గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 25: మున్నంగి

0
3

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 25” వ్యాసంలో మున్నంగి లోని బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ భీమేశ్వరస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

[dropcap]ఈ[/dropcap]మారు మా యాత్రకి కొంచెం ఎక్కువ రోజులే కేటాయిద్దామనుకున్నాము. అందుకే తిరుగు ప్రయాణానికి రిజర్వు చేయించుకోకుండా వెళ్ళాము. అలా అలా, వెళ్ళే రోజు, వచ్చే రోజు కలుపుకుని 10 రోజులు, 44 ఊర్లు.. ఆలయాలు ఎన్నో.. ఎన్నెన్నో చూశాము. ఈమారు సికిందరాబాద్ నుంచి నేను, మా స్నేహితురాలు ఉమా మహేశ్వరి కలిసి 26-9-18 రాత్రి నరసాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో బయల్దేరి మర్నాడు ఉదయం 6 గం.లకల్లా విజయవాడలోని మా చెల్లెలు విమలగారింటికి చేరాం. ఆ రోజంతా ప్రయాణం బడలిక, మర్నాడు ప్రయాణానికి ఏర్పాట్లు, కబుర్లతో గడిపేశాము. హైదరాబాద్ లోనే నేను గూగుల్ చూసి చూడవలసిన ఊళ్ళన్నీ లిస్టు చేసి పెడితే, మావారు శ్రీ వెంకటేశ్వర్లుగారే ఏ రూట్‌లో వెళ్తే ఏమి చూడవచ్చో, ఎటునుంచి ఎటు వెళ్ళాలో మేప్‌లు దాదాపు ఖరారు చేసి ఇచ్చారు. రోజుకు అన్ని ఊళ్ళు చూడాలంటే ఈ మారు కారు తప్పనిసరి అనిపించింది. మా చెల్లెలుగారి అల్లుడు శ్రీ ప్రసాద్ కారు బుక్ చేసి మర్నాడు ఉదయం 5-30కల్లా ఇంటికి కారు వస్తుందని చెప్పారు.

అనుకున్నట్లే మర్నాడు (28-9-18) ఉదయం 5-30కల్లా కారు వచ్చింది. 5-45 కి ఇంటినుంచి నేను, ఉమ, మా చెల్లెలు విమల బయల్దేరి యస్.ఆర్.ఆర్. కాలేజ్ దగ్గర వున్న మా మేనగోడలు రాధికని ఎక్కించుకుని బయల్దేరాము మా మొదటి మజిలీ మున్నంగికి.

దుగ్గిరాల బ్రిడ్జ్ దాటిన తర్వాత ఎడమవైపు తిరిగి 10 కి.మీ. లు వెళ్ళాలి మున్నంగికి. రోడ్లు బాగున్నాయి. ఊరి పేర్లు తెలియజేస్తూ బోర్డులు కూడా వున్నాయి. ఏ ఇబ్బందీ లేకుండా ఉదయం 7-10కల్లా శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ భీమేశ్వరస్వామి వారి ఆలయం చేరాము.

ఊరు

కృష్ణానదీ తీరంలో వున్న ఈ ఊరికి అసలు పేరు మునికోటిపురం. ఇక్కడ కృష్ణానది ఒడ్డున అనేకమంది మునులు తపస్సు చేసుకుంటూ, అక్కడవున్న ఐదు శివలింగాలను భక్తితో సేవిస్తూ వుండేవారుట. వారెవరూ ప్రజలకు కనబడేవారు కాదు. ఒక నాటి రాత్రి ఆలస్యంగా ఇంటికి చేరుతున్న ఒక రైతు కృష్ణానది ఒడ్డున మునులను చూశాడుట. వారు అది గమనించి ఈ సంగతి ఎవరికీ చెప్పవద్దనీ, చెబితే అతని తల పగిలిపోతుందనీ చెప్పారుట. ఆ రైతు కూడా ప్రాణ భయంతో ఆ సంగతి ఎవరికీ చెప్పలేదు. కానీ అవసాన దశలో దానిని దాచలేక చెప్పాడుట. వెంటనే అతని తల పగిలి మృతి చెందాడు. తర్వాత మునులు ఎవరికీ కనబడలేదు. ఆ మునికోటి పురమే కాలక్రమేణా మున్నంగి అయిందంటారు.

