. “ఉత్తర తెలంగాణ కథా సాహిత్యము – పరిశీలన: 1970 నుండి 2000 వరకు” అనేది నా పరిశోధనాంశం. ఉత్తర తెలంగాణ అంటే వరంగల్, కరీంనగర్, నిజమాబాద్, ఆదిలాబాద్ జిల్లాలన్న మాట. 30 సంవత్సరాల కాలంలో ఈ నాలుగు జిల్లాల కథా సాహిత్యం గురించిన పరిశోధన అన్నమాట. దీనికి జయధీర్ తిరుమలరావు గారు నాకు పర్యవేక్షకుడు.. గైడ్. అట్లా ఆయన నా మార్గాన్ని స్పష్టం చేసిండు.

రీసెర్చ్‌లో మీరు కనుగొన్న అంశాలేంటి?

వాస్తవంగా నేను పిహెచ్.డిలో జాయిన్ అయిన తర్వాత ఈ నాలుగు జిల్లాలో కథకులు ఎంతమంది ఉన్నారో చూస్తే, పుస్తకాలు సేకరించిన తర్వాత నలుగురు అయిదుగురు తప్పితే నాకు ఎక్కువ మంది కనిపించలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. అల్లం రాజయ్య, రఘోత్తమ్ రెడ్డి, చందూ, బి.ఎస్. రాములు వంటి సీనియర్లు నలుగురైదుగురు ఉన్నారు. ఈ నలుగురైదుగురు మీద పరిశోధన చేయడమెట్లా? సాధ్యమేనా ఇది అని అనిపించింది. అప్పుడు ఈ నాలుగు జిల్లాలను తిరగాలే, ఈ నాలుగు జిల్లాలను వడపోయాలె అన్న అలోచన వచ్చింది. ఎందుకంటే పరిశోధనలో ప్రాథమికంగా సేకరణ జరగాలె. కథల సేకరణ జరిగితే ఎన్ని కథలున్నాయి, వాటిని ఈ విధంగా వింగడించుకోవాలి, ఏ విధంగా పరిశోధన చెయ్యాలె, ఏ ప్రతిపాదన వస్తాది అన్నది తరువాతి విషయం.

ఈ క్రమంలో నాకు దాదాపు ఒక సంవత్సర కాలం ఈ నాలుగు జిల్లాలు తిరగడంతోనే సరిపోయింది. ఈ సమయంలో నాకు కలిసొచ్చిన అంశం ఏంటంటే – తెలంగాణలో అప్పుడు నందిని సిధారెడ్ది అధ్యక్షుడిగా ‘తెలంగాణ రచయితల వేదిక’ ఏర్పడింది. నేను ఎక్కువగా వాళ్ళ సమావేశాలకు వెళ్ళేవాడిని. ఏ జిల్లాలో సమావేశం పెట్టినా వెళ్ళేవాడిని, ఒక కార్యకర్తగా ఉండేవాడిని. అదే సమయంలో నా పరిశోధనకి సంబంధించిన కథకులు ఎవరైనా దొరుకుతారా అని వెతుక్కునేవాడ్ని. అట్లా చాలామంది కథకులు కనబడడం, వాళ్ళ వివరాలు రాసుకుని పెట్టుకోవడం చేశాను. ఈ రకంగా సాధ్యపడుతుందని అనుకోకపోయినా నేను 224 మంది కథకులను నేను వెలికితీయగలిగాను. నా పిహెచ్.డి. థీసిస్ ప్రింట్‌లో రాలేదు కానీ 224 మంది కథలు, వాళ్ళు ఏమేం రాసిన్రు అన్నీ కూర్చి అకారాది క్రమంలో అమర్చి ‘అందుబాటు’ అనే పుస్తకం తెచ్చాను. ‘అందుబాటు ఉత్తర తెలంగాణ కథారచయితల పరిచయం’ పేరిట వెలువడిన పుస్తకంలో ఈ 224 మంది కథకుల పరిచయం ఉంటుంది.

ఈ పుస్తకం ప్రస్తుతం అందుబాటులో ఉందా?

ఉంది. ఈ పుస్తకం చాలామంది పరిశోధకులకు అక్కరకొచ్చింది.

ఖమ్మం జిల్లా కథల మాటేమిటి?

అది వేరు. నా పరిశోధన ఈ నాలుగు జిల్లాలకే పరిమితమైనా, పుస్తకం తెస్తున్నప్పుడు ఖమ్మం జిల్లాను కూడా కలిపితే సగం తెలంగాణ కవర్ అవుతుందని అనిపించింది.

అంటే నేను అప్పుడు మాగ్జిమం తిరిగిన సమయంలో… నాకు తెలిసిన విషయం ఏంటంటే…. అందుబాటులో ఉన్న రచయితలు తక్కువ అని.

పుస్తకానికి అందుబాటు అని పేరు అందుకే పెట్టారా?

(నవ్వి…) అవును. కథలు పోగొట్టుకున్న కథకులు చాలామంది కనబడ్డారు. తర్వాత కొంతమంది ఇస్తామని చెప్పినా, స్పంచించని వారు కనబడ్దారు. ఇట్లా కథలు సేకరించడం కష్టమైంది. నాకు తెలియకుండా ఉన్న రచయితలు కూడా ఉండి ఉండవచ్చు.  పరిశోధనలో ప్రవేశించాకా అప్పటివరకు పదిమంది పన్నెండు మంది ఉన్నట్టు అనిపించినా, కాని నేను ఒక సంవత్సరం తిరిగేసరికి, 224 మంది కథకుల వివరాలను సేకరించగలిగినా. వాళ్ళ గురించి, వాళ్ళ కథల గురించి నేను థీసిస్ డెవలప్ చేయగలిగినా. అట్లా నేను ‘అందుబాటు’ అనే పుస్తకం తీసుకురాగలిగినా.

ఇదే సమయంలో ఒకవైపు పరిశోధన కొనసాగిస్తూనే నేను కథలు రాయడం మొదలుపెట్టిన. కథలు రాసుకుంటూ, సమీక్షలు చేసుకుంటూ, పరిశోధన చేసుకుంటూ… ఇట్లా కథా పరిధిలో నా ప్రయాణం సాగింది.

మీరు కథారచనలోకి ఎలా ప్రవేశించారు చెప్తారా?

నేను కథలు రాయడం స్టార్ట్ చేశాక ఒక 17 కథలతో ‘నెలపొడుపు’ అనే కథాసంపుటి తీసుకురావడం జరిగింది. ఈ పుస్తకంలోని 17 కథలలో ‘నెలపొడుపు’ అనే కథ కూడా ఒకటి ఉంది. అది చాలా మంచి కథ. కథలు రాయడంలో నేను ఎప్పుడూ  జరిగిన వాస్తవాలనీ, బతికి ఉన్న మనుషుల్ని, వాళ్ళ జీవితాలని స్టడీ చేసి మాత్రమే కథలుగా రాస్తాను. నా కథలలో వాస్తవిక కల్పన ఉంటుంది. ఊహా కల్పనకు ఏమాత్రం తావు ఇవ్వకుండా నేను రాస్తూ ఉంటాను.

వాస్తవిక కల్పన, ఊహ కల్పన వీటిని మీరు ఎలా నిర్వచిస్తారు?

వాస్తవిక కల్పన అంటే ఒక సంఘటన జరిగి ఉంటుంది. దాన్ని కథగా మలిచే క్రమంలో కొంత కల్పన జోడించాలి. లేదంటే అది వార్తా కథనమైతుంది. ఉదాహరణకి ‘నెలపొడుపు’ కథలో నేను ఒక చేపలు కడిగే ఆమె జీవితాన్ని తీసుకున్నాను. ఆ చేపలు కడిగే ఆమె జీవితంలో జరిగిన సంఘటనలు తీసుకొని ఆ కథ రాశాను. భర్త తాగుబోతు. అతను చనిపోయిన తర్వాత పిల్లల్ని పట్టుకొని జీవితం గడుపుతుంది. ఆమెకు తెలిసిన పని కేవలం చేపలు కడగడం మాత్రమే. మార్కెట్లో చేపలు కొన్నవాళ్లు కడిగించుకుని వెళ్తారు. ఇలా చేపలు కడగడంతోనే ఆమె జీవితం ప్రారంభమవుతుంది. ఇలా చేపలు కడిగి పొట్టపోసుకోవడం పిల్లల్ని పెంచడం ఆ క్రమంలో ఎదురైన సాధకబాధకాలు ఇవన్నీ కూడా ‘నెలపొడుపు’ కథలో రాయడం జరిగింది. ఈ కథ మొదటిసారిగా వార్త ఆదివారం అనుబంధంలో ప్రచురితమైంది. దానికి మంచి స్పందన రావడం నాకు సంతోషం కలిగించింది. నేనూ రాయగలను అనే నమ్మకం నాలో బలపడింది. అలా నేను కథలు రాస్తూ వచ్చాను. జరుగుతున్న పరిణామాలను కూడా బేరీజు వేస్తూ నేను కథలు వ్రాసిన క్రమం ఉంది. ‘అభ్యంతరం’ అనే కదా అలాంటిదే. ఈ కథను రైతులు కరెంటు కోత వలన కరెంటు చార్జీల వలన ఎలా ఇబ్బంది పడుతున్నారో చెప్పాను. ముఖ్యంగా ప్రపంచీకరణ వలన ఏ ఏ రంగాలలోని ప్రజలు బాధపడుతున్నారో వాళ్ల గురించి కథలు రాయాలన్న ఆలోచన నాకు వచ్చింది.

ఆ ఆలోచన ప్రకారమే నేను కథలు వ్రాయడం జరిగింది. తర్వాత నా పరిశీలనలో ఏం తేలింది అంటే సమాజంలో పురుషులకంటే స్త్రీలకు తక్కువ ప్రాధాన్యత ఉండటం, తర్వాత స్త్రీకి సంస్థాపరంగా ఎక్కువ కష్టాలు ఉండటం కూడా నా పరిశీలనలోకి వచ్చింది. వాటిని బేస్ చేసుకుని ఎక్కువ కథలను రాయడం జరిగింది. ‘కలుపు మొక్క’ అనేది కూడా అలాంటి కథనే. ఆమె కుటుంబాన్ని మొత్తం చేతిలోకి తీసుకొని కుటుంబాన్ని నడిపించిన కూడా ఆమె భర్తకు ఉన్నటువంటి గౌరవం ఆమెకు లేకపోగా, ఆమెకు ఇంకా కష్టాలు రావడం జరుగుతుంది. కారణం ఆమె స్త్రీమూర్తిగా అక్కడ ఉండడమే అని నాకు అర్థం అయింది. ఇట్లా నేను కథలు రాయడం జరిగింది.

ఇలాగ సమాజంలో వస్తున్న పరిణామాలను మార్పులను నేను బేరీజు వేసుకుంటూ కథలు రాయడం జరిగింది. ‘వలస’ కథ మరో ఉదాహరణ. మనకి ఇప్పుడు ఒక కొత్త ప్రపంచం, న్యూ వరల్డ్ కనబడుతోంది. ప్రపంచీకరణ తర్వాత ఒక న్యూ వరల్డ్ అనేది ఎమర్జ్ అయ్యింది. ఈ న్యూ వరల్డ్ మనుషుల జీవితాలను ఏ విధంగా మార్పులకు గురి చేసింది, ఆ మార్పులు వాళ్ళ జీవితాలను ఏవిధంగా ప్రభావితం చేశాయో నేను నా కథలలో రాశాను.

మీకు నచ్చిన మీ కథ ఏది?

‘కరివేపాకు’ కథ. మనం సాధారణంగా వంటల్లో కరివేపాకు వేసుకుంటాము కానీ తినేముందు తీసేస్తూ ఉంటాం. వేసుకోవడం తీసేయడం రెండు కూడా జరుగుతుంటాయి. అంటే ఉపయోగించుకుని వదిలేయడం అన్నమాట. దీని ఆధారంగా నేను ఒక కథ రాసాను. ఈ కథ ఆర్టీసీలో ఒక కండక్టర్ జీవితానికి సంబంధించినది. ఈ కథ రాసే క్రమంలో నేను ఒక కండక్టర్‌ని ఇంటర్వ్యూ చేశాను. ఆర్టీసీకి వెళ్లి అక్కడి వారి జీవితాలను పరిశీలించాను. కిక్కిరిసిన బస్సుల్లో ఉద్యోగం చేయడమే కష్టమైతే ఒకవేళ ఏమరపాటుగా ఉండి ఒక టికెట్ ఇష్యూ కాకపోతే అది కండక్టర్ పాలిట శాపం అవుతుంది. అది అతని ఏమరపాటు కావచ్చు లేదా ప్రయాణికుడు యొక్క లౌక్యం కావచ్చు పిసినారితనం కావచ్చు. అది కండక్టర్‌కు మాత్రం శాపమే అవుతుంది. కార్పొరేషన్‍కి మాత్రం కండక్టర్ సేవలు కావాలి కానీ అతనిని రక్షించటానికి మాత్రం అక్కడ ఎవరూ ఉండరు. ఈ అంశంతో నేను ‘కరివేపాకు’ అనే కథ రాశాను. ఆ కండక్టరు నాకు తెలిసిన వ్యక్తి,  ఆయన కథ నిజంగా హృదయ విదారకంగా ఉంటుంది. ఆ విధంగా అతని జీవితాన్ని గమనించి నేను కథగా రాయడం జరిగింది. ఇట్లా ప్రతి కార్నర్ నుంచి నేను కథాంశాలను తీసుకోవడం జరిగింది.

ముంపుకు గురయ్యే ప్రాంతాలలో ఉండే ప్రజల గురించి కూడా నాలుగైదు కథలు రాశాను. ఎందుకంటే మా అమ్మమ్మవాళ్ళ ఊరు ముంపుకు గురైంది. ఆ బాధ నాకు తెలుసు. చిన్నప్పుడు నేను ఎప్పుడూ మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళేది చర్లాపూర్ మా అమ్మమ్మ వాళ్ళ ఊరు. చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ మా అమ్మమ్మ వాళ్ళ ఊరుతో పెనవేసుకొని ఉన్నాయి. ఆ ఊర్లో మా దేవుని గుట్ట ఒకటి ఉండేది. ఆ గుట్టకు పోయే వాళ్ళం. ఆ గుడికి అయ్యవార్ల అంటే పూజారులు మేమే. మా తాత దేవునిగుట్టకి పోయి పూజ చేసి వచ్చేవాడు. వచ్చిన తర్వాత కాలువ దగ్గరకు వెళ్లే వాడు. దేవునిగుట్ట, కాలవ గట్టు ఇదంతా ఒక సర్కిల్. నా చిన్నప్పుడు తెలిసో తెలియకో ఇవన్నీ తిరిగిన వాడిని. ఎప్పుడైతే మానేరు డ్యామ్ వచ్చి, ఆ మానేరులో మా ఊరు మునిగిపోయిందో ఊరివాళ్లంతా ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. అలా ప్రజలు వెళ్లే సమయంలో వాళ్ల బాధలు ఏంటో నాకు తెలుసు. కనుక నేను ‘దేవులాట’ అని ఇటువంటి కొన్ని కథలు రాశాను. ఈ రకంగా ముంపుకు గురైన ప్రజల బాధలను కూడా నేను కథలుగా మలిచాను.

ఒక కథ రాయడానికి మీకు ఎంత సమయం పడుతుంది?

కథ రాయడానికి నాకు ఎక్కువ సమయమే పడుతుంది. నేను స్లో రైటర్ ని. చాలా మెల్లగానే రాస్తుంటా.  మెటీరియల్ అంతా సమకూర్చుకుంటే నేను నాలుగైదు రోజుల్లో రాయగలుగుతాను. ఒకసారి కథ రాయడానికి నాకు నాలుగైదు నెలలు కూడా పడుతుంది. కనుక ఇది అది అని చెప్పలేను. మొత్తానికి నేను ఒక స్లో రైటర్‌ని. రాయడము, కొట్టేయడం, మళ్లీమళ్లీ రాయడం ఇవన్నీ ఉంటాయి. వన్ టైంలో రాయడం అనేది నాతోని కాదు. కూసున్ననంటే వన్ సిట్టింగ్‌లో కథ రాయడం అనేది కొంచెం కష్టం. కనుక మళ్ళీ మళ్ళీ తిరిగి రాయాల్సిందే. అందుకే నా దృష్టిలో కథ రాయడం అనేది ఒక లేబర్ వర్క్. కానీ ఆ లేబర్ వర్క్ చేయడం లోని ఆనందం ఉన్నది.

మీరు కథలు సాధారణంగా ఏ టైంలో రాస్తారు? అంటే మీ ఉద్యోగ బాధ్యతలు కూడా నిర్వహించాలి కదా!

సాధారణంగా నేను రాత్రుళ్ళు, సెలవు రోజుల్లో రాస్తూ ఉంటాను. మామూలుగా స్కూల్ ఉండే రోజుల్లో రాయడం చాలా కష్టం. విశ్రాంతిగా ఉన్నప్పుడు రాయడం జరుగుతూ ఉంటుంది. తప్పని పరిస్థితుల్లో రాత్రుళ్ళు కూర్చోని రాయడమే.

స్వామి గారు మీరు మరో కథా సంకలనం రాత్రి పగలు ఒక మెలుకువఅని వెలువరించారు. ఆ పుస్తకంలోని కథల గురించి చెప్తారా?

ఈ కథా సంపుటిలో 14 కథలు ఉన్నాయి. ఇందులో ‘వర్తమాన చిత్రపటం’ అనేది తెలంగాణ ఉద్యమాన్ని నేపథ్యంగా చేసుకుని రాసిన కథ.  తెలంగాణ ఉద్యమం జరిగే క్రమంలో తెలంగాణ ఆకాంక్షలను, తెలంగాణ ఉద్యమంలో చోటు చేసుకున్న సన్నివేశాలను, వీటిని ఆసరాగా చేసుకుని రాసినటువంటి కథ వర్తమాన చిత్రపటం. పేరులోనే ఉంది వర్తమానంలో జరుగుతున్న విషయం ఏమిటో. ఆ ఆకాంక్షలను కళ్ళకు కట్టినట్లుగా రాసిన కథనే అది. ఈ కథని ఒక జ్ఞాపకంగా రాసినా. ఆ జ్ఞాపకం ఏమిటంటే ఒక భార్య చనిపోతుంది. భార్య చనిపోయిన తరువాత  స్మశానం నుంచి వచ్చే క్రమంలో భర్తకు ఒక ఊరేగింపు ఒక ధర్నా ఎదురైంది. ఆ ధర్నా ఏమిటంటే ఉద్యమ సందర్భంగా చేస్తున్న ఊరేగింపు. ఇంతకు ముందు జరిగిన ఊరేగింపు అంటే తన భార్య శవాన్ని స్మశానానికి తీసుకు వెళుతున్నప్పుడు జరిగిన ఊరేగింపు ఒకటి అయితే ఎదురుపడ్డ ఊరేగింపు ఒకటి. ఇట్లా ఈ రెండు ఊరేగింపుల మధ్య ఉన్న తేడా ఆయనని ఆలోచింపచేస్తుంది. అట్లా ఆలోచింపచేసిన క్రమంలోనే ఆంధ్ర తెలంగాణ సమస్య కూడా వస్తుంది. ఆయన ఆలోచనలు ఆ విధంగా ఉంటాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉద్యమం జరుగుతున్న చోట ఒక గొడవ జరుగుతుంది. హైదరాబాద్ మీద తెలంగాణ వాళ్ళకి హక్కు లేదని ఆంధ్ర నాయకులు, హైదరాబాద్ మాది అని తెలంగాణ నాయకులు వాదన చేస్తా ఉంటారు. ఈ వాదనని బేస్ చేసుకుని కథలో ఏముంటాదంటే ఒకప్పుడు ఆ భార్యాభర్తలు తమ ఊర్లో ఉన్న ఇంటిని విడిచి పెట్టి రావడం వల్ల ఆ ఊరి అభివృద్ధి జరిగి ఆ ఇల్లు సగంగా చీలిపోతుందన్న మాట. అలా సగం చీలిపోయిన ఇంటిని ఆ ఊరి సర్పంచ్ అది ఊరి ప్రాపర్టీ ఒక వాదన లేవదీస్తాడు. ఈ వాదనను ఒక జరుగుతున్న క్రమానికి ముడిపెట్టి వ్రాసిన కథ అది.

తర్వాత పద్మశాలీల జీవితాన్ని బేస్ చేసుకుని వ్రాసిన కథ కుంఠనం అనే కథ.

కుంఠనం అంటే?

కుంఠనం అంటే ఒక ఫ్రస్టేషన్ లోకి వెళ్లి పోవడం అన్నమాట.

అది మచ్చ వీరయ్య గారు చెప్పినటువంటి కథ. ఆయన మచ్చ హరిదాసు గారి తండ్రి. అను కేవలం మూడో తరగతి వరకే చదువుకున్న అపారమైన పద్యాలు రాసినటువంటి వ్యక్తి.  అలాంటి వారిని కలుసుకోవడం నాకు చాలా ఇష్టం. అలాగే సిద్ధప్ప వరకవి. ఆయనది మా ఊరి దగ్గర గుండారెడ్డిపల్లి. అట్లాగే ఈయన కూడా. ఆయన దగ్గరకు పోతే పద్మశాలీల జీవితం ఎలా ఉంటుందో ఆయన పూసగుచ్చినట్టుగా చెప్పారు. అదొక కథ అయితది కదా అనుకున్నా. పద్మశాలీల కులదైవం దగ్గర్నుంచి చేనేత కార్మికులు ఈ రకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, ఆత్మహత్యలకు పాల్పడటానికి కారణాలేమిటి అనేది మొత్తం ఆయన వివరంగా చెప్పిండు. ఇవన్నీ కథగా అల్లడం జరిగింది. ఆ కథలో పద్మశాలీలకు సంబంధించిన ఒక పాట కూడా పెట్టడం జరిగింది. ఈ కథ నాకు మంచి పేరును తీసుకువచ్చింది తృప్తిని మిగిల్చింది. అట్లా ఒక వృత్తికి సంబంధించిన ఫుల్ లెంత్ కథ నేను రాయగలిగినా. అది కుంఠనం.

తర్వాత రాసిన కథ ‘చావు ప్యాకేజ్’. ఇప్పుడు ఈ కొత్త కాలంలో ప్రతీదీ కూడా ఒక ప్యాకేజ్ గా మారుతోంది. మనిషి చనిపోయిన తర్వాత వచ్చి వెళ్లే వాళ్లు కనబడుతున్నారు, కానీ ఈ కాలంలో ఆ చనిపోయిన వ్యక్తిని తీసుకు వెళ్లడం, ఆ కుటుంబానికి సహాయం చేయడం, ఆ  కుటుంబంతో పాటు కలిసి ఉండాలె అనేటువంటి వాళ్లు చాలా తగ్గిపోతున్నారు. కారణాలు ఏవైనా కావచ్చు కానీ వెనుకటి కాలంలో ఇట్ల లేదు. వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ మొత్తం కుటుంబాన్ని వాళ్ళు ఆదుకునే వారు. ఇప్పుడు వచ్చి వెళ్లడమే జరుగుతోంది. శవం అంత్యక్రియలు, దహన సంస్కారాలు మొత్తం కూడా ఒక వ్యక్తి ఒక వృత్తిగా తీసుకున్నాడు. వృత్తిగా తీసుకొని దానికి ఒక ప్యాకేజ్ ఏర్పాటు చేశాడు. ఆ ప్యాకేజ్ ఆయనకి వృత్తి, అదే విధంగా వీళ్ళకి సహాయం. చనిపోయిన వ్యక్తి కుటుంబీకులకు ఇదొక సహాయం. అయితే దీన్ని ఒక వృత్తిగా కాకుండా ఆ కుటుంబ సభ్యుడిగా ఆయన చేయడం నన్ను కదిలించింది. ఎప్పుడైతే వ్యక్తి చనిపోతాడో, చనిపోయిన విషయం తెలియగానే ఆయనే వచ్చి దహన సంస్కారాలకి సంబంధించిన పాడె దగ్గర్నుంచి అన్నీ కూడా ఆయనే సరఫరా చేసి దహన సంస్కారాలు అయ్యాక వాళ్ళని ఇంట్లో దిగబెట్టి ఆయన వెళ్ళిపోతాడు. ఇదంతా ఒక వ్యాపార దృక్పథంగా కాకుండా ఒక మానవీయ దృక్పథంతో ఆయన చేయడం అనేది నన్ను కదిలించింది. అది ఆయనకు ఒక జీవిక కావడం నన్ను ఆలోచింపజేసింది. వాస్తవమే బతుకు భారమైంది ఒప్పుకుంటా, కానీ దాన్నుంచి మనం బయటపడి జీవించడానికి చేసిన ఒక పోరాటం కానీ, ప్రయత్నం గాని ఉన్నది కదా, అప్రయత్నంగా నేను ఈయనని నేను చూసుకుంటా. ఎందుకంటే ఆయన ఇది మాత్రమే చేసి జీవిస్తాడు. దీంతోనే ఆయన కుటుంబాన్ని సాకుతున్నాడు. ఇటు ఆయనకి జీవిత అవుతున్నది; అటు ఎవరైతే చనిపోయారు ఆ కుటుంబానికి సహాయం చేసినట్టు అవుతుంది. ఆయన మా కరీంనగర్ టౌన్‌లో చాలామందికి తెలిసిన వ్యక్తి. ఎవ్వరు చనిపోయినా కూడా ముందు ఆయనే గుర్తుకొస్తాడు. ఆయన ఇంటి దగ్గర ఉంటే ఆ కుటుంబీకులకు కొండంత అండగా ఉంటుంది. దీన్ని ‘చావు ప్యాకేజ్’ అనే కథగా మలచడం జరిగింది. ఒక శవం ఇంటి ముందు ఉందంటే అందరూ ఎన్ని కోణాల్లో ఆలోచిస్తారో కూడా నేను ఈ కథలో చూపించగలిగాను. ఆ వ్యక్తి ఒక గుణాలు చూపిస్తూనే, వచ్చిన వాళ్ళు ఎలా కామెంట్ చేస్తారు అన్నది కూడా నేను ఆ కథలో చెప్పాను. అది నాకు చాలా ఇష్టమైన కథ. అది నా దగ్గర సన్నిహితుల కథ అని కూడా చెప్పగలుగుతా. ఎందుకంటే అంత దగ్గరగా చూశాను కాబట్టి, అట్లా రాయగలిగినా. రేర్ కథల్లో ఒకటి అది మిగిలింది. తెలంగాణ సాహిత్య అకాడమీ వారు ప్రచురించిన మూడు తరాల తెలంగాణ కథ అనే సంపుటిలో ఈ కథ చోటు చేసుకుంది. ఇట్లా 14 కథలతో నేను ‘రాత్రి పగలు ఒక మెలకువ’ అనే పుస్తకాన్ని వెలువరించాను.

‘రాత్రి పగలు ఒక మెలకువ’ అనేది కూడా ఒక కథనే. ఈ కథకి సంబంధించిన ఒక విశేషం ఏమిటంటే టి నిజం పత్రిక’లో ఈ కథ ప్రచురితమైనప్పుడు కాళీపట్నం రామారావు మాస్టారు గారు చదివి నాకు ఫోన్ చేసి మాట్లాడారు. కథ నడిపిన తీరు కొత్తగా ఉందని, తనకు నచ్చిందని ఆయన అన్నారు. ఆ మాట నాకు చాలా బలాన్నిచ్చింది. ఈ కథ బీడీ కార్మికుల కథ. బీడీ కట్ట మీద పుర్రె గుర్తు ఉండకూడదని ఒక చట్టం తేవాలని పార్లమెంట్‌లో దుమారం రేగింది. అది తీసేస్తే దాని ప్రభావం బీడీ కార్మికుల మీద ఏ విధంగా ఉంటుందనేది నేను స్వయంగా చూసినా. ఆ చట్టానికి వ్యతిరేకంగా బీడీ కార్మికులు కలెక్టరేట్‌కి పెద్ద ధర్నా చేయడం కూడా జరిగింది. పరోక్షంగా ఇది సిగరెట్ పాకెట్‌లకి దోహదపడుతుందని ఒక వాదన కూడా వచ్చింది. అంటే చిన్న కార్మికుల మీద, చిన్న కంపెనీల మీద దెబ్బన్న మాట. అది పెద్ద కంపెనీలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది ఈ ధర్నా ద్వారా నాకు అర్థమయింది. ఆ ధర్నాని దూరం నుంచి చూస్తున్న వ్యక్తి ఏ విధంగా స్పందించాడు, కలెక్టరేట్ ఉద్యోగులు ఆ ధర్నా పట్ల ఎలా స్పందించారు అనేది కూడా నేను ఈ కథలో చెప్పాను. ఒక చట్టం ఒక ధర్నాకు ఏ విధంగా మూలమయింది, ఉద్యోగ వర్గాలు దాన్ని ఏ విధంగా చూసినయి అనేది కూడా ఒక పాత్ర ద్వారా చెప్పడం జరిగింది. అంటే ఇవాళ అటు బీడీ కార్మికులు కావచ్చు లేదా కుటుంబాలలో స్త్రీ పురుషులిద్దరూ పనిచేయడం కావచ్చు దీనివల్ల ఏమవుతుందంటే కుటుంబంలో ఒకరు ఇంకొకరికి టైం ఇవ్వని దశ వస్తోంది. భార్యాభర్తలిద్దరూ పని చేస్తున్న క్రమంలో ఒకవేళ భర్తకి ఒంట్లో బాగా లేకపోయినా, ఏదైనా జ్వరం వచ్చిన భార్య అతనికి టైం కేటాయించలేని పరిస్థితి. అది కూడా ఒక వ్యథకి సంబంధించినదే. అంటే కుటుంబపరమైన వ్యథ. బీడీ కార్మికులకు సంబంధించి వ్యవస్థాపరమైన బాధ. ఇట్ల బాధ అనేది రకరకాల తీరులలో కనబడతా ఉంటది. అయితే ఆ రకరకాల తీరులో కనబడ్డ సమయాల్లో కూడా బాధకి ఏ విధంగా ఉపశమనం కలిగించే దారులు ఉంటాయనేది ఒక కథకుడిగా నేను ఈ కథలో సూచించడం జరిగింది. ఈ కథలో నేను ఒక గీతం కూడా పెట్టడం జరిగింది ఆ గీతం ఎవరు చెప్తున్నారు? ఏ కుటుంబంలో అయితే పెద్దలు అమ్మమ్మలు తాతయ్యలు ఉంటారు వాళ్ళు చెప్తున్నారు. ఇలాంటి వాటి వల్ల ఒక సాంత్వన అనేది దొరుకుతుంది. ఇవాళ వ్యక్తులు అనేక అలజడులకు గురవుతున్నారు. ఆ అలజడులకు గురైన వ్యక్తులకు సాంత్వన దొరకాలి. అయితే ఈ సాంత్వన కలిగించే వ్యక్తులు కుటుంబాలలో కరువవుతున్నారు. అయితే అది ఏ విధంగా దొరకబట్టుకోవాలి అనేది కూడా నేను ఈ కథలో చెప్పినా. పోతన రాసిన ‘సిరికిం జెప్పడు’ పద్యం కూడా ఈ కథలో వాడుకున్నాను. ఎందుకంటే అప్పటి మనుషులు లేకపోయినా ఆనాటి సాహిత్యం మనుషులకు సాంత్వన కలిగిస్తుంది. అది సత్యం. ఇలాంటి వాటిని అన్నిటిని కథలలో జొప్పించి వాటిని తిరిగి మననం చేసుకున్నట్లయితే, సాంత్వనని అట్ల కూడా పొందవచ్చు అని చెప్పాను. కథలలో వర్తమాన సంక్షోభాలను చూపిస్తూనే ఈ రకంగా కూడా సాంత్వన పొందవచ్చు అని చెప్పాను. ఇది నాకు బాగా నచ్చిన కథ అందుకే కారా మాస్టారు నాకు ఫోన్ చేసి నన్ను అభినందించారు. అందుకే ఈ సంపుటికి ‘రాత్రి పగలు ఒక మెలకువ’ అనే పేరు పెట్టుకున్నాను.

మీరు కథలతో ‘కశప’ అని ఒక విచిత్రమైన ప్రయోగం చేసినట్లు చెప్తారు. ఏమిటిది?

‘కశప’ అంటే కథా శతక పద్యం. కథలు చదవడం, కథలు రాయడం, కథ సమీక్షలు, కథా విమర్శలు… ఇలా నా ప్రతి అడుగు కథలతోనే సాగింది. కథలు అంటే నాకు ఇష్టం. కథలే కాకుండా నాకు పాట వినడం, పాట పాడడం, పాట రాయడం, పద్యం చదవడం, వినడం కూడా బాగా ఇష్టం. అయితే ఇవేవీ నాకు రావు. నేను పాటలు రాయలేను కనుక నా మొదటి కథలో చాలా పాటలు పెట్టుకున్నాను. అలాగే నాకు పద్యాలు అంటే బాగా ఇష్టం ముఖ్యంగా సుమతీ శతకము, వేమన శతకము. ఇవి నాకు చాలా ఇష్టమైన పద్యాలు.

ప్రతి సంఘటనకు ఏదో ఒక పద్యం జ్ఞాపకం వస్తూ ఉంటుంది. చిన్నప్పుడు నేను చాలా శతక పద్యాలు చదువుకునేవాణ్ణి. శతక పద్యాలలో ఉన్న నీతి… ఇవాళ ఏదైనా సంఘటన జరిగితే ఆ పద్యాలు యాదికి వస్తాయి. పద్యం రాయలేకపోతున్నా, పాట రాయలేకపోతున్నా అని మనసులో ఉండేది. కానీ వాటి జోలికి పోకుండా పాటలని మొదటి కథలలో పెట్టుకోవడం జరిగింది. అలాగే పద్యాలకి సంబంధించి ఏమీ చేయలేకపోతున్నా అనే ఒక వెలితి మనసులో ఉండేది. కథకి సంబంధించి అనేక పనులు చేసే సమయంలో బి.వి.ఎన్.స్వామి అనే వ్యక్తి కథకి సంబంధించిన పనులు చేస్తాడని నలుగురికి తెలిసింది. ఆ నలుగురికి తెలియడం దేని ద్వారా తెలిసింది? కథ ద్వారా తెలిసింది.  ఆ సమయంలో నేను కథకు ఏం చేసినా కథకు ఏదో ఒకటి చేయాలి అన్న ఆలోచన కలిగింది. ఆ ఆలోచనల ఫలితమే ‘కశప’. కథా శతక పద్యం. నేను చూసినట్లు సన్నివేశాలను, కథగా మలచడం అనేది నేను మొదటినుంచి చేస్తున్నదే. కథకి నేనుగా ఏదో ఒక కాంట్రిబ్యూషన్ చేయాలన్న ఆలోచన వచ్చింది. ఆలోచన నాలో సుళ్ళు తిరుగుతున్నప్పుడు నేను చూసిన ఒక సన్నివేశాన్ని చిన్న కథగా రాయడం జరిగింది. ఆ కథ సారాంశానికి తగిన పద్యం కూడా నాకు స్ఫురించింది. ఒకవైపు నేను రాసిన కథ మరోవైపు వేమననో సుమతి శతకకారుడో రాసిన పద్యం… అటు కథ ఇటు పద్యం రెండు నా కళ్ళముందు కనబడుతుండేవి. అప్పుడు నాకు ఈ ఆలోచన వచ్చింది. ఒక కథ రాసి ఆ కథ సారమున్న పద్యాన్ని దాని కింద జోడించినట్లయితే. అదొక ప్రయోగంగా ఉంటదా అని అనిపించింది. కానీ రెండూ ఒకే దగ్గర ఉన్నట్లయితే లింక్ ఎలా కుదురుతుంది, లింక్ పెట్టాలి కదా అని మరొక ఆలోచన. అంటే పద్యాన్ని కథకి జత చేయడం ఏ విధంగా అనేది ఒక ఆలోచన. సాధారణంగా శతక పద్యాలలో మూడవ పాదంలో ఒక కొత్త ఆలోచన కానీ ఒక కొత్త నీతి గాని ఉండటం గమనించవచ్చు. శతకకారుడు ఏదో ఒకటి చెబుతూ ఉంటాడు. కనుక శతకంలోని మూడవ పాదంలో ఉన్న ఒక పదాన్ని కథా శీర్షికగా పెట్టి ఈ రెండిటికీ లంకె వేయాలన్న ఆలోచన తట్టింది. అట్లా ఆలోచన వచ్చిందే తడవుగా ముందు ఒక 60, 70 కథలు రాసినా. ఆ 60, 70 కథలకు సరిపడేటువంటి వేమన పద్యాలను జోడించగలిగాను. తర్వాత కొందరు మిత్రులు సూచించిన ప్రకారం అన్నీ వేమన పద్యాలే ఎందుకు అందరి పద్యాలు తీసుకోవచ్చు కదా అని ఆలోచన వచ్చింది. అందుకని ఆ 70 కథల్ని మళ్ళీ తిరగ రాసినా. అలా తిరగరాసినప్పుడు చాలామంది రాసిన మకుట సహిత శతకాలను తీసుకోవడం జరిగింది. ఒక్కో శతకము తీసుకొని ఆ శతకంలోంచి నా కథకు సరిపోయేటటువంటి పద్యాన్ని ఎంచుకున్నాను. ఆ శతకంలోని పద్యంలోని మూడవ పాదంలోని పదాన్ని కథా శీర్షికగా పెట్టి కథలు రాశాను. అలా 117 కథలు రాసి దానికి ‘కశప’ అని పేరు పెట్టాను. ఇది కథా సాహిత్యంలో ఒక కొత్త ప్రయోగం అని నేను అనుకుంటున్నాను. జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇది. పద్యం ఎంచుకొని దానికి కథ రాయడం కాదు, కథకు సరిపోయే పద్యం ఎంచుకోవడం జరిగింది. ఇలా ఎంచుకోవడం వల్ల నేను వేలాది పద్యాలను చదవగలిగినా. ఈ పుస్తకానికి ముందుమాట రాస్తూ డాక్టర్ మచ్చ హరిదాసు గారు ఇందులో ఉన్న 8 లక్షణాలను ప్రత్యేకంగా పేర్కొనడం జరిగింది. అందులో ఒకటి రెండు లక్షణాలను చెప్తాను. ఒకటి -ఇది స్వల్ప వ్యవధిలో చదవగలిగేదిగా ఉండాలి. రెండు – ఇతివృత్తం ఏదైనా ఒక అంశానికి పరిమితం కావాలి. మూడు- మకుటం ఉన్న నాలుగు పాదాల పద్యాన్ని ఎన్నుకోవాలి. అంటే మకుట సహిత పద్యం అయి ఉండాలి. ఇలా ఈ మొత్తం 117 పద్యాలను తీసుకుంటే మనకి ప్రత్యేకంగా 8 లక్షణాలు కనబడతాయి. అవి కథా నిర్మాణానికి సూత్రాలుగా హరిదాసుగారు పేర్కొన్నారు. ఈ పుస్తకానికి ప్రొఫెసర్ రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ఇంకో ముందుమాట రాసిండు.  “ప్రాచీన పద్యాలకు కూడా సమకాలీన సామాజిక సందర్భాలను కల్పించడం స్వామి వర్తమాన దృక్పథానికి నిదర్శనం” అని ఆయన అన్నాడు. పాతవి అని చెప్పి సాహిత్యాన్ని పక్కన పెట్టకూడదు, పాత సాహిత్యాన్ని కూడా కొత్త తరపు కథలకు, కొత్త సన్నివేశాలకు జోడించవచ్చు. కనుక పాత సాహిత్యమనో, పద్య సాహిత్యమనో, ప్రాచీన సాహిత్యమనో దాన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు.  అది మనకు వెన్నెముక అని కూడా చెప్పవచ్చు. కనుక దాన్ని మనం ఉపయోగించుకోవాలి. కథాసాహిత్యానికి ఈ ‘కశప’ ద్వారా నేను ఒక చేర్పునందించానని అనుకుంటున్నాను. తల్లి తండ్రి గురువులకు రుణపడి ఉన్నట్లే ప్రతి వ్యక్తి సమాజానికి కూడా కొంత ఋణపడి ఉంటాడు. అదే సామాజిక ఋణం. ఈ సామాజిక ఋణాన్ని తీర్చుకునే క్రమంలోనే – కథ నాకు ఎంతో చేసింది, నేను కథకి ఏం చేశాను అని ఆలోచించి ఈ రకంగా ‘కశప’తో నేను సామాజిక ఋణాన్ని తీర్చుకున్నాను.

