[box type=’note’ fontsize=’16’] “గుర్తు, మతిమరుపు బ్రతుకు పార్శ్వానికి రెండు అంచులు. నీటిపై కనిపించే ఆవృతాల ఆయువెంత? ఆ క్షణమె మనను మమైకాన ఉంచేది. ఏ గురుతయినా జీవనయానపు చివరంచున మిగిలితే అదే గతించని గతం.” రచన చావా శివకోటి. [/box]
[dropcap]రో[/dropcap]జూ నేను స్టూడియోకు, జయ స్కూలుకు, అప్పుడప్పుడు ఆసుపత్రికి వెళుతూనే ఉన్నాము.
వినాయక చవితి దగ్గరకు వచ్చింది. మహారాష్ట్రలో అంతా చాలా గొప్పగా చేస్తారు ఈ ఉత్సవాన్ని. సాంప్రదాయపు నాటకాలను ప్రదర్శిస్తూ… నృత్యాలు చేస్తూ… గులాలు చల్లుకుంటూ, భంగు తాగుతూ, పెద్ద పెద్ద గణేష్ విగ్రహాలకు పూజ చేసి ‘నిమజ్జనం’ నాడు అట్టహాసంగా ఊరేగింపులకు బయలుదేరి సముద్రాన ఆనందోత్సవాల మధ్య కలుపుతారు. ఎక్కడ విన్నా గణపతి బొప్పా మోరియా… మంగళ మూర్తి గోవిందా… అన్న భజన వినిపిస్తుంది. ఈ గణేష్ పండుగకు ఇంత ప్రాముఖ్యత సంతరింపచేసిన వ్యక్తి శ్రీ లోకమాన్య బాల గంగాధర తిలక్ మహాశయుడు. తెల్ల దొరలకు వ్యతిరేకంగా వినాయక ఉత్సవాలు పేరిట రాజకీయ చైతన్యం కలిగించారట. ఆయన పోయిన దాని విశిష్టత మాత్రం పెరుగుతూనే ఉంది. అందరితోపాటు పండగ మేము జరుపుకున్నాము. మన పద్ధతి ప్రకారం కుడుములూ, ఉండ్రాళ్ళూ చేసుకుని, వడపప్పు గారెలతో పాటు పానకం చేసుకొని దైవ సన్నిధిన ఉంచి మనసారా నమస్కరించుకున్నాము.
ఆసాయంత్రం సినిమాకెళదామన్నది జయ. సరేనన్నాను. శ్రీ థియోటర్‌లో హాస్య రస ప్రధానమయిన చిత్రం ఉంటే వెళ్ళాము. నవ్వి నవ్వి పొట్ట పట్టుకోవాల్సి వచ్చింది. ఎంత విషాద దృశ్యాన్ని అయినా, సీరియస్ సీన్ అయినా, అంత హాస్యంగా చెప్పడం ఒక చార్లీ చాప్లిన్‌కే తెలుసు. ఆయన సినిమా సమాజం నుంచి పుట్టి సమాజ చిత్రాన్ని ఆవిష్కరిస్తుంది. సినిమా చూసి సీదా ఇంటికి రాలేదు. శివాజీ పార్క్‌కు వెళ్ళాము, అక్కడ పచ్చటి గడ్డిపై కూర్చొని దాదాపు గంట గడిపాము. సముద్రపు ఒడ్డుకు వచ్చి ఎగసి పడుతున్న అలలను చూస్తూ చాలాసేపు ఉన్నాము. నెమ్మదిగా మా ఇంటికి చేరేసరికి రాత్రి పదకొండు దాటింది. కాళ్ళు చేతులూ కడుక్కుని జయ ఇష్టంగా పండగ స్పెషల్ అని చేసిన ఖీర్ రుచి చూసాము. ఒక్క పొట్లం వేసుకుని వరండాలని వచ్చి కూర్చున్నాము. భుక్తాయాసం తీరాక లోనకి వెళ్ళొచ్చు అనుకుని…. మాటల సందర్భంగా “ఈ పండుగకు నాకొక ప్రజంట్ ఇవ్వాలి” అంది జయ. తల ఊపాను ఆనందంగా. కుర్చీ నుంచి లేచి జయ ముందు కూర్చుని ఒళ్ళో తల పెట్టుకుని “మరి నాకేమిస్తావ్” అన్నాను.
నన్ను నేను ఇచ్చుకున్నాను అన్నట్టు చూసి నవ్వింది. ఆ నవ్వు నిజంగా అనితర సాధ్యమయ్యింది. నన్ను అనంతానంతానికి లాక్కెళ్ళింది. ఆ అందాన్ని దేనితోనూ పోల్చలేము. అట్టాగే చూస్తూ ఉన్నాను. నవ్వడం ఆపాకా ఆ పెదవులను ముద్దెట్టుకోవాలనిపించింది. హటాత్తుగా ముద్దెట్టుకున్నాను కూడా. మెలుకువగా తప్పించుకుందామని చూసింది. కానీ కుదరలేదు. అయితే నాకది చాలదనిపించింది. మళ్ళా బలిమిన గట్టిగా ఒడికి జరుపుకుని తనివితీరా ముద్దిచ్చాను. కొత్త పెళ్లి కూతురులా అయ్యింది జయ. జయ సిగ్గుపడినప్పుడు చూడాలి. రెండు కళ్ళు చాలవు.
సిగ్గే సిగ్గుతో ఉబ్బి తబ్బిబ్బవుతుంది. ఆగలేక మళ్ళా దగ్గరకు తీసుకుని గుండెకు హత్తుకున్నాను. కళ్ళు మూసుకుని నాకింకా చేరువయ్యింది. అలానే అమాంతం లేపి లోనికి నడిచాను. నా జట్టులోనికి వెళ్ళు పోనిచ్చి సుతారంగా కదుపుతూ అర్ధ నిమీల నేత్రాలతో నన్ను చూసింది. నేనేమయి పోయానో – నాకే తెలియదు. అలాంటి సమయాన “అబ్బా… శివా” అని కడుపు పట్టుకుని మూలిగింది. మెడన మొదలయిన నొప్పి పొత్తి కడుపున ఆగుతున్నట్టుంది. శ్వాస కూడా కష్టంగా పీలుస్తునట్టుంది. బాధతో చేతులూ కాళ్ళు కదిపింది. నాకు ఒళ్ళంతా మంచులో పడేసినట్టు అయ్యింది.
“జయా…. జయా” అని ఎంత ఇదిగా పలకరించినా బాధతో విలవిలలాడింది తప్ప నావైపు చూడలేదు. అసలు కళ్ళే తెరవలేకపోయింది. ఇక లాభం లేదని ఆ వీధిన ఉన్న డాక్టర్ దగ్గరకు పరిగెత్తాను. డాక్టర్ వచ్చి పరిస్థితి గమనించి, వెంటనే ఆసుపత్రిన చేర్చమన్నాడు. చేర్చాను. పైకి వచ్చాక రెండు గంటలదాకా భయంగానే అనిపించింది. బాధ తట్టుకొనలేక విలవిలలాడుతూనే ఉంది. ఆనక నెమ్మదిగా నావైపు చూసింది. కాస్త బాధ నెమ్మదించినట్టు ఉంది. నన్ను చూసి నవ్వే ప్రయత్నం చేసింది. బాధ మిళితముయ్యి, నిస్సారంగా ఉందా నవ్వు. నేను ఆగబట్టలేక దగ్గరకు వెళ్ళాను. నుదుటన ముద్దెట్టుకున్నాను. డాక్టర్ వచ్చి మళ్ళీ చూసి ‘వారం రోజుల్లో మాములుగా అవ్వుద్ద’న్నాడు. జయ పెదాలు ఆరిపోయినట్టు అనిపిస్తే “మంచినీళ్ళు ఇవ్వనా” అని అడిగాను, కళ్ళు ఒకసారి తెరిచి మళ్ళా మూసుకుంది. కానీ చూపు అదోలా మారిపోతూ కనిపించింది. భయమయ్యి డాక్టర్ దగ్గరకు పరిగెత్తాను. వచ్చాడు. చూసాడు. నేను జయను ఒళ్ళోకి తీసుకున్నాను. డాక్టర్ చూస్తున్నాడు. జయ నావైపే ఆర్తిగా చూస్తున్నది. కళ్ళెంట ఒక చుక్క నీరు జారింది. కానీ రెప్ప వాల్చిన జాడ లేదు. ఒళ్ళు చల్లబడుతున్నట్టు అనిపించింది నాకు. డాక్టర్‌ని మళ్ళీ చూడమని అరిచాను. చూసాడు, జయ చేతిని పట్టుకుని చూసి, “షీ ఈస్ నో మోర్” అని చేయి వదిలిపెట్టాడు. అసలెప్పుడు ప్రాణం పోయిందో అర్థం కాలేదు. జయ…. జయ…. అని పెద్దగా ఏడ్చాను.
ఇహ జయ లేదు. ఈ భావనే నన్ను నన్నుగా నిలవనీయలేదు.
అసలేమిటి మనిషి. అనుకోకుండా జీవితంలో కలిసి, హఠాత్తుగా అదృశ్యమయిపోయింది. మన ఊహకు అందనిదేదో ఉందనిపించి ఒంటరిగా కూర్చొని ఏడ్చాను, మూడు నాలుగు రోజులు తిండి తిప్పలు లేక పడి ఉన్నాను. తల పూర్తిగా మొద్దుబారింది. కనీసం పలకరించే దిక్కులేదు. కన్ను మూసినా తెరిచినా జయే. ఇంట్లో నుంచి వస్తునట్టు… లోపలకి పిలిచినట్టు… స్కూల్‌కి వెళుతున్నట్టు, వరండాలో తిరుగుతున్నట్టు….
ఈ పరిస్థితి ముదిరి పిచ్చి స్థాయికి చేరింది నా వ్యవహారం. అప్పటికి వారం రోజులు గడిచింది. ఆవేళ పొద్దుటే తలారా స్నానం చేసి, కాఫీ కాసుకుని తాగి, వరండాలోకి వచ్చి కుర్చీలో కూలబడ్డాను. జయ బయటినుంచి వస్తూ కనిపించింది. కుర్చీ నుంచి లేవబోతూ కింద జారి పడ్డాను. లేస్తూ మళ్ళా చూసాను. ఎవరూ లేరు.
కానీ ఆ ఇంటి ప్రతి భాగాన జయ ముద్ర కనిపిస్తూనే ఉంది. ఏం చేయాలో, ఎలా నిగ్రహించుకోవాలో తెలియలేదు. ఇంకా అక్కడే ఉంటే మాత్రం పిచ్చెక్కడం ఖాయం అనిపించింది. కానీ భయమని అనిపించలేదు. ఇల్లు ఖాళీ చేయాలని అనిపించింది. ఆ ఆలోచన రావడమే ఆలస్యం ఇంట్లో సామానంతా సదిరి సెకండ్ హాండ్ సామాన్లు అమ్మే వాడికి చూపి, అమ్మేసాను. ఇరవై వేల రూపాయిల చిల్లర వచ్చినవి. నేనుగా నా ఆలోచనలను ఎటు మలిపినా జయ మాత్రం నన్ను వదలడంలేదు. అసలు కొంత కాలం బొంబాయి వదిలి పెళితే… అనిపించింది. ఇలా ఆలోచనలో ఉండగా కుంటి ముసలయ్య కనిపిచ్చాడు.
“బాబూజీ ఠీక్ తో హైనా?”
తల ఊపాను అదోలా చూస్తూ.
“ఆప్కా సాథీ..?” అన్నాడు.
“క్యోం?” అన్నాను అసహనంగా…
అతని కళ్ళలో మాత్రం తడి కనిపించింది. నన్నే చూస్తూ నిల్చుని “ఏక్ బార్ బిటియాకో దేఖ్ కే జావుంగా”
నేను మాట్లాడలేదు.
కొద్దిసేపు చూసి “బాబూజీ ఏక్ బార్ బిటియాకో బులావ్, దేఖ్‌నే దోనా” అన్నాడు బ్రతిమాలుతున్నట్టు.
నేను మాట్లాడలేదు. అట్టాగే నిలుచుంటే చూడలేక “జయ ఇప్పుడు లేదు. చనిపోయింది” అన్నాను పెద్దగా.