ఆలయ చరిత్ర

ఈ ఆలయం పేరు శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీభీమేశ్వరాలయం. అయితే ఇలా అడిగితే తొందరగా ఎవరూ చెప్పలేరు. ఐదు గుళ్ళు అంటే వెంటనే ఎవరైనా చెబుతారు. ఈ ప్రహరీ గోడ లోపల ఐదు గుళ్ళు వుండటమే ఆ పేరు రావటానికి కారణం. అవి..

  1. గంగా పార్వతీ సమేత సకల కోటేశ్వర స్వామి
  2. గంగా భ్రమరాంబ సమేత శ్రీశైల మల్లికార్జున స్వామి
  3. గంగా అన్నపూర్ణా సమేత కాశీ విశ్వేశ్వర స్వామి
  4. గంగా బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి
  5. బాలా త్రిపురసుందరీ దేవి

వీటిలో ప్రధాన దైవాలు భీమేశ్వర స్వామి, బాలా త్రిపుర సుందరీ దేవి. పేర్లు ఎన్ని వున్నా దైవమొక్కటే. భక్తులు వారి వారి ఇష్టానుసారం ఆ భగవంతుణ్ణి అనేక పేర్లతో పిలుచుకుంటారు అన్న దానికి సాక్షీభూతంగా నిలుస్తుంది ఈ దేవాలయం. ముందు మండపం అన్నింటికీ కలిపి ఒకటే వుంది. శివ లింగాలన్నింటికీ ఇత్తడి నాగ ప్రతిమలున్నాయి. ఆలయ ప్రదక్షిణ చేస్తుంటే మా అందరినీ ఆకర్షించిన విశేషం… దాదాపు 4 అడుగుల శ్రీకృష్ణుని విగ్రహం.. నల్ల రాతితో చెక్కినది.. త్రి భంగిమలో వేణువు ఊదుతున్నట్లు.. అది కాదు విశేషం.. ఆ విగ్రహం మీద పడుతున్న పారిజాత పుష్పాలు.. ఆ చెట్టునీ, విగ్రహాన్నీ అలా కావాలని పెట్టారో, లేక అలా అనుసంధానమయ్యాయో తెలియలేదుగానీ కృష్ణుని మీద పారిజాతాలు పూజ చేస్తున్నట్లు అలా పడుతూండటం చాలా బాగుంది.

        

స్ధల పురాణం

అక్కడి పూజారిగారు, శ్రీ చలపతి గారు స్ధల పురాణం చెప్పారు. పుస్తకం కూడా ఇచ్చారు. దాని ప్రకారం పూర్వం ఇక్కడ మునులు తపస్సు చేసుకుంటున్నప్పుడు కొందరు మునులు భార్యలతో సహా ఇక్కడ నివసించి, తమ ఉపాసనా దైవాల పేర్లతో ద్రాక్షారామ భీమేశ్వరుడు, శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సకల కోటేశ్వరుడు, బాలా త్రిపుర సుందరీ అమ్మవార్లను ప్రతిష్ఠించి పూజ చేసుకున్నారు. ఆ ఋషీశ్వరుల పేర్లు దుర్గా భీమపాదులు, విజయా మల్లేశ్వరులు, విమలా విశ్వనాధులు, వాణీ కోటప్పలు, త్రిపుర సుందరీ గంగాధరులు అని చెప్తారు. తర్వాత కొంతకాలానికి ప్రకృతి వైపరీత్యాలలో ఆ దేవతామూర్తులు నీట మునిగాయి.