‘కశప’ పుస్తకంలో మరో విశేషం కూడా ఉంది. నాకు ఒక కోరిక ఉండేది ఏ కథ వ్రాసిన ఒక కొత్త శిల్పంలో రాసుకోవాలని. ఆ కోరిక లో భాగంగానే ఇందులో బుంగి అనే పాత్రను సృష్టించాను. మొత్తం 117 కథల్లో బుంగి అనేది ప్రధాన పాత్ర. బుంగి అనేక పాత్రల్లో కనబడుతూ ఉంటాడు. ఒక దగ్గర టీచర్‍గా, ఒక దగ్గర తాత్వికుడిగా, ఒక దగ్గర కుటుంబీకుడిగా, ఒక దగ్గర స్టూడెంట్‌గా, ఇలా… అనేక పాత్రల్లో కనబడతాడు. కథా సాహిత్యంలో బుడుగు అనే పాత్ర ఉన్నట్టే నా కథల్లో బుంగి పాత్ర ఉంటుంది. నేను చదువుకున్న అనేక కథలు కూడా నా మీద ప్రభావం చూపెట్టినాయి, అందుకే ఇలాంటి పాత్రను సృష్టించాను.

మీరు రాసిన వ్యాసాల గురించి చెప్తారా? కథా సాహిత్య వ్యాసాలు రాశారు, కథా తెలంగాణ, వివరం, పటువ మొదలైన పుస్తకాలు వెలువరించారు. వాటి గురించి చెప్పండి.

   

ఈ మూడు కూడా వ్యాస సంపుటాలే. ఇవి నన్ను కథ విమర్శకుడిగా నిలబెట్టినాయి. వివరం కావచ్చు, కదా తెలంగాణ కావచ్చు, ఈ రెండు సంపుటాల్లో కూడా కథా సాహిత్యం మీదనే విమర్శ వ్యాసాలు రాసినా. కదా తెలంగాణ అయితే మొత్తం తెలంగాణకు సంబంధించిన కథల మీద విమర్శా వ్యాసాలే.  మొత్తం 30 వ్యాసాలు ఉన్నాయి. ఈ 30 వ్యాసాలు కూడా నిజామ్ జమానాల నుంచి నేటి వరకు తెలంగాణలో కథ ఎలా రూపుదిద్దుకుంది అని చెబుతాయి. అంటే సురవరం ప్రతాపరెడ్డి జమానా నుంచి ఇవ్వాల్టి వరకు. అందుకే నేను కథ అనేది ఒక చారిత్రక వనరు అంటాను. తెలంగాణలో ఒక సీరియస్ కథ ఉంది. సీరియస్ కథని మనం పట్టించుకోని చదివితే అన్ని పరిణామాలు కూడా మనకు కనబడుతా ఉంటాయి. నిజామ్ వున్నప్పుడు నిజామ్ ఏవిధంగా బతికింది అనే విషయాన్ని సురవరం ప్రతాప రెడ్డి గారి కథల్లో తెలుసుకోవచ్చు. నిజామ్ కాలంలో భూస్వామ్యం ఏ విధంగా ఉండేది అనేది కూడా ఆ కథల్లో కనబడుతుంది. భారత దేశ స్వాతంత్ర ఉద్యమం యొక్క ప్రతిఫలనాలు తెలంగాణలో ఎలా ఏ విధంగా ఉన్నాయి అనేది మన పివి నరసింహారావు రాసిన ‘గొల్ల రామవ్వ’ కథ ద్వారా తెలుస్తుంది. తర్వాత బి.ఎన్.రెడ్డి రాసిన ‘ఆయువు పట్టు’ అనే కథలో భూమిని ఏ విధంగా పంచడం జరిగింది అనేది కనబడుతుంది. నెల్లూరు కేశవ స్వామి రాసిన కథలో ఇక్కడ పోలీస్ యాక్షన్ తర్వాత ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఏ కథ తీసుకున్న ఆ కథ తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించిదని చెప్పవచ్చు. ఎన్ని పరిణామాలు తెలంగాణలో జరిగినా ఆ పరిణామాలన్నిటినీ కథలు పట్టించుకున్నాయని ఈ వ్యాసాల ద్వారా చెప్పొచ్చు. ఈ పుస్తకానికి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు విమర్శ రంగంలో నాకు పురస్కారం ఇచ్చారు. నాకు ఇది చాలా సంతృప్తికరమైన వర్క్. తెలంగాణకు సంబంధించిన అన్ని దారులు ముస్లిం జీవితాలు ఎలా ఉన్నాయి, దళితుల జీవితాలు ఎలా ఉన్నాయి, వలసలు ఏ విధంగా ఉన్నాయి, పారిశ్రామిక కారిడార్లు ఏ విధంగా ఏర్పడ్డాయి, సింగరేణి బండ కింద బ్రతుకులెట్లున్నాయి, తెలంగాణ ఎలా వచ్చింది, ప్రాంతీయ అస్తిత్వం ఎలా వచ్చింది, ప్రాంతీయ అస్తిత్వం వల్ల ఎలాంటి కథలు వచ్చినాయి, తెలంగాణ ఉద్యమంలోని ఆకాంక్షలు ఎలా ఉన్నాయి వాటిని కథలు ఏవిధంగా ప్రతిఫలించినయి అనేది ఈ వ్యాసాలలో చెప్పడం జరిగింది. ఈ రకమైన అనేక పరిణామాలను కథలు తమలో నిక్షిప్తం చేసుకున్న కథలను ఒక చరిత్రకు ఆధారంగా భావించాలి. చరిత్రకు పురాతత్వ ఆధారాలు, లిఖిత ఆధారాలు ఉంటాయి. కథ లిఖిత ఆధారమే. కాబట్టి కథను చారిత్రక వనరు అనాలి. సమాజాన్ని పట్టించుకుని జీవితాన్ని పట్టించుకుని రాసిన ప్రతి ఒక్క కథ కూడా చారిత్రక ఆధారమే. ఇది నాకు బాగా ఇష్టమైనటువంటి వ్యాస సంపుటి.

మీరు సంపాదకత్వం వహించిన వాటి గురించి చెప్పండి.

నాకు కథలంటే ఇష్టం అని చెప్పాను కదా అందుకే కథలకు సంబంధించి మూడు సంపుటాలకు ఎడిటర్‌గా ఉన్నాను. మొదటిది ‘తెలంగాణ చౌక్’. ‘తెలంగాణ చౌక్’ ఎందుకు తీసుకు వచ్చినాను అంటే గతంలో వాసిరెడ్డి నవీన్ గారు తెలంగాణ రైతాంగ పోరాటానికి సంబంధించిన ఒక కథా సంకలనం తెచ్చారు. దాన్ని చదివినప్పుడల్లా నిజామ్ రాజ్యంలో భూస్వామ్య పోరాటాలు ఏ విధంగా జరిగినాయనేది నాకు కనబడేది. మరి ప్రత్యేక తెలంగాణకు 69లో ఉద్యమం జరిగింది, ఇప్పుడు 2000 తర్వాత కూడా ఉద్యమం జరిగింది. 69 లో కథలు వచ్చినాయి, 2000 తర్వాత ఇన్ని కథలు వచ్చినాయి. వీటిని సంకలనంగా తీసుకురావాల్సిన బాధ్యతను ఎవరూ తీసుకోవడం లేదు. నేనైనా తీసుకోవాలి కదా అని ఒక బాధ్యతగా ఫీలయి 69లో వచ్చిన కథలు సేకరించినా, 2000లో వచ్చిన ఒకటి రెండు కథలు సేకరించినా. మిగతావి ఉద్యమాన్ని చిత్రిస్తూ కథలు రాయాల్సిన బాధ్యత ఉందని కొంతమంది కథకులకు చెప్పి వాళ్ల చేత రాయించినా. అట్లా రాయించి ‘ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కథలు’ పేరు మీద ఒక సంకలనంగా తీసుకొచ్చిన. నాతో పాటు కర్ర ఎల్లారెడ్డిగారు సంపాదకత్వ బాధ్యతలు పంచుకున్నారు. కథల ఎంపిక, కథలు తీసుకురావడం నా బాధ్యత అయితే, ప్రచురించే బాధ్యత ఆయన తీసుకున్నారు.

దీనికి సంబంధించి ఇంకొక విషయం ఏంటంటే కారా మాస్టారు గారు నన్ను శ్రీకాకుళంలో కథ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. అప్పుడు నేను… “సార్ ‘తెలంగాణ చౌక్’ అని ఒక పుస్తకం తీసుకువచ్చినా. మీరు అక్కడ ఆవిష్కరించాలి సార్” అన్నాను. ఆయన అంగీకరించి అక్కడ శ్రీకాకుళంలో ఆ పుస్తకాన్ని ఆవిష్కరించి, సమీక్షించారు కూడా. “ఇవి మంచి కథలు, ఇది రావాల్సిన పుస్తకం” అని కితాబిచ్చారు. నేను చాలా ఇష్టంగా చేసిన పని ‘తెలంగాణ చౌక్’ తీసుకురావడం. తర్వాత మరో రెండు సంకలనాలకు సంపాదకుడుగా ఉన్నాను. కరీంనగర్ కథకుల కథలు ‘పంచపాల’, ‘కుదురు’. వీటిని సాహితీ గౌతమి అనే సంస్థ ద్వారా సంకలనాలుగా తీసుకొచ్చాం. వారాల ఆనంద్, కె.ఎస్.అనంతాచార్య, మాడిశెట్టి గోపాల్, దాస్యం సేనాధిపతి వంటి మిత్రుల సహకారంతో ఈ వ్యాస సంపుటాలు వెలువరించాము. ఈ రకంగా కథకి సంబంధించి సంపాదక రంగంలో కూడా నేను పని చేసినానన్న తృప్తి నాకు మిగిలింది.

స్వామి గారూ, మా కోసం సమయం వెచ్చించి మీ వివరాలు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం.

నమస్కారం. మా ఊరొచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసినందుకు మీకు నా కృతజ్ఞతలు.

(డా॥ బి.వి.ఎన్. స్వామి, ఇ.నెం: 9-6-161, రాంనగర్, కరీంనగర్-505001, సెల్: 9247817732)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here