[box type=’note’ fontsize=’16’] ఈ జీవన యానంలో దుఃఖాన్నో సంతోషాన్నో కలిగించిన సంగతులు ఎన్నో. జ్ఞాపకాలు మాత్రం మనసుని అంటిపెట్టుకునే… అప్పుడప్పుడూ తొంగి చూస్తూంటూనే వుంటాయి. అటువంటి గత స్మృతుల సమాహారమే మన్నెం శారద “మనసులోని మనసా” శీర్షిక. [/box]
[dropcap]చి[/dropcap]న్న సూరి చనిపోయిందని తెలిసినప్పుడు నేను చాలా షాక్‌కి గురయ్యేను.
అదీ ఒక సంవత్సరం తర్వాత.
గ్లోబలైజేషన్‌లో మనమెంత దగ్గరయ్యేమో అయిన వారికంత దూరమయిపోయామని తెలిసినప్పుడు చాలా బాధ కల్గుతుంది.
సెల్‌ఫోన్, ఇంటర్నెట్ పుణ్యమా అని మనం ఎదుటి వారిని తలెత్తి చూసి పలకరించ లేకపోతున్నాం. ఒక చిన్నపాటి చిరునవ్వుని కూడా చిలకరించలేని ప్లాస్టిక్ ఫేస్‌లు పెట్టుకుని తిరుగుతున్నాం.
ఇప్పుడు మనకి దూరపు కొండలు నునుపు.
మన నవ్వులు, పలుకరింపులు, నిట్టూర్పులు, దిగుళ్ళు మన చిటెకెన వేలు అరచేయంత యంత్రం మీద చూపించి మన ఔదార్యాన్ని ప్రకటించుకుంటున్నాం.
ఇంతకీ చిన్న సూరి ఎవరో మీకు చెప్పనేలేదు కదూ !
దాని పూర్తి పేరు సూర్యారత్నం.
అది బంధువో, ఇంటి ఎదురమ్మాయో.. ఎవరో నేనిప్పటికీ చెప్పలేను. కారణం మేమంతా ఒకటిగా చాలా ఆత్మీయంగా పెరిగాం.
ఒక చోటే ఆడుకుని, పాడుకుని, ఒక చోటే పడుకుని, కథలు చెప్పకుని పెరిగాం.
అప్పట్లో బయట స్నేహాలు చేయడానికి, వాళ్ళని ఇళ్ళకి తీసుకురావడానికి పెద్దలు ఒప్పుకునేవారు కాదు.
అందుకని స్నేహాలు ఆ వీధిలో వారితోనే కొనసాగుతుండేవి. కలిసి పంచుకోవడాలు, ఇచ్చి పుచ్చుకోవడాలు, తగాదాలు, తీర్పులూ ఈ కుటుంబాల మధ్యనే వుండేవి.
సూర్యరత్నాన్ని చిన్నసూరి అని పిలవడానికి కారణం ఇంకొకామె అదే పేరుతో వుండేవారు. ఆమెని పెద్ద వాళ్ళంతా ‘పెద్దసూర్యారత్నం’ అని పిలిచే వారు. మేము ‘సూర్రత్నం పెద్దమ్మ’ అనే వాళ్ళం.
చిన్న సూరి నాకన్నా కొంచెం చిన్నది.
మా అక్కయ్యలంతా నాకన్నా కొంచెం పెద్దవాళ్ళు కావడం వలన వాళ్ళంతా ‘మాతో నీకేంటే, పోయి చిన్న వాళ్ళతో ఆడుకో’ అని నన్ను కసిరి పంపించే వాళ్ళు.
మరో బాచ్ వుండేది. వాళ్ళంతా నా కన్నా చిన్న వాళ్ళు.
వాళ్ళతో కలిసి ఆడాలంటే నాకు నచ్చేది కాదు.
ఇక మిగిలింది నా వయసు మగపిల్లలు.
అంచేత నేను బాబూరావుతో, ధనుంజి, జిన్నలతో గోళీలు, గాలి పటాలు ఎగరెయ్యడం, సిసిండ్రీలు లాంటివి కాల్చడం మొదలైన ఆటలాడుకునేదాన్ని.
మా అన్నయ్య దీపావళికి సిసింద్రీలు, చిచ్చు బుడ్లు, మాతాబులు, తారా జువ్వలు తయారు చేసేవాడు. నెలరోజులు వాడు చేసే పనికి పెరట్లో నా సహాయసహకారాలు తీసుకునేవాడు. నేను మా దొడ్డమ్మ వస్తుంటే సిగ్నల్ యివ్వాలి. వెంటనే సరంజామా అంతా దాచేసేవాడు. వాడికి టైమ్ టైమ్‌కి తిండి సదుపాయాలు చూడాలి. బొగ్గు నూరమంటే నూరాలి. ఇవన్నీ చేస్తూ నాకు కొన్ని ‘సిసింద్రీలు ఇవ్వరా’ అంటే వాడు నువ్వు ‘సిసింద్రీలు కాలుస్తావా. మొహం పగుల్తుంది. మతాబులు, చిచ్చు బుడ్లు ఇస్తాలే’ అనేవాడు.
నిజానికి మా పెద్దనాన్న పోలీసాఫీసరు కావడం వలన చాలా మందుగుండు సామాను వచ్చేది. అయినా వీడు వీటిని తయారు చేసుకునేవాడు.
నేను వాడు బయటికి వెళ్ళినప్పుడు మా మామయ్య, అమ్మ లేనప్పుడు ఫ్రాకులోంచి లంగాలోకి మారి పోయి, దాన్ని లుంగీలా పైకి మడిచి కట్టుకుని ఆ మడతల్లో కొన్ని సిసింద్రీలు వేసుకుని, ఒక కొబ్బరి తాడు చివర వెలిగించి మా యింటి రోడ్డు మీద అటూ యిటూ మగపిల్లాడిలా తిరుగుతూ సిసింద్రీలు వెలిగించి విసురుతుండేదాన్ని. అలా చేస్తున్నప్పుడు నాకు యమ థ్రిల్‌గా వుండేది. కొన్ని బాబూరావుకు, ధనుంజకి యిచ్చేదాన్ని. ఒకసారి మా అన్నయ్య కంట్లో పడటం వాడు నన్ను తరమడం, నేను రెండ్రోజులు వాడికి కనిపించకుండా దాక్కోవడం అంతా అదొక అదొక నిరంతర ప్రక్రియ.
ఇక సూరికి నాకు ఎలానో స్నేహం కుదిరింది.
మేమిద్దరం చాలా కబుర్లు చెప్పుకునేవాళ్ళం.
అయితే సూరి అప్పుడప్పుడూ అలకసాగించేది.
దాన్ని బ్రతిమాలుకోవడం దానికి చిన్న చిన్న లంచాలివ్వడం నాకు పరిపాటయ్యంది.
అది ఒక్కోసారి మూతి ముడుచుకుని మండువా యింటి వసారాలో స్తంభానికి జేరబడి కూర్చునేది.
నేను వెళ్ళి ఎందుకలా వున్నావని అడిగితే ‘ఆకలేస్తోంది ఏదన్నా చెయ్యమని అడిగితే అమ్మ తిట్టింద’ని చెప్పేది.
సరే.. దాని ఆకలి తీర్చకపోతే అది నాతో ఆడదని తెలుసుకుని పెద్దవాళ్ళు నాకు దాచుకోడానికి యిచ్చిన డబ్బుల్లో ఒక పావలా తీసుకుని వీధి మలుపులో వున్న చేగోడీల తాత యింటికి వెళ్ళేదాన్ని. ఆయన బజ్జీలు, పుణుకులు, బజ్జీలు లాంటివి మడిగా తయారు చేసి సాయంత్రం వీధిలో తిరిగి అమ్మేవారు. మా పెద్దనాన్న వుంటే బుట్ట బుట్ట తనే కొని పిల్లలందరికీ పంచేవారు.
నేను ఆయన దగ్గర కెళ్ళి బజ్జీలు, చేగోడీలో కొని పొట్లం కట్టించుకుని గౌను చాటున దాచి తెచ్చేదాన్ని.
అలా దాచడం గద్దలకి బయపడి.
కాకినాడ సముద్ర తీరం కావడం వలన కాకులు గ్రద్దలూ ఎక్కువే.
అయినా మాయదారి గ్రద్ద ఎక్కడ నుండి పొంచి చూసేదో ఏమోగాని రివ్వున వచ్చి చేతిని రక్తం వచ్చేలా ముక్కుతో గీరేసి పొట్లం పట్టుకుపోయేది.
ఆ సడెన్ షాక్ నుండి తేరుకుని చూసేసరికి చెయ్యి మీద రక్తం కారుతుండేది.
కళ్ళనిండా నీళ్ళతో తిరిగొచ్చి చేతికి ఏదో ఒక ఆయింటుమెంటు రాసుకుని మళ్ళీ డబ్బులు తీసుకుని ఏదో ఒకటి తెచ్చి సూరికిచ్చేదాన్ని. సూరి శుభ్రంగా తిని అప్పుడు నా చెయ్యి చూసి నొచ్చుకుని ఆటలాడటానికి వచ్చేది. అలా మా స్నేహం దాని పెళ్ళి వరకూ కొనసాగింది. నేను శెలవుల్లో వెళ్ళినప్పుడు దాని దగ్గరే చేరి మా స్కూలు విషయాలు చెబితే అదన్నీ ఆసక్తిగా వినేది.
ఇంకా చదువుకోవాలని ఆశపడిన దానికి బలవంతంగా బావకే యిచ్చి పెళ్ళి చేసారు.
ఆ తర్వాత దాని మకాం అనపర్తికి మారింది.
మేం వెళ్ళినప్పుడు అది వుండేది కదు.
అలా.. మేం కలుసుకోవడం పూర్తిగా తగ్గిపోయింది.
ఇప్పుడది జబ్బు చేసి చనిపోయిందన్న వార్త నన్ను ఎంతగానో కృంగదీసింది. చిన్ననాటి ప్రాణస్నేహితురాలి మరణం తెలియక పోవడం చాలా బాధ కల్గించింది. ఇది చెబుతున్నప్పుడు నాకు కమల గుర్తొస్తుంది.
కమల నాకు నాగార్జునసాగర్ స్నేహుతురాలు.
సడెన్‌గా వాళ్ళ నాన్నగారు సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా సాగర్ రైట్ బాంక్‌కి వచ్చినప్పుడు వాళ్ళ యిల్లు మా యింటి పక్కనే కావడం, అది మా స్కూల్లోనే జేరడం యాదృచ్ఛికంగా జరిగిపోయాయి.
ముందు చాలా గర్వంగా ఫోజు కొట్టే కమల తర్వాత నాకు చాలా క్లోజ్ ఫ్రెండయిపోయింది. ఎప్పుడూ మా యింట్లోనే వుండేది. వాళ్ళు రాజులు. వాళ్ళమ్మగారికి కమల అలా ఛెంగుఛంగున అల్లరి చేస్తూ తిరగడం యిష్టముండేది కాదు. కాని కమల చాలా అల్లరి. పాత నమ్మకాల్ని నమ్మదు.
ఒకసారి ‘నువ్వర్జంటుగా రా’ అని చెయ్యి పట్టుకుని నన్ను వాళ్ళింట్లికి లాక్కెళ్ళింది.
వాళ్ళ నాన్నగారు డైనింగ్ టేబుల్ మీద భోంచేస్తున్నారు. అక్కడ ఒక తెర కట్టేరు. తెర వెనకాల వాళ్ళమ్మగారు ఘోషాగా నిలబడి వున్నారు, వాళ్ళ నాన్నగారికి కనబడకుండా.
మేం దొంగచాటుగా, వస్తున్న నవ్వు ఆపుకుంటూ తొంగి చూస్తూ, వారి సంభాషణ వింటున్నాం.
“అయ్యా”
“ఊ..”
“మీరో పాలి మన కమల్ని మందలించాలండయ్యా”
“ఊ”
“ఊ అంటే కాదండయ్యా. కమల అల్లరి ఎక్కువయిందండయ్యా. చీటికి మాటికి ఆ పోస్టుమాస్టారు గారింటి కెల్లి పోతుందండయ్యా.”
“వెళ్ళనీ. ఆ అమ్మయి కూడ బాగా చదువుతంది కదా! ”
“తవరలా అంటే ఎలాగండయ్యా. ఆడపిల్లని అలా వదిలేస్తే తప్పుకదటండయ్యా. మీరలా ఎనకేసుకొస్తే అదింకా చెడిపోతుందయ్యా. మీరో పాలి కూకలెయ్యకపోతే నా మాటినడం లేదు.”
“సరి సర్లే. నేను చెబుతా.”
అంటూ ఆయన చెయ్యి కడుక్కుని హాల్లో కొచ్చి మమ్మల్ని చూసి నవ్వేసారు.
“చూడండి నాన్నగారూ! అమ్మ నా మీద ఎలా చాడీలు చెబుతున్నదో. నేనేం కాని పనులు చెయ్యడం లేదు” అనేది కమల గోముగా.
ఆయన నవ్వి “ఊ ఊ తెలుసులే” అని జీప్ ఎక్కి ఆఫీసుకి వెళ్ళి పోయేవారు.
ఆ తర్వాత కమల వాళ్ళమ్మగారి మీద ఎగిరి గంతులేసేది.
నిజానికి మాకంత వయసేం కాదు. అంతా పదకొండేళ్ళలోపే.
కమల నిజంగానే చాలా అల్లరి.
మా అమ్మగారు లేడీస్ రిక్రియేషన్ క్లబ్బుకెళ్తే నేను చిన్న చిన్న పనులు చేద్దామని చేస్తుంటే వాటిని చెడకొట్టేసేది.
పచ్చడి నూరుతుంటే చెంబుతో తెచ్చి నీళ్ళు పోసేది.
చదువుకుంటుంటే పుస్తకం లాక్కుని పారిపోయేది.
మా అమ్మగారు మందలిస్తే “ఎందుకత్తయ్యగారు అన్ని మార్కులు. ముప్పయైదొస్తే పాసవుతాం. దీనికొచ్చే మార్కులకి ముగ్గురు పాసవుతారు” అనేది. మా అమ్మగారికి కూడా దాని మాటలకి నవ్వొచ్చేది.
అలా మాతో అల్లుకుపోయిన కమల మాకు సాగర్ నుండి దరిశి ట్రాన్సఫరయినప్పుడు చాలా ఏడ్చింది. నన్ను వదలలేకపోయింది.
అయితే అది పెట్టిన ఒక పిచ్చి కండిషన్ మమ్మల్ని శాశ్వతంగా విడదీసింది.
“నువ్వెళ్ళాక నేను మూడు వుత్తరాలు రాస్తాను. మూడింటికి జవాబివ్వకపోతే ఇక జన్మలో లెటర్ రాయను” అంది.
నేను ఈజీగా తీసుకుని నవ్వాను.
అది వెళ్ళగానే గబగబా మూడుత్తరాలు రాసింది.
నేను సీరియస్‌గా తీసుకోలేదు.
దరిశి మాకసలు నచ్చలేదు.
అక్కడ విపరీతంగా పాములు! భయపడి చచ్చేవాళ్ళం.
అమ్మ సిమెంటు తెప్పించి గోడలన్ని పూడిపించింది.
ఆ గొడవలో నేను ఆలస్యం చేసేను.
ఆ తర్వాత నేను క్షమాపణలు చెబుతూ ఎన్ని లెటర్స్ రాసినా తను జవాబివ్వలేదు.
తర్వాత ఎక్కడుందో కూడా తెలియలేదు.
నేను రచయిత్రినయ్యేక నా ఎడ్రస్సు, ఫోన్ నెంబరు పత్రికల్లో ఇచ్చినప్పుడన్నా చూసి లెటర్రాస్తుందను కున్నాను. ఆ నాటి నుండి ఈ నాటి వరకూ చూస్తూనే వున్నాను. నా ఎదురు చూపులకి ఫలితం దొరకలేదు.
అదెంత మూర్ఖురాలో తెలిసి కోపం వస్తుంది. బాధా కల్గుతుంది.
స్నేహమంటే ఒకరి మేలు ఒకరు కోరుకోవడం, ఒకరి మనసు మరొకరు అర్థం చేసుకోవడమే కాదు!
“స్నేహమేరా జీవితం! స్నేహమేరా శాశ్వతం!” అంటారు కవులు.
బంధువులకన్నా స్నేహితులే ఆత్మీయులని మనం కూడా నమ్ముతాం.
కాని.. చాలా స్నేహాలు అలా వుండటం లేదు.
ఎన్నో స్నేహాలు పుబ్బలో పుట్టి మఖలో మాయమవుతున్నాయి.
వెన్నుపోటు చర్యలకి ఆలవాలమవుతున్నాయి.
చేసిన మేలుని మరచి తిన్నయింటి వాసాలే లెక్కపెడుతున్నారు కొందరు.
స్నేహానికి కులాలు అంతస్తులు ఆలవాలమవుతూ తమ మానసిక వైశాల్యాన్ని కుంచింప చేసుకుంటున్నాయి.
ఇద్దరి మధ్య వున్న సత్సంబంధాన్ని చెడగొట్టేందుకు కొందరు తయారవుతున్నారు. చెప్పుడు మాటలు విని కొందరు తమ స్నేహితులకి దూరమవుతున్నారు. ఎంత మేధస్సు వున్న వారు కూడా ఇది నిజమా కాదా అని ఆలోచించకుండా మంచి స్నేహబంధాల్ని త్రుంచేసుకోవడం ఒక విషాదం.
అలా ఎవరైనా చెప్పినప్పుడు కొంచెం ఓపిక వహించి తమ స్నేహితుల్ని అడిగేస్తే నిజాలు బయటపడతాయి.
కాని అలా చేయరు.
అప్పుడు వాళ్ళ తెలివి, మేథస్సు ఏమయిపోతాయే కదా!