నిలుచున్నవాడల్లా అక్కడే చతికిలబడిపోయాడు. ఆగకుండా కన్నీరు. అతన్ని డాక్టర్ దగ్గరకు చేర్చి మళ్ళా వెళ్ళలేదు. వెంటనే స్టేషన్‌కి వచ్చాను. తిరుగు ప్రయాణంలో మొదటి మజిలీ పూణా. అక్కడ ఉండలేను అనిపించింది. జయ జ్ఞాపకాల వలయంలో ఎక్కడా స్థిరంగా ఉండలేనేమో. జయను మరచిపోవాలని మరచిపోలేకపోతున్నాను. అయినా నా ప్రయాణం ఆగలేదు. బస్సున, రైలున, కాలినడకన తిరుగుతూనే ఉన్నాను. అనేక ఆలయాలు దర్శించాను. వాటిలోనే అనేక రాత్రి పడుకున్నాను, ధర్మోపన్యాసాలు విన్నాను. రెండు నెలలు దాటుతుండగా కొంత ధ్యాస మారింది. అయినా స్థిమితం రాలేదు. అజంతా ఎల్లోరాలు తిరిగాను. అక్కడ బుద్ధుడి ముందు కూర్చున్నాక, అక్కడ పడుకున్నప్పుడు ‘ఇంటికెళితే’ అనిపించింది. ఆ తెల్లవారి అనాలోచితంగా ఇంటికి ఉత్తరం రాసి పోస్ట్ చేశాను. ఎల్లోరా నేను చూసిన చివరి మజిలీ. రంగుల కలయికలోని అద్భుతమయిన రీతులు చిత్ర భంగిమలలో నిత్య నూతనంగా కనిపించింది. మాటలలో చెప్పలేని, ఊహలలో మెదలని అనేక సంగతులు ఈ చిత్రాలు చెప్పినవి. ఎంతటివారయినా ఆ దృశ్య కావ్యాన్ని చూస్తున్నప్పుడు అన్నీ మరిచి పోవాల్సిందే.
అక్కడ నుంచి బయలుదేరాను, హైదరాబాద్ చేరాను. సరిగ్గా పదహారు, పదిహేడు సంవత్సరాల తరువాత. చాలా మార్పులు కనిపించినవి. పిచ్చివాడిలా ఆటో తీసుకుని, రిక్షా సవారి వేసుకుని హైదరాబాద్ అంతా తిరిగాను. అకస్మాత్తుగా కింగ్ కోటి వైపు వెళ్లాను, దాన్ని గురించి అప్పుడొక స్నేహితుడు చెప్పగా విన్నది గుర్తుకు వచ్చింది. ఇది నిజామ్ కట్టించింది కాదట, కమల్ ఖాన్ అనే చిన్న నవాబు తన నివాసం కోసం కట్టుకున్నాడట. ఒకానొక సందర్బాన నిజామ్‌ను కమల్ ఖాన్ విందుకు ఆహ్వానించాడట. ఆయన వంది మాగధులతో విచ్చేసి ప్యాలెస్ అంతా చూసాక ‘చాలా బాగుంద’ని ముచ్చట పడ్డాడట. అప్పటి రాచరికపు తీరు ప్రకారం సర్వాధికారి అయిన నవాబు ముచ్చట పడితే దాన్ని గమనించిన యజమాని, “ప్రభూ ఇది తమరిదే” అన్నాడట. అలా అనటం ఆనాటి మర్యాద కూడా. “అవును మాదే” అని సంతుష్టుడయిన నవాబు దాని ఖరీదును చెల్లించి తన నివాసాన్ని ఈ ప్యాలెస్‌కు మార్చాడట. అయితే ఈ భవనానికి ఉన్న కిటికీలపై, దర్వాజాలపై, దాని అసలు యజమాని కమల్ ఖాన్ తాలూకు పొడి అక్షరాలు చెక్కి ఉన్నాయట. దాన్నేం చేయాలో అర్థం కాక కింగ్ కోటి (కె.కె.) గా పిలవటం ప్రారంభించారట, కింగ్ అనేది ఇంగ్లీష్ పదం, కోటి అనేది ఉర్దూ పదం, అయినా మార్పు చేయలేక కింగ్ కోటి గానే పిలవబడిందట.
ఛ…. ఛ… ఏమిటి ఆలోచనలు. ఇంటికి వెంటనే వెళ్లిపోదామనిపించి రైల్వే స్టేషన్‌కి నడిచాను.
నిష్రియావాదిగా నడుస్తున్న మనిషికి కర్తవ్యం బోధించి ముందుకు నడిపించేది భగవద్గీత అని ఒకసారి జయ అన్నది. “అసలేమిటి నువ్వు? పలకరించే తీరున, చూసే చూపున, గౌరవం ఆత్మీయత తప్పితే ఏమీ కనిపించదే? ఒక్కోసారి ఏ రాతి బొమ్మనో చూసినట్టు చూస్తావ్. అయినా నీ చూపున ధైర్యం, నిశ్చింత, భద్రతా భావం ఉంటుంది. అందుకే…” అని మాట్లాడలేక పూర్తిగా దగ్గరయ్యింది ఆనాడు.
జయ గుర్తులోకొస్తే చాలు, కళ్ళు తడవుతున్నాయి. నాన్న గుర్తులోకొచ్చాడు. చివరికి పిచ్చిది నా ఇల్లాలు కూడా. ప్రేమకు ప్రతి రూపుగా నా మనస్సున స్థిరపడింది మాత్రం నన్ను ప్రేమించిన సత్యే.
ఇంటికి చేరాను. నాన్న కనిపించాడు. ఆయన కళ్ళనిండా నీరు. పాదాలంటుకుని దణ్ణం పెట్టాను. లేపి ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు. నా భార్య చాటునుంచి అపురూపంగా చూడటం గమనించాను.
ఊరంతా వచ్చారు.
తమ్ముడు ఇంటి వద్ద లేడు.
నన్నో వింత జంతువును చూసినట్టు చూసి వెళ్ళారు. కొందరు పలకరించారు. కొందరు నిష్ఠూరాలాడారు. కొందరు ఎద్దేవా చేసుకుంటూ వెళ్ళారు. అంతా వెళ్ళాక నెమ్మదిగా స్నానం పూర్తి చేసాను. బోజనానికి పిలిచారు. వెళ్లి కూర్చున్నాను. నా భార్యే వచ్చి వడ్డించింది. ఆవిడ కళ్ళలోకి చూసే ప్రయత్నం అరకొరగా చేసాను. ఆమె పూర్తిగా కనిపించింది. అంతు లేని మార్పు.
ఆ స్థితిన కూడా సిగ్గుతో చెక్కిళ్ళు ఎర్రబడినవి. నేను భోజనం అయ్యిందని అనిపించుకున్నాను.
“అమ్మ రమ్మంటుంది” అన్నది అని ఓ అమ్మాయి. నా చేయి పట్టుకుని నడుస్తూ నా భార్యను చేర్చింది. నేను ఇల్లు వదిలినప్పుడు నా భార్య గర్భవతి అని… ప్రస్తుతం నాకు చందన అనే ఒక పాప ఉందని తెలిసింది.
మా తమ్ముడికి భిలాయిలో ఉద్యోగం దొరికింది. కాలం ప్రశాంతంగానే గడిచిపోతుంది. మా నాన్నకు తమ్ముడి పెళ్ళి గురించి ఆలోచనలు ముసురుతున్నవి. చందనకు నాకు మధ్య అనుబంధం రోజు రోజుకు పెరగసాగింది. దాని తలనిండా అనేక ప్రశ్నలు. నన్ను ఒంటి కాలిమీద నిలపెట్టి చాలా తికమక పెట్టేస్తున్నది. సమాదానం కొంచం ఆలస్యమయినా, తడబాటు కనిపించినా ఇక దానిని పట్టుకోవడం కష్టమవుతున్నది. అది చదువునుంచి ఇంటికి వస్తే చాలు… అప్పటిదాకా నిశ్శబ్దంలో జోగుతున్న లకంత ఇల్లు ఆనంద సందోహంలో నిండిపోతుంది.
ఈ మధ్యనే చుక్కావు ఈనింది. అన్ని లక్షణాలు ఉన్న దూడను పెట్టింది. చందన ఆ దూడతో తిరగడం, గెంతడం, దానికి పాలు పట్టడం, వగైరా పనులలో పడి కొంత అల్లరి సద్దుమణిగింది.
చాలా గడుసు మొగుడయితే కానీ దీనికి ముకుతాడు వేయడం కష్టం అని నాకనిపించింది ఒకసారి. ఆ వెంటనే నవ్వు వచ్చింది.
ఇక మా ఆవిడ. నేను ఇక్కడికి రాకముందు ఎలా ఉండేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మౌన వ్రతం వీడినా… అంతగా ఉషారు అనిపించకపోయినా ఎంతో కొంత తృప్తిగానే కనిపిస్తున్నది. నా రాక చాలా ఆలస్యమయినా… మొత్తం కుటుంబానికి సంతోషాన్నే ఇచ్చింది. ఆ భావనే నన్ను ఇక్కడ నిలిచేలా చేసింది.
నాకు ఈ రకమయిన జీవన క్రమం పైన అంతగా నమ్మకం లేకున్నా… నావాళ్ళు నలుగురూ నా రాకతో సంతోషంగా ఉన్నారన్న భావన నిలకడనిచ్చింది. ముఖ్యంగా చందనను వదిలి ఎక్కడికీ వెళ్ళలేకపోతున్నాను. తమ్ముడి నించి ఉత్తరాలు వస్తూనే ఉన్నాయి.
నాన్నలో మాత్రం మార్పు లేదు. నాన్నగారి స్నేహితుడి కూతుర్ని తమ్ముడికిచ్చి పెళ్ళిచేయాలని ఆయన సంకల్పం. సందర్భవశాత్తు ఒకనాడు అన్నాడు కూడా “రవి పెళ్లి ఆ పిల్లతో జరిపితే ఎలా ఉంటుందంటావురా” అని.
“నాన్నగారూ వాడి ఇష్టాయిష్టాలను తెలుసుకున్నాకా మనం ముందుకు నడవడాం సబబుగా ఉంటుందేమో?” అన్నాను.
“నేను వాని తండ్రిని. వాడికి క్షేమం కానీ దాని గురించి నేను ఆలోచన చేయగలనట్రా” అన్నాడు.
“ఏదేమైనా ఇప్పటి పరిస్థితిని గమనించి వాళ్ళ అభిప్రాయాలను తెలుసుకొని తదనుగుణంగా నడుచుకోవడం అందరికీ శ్రేయస్కరం కదా” అని అన్నాను.
అయితే నాన్న రవికి తెలియకుండానే ఆయన మిత్రుడికి మాట ఇవ్వడం మూలాన తొక్కిసలాటలో పడ్డాడు. రానురాను ఆ మాట నిలబెట్టుకోవడం ఎలా అన్న ఆలోచన జోరందుకుంది. అదే పట్టుదలగా మారింది.
నాలుగైదు నెలలు గడిచిపోయినవి. చివరకు నాన్న అతని స్నేహితుని కూతురును చూసి రమ్మనమని తమ్ముడు రవిని ఆదేశించాడు కూడా.
రవేమో “నాకు ఎక్కడికి వెళ్లాలని లేదు. మీరు తప్పదు అంటే అక్కడకు వెళ్లి వస్తాను, పెళ్లిచూపులుగా మాత్రం చూడను. అది నా నుంచి కాదు” అని కట్టె విరిచినట్టుగా సమాధానం రాశాడు.
ఈ ఉత్తరం నాన్నను బాధించింది. అయినా రవి ఇంటికి రాగానే ఏదో ఒకలాగా ఒప్పించగలననే భావనలో ఉన్నారు.
రవి విముఖంగా కనిపిస్తున్నా నాన్న పట్టుదలలో సడలింపు రాలేదు. పరిస్థితి రోజు రోజుకు మారుతుండటాన్ని గమనించి ఒకనాడు కూర్చోపెట్టి నాన్నగారితో మాట్లాను.
“రవిని సంప్రదించనిది మనం ఎటు అడుగు కదిపినా మంచిది కాదు” అని వివరించాను.
ఏం చేయదలిచాడో మాత్రం చెప్పలేదు.
ఒకనాడు నేను పొలం నుంచి రాగానే చందన మంచి నీళ్ళిచ్చి బాబాయి ఉత్తరం రాసాడు అని ఒక కవరు నా చేతికి ఇచ్చింది. తీసుకుని విప్పాను. రాత అర్థమయింది.
“అన్నయ్యకు రవి రాయునది. క్షేమం. నాన్నా వదినా… పావా… అందరూ బాగున్నారు కదా.
అన్నయ్యా.. నీకు ఇలా ఉత్తరం రాయాల్సి వస్తుందని ఊహించలేదు. నాన్నగారు రాసిన ఉత్తరంలో నన్ను ఆదేశించిన ప్రకారం ఆయన స్నేహితుని ఇంటికి వెళ్లాను. ఇప్పుడు కాదు ఆయన ఉత్తరం రాసిన వెంటనే. ఈ విషయం మీకు తెలియదేమో కానీ నాన్నకు తెలుసు. నేనక్కడకి వెళ్ళిన సంగతి అయన గారి స్నేహితుడు తెలిపి ఉంటాడు. నేను వెళ్లానని చెప్పాను కదా. వెళ్లి వారి అమ్మాయిని చూసాను. బాగానే ఉన్నది. చదువుకున్నది. లోకావలోకనం తెలిసిన పిల్ల కూడా, అన్నింటికంటే నాకు ఆవిడలో నచ్చిన గుణమేమిటంటే… చాలా సంస్కారవంతంగా ప్రవర్తించడం. ఇది మనకు చాలా చోట్ల కనిపించనిది.. అయితే నేను వెళ్ళింది పెళ్లి చూపులకు కదా, పెళ్ళి చేసుకునేందుకు మాత్రం నాకు ఇష్టంగా అనిపించలేదు. పిల్ల అందంగా ఉండి, చదువూ సంస్కారం ఉంది. పైగా నాన్నగారి స్నేహితుడి కూతురయి ఉండి, నాన్న కోరినంత, నేను ఉహించనంత పైకం కట్నంగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా నేను కాదంటున్నాను.
ఎందుకో తెలుసా అన్నయ్యా..? నేను నా జీవితంలో ఆ పిల్ల ఇప్పుడున్న స్థాయికి ఎదగాలన్నా… నా ఉద్యోగ భృతి, దానికి వచ్చే లంచం కూడా సరిపోదు. ఇంతెందుకు నా రెండు మూడు నెలల జీతం కలిపినా ఆవిడకు నేను కనిపించినప్పుడు కట్టుకున్న చీర ఖరీదు కంటే తక్కువే ఉంటుంది. ఆ పిల్లకు ఇంట్లో కాలు సరాసరి కారులో పెట్టగల స్థితి. కారులోంచి తిరిగి తివాచిపైనే కాలు పెడుతుంది. ఇక ఆ పిల్ల వెంట ఎప్పుడూ చెలికత్తె లాంటి మనిషి. ఆ పిల్ల ఏం పురమాయిస్తుందో అని దాని వెంటనే చేసేందుకు ఎదురుచూస్తూ ఉంటుంది. నేను ఇలాంటి అంతస్తుకు ఎన్ని రోజుల్లో చేరగలనో చెప్పు.
నాన్నగారికి ఆయన ఎంత బాల్యస్నేహితుడయినా….. వారికి నన్ను ఎంతగా అల్లుడిని చేసుకోవాలని ఉన్నా…. నేనేమిటో నేను ఆలోచించుకోవాలి.
మనిషన్న వాడు తనకున్న స్థితిని బట్టి కోరికను అదుపు చేసుకోగలగాలి. నా భావన అది.
మనకున్న భావం రూపాన్ని ఆశ్రయించి మిగులుతుంది. ఆ రూపానికి ఒక పేరు. అందుకే చంద్రున్ని కాలస్వరూపుడని అంటారు. శశీ అంటే చంద్రుడు. శశము అంటే కుందేలు. అది గెంతుతూ నడుస్తుంది. కృష్ణ శుక్ల పక్షాలను గంట్లు పెడుతూ….. చంద్రుని నడక ఉంటుంది. అలానే మనిషి బ్రతుకు అనేక ఒడిదొడుకుల సమహారం.
అన్నయ్యా… నేను చూసిన అమ్మాయి మంచిది. నడవడిక మంచిది. నేను కనిపించిన దగ్గరనుంచి నాతోనే ఉంది. ఎంత సాదరంగా చూసిందని. ఎక్కడా అహం కానీ, దర్పం కానీ, కనిపించనీయలేదు. ఇంట్లో కనిపిస్తున్న పియానోని చూసి “మీకు సంగీతం వచ్చా? పాడుతారా?” అని అడిగాను. మంద్రంగా తల ఊపి ఒక జానపద గేయాన్ని పియానోపై వాయిస్తూ పాడింది. గొంతు బాగానే ఉంది. అంతే కొద్ది పరిచయంలో అరమరికలు లేకుండా మెలిగింది. పరిమితితో ఉన్న చనువుతో నా వెంట తిరుగాడింది. స్నేహితుడిలా నాకేం కావాలో చూస్తూ చాలా కబుర్లు చెప్పింది. నిజం చెప్పాలంటే నేనక్కడా ఉన్న రెండు రోజులు రెండు క్షణాల్లా గడిచిపోయినవి. అక్కడ సెలవు తీసుకుని భిలాయి వచ్చాను.
వచ్చాక సమీక్ష చేసుకున్నాను. అంతా ప్లస్సే అనిపించింది. కానీ ఏదో నిషాలా ఉంది. ఆలోచించిన మీదట నిషా తాత్కాలికంగా ఉంటేనే అందం. మజా.
ఇది శాశ్వతం కాకూడదు. తాగుబోతులా అవుతాం. అప్పుడు తాగుడున ఉన్న గ్రేస్ పోతుంది.
ఒక విషయం చెపుతాను. రచయితగా చలం అంటే నాకిష్టం. ఆయన మ్యూజింగ్స్ చదివి ఫ్లాట్ అయ్యాను. ఎంత సంఘర్షణ. ఆర్తి. భౌతికత నుండి పైకి ఎదుగుదల కనిపిస్తుంది. దాన్నందుకోవాలని మనమూ పరుగులు తీస్తాం.
జరిగిన విచారం ఏమిటంటే ఆయనను అర్ధం చేసుకోనలేక వట్టి శృంగార రచయితగా మిగిల్చాం. గొప్ప సమాజం కావాలని, మంచిని మిగిల్చిన యోగిగా, మునిగా, స్రష్టగా మనసున నిలుపుకోలేక పోయాం.