చాలా కాలం తర్వాత ఒక శ్రీమంతులు ఇంటి ఐదుగురు కుమారులు, వారి భార్యలు కాశీకి బయల్దేరి దోవలో క్షేత్రాలన్నీ దర్శించుకుంటూ ప్రయాణం సాగించారు. చిలుమూరు దగ్గరకొచ్చేసరికి అక్కడివారు మునికోటిపురం గురించి చెప్పి, ఇక్కడ కృష్ణానదీ స్నానం బహు పుణ్యదాయకమని చెప్పగా వారంతా ఇక్కడికి వచ్చి భక్తి తత్పరలతో కృష్ణానదిలో స్నానం చేశారు. ఆ తోడికోడళ్ళల్లో నలుగురికి అంతకు ముందెప్పుడో నీట మునిగిన నాలుగు శివలింగాలు దొరికాయి. అక్కడి పెద్దల సలహాతో వాటిని అక్కడ ప్రతిష్ఠించి పూజలు చేశారు. ఐదవ కోడలుకి ఏమీ దొరకక పోవటంతో ఆవిడ తాను చాలా పాపాత్మురాలిననీ, అందుకే తనకేమీ లభించలేదని దుఃఖించింది. నాలుగు లింగాలను ప్రతిష్ఠింప చేసిన ముని పుంగవులు ఆవిడని దుఃఖించవద్దని, స్వామి అభిషేకాదులకు అక్కడ బావి తవ్వించమని ఆదేశించగా అలా చేసి తరించింది ఆ సాధ్వి.

అప్పటినుంచి ఈ క్షేత్రంలో నాలుగు సుప్రసిధ్ధ శైవ క్షేత్రాలలో వున్న పేర్లతో లింగాలు వుండటంవల్ల ఆ క్షేత్రాల మహిమంతా ఇక్కడ మూర్తీభవించి వుంటుందని తెలియజేశారు.

తర్వాత కాలంలో శ్రీ వాసిరెడ్డి వెంకటాద్రినాయుడుగారు కొందరు బందిపోటు దొంగలను చంపించి ఆ పాప ప్రక్షాళన కోసం 101 ఆలయాలను నిర్మించటమో, పునర్నిర్మించటమో చేశారు. ఆయన ప్రతి శుక్రవారం మేనాలో ఈ దోవగుండా చిలుమూరు వెళ్ళేవారుట. ఇక్కడివారు ఆయనకి ఈ దేవాలయం గురించి విన్నవించగా ఆయన ఇక్కడి ఆలయాన్ని విస్తరింపచేశారు. 1959లో మకర తోరణం, శివ లింగాలన్నింటికీ ఇత్తడి నాగాభరణాలను చేయించారు తాతిరెడ్డి అనే ఒక భక్తుడు.

అమ్మ బాలా త్రిపుర సుందరీ దేవి నాలుగు అడుగుల ఎత్తున్న నల్లరాతి మూర్తి. ప్రశాంత వదనంతో భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలువు తీరింది.

       

ఆలయ సందర్శన అయ్యేసరికి ఉదయం 7-45కి బయల్దేరి దోవలో ఒక చిన్న హోటల్‌లో ఇడ్లీ తిన్నాము. చాలా రుచిగా వుంది. హోటల్ చిన్నదయినా శుభ్రంగా వుంది. వీటన్నింటికన్నా విశేషమేమిటంటే ఆ హోటల్ యజమానికి ఎలా తెలిసిందో మేము వచ్చిన పని కారు దగ్గరకు వచ్చి (హోటల్ చిన్నగా వుండటంతో మేము కారులోనే కూర్చుని తిన్నాము) ఆ ఆలయం 1500 సంవత్సరాల క్రితందని, చాలా మహిమకలదని, వివరాలు చెప్పారు. వారి ఊరి గురించి, అందులో ఆలయం గురించి తెలియజెయ్యాలని ఆయన తీసుకున్న శ్రమకి ముచ్చటేసింది. ప్రతివాళ్ళూ వాళ్ళ ఊరి గురించి ఇలా ఆలోచిస్తే…. ఎంత బాగుంటుందో కదా. పల్లెటూళ్ళల్లో వార్తలు ఎంత తొందరగా వ్యాపిస్తాయో అనుకుంటూ, ఆయనకి ధన్యవాదాలు తెలిపి ముందుకు సాగాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here