అన్యాయమైపోయిన ప్రొఫెసర్ కథ

1
5

[dropcap]ప్రై[/dropcap]వేట్, ఎయిడెడ్ కళాశాలలు ప్రభుత్వం నుంచి నిధులు పొందుతూ, అధ్యాపకులకు వేతనాలు ఇవ్వకుండా వారితో వెట్టి చాకిరి చేయించుకుంటాయి. ఈ అన్యాయాన్ని ప్రతిఘటించి, ప్రశ్నించే శ్రీనివాసరావు లాంటి వారిని యాజమాన్యం వారు అరాచకవాదులుగా, అభివృద్ధి నిరోధకులుగా ముద్రించి బెదిరిస్తారు. అప్పటికీ లొంగని శ్రీనివాసరావుని యాంటీ సోషల్స్‌గా, యాంటీ నేషనల్స్‌గా పోలీసులకు అప్పగించి నిర్బంధాలకు, చిత్రహింసలకు గురిచేస్తారు. దానికి ఎమర్జెన్సీ కాలం బాగా పనికొచ్చింది. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వారిని, సమాజంలో మార్పును కోరుకునే అభ్యుదయవాదులు, అహింసా పద్ధతిలోనే న్యాయం కోసం, హక్కుల కోసం నిరాహార దీక్షలు చేపట్టి వారిని కూడా నిర్బంధంలోకి తీసుకున్నారు. అలా నిర్బంధింపబడిన వారిలో రచయిత, అధ్యాపకుడు అయిన డా. వి. తిరుపతయ్య కూడా ఉన్నారు. 26 రోజుల నిర్బంధంలో ఎంతో మానసిక హింసకు గురైన తిరుపతిరావును, అతని అనుభవాలను నవీన్ ‘చీకటి రోజులు’ నవలగా రూపొందించారు. ఇందులో నమ్మిన సిద్ధాంతపు ముళ్ళ బాటలో నడుస్తూ ఆత్మార్పణ కావించుకున్న యువతీ యువకుల జీవితాలతో పాటు నిర్దాక్షిణ్యమైన నిర్బంధ కాండను, హింసా స్వరూపాన్ని, థర్డ్ డిగ్రీ మెథడ్స్‌ను, బాధను, భయాల్ని, ఆక్రోశాన్ని, మానవతను ఇలా అనేక అంశాలను నవలలో ఇమడ్చగలిగారు.

ఈ సంఘటన జరిగిన సరిగ్గా పదేళ్లకు అచ్చు ఇలాంటి సంఘటనే మన పక్క రాష్ట్రమైన కర్ణాటకలో  జరగడంలో ఆశ్చర్యపడాల్సిందేమీ లేదు. రాజ్య స్వభావం అలాంటిది. “పల్లె ప్రజల బతుకులు బాగుపడాలి, కులం మతం అడ్డు గోడలు ధ్వంసం కావాలి, సమానత్వం రావాలి, అందరి జీవితాలు కొత్తగా విచ్చుకోవాలి” అనే భావాలు ఉన్న రచయితలు, కవులు అందరూ పోలీసుల హిట్ లిస్ట్‌లో ఉంటారన్న విషయం నిర్బంధంలోకి తీసుకున్న తర్వాతే బాబయ్యకు అర్థమవుతుంది.

ఇది బెంగుళూరు విశ్వవిద్యాలయం ఇంగ్లీషు శాఖలో అధ్యాపకుడిగా పని చేసిన నగరి బాబయ్య అనుభవించిన నిర్బంధ గాథ. బెంగుళూరులో ఆయన సిఫారసు మీద ఎవరో అద్దెకు తీసుకున్న ఒక ఇంటిని కొండపల్లి సీతారామయ్యతో సహా నక్సలైట్లు ఆశ్రయంగా, స్థావరంగా మార్చుకున్నారని అనుమానంతో, ఆరోపణతో పోలీసులు ఆయనను 1986 ఏప్రిల్‌లో అరెస్ట్ చేశారు. అక్రమ నిర్బంధంలో చిత్రహింసలతో, ప్రశ్నలతో వేధించి, ఆ తర్వాత తప్పుడు కేసు బనాయించి, జైలుకు పంపి మొత్తం మూడు నెలలు జైలు పాలు చేశారు. ఆ మూడు నెలల అక్రమ నిర్బంధం గురించీ, పోలీసులు తనతో ప్రవర్తించిన తీరు గురించీ, జైలులో అభాగ్యుల జీవితాల గురించీ ఆయన వెంటనే ఇంగ్లీషులో జ్ఞాపకాలు రాశారు. ఆ జ్ఞాపకాలను ఆయన విద్యార్థి హెచ్. ఎల్. నటరాజ్ వెంటనే కన్నడంలోకి అనువదించి సుద్ధి సంగాతి పత్రికలో సీరియల్‌గా ప్రచురించారు. ఆ అనువాదం పుస్తకరూపంలోకి రాకుండానే 20 సంవత్సరాలు అలాగే ఉండిపోగా 2016లో దాన్ని లంకేశ్ ప్రకాశన్ ప్రచురణగా గౌరీ లంకేష్ వెలువరించారు. కొత్తగా బాబయ్యగారితో నూర్ శ్రీధర్ జరిపిన ఇంటర్వ్యూ కూడా అనుబంధంగా చేర్చారు. కన్నడ అనువాదానికి సడ్లపల్లి చిదంబర రెడ్డి చేసిన తెలుగు అనువాదం ఇది.

ఇందులో ముందుగా పోలీసులు బాబయ్య ఇంటికి వచ్చి ఆధారాల కోసం వెతుకుతూ ఇల్లంతా చిందరవందర చేస్తారు. వాంగ్మూలం తీసుకోవాలి, పోలీస్ స్టేషన్‌కు రమ్మని ఇన్‌స్పెక్టర్ తీసుకెళ్తాడు. మళ్లీ మధ్యాహ్నం స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు వచ్చి ఎంత వెతికినా అనుమానించదగ్గవేవీ దొరకవు. పోలీస్ స్టేషన్‌కు తీసుకు వెళ్ళిన బాబయ్యను ఇంటరాగేషన్ పేరిట చిత్రహింసలు పెడతారు. “విద్యాధికుడై, గౌరవప్రదమైన వృత్తిని నిర్వహించే నా పైనే ఇంత క్రౌర్యాన్ని ప్రదర్శించే ఖాకీలు, చదువురాని అమాయకుల పైన, నిర్భాగ్యుల పైన, అనామకుల పైన ఇంకెంత కాఠిన్యాన్ని ప్రదర్శిస్తారో కదా అని చింతిస్తాడు. గాలీ వెలుతురు లేని జైలు గోడల మధ్య, ఉచ్చ పోసిన దుర్గంధం, ఊపిరి పీల్చుకోలేని అసహ్యంతో నిండి ఉన్న లాకప్‌లో పడేస్తారు.  మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచకుండా పోలీసులే అతని దగ్గరకు వెళ్లి అయిదు రోజుల వరకు కస్టడీలో ఉంచుకోవడానికి సంతకం చేయించుకు వస్తారు. నాలుగు రోజులు జరిపిన విచారణ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్న ప్రతి వ్యక్తిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. చట్టాన్ని తమకు అనుకూలంగా మార్చుకున్న పోలీసుల అవ్యవహారాన్ని లాయర్ హనుమంతరావు బట్టబయలు చేస్తారు. దాంతో కోర్టు వారు జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించడంతో పోలీసు కస్టడీ నుంచి విముక్తి కలుగుతుంది. ఉగ్రవాదం, మారణాయుధాలు కలిగి ఉన్న కేసుల కింద చిత్రహింసలు పెట్టిన పోలీసులు తీరా చూస్తే దొంగతనానికి సంబంధించిన కేసులు పెట్టడం మరీ విచిత్రం.

జైలులో విచారణ ఖైదీలతో పాటు పెటీ కేసుల పేరిట దొంగతనం ఆరోపణల మీద అక్కడ మగ్గిపోయే వారిలో ఎక్కువ మంది పిల్లలు ఉండడం, బాబయ్యగారిని ఆశ్చర్యపరుస్తుంది. అక్కడున్న వాళ్ళలో చాలామంది పేదవాళ్ళు, దిక్కు లేని వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు మాత్రమే. వారికి న్యాయాన్ని కొనుక్కుని సామర్థ్యం లేకపోవడం వలన వారి బతుకులు జైళ్ళలోనే మగ్గిపోతుంటాయి. కటకటాల వెనుక అనగా జైలులో, జైలు ఆస్పత్రిలో అవినీతి, దుర్మార్గాలు విచ్చలవిడిగా కొనసాగడంలో పోలీసులు నిర్వహించే పాత్ర గురించి కూడా తెలియజేస్తారు. ముఖ్యంగా జైళ్ళ సంస్కరణల గురించి చర్చ చేస్తారు.

ఎంతో మంది విలేకరులు, పౌరహక్కుల సంఘం వారు, లాయర్లు, రచయితలు పోరాడడం వలన మూడు నెలల తర్వాత విడుదల కాగలిగారు. ఆంధ్ర పోలీసుల కంటే కర్ణాటక పోలీసులు కొంత సౌమ్యంగా ప్రవర్తించారని, విడుదల రోజున కన్నడ పోలీసు మిత్రులంతా ఆత్మీయత ప్రకటించారని చెబుతారు.  బహుశా ఆయన హోదా పాపులారిటీ దానికి కారణం కావచ్చు. ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగవని ఆశించడం అత్యాశే అవుతుంది. ఇది జరిగిన 30 సంవత్సరాలకు అనగా ఇప్పటి పరిస్థితులలో నియంతృత్వ ధోరణి మరింత పెరిగిపోయింది. పాలకవర్గాల భావజాలాన్ని వ్యతిరేకించే వారందరిపై ‘అర్బన్ నక్సల్స్’ అనే ముద్ర వేసి తమ భావజాలాన్ని తమకు తామే సమర్ధించుకుని, ఇతర భావజాలాల మీద, ప్రత్యామ్నాయాల మీద విరుచుకు పడడం మామూలైపోయింది. ఫలానా వాళ్ళు ‘అర్బన్ నక్సల్స్’ అని వాళ్లు విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులను రెచ్చగొడుతున్నారని వాళ్ళను అడవులకు పంపే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపణలతో భయభ్రాంతులను చేస్తున్నారు. ఆ ముద్ర వేసి తమకు నచ్చని వారిని నిర్బంధంలోకి తీసుకోవడం కూడా ఇప్పుడు మామూలైపోయింది. దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరాన్ని ప్రజాస్వామ్యవాదులందరూ గుర్తించి, ఉద్యమించాల్సిన పరిస్థితులు ఇప్పుడు దేశమంతటా నెలకొని ఉన్నాయి. ఆ దిశగా నగరి బాబయ్య “చీకటి లోకంలో తొంబై రోజులు” మనల్ని అప్రమత్తం చేస్తుంది.

***

చీకటి లోకంలో తొంబై రోజులు

రచన: నగరి బాబయ్య, అనువాదం: సడ్లపల్లె చిదంబర రెడ్డి,

ప్రచురణ: స్వేచ్ఛాసాహితి, హైదరాబాద్.

పుటలు: 72; వెల: రూ.60/-

ప్రతులకు: స్వేచ్ఛాసాహితి, హైదరాబాద్, ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here