ఆ స్థాయి మనకు లేదు. అది మరునిముషాన గతమయి, అనుభవపు అనుభూతిన మిగులతది. స్థూలంగా చెప్పాలంటే మనిషి బ్రతుకు అనుభవాల కుప్ప. అనుభూతుల సమాహారం కాదు. నాలాంటి మామూలు మనిషికి అది తగదు అనిపించింది ఆలోచన మేర. అంచేత నేనా పిల్లకు తగను అన్న నిర్ణయానికి వచ్చాను. వారందరికీ ఇష్టమయినాక నీకేం అని నాన్న అడగవచ్చు. తెలిసిన హితులూ అడుగుతారు.
నాన్నకు ఆయనకు ఉన్న స్నేహాన్ని పురస్కరించుకుని మాకు వివాహం జరిపించాలని ప్రయత్నంచవచ్చు. నేను అందుకు సిద్ధంగా లేను. ఈ ఎండల్లో నేను ఇంటికి రావడం లేదు. వస్తే ఈ పెళ్లి విషయాన్ని బాగా ఒత్తిడి తెస్తాడు. ఆయన ఎదురుగా నేను మాటాడలేను.
ఇదంతా ఎందుకని ఓ నిర్ణయానికి వచ్చి నాకు నచ్చిన నాకు సరిజోడు అయిన ‘ఉమ’ను పెళ్ళాడాను, రిజిస్ట్రార్ ఆఫీస్‌లో, నలుగురు స్నేహితుల మద్య.”
ఈ మాటలు చదివాక నాకు చెమటలు పోశాయి. ‘వీడికి తొందరపాటు ఎక్కువే’ అనిపించింది. నాన్నగారికి ఈ విషయాన్ని చెప్పడం ఎలా? ఆయన ఎలా దీనిని స్వీకరించగలడు. వీడి చేత కూడా మోసపోయాను అనే భావన ఆయనకు కలిగితే…?
అంతా గజిబిజిగా అనిపించింది. కూర్చున్న చోటునుంచి లేచాను. తిరిగి ఉత్తరంలోకి తల దూర్చాను. అక్షరాలు కదులుతున్నవి.
“అన్నయ్యా… నీకు ఇది నా తొందరపాటు గానే అనిపించవచ్చు. కానీ ఈ తొందరపాటు వెనక నా భయం నాకుంది. నీకు కూడా చెప్పకుండా పెళ్లి చేసుకోవలసి వచ్చింది. నన్ను క్షమించు. నువ్వైనా ఉంటే బాగు అని మనస్సు పీకింది. కానీ ఏం చేయను?
పెద్దలు, హితులు, వధూవరులని పదికాలాలపాటు సుఖసంతోషాలతో జీవించాలని దీవెనలిస్తారు.
నా భావన ప్రకారం దీనికంతటికి కారణం నాన్న మొండి వైఖరే. ఇంతెందుకు ఒక దశన నిన్ను కూడా నా మనస్సు శంకించింది. ‘నువ్వు చేస్తున్నది మంచిది కాదురా అంటావేమో’ అని. అందుకే మనస్సుని రాయిని చేసుకున్నాను.
ఇహ పోతే ఈ పెళ్లి నాన్నకు చాలా మనఃక్లేశాన్ని కలిగిస్తుంది. వృద్ధాప్యంలో ఆయన్ని సుఖపెట్టాల్సిన సమయాన ఇలా చేయాల్సి రావడం దురదృష్టం.
ఇహ నేను పెళ్ళాడిన ‘ఉమ’ గురించి చెపుతాను.
నాతో పాటు సహా ఉద్యోగి. నేను ప్రేమించే దానికంటే నన్ను పూర్తిగా అర్థం చేసుకుని నన్ను ప్రేమిస్తున్న మనిషి.. అందుకే దంపతులమయ్యాము.
మరో విషయం. ఈ పిల్లది మన కులం కూడా కాదు. మనకంటే పెద్ద కులానికి చెందింది. కులాంతర వివాహానికి నాన్న బొత్తిగా హర్షించడు. ఆయన దృష్టిన ఇది క్షమించరాని తప్పు.
రాజారావు గారని ఒక జోనల్ ఇంజనీర్ గారు ఉన్నారు. ఉమ ఆయన కూతురు. ఆవిడ మనస్తత్వం రాజారావు గారికి తెలుసు కనుక పెళ్లి విషయంలో ఆవిడ తీసుకున్న నిర్ణయం ఆయనకు నచ్చక పోయినా…. కుటుంబం వ్యతిరేకించినా ఆయన రిజిస్ట్రార్ ఆఫీస్‌కి వచ్చి ఆశీర్వదించి వెళ్ళాడు. ఇంటికి రమ్మని మాత్రం మమ్మల్ని ఆహ్వానించలేదు.
ఇదంతా ఎప్పుడో ఒకసారి నాన్నకు తెలుస్తుంది. జరిగిన దానికి ఇది మంచి – ఇది చెడు అన్న మీమాంస నాకెప్పుడూ లేదు. మారి కనిపించిన అనేక విషయాలు మనం చూస్తున్నాం. కాలగమనాన ఈ మార్పు తప్పదు.
ఒకనాడు భుజబలం లేనిదే దాసోహం అనని రాజుల చరిత్ర ఉన్నది. ఏకు పట్టుకుని సూర్యుడు అస్తమించని తెల్లవారి అధికారాన్ని ఈ దేశాన్నించి పంపగలిగిన బాపూజీ ఉన్నాడు, బలం, బలగంతో పని లేకుండా ఈ ప్రపంచాన ఏ రాజ్యమయినా వచ్చిందా? ‘ఆఁ వచ్చింది’ అని మనం మాత్రం గర్వంగా చెప్పుకోగలం. అశోకుని శాంతి అప్పటికి శాంతే అయినా మనకు సంప్రాప్తించిన ఇన్నీ శతాబ్దాల పరాయి పాలనకు మూలం అప్పటి ‘అహింసా వర్తనమే’. కనుక తప్పొప్పులు మనకిప్పుడు ఎలా అనిపించినా… ముందేమవుద్దో తెలీదు. నేను చేసింది తప్పంటుంది ఈ సమాజం, ఇది చట్ట సమ్మతమయినా.
నువ్వు చెప్పు అన్నయ్యా…! నాకు తగిన అమ్మాయిని నేను పెళ్ళాడడంలో న్యాయం ఉంది కదా.
మతాంతర కులాంతర వివాహాలు జరిగితే హర్షించాలే కానీ… తప్పంటే ఎలా? అయితే చట్టాన్ని అధిగమించి శాసించగల శక్తి మన సమాజానికి ఉంది. ఇది ఇప్పటిది కాదు. మన చట్టం ఏర్పడక ముందు సమాజం పద్ధతిగా నడవడానికి మనవాళ్ళు ఏర్పరుచుకున్న (నిబంధనలు) చట్టాలు ఇవి. కాకపోతే పరిపాలనాపరంగా చట్టం వచ్చాక కూడా వాటి బిగి సడలలేదు. చట్టం తన అధికారంతో విధించలేని శిక్షను ఇది విధించగలదు.
మానసికంగా న్యూనత పరచగలదు. దాన్ని ఎదుర్కొనగలగాలి మొదట. ఏది ఏమయినా పరిణాను క్రమమయిన ఈ సృష్టిన ఇంతకు మించిన వాస్తవం నాకు తెలియదు.
మన మానసిక స్థితి యొక్క స్థాయి మన భావనను తెలుపుతుంది. అది తప్పు కాదు. సహజం.
ప్రతి మనిషి మొదటినుంచి అప్పటికి నెలకొని ఉన్న పరిస్థితులతో ఎదిరించి పోరాటం సాగిస్తునే ఉన్నాడు. ఇది పరిణామ క్రమాన జరుగుతున్న భాగం. దీని నడకే మనకు చరిత్రగా మిగులుతుంది.
అన్నయ్యా….. నన్ను నా స్థితిని అర్ధం చేసుకున్నావనుకుంటున్నాను. నాన్న ముందు ఇదంతా అరణ్యరోదన గానే మిగులుతుంది. ‘ఏ విశ్లేషణా’ అక్కర్లేని అనుష్టాన వాదమేమో సమాజానిది. కాలగమనం వీటన్నిటికి మార్గం చూపించగలదు. నాకొకటి అనిపిస్తుంది. ఈ మనిషి తన స్వహస్తాలతో శ్రమపడి నిర్మించుకున్న సమాజం కదా ఇది. దీన్ని వదులుకునేందుకు అందుకే ఇష్టపడడు.
ఏదేమయినా మానసికంగా మనిషికున్న బలహీనతను ఎవరూ ఆపలేరు. అనేక లోపాలతో కూడిన హృదయాన్ని ప్రకృతి మనకు ప్రసాదించింది. ఈ మనస్సుంది చూడూ, ఇది వయస్సుకూ సంఘానికీ, పరిస్థితులకూ దాస్యం చేస్తుంది.
ఇప్పటి నాగరీకుని అనాగరీకం చూసేందుకు ఈ కళ్ళు చాలవు. మనం దీన్ని ఏ రంగుటద్దాలలో చూస్తే ఆ రంగున కనిపిస్తుంది. గాంధీ, సుభాష్‌లు ఒకే ఆదర్శంతో చరిత్రలోకి వచ్చినా ఇద్దరూ ఒకే విధంగా ఆదరింపబడలేదు. స్వాతంత్ర్య పిపాస వారిలో ఎక్కువ తక్కువలు లేవు కదా, ఇద్దరూ తెగువా, నిబద్ధతా ఉన్నవారే. కానీ –
భిన్న దృక్పదాల సమ్మేళనం ఈ మనిషి.
ఒక నీగ్రో, ఒక కమ్యూన్‌లో మనిషి, ఒక డక్కల వాడు, పూజాదికాలు నిర్వహించే ఒక పంతులు ఈ సమాజంలోనే ఉన్నారు. ఈ గాలి ఈ నీరే వారు తీసుకునేది. మరి వారి మానసిక స్థితిని గమనించి చూడు.
తప్పెటు! ఒప్పెటు! చీకటీ వెలుగు! స్వేచ్చా, బానిసతనం. నో… లేదు. ఎక్కడా ఏమీ లేదు.
మనిషి పుట్టుకే ఒక మిస్టరీ. అదేమిటో తెలుసుకోకుండా ఏదో చెప్పి సమర్థించుకో చూడటం సబబు కాకున్నా… అదే మనిషి విధి బలీయమయిన చరిత్ర. జీవితం.
మనిషిన ఉన్నవే ఈ వెలుగు నీడలు. ఇతనికి ఎలా సంక్రమించిందో కానీ… ఇందులో అంతులేని నిరంకుశత్వపు పోకడ వదలక ఉంటుంది. మనిషిన మానుషత, దయనీయతా కనిపించినా… కరగదు.
అన్నయ్యా… నేను చేసింది మంచని సమర్థించుకోబోవటం లేదు. నా పరిధిన నా ఆలోచనలకు సరిపడినవి చేశాను. దీనికి సమాజపు ఆమోదం దొరికితే సుఖంగా కాలం వెళ్ళమారుతుంది. లేకుంటే నిత్యం అలజడి వదలదు.
ఇక –
నాన్నగారికి ఈ విషయం ఎలా చెపుతావో నీకే వదిలేస్తున్నాను.
సమాధానం రాయి. దిక్కుతోచని కీకారణ్యాన నడకలా ఉంది నా పరిస్థితి. నేను చేసింది అంత పెద్ద తప్పు కాదని నాకు నమ్మకం ఉంది. వెలుగు కోసం వెళ్ళేటప్పుడు చీకటిన మరొకరి ఆసరా అవసరం. కానీ… అటు
చివరకు చేరేసరికి పొద్దువాలి పోకుండా ఉండాలి. కానీ చిత్రమేమిటంటే పొద్దుగూకగానే అయిపోయేదేమిటి? మళ్ళీ తెల్లవారుతుంది కదా! అయినా తెలీని జంకు కూర్చున్న చోట కూర్చోనీయదు. వివరంగా చెప్పు.
.. రవి.”
నేను మళ్ళీ ఒకసారి ఉత్తరాన్ని పూర్తిగా చదివాను. రవి చేసింది నాకు తప్పుగా అనిపించలేదు. వయస్సులో తొందరపడి చేసిన పొరపాటుగాను అనిపించలేదు. సమగ్రంగా ఆలోచించి చేశాడని అనిపించింది. చేయని తప్పుకు బాధ ఉండరాదు. వెంటనే సమాధానం రాసాను.
“చిరంజీవి రవికి,
భయం వద్దు. వెలుగు కోసం వెతకా వద్దు. అది నీ దగ్గరే ఉన్నది. ఎక్కడో ఉందని వేగిరపడకు. మిమ్మల్ని మనసారా ఆశీర్వదిస్తున్నాను.
— శివుడు.”
***
తమ్ముడు ఇంటికి వచ్చాడు. వాని వెంట బంగారు తీగలాంటి అమ్మాయి వచ్చింది. ఆ పిల్లే ఉమ కావచ్చు. చాలా మంచి ఎంపిక,
గరటయ్య తమ్ముడి సామానులన్నింటిని ఇంటిలోనికి చేరవేశాడు. గడపదాకా వచ్చారు.
నాన్న తమ్ముడి కోసం ఆరాటంగా ఎదురు చూసి చూసి ఆత్రుత ఆపుకోలేక వరండా వైపు నడిచారు. గడప దాపుకు వచ్చేసరికి రవి కనిపించాడు. దగ్గరకు వస్తూ…. “రవీ వచ్చావా..” అనబోతుంటే. రవే కాదు వెంట జంటగా ఓ అమ్మాయి కనిపించింది. రవిని చేరుదామనుకున్న వేగం తగ్గింది. అంటే ఆయన మనసు ఏదో శంకించింది. అక్కడే ఆగిపోయాడు వారినే చూస్తూ.
రవి – ఉమలు మాత్రం దగ్గరకు వచ్చి తండ్రి పాదాలకు వంగి నమస్కరించారు. జరిగిందేమిటో లీలగా నాన్నగారి మనస్సుకు అర్థమయినట్టుంది. అస్పష్టంగా ఆశీర్వాదం ఇచ్చారు.
హరిచందన మాత్రం రవిని ఉమను లోనకు తీసుకెళుతూ… ఆట పట్టిస్తున్నది. వారిని నా ఇల్లాలు ఆశీర్వదించి లోనకు తీసుకువెళ్ళింది.
హరిచందన ప్రశ్నలకు రవి ఉక్కిరి బిక్కిరవుతుంటే, ఉమ వినోదం చూస్తున్నది.
నాన్న కుర్చీలో జారగిలపడి కొద్ది నిముషాలు కళ్ళు మూసుకున్నాడు. రవి అయన దగ్గరకు వచ్చినా కళ్ళు తెరవలేదు. “నాన్నా” అని పిలిచాడు.
“ఊ…” అని కళ్ళు తెరిచి “నువ్వు మొదట లోనికి వెళ్ళు” అన్నాడు.
నన్ను చూస్తూ రవి లోనికి వెళ్ళాడు. నేను నాన్న దగ్గరకు చేరాను.
రెండు నిముషాలాగి “నాన్నగారు” అని పిలిచాను. ఆయనకు దగ్గరగా జరిగాను.
“శివుడూ… రవి చేసింది మంచి పనేనట్రా? పిల్లదాన్ని చూసావు కదా! చిదిమి దీపం పెట్టుకోవచ్చు కదూ” అని తిరిగి కళ్ళు మూసుకుంటూ…. కండువాతో కళ్ళు వత్తుకున్నాడు.
ఆయనేమిటో నాకు తెలుసు. మనసున ఎంత బాధ ఉన్నా, చాలా సార్లు బయటపడడు. నిగ్రహించుకుని ప్రశాంతంగా కనిపించగలడు. నాకు మాత్రం లోన కొంచం భయమని అనిపించింది,
మనిషిని కాలం మార్చగలదా? ఈ ప్రశ్నకు మాత్రం నాకు సమాధానం దొరకలేదు. ఆయన పక్కన నిల్చుని అలాగే ఉండిపోయాను, ఎంతసేపలా ఉన్నానో నాకే తెలియలేదు,
హరిచందన బయటకు వచ్చి నాన్నగారి ఎదురుగా నేను నిలుచున్న తీరు చూసి, “అలా నిలుచున్నారు? తాతయ్య ఏదయినా పనిష్మెంట్ ఇచ్చారా? గుంజీళ్ళు ఎన్ని తీయనున్నారేమిటి?” అని చిత్రంగా కళ్ళు తిప్పుతూ నవ్వింది.
నాన్నగారు కళ్ళు తెరిచారు, నేను ఎదురుగా కనిపించాను.
“ఏరా! అప్పటినుంచి ఇక్కడ ఇలాగే ఉన్నావా?” అన్నాడు లేస్తూ,
నవ్వి అక్కడనుంచి కదిలాను. నా గదిలోకి వెళ్ళబోతుండగా….. ఉమ ఎదురుపడి పక్కకు తొలిగింది. నాన్న అక్కడనుంచి లేచి కొష్టంలోకి వెళ్లి అక్కడ ఉన్న నులకమంచం పైన కూర్చున్నారు.
వేపచెట్టుకింద వెలుగునీడలు చెట్టు కదలికన దోబూచులాడుతున్నాయి. నీడ కావాలంటే ఏదో వస్తువు అవసరం. అది ఉంటేనే నీడ. లేనప్పుడు నీడా గీడా ఏదీ ఉండదు. ఈ నీడను గురించి ఆలోచించినా… కొన్ని నిజాలు మనకు అవగతమవుతాయి. కొన్ని మరపును తీసుకొస్తాయి. కొన్ని కటువుగా ఎదురవుతాయి. అయితే ఇవి నిజాలు కావు. కాకనూ పోవు.
మనిషి నడకన జరిగే ఘటనలు వాటి పూర్వాపరాలూ మనని జ్ఞాపకాలలోకి దింపుతాయి. ఒక్కోటి మనసుని వదలదు. చాలా కాలం చెదరదు, నీడలా మనల్ని వదలదు. నీడా నిజమూ పెనవేసుకుని కనిపిస్తే మాత్రం లీలగా మనకు ఏదో సాక్షాత్కరిస్తుంది. చెదరదు, చెరగదు. తెలిసినట్టుంటుంది. ఏమీ తెలియదు.
***
(సశేషం)