మనోమాయా జగత్తు-2

0
3

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది రెండవ భాగం. [/box]

2

[dropcap]“పి[/dropcap]జ్జాలమ్మే కొట్లన్నిటికీ పిజ్జా హట్ అనో లేకపోతే పిజ్జా పేలెస్ అనో పేర్లుంటాయి ఎందుకనో! గుడిసెల్లో, అంటే హట్స్‌లో ఉండేవాళ్లు వీళ్ల రేట్లకి దడిసి ఎలాగూరారు. ఇంక రాజభవంతుల్లో ఉండేవాళ్ళు ఇంటికే తెప్పించుకుంటారు ఇంకాస్త డబ్బు చెల్లించుకుని. అలాంటప్పుడు ఆ రాలేని, రాని వాళ్ళ సింబాలిజమ్‌తో దుకాణానికి పేరెట్టుకోడం, ఇలా దుకాణానికొచ్చిన మనలాంటి వాళ్ళని అవమానించడమే కదా. ఈ విషయం మనం చర్చించి సిధ్ధాంతీకరించాలి” అన్నాడు యోగి కుర్చీలో వెనక్కివాలి కాళ్ళు బల్లకింద పూర్తిగా పొడుగ్గా జాపేసి హాయిగా కూచుని చుట్టూ చూస్తూ. “ఏదోలెద్దూ. ప్రతిదానికీ వెనకాల ఓ సిధ్ధాంతం ఉంటుందా? తిన్నాం. కూచున్నంతసేపూ కూచుని ఇంటికిపోతాం, ఆమాత్రం దానికి ఈ పేర్ల మీద పేద్ద థియరీలూ రిసెర్చిలూ ఏవిటీ?” విసుక్కున్నాడు విమల్. అతనికెందుకో మనసు మహా చిరాగ్గా ఉంది.

“తిన్నదరగాలి కదా” అన్నాడు యోగి గంభీరంగా.

విమల్‌కి విసుగుతగ్గి కిసుక్కున నవ్వొచ్చింది. సన్నగా వినిపిస్తున్న సంగీతం, ఎసి చల్లదనం ఆ పిజ్జా గుడిసెలో వాతావరణమైతే ఆహ్లాదంగానే ఉంది. అక్కడ తింటూ ఎంజాయ్ చేస్తున్న వాళ్లల్లో చాలామంది కుర్రాళ్లే. పిల్లల్ని తీసుకొచ్చిన నడివయసు తలిదండ్రులు కూడా ఉన్నారు. ఎవరూ ఎక్కువేం మాటాడట్లేదు. తింటున్న రుచులు ఆస్వాదించుకుంటూ ఓ తన్మయత్వంతో ఉన్నట్టు మౌనంగా ఉన్నారు. ఆ ప్రశాంతతను ఛేదిస్తూ….

“చచ్చాను బాబోయ్!” అని కేకలు పెట్టుకుంటూ వచ్చి మధ్యలో నేలమీద దబ్బున పడ్డాడొకడు. అతను పడ్డ చోట పెద్దరక్తపు మడుగేర్పడింది. చుట్టూ కుర్చీల్లో ఉన్నవాళ్లు కంగారుగా లేచి దూరంగా పరిగెట్టారు. దూరంగా అవతలి కుర్చీల్లో ఉన్న వాళ్ళు ఏమైందో చూడాలని ఆత్రంగా దగ్గరకొచ్చారు.

వాళ్ళు కూడా రక్తపు మడుగు చూసి భయంగా మళ్ళీ దూరంగా జరిగారు.

కేకలు పెడుతున్న వాడిని తరుముకుంటూ వచ్చినవాడొకడు కత్తితో మరో రెండు పోట్లు పొడిచి స్పీడుగా రోడ్డు మీదకి పరిగెత్తేసాడు. ‘వాడాపోటు బలంగా పొడవలేదు’ అనుకున్నాడు యోగి పడున్నవాడి వైపు నడుస్తూ. “మనకెందుకు మనం పోదాం పద” విమల్ వెనక్కి లాగాడు. చెయ్యి విదిలించుకుని ముందుకెళ్ళాడు యోగి.

రక్తంలో పడున్నవాడు, వాడిని పొడిచినవాడు అంతకు ఓ పావుగంట ముందుదాకా అక్కడే ఒక మూలగా ఉన్నబల్ల దగ్గర మరో అమ్మాయితోబాటు కూచుని కాఫీ తాగి వెళ్లినవాళ్ళేనని గుర్తుపట్టారందరూ. ఆ అమ్మాయి వీళ్లవెనకే ఏడుస్తూ వచ్చి బేగ్ లోంచి సెల్ ఫోన్ తీసి గుమ్మం దగ్గరకెళ్లి ఏడుస్తూ ఎవరెవరికో ఫోన్లు చేస్తోంది.

“ఎవరైనా పోలీసులకీ ఏంబులెన్స్‌కీ ఫోన్ చెయ్యండి. మీరందరూ దూరంగా ఉండండి. ఇతనిక్కొంచెం గాలి తగలనీయండి. ఫస్ట్ ఎయిడ్ చేస్తే ప్రాణం దక్కుతుంది. నేను డాక్టర్ని లెండి. ప్లీజ్ దూరంగా వెళ్ళండి” రక్తంతో తడిసి ముద్దయిన అతని షర్టుని కష్టం మీద ఊడదీస్తూ అందరినీ కొంచెం దూరంగా ఉండమని ఆంగ్లాంధ్రాల్లోనే కాక వచ్చీరాని హిందీలో కూడా చెప్పాడు యోగి. అక్కడి నేప్‌కిన్లతో గాయం క్లీన్ చేసి తనవీ విమల్‌వీ రెండేసి రుమాళ్లు కలిపి తాత్కాలికంగా డ్రెస్సింగ్ చేసాడు కొంతైనా రక్తస్రావం తగ్గించవచ్చని. యోగి వాష్‌బేసిన్‌లో చేతులు కడుక్కుంటుండగా ఒక పోలీస్ వేన్, ఒక ఏంబులెన్సూ వచ్చాయి.

లోపలున్న జనం గొప్ప సందిగ్ధంలో పడ్డారు. ‘మనకెందుకొచ్చిన గొడవ? పోలీసుల దృష్టిలో పడకముందే జారుకుందాం’ అని ఓ పక్క వివేకం పీకుతుంటే, ‘ఒక్కనిముషం ఆగి ఇంకేం జరుగుతుందో చూద్దాం’ అని కుతూహలం మరోపక్క పీక్కుతినేసింది. ఏ పీకుడుకి తలొగ్గాలో జనం తేల్చుకునే లోపే, “లోపలవాళ్లెవరూ బైటికి పోకండి ఎక్కడోళ్ళక్కడే ఉండండి. కిసీకో బాహర్ నై జానా” అన్నాడో పోలీసు. క్లిష్టమైన నిర్ణయం తీసుకునే కష్టం తప్పినందుకు జనం సంతోషించి గుడ్లప్పగించి నుంచున్నారు. కొంత మంది ధైర్యం చేసి కుర్చీల్లో సద్దుక్కూచున్నారు కూడానూ.

యోగి చేతులు కడుక్కుని ఇటు తిరిగేలోపు మరో రెండు కార్లొచ్చాయి. ఓ కార్లోంచి ఓ పెద్దావిడ, ఇంకొందరూ దిగారు. పెద్దావిడ పెద్దగా ఏడుస్తూ కిందపడున్న వాడివైపు పరిగెత్తుకొచ్చింది. ‘తల్లి గాబోలు!’ అందరూ కరెక్టుగా ఊహించారు. రెండో కార్లోంచి దిగిన స్త్రీమూర్తిని చూడగానే జనం ఒక్కసారి ఆశ్చర్యంతో ఊపిరిబిగబట్టారు. “నీలాంబరి దేవీ! నీలాంబరి! నీలాంబరీమాత!” గుసగుసగా చెప్పుకున్నారు.

అందర్లోనూ ఒకటే ఆలోచన ఇంకా ఏదో జరగబోతోంది. అంతా చూసి ఇంటికెళ్ళాక ఇంట్లో వాళ్ళతో చెప్పేందుకు రసవత్తరమైన ఎపిసోడ్. ఏళ్ళ తరబడీ చెప్పుకోదగినంత ఎక్సైట్‌మెంట్ అదృష్టం కొద్దీ తమ సొంతమవబోతోంది. నీలాంబరి వేస్తున్న ప్రతి అడుగూ ఎంతో ఉత్కంఠతో చూస్తున్నారు జనాలు ఊపిరిబిగబట్టి.

నీలాంబరి ఎందుకొచ్చింది? ఈ కత్తిపోటు తిన్నవాడికీ ఆవిడకీ ఏవిటి సంబంధం?

ఏంబులెన్స్‌లో వచ్చిన డాక్టరు యోగి కట్టిన కట్టు తీసేసి గాయాన్ని పరీక్షగా చూసాడొక్క నిముషం. ఎర్రగా నిలువుగా చీరినట్టున్న గాట్లలోంచి ఒక్క చుక్క కూడా రక్తం రావట్లేదు. గాయాల మీద అంతకు ముందు కారిన రక్తం బొట్లు అట్టలా గట్టి పడిపోయాయి అప్పుడే. అటుచూసిన యోగి చిన్నగా ఉలిక్కిపడ్డాడు.

“ఇంపాసిబుల్!” యోగి చకచకా వచ్చి మునివేళ్ళమీద కూచుని చటుక్కున రిస్ట్ పట్టుకుని పల్స్ చూసాడు. కొంచెం నీరసంగానైనా కొట్టుకుంటూనే ఉంది నాడి. “అయామ్ డాక్టర్ యోగి” అన్నాడు తనవైపు చిరాగ్గా చూసిన ఏంబులెన్స్ డాక్టర్‌తో. “ఓ” అనేసి స్ట్రెచర్ తెమ్మని సైగ చేసాడతను.

నీలాంబరి తనుకూడా వచ్చి పక్కనే మునివేళ్లమీద కూచోడం చూసి సంభ్రమాశ్చర్యాలతో విష్ చేసాడు ఏంబులెన్స్ డాక్టరు. స్పృహ లేకుండా పడున్న కుర్రవాడి గాయాలను కళ్ళు చిట్లించి దగ్గరగా పరీక్షించించింది నీలాంబరి. లేచి నిలబడి కాస్త అవతలగా చేతులు నలుపుకుంటూ కళ్ళనీళ్ళ పర్యంతమై నిలబడ్డ కుర్రవాడి తండ్రి మొహంలోకి చూసి నవ్వింది నీలాంబరి.

“ప్రాణాపాయం లేదుకదా?” ఏడుపుగొంతుతో అడిగాడు తండ్రి.. “పాత అపాయం కూడా లేదు. చూడండి రక్తం గడ్డకట్టింది”. చూపుడువేలు చాచి గాయంవైపు చూపించింది. నీలాంబరి ముఖంలో విజయగర్వం ఉట్టిపడుతోంది. ఏడుస్తున్న తల్లి ఏడుపాపి వీళ్ళమాటలు వింది. ఒక్క ఉదుటున ముందుకొచ్చి నీలాంబరి కాళ్ళమీద పడిపోయింది. తండ్రి కూడా వొంగుని పాదాలంటుకుని నమస్కారం చేసాడు.

స్ట్రెచర్ మీద కుర్రాడిని పడుకోబెట్టి ఏంబులెన్స్‌లో ఎక్కించారు. ఏడుస్తున్న సెల్ ఫోన్ అమ్మాయితోసహా అందరూ కార్లలో ఎక్కి ఏంబులెన్స్ వెనకే వెళ్లిపోయారు. ఇద్దరు పోలీసులు ఏంబులెన్స్‌తో పాటూ వెళ్ళిపోయారు.

అక్కడే ఉన్న పోలీస్ పార్టీలో కొందరు పిజ్జాహట్ వెయిటర్స్‌నీ ఇతర సిబ్బందినీ ప్రశ్నించడం మొదలుపెట్టారు.

అక్కడున్న సామాన్య పౌరులందరికీ మహా ఆనందంగా, ఎంతో సంతృప్తిగా ఉందిప్పుడు. నిజం హత్యా ప్రయత్నం కళ్ళారా చూసిన ఉత్సాహం, ఎక్సైట్‌మెంట్ ఒకవైపు, దాన్నిమించి నీలాంబరిని అంత దగ్గరగా చూసిన థ్రిల్లు మరో వైపు. “వాళ్ళెవరో చాలా ఇన్‌ఫ్లుయెన్సూ పరపతి గట్రా ఉన్నవాళ్ళై ఉంటారు. నీలాంబరి స్వయంగా ఏం జరిగిందో చూడ్డానికొచ్చిందంటే బాగా పవర్ ఫుల్లయ్యుండాలి” చిన్నగొంతులతో రకరకాలుగా మాటాడుకుంటున్నారు.

“ఆ కత్తి పోట్లు చాలా పైపైన సూపర్‌ఫిషియల్‌గా ఉన్నాయి. పొడిచిన వాడు ప్రొఫెషనల్ కాదు. కిరాయి రౌడీ కాదు. సీజన్డ్ క్రిమినల్ కాదు. ఆ కుర్రాడి రక్తం చాలా తొందరగా గడ్డ కట్టేసింది. పెక్యూలియర్.” అన్నాడు యోగి కొంచె గట్టిగా. కేష్ బాక్స్ దగ్గరున్న ప్రొప్రయిటర్‌తో మాటాడుతున్నపోలీసులు వెనక్కి తిరిగి, ‘చూద్దాం. ముందసలు నీ పని పడతాం’ అన్నట్టు యోగి వైపు కరుకు చూపులు విసిరి మళ్ళీ ప్రశ్నలపరంపర గుప్పించే డ్యూటీలో మునిగి పోయారు.

విడిగా కొంచెం అవతలగా నిలబడి, జరుగుతున్న తతంగాన్ని గంభీరంగా పర్యవేక్షిస్తున్న పొడుగాటి వ్యక్తి మాత్రం కన్నార్పకుండా యోగిని నిశితంగా చూసాడు. యోగి కూడా యథాలాపంగా అతని వైపు చూసాడు.

‘జస్ట్ సింపుల్‌గా ఓ గోచీ పెట్టుకు నిలబడినా సరే ఇతన్ని పోలీసాఫీసరని ఇట్టే పోల్చుకోవచ్చు. ఇతనికి యూనిఫామ్ అక్కరలేదు’ అనుకున్నాడు యోగి. విమల్ యోగికి బాగా దగ్గరగా జరిగి, “ఒరేయ్, ఉందికదా అని నోరూరికే పారేసుకోకు. పోలీసులు మొత్తం కేసు నీనెత్తిన రుద్దేసి జైల్లో తోసేస్తారు. ఏదో అందర్లాగే నోర్మూసుకుందాం. వాళ్ళడిగిందానికి జవాబు చెప్పేసి బయటపడదాం” అని వార్నింగిచ్చాడు. తన స్నేహితుడు నెత్తిమీదికి ఏం తద్దినం తెస్తాడో అన్న భయం అతని ముఖం మీద స్పష్టంగా కనబడుతోంది.

పోలీసులడిగిందానికి తాము చూసినంత మటుకు చెప్పారు అందరూ. అందరివీ ఎడ్రసులూ, ఫోను నంబర్లూ తీసుకుని ‘ఇంక వెళ్ళచ్చు’ అని పర్మిషనిచ్చారు పోలీసులు. ఆ మాట వినగానే బాణాల్లా దూసుకుపోయారు ఎవరి మటుకు వాళ్ళు. తాము చూసిన దానిక్కాసిని చిలవలూ పలవలూ కలిపి ఇంట్లో వాళ్ళకి చెప్పాలని. ఎవరి ఆత్రం వారిది!

“ఆ నీలాంబరీ దేవిని ఇంతకుముందు ఎక్కడో బాగా చూసినట్టుంది. ఎక్కడో గుర్తురావట్లేదు”. అన్నాడు యోగి కారు స్టార్ట్ చేస్తూ. “నీ మొహం. గత రెండు నెలలుగా ఎలక్షన్ కేంపెయిన్‌లో ఆవిడ చేసిన రోడ్ షోనే కవర్ చేసి చచ్చాయి అన్ని రకాల మీడియాలూ. ఆవిడ ముఖారవిందం తప్ప మరేదీ కనిపించక మనం చచ్చాం. ఎక్కడో చూసినట్టండటమేంటీ? ఈవిడే ఆంధ్రప్రదేష్ తొలి మహిళా మరియు సన్యాసీ ముఖ్యమంత్రి అని జోస్యాలు చెపుతున్నారుగా. ఎలక్షన్లవనీ తేలిపోతుంది” అన్నాడు విమల్. ఆలోచిస్తూ కారు ముందుకురికించాడు యోగి. మెయిన్ రోడ్డంతా ఈ చివరినించి ఆ చివరివరకూ కార్డన్ ఆఫ్ చేసేసి. పక్కసందుల్లోకి ట్రాఫిక్కంతా మళ్ళిస్తున్నారు. సందులూ గొందులూ తిరుగుతూ కాస్త వెడల్పుగా ఉన్న వీధిలోకి మళ్ళేసరికి ఆ వీధి వీధంతా జాతర జరుగుతున్నట్టు ఒకటే జనం కిక్కిరిసి ఉన్నారు. సడెన్ బ్రేక్ వేసి కారాపాడు. “ఇదేంటి ఇక్కడ కూడా నీలాంబరి ప్రత్యక్షమౌతుందా?” సణుక్కుంటూ దిగాడు విమల్. యోగి కూడా దిగి నిలబడ్డాడు ఏం చెయ్యాలో తోచనివాడిలా.

“సార్ ఏం జరిగింది? ఎవరైనా విఐపి లొచ్చారా ఇక్కడికి?” దారిని పోయే దానయ్యనెవరినో ఆపి అడిగాడు విమల్. “కాదండీ బాబూ, అదుగో ఆ పచ్చడాబాలో ఓ కుర్రాడు చచ్చిపోయాడు. ఆత్మహత్య అంటున్నారు వీధిలో వాళ్ళంతా. చూసారుగా అప్పుడే పోలీసులు ప్రత్యక్షమయ్యారు” దూరంగాఉన్న పోలీసు వేన్ కేసి గౌరవం గా చూపించి గుంపులో కలిసిపోయాడు దానయ్య. పోలీసువేన్‌కి కొంతదూరంలో ఓ ఏంబులెన్స్ కూడా ఉంది.

“సరిపోయింది. హత్యనించి తప్పించుకొస్తే ఆత్మహత్య అడ్డుకుందేంటీ? ఇప్పుడింటి కెళ్ళిపడ్డం ఎలా?” నీరుగారి పోయినట్టు నీరసించి పోయాడు విమల్. ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చినట్టు యోగి వైపు తిరిగి పెద్ద చప్పుడుతో రెండు చేతులూ జోడించి నమస్కారం పెట్టి, “నాయనా, ఇక్కడ కూడా పోలీసులున్నారు. ఇప్పుడు నువ్వో పేద్ద అపరాధ పరిశోధకుడిలా వేషాలు వెయ్యకు, పిచ్చిగా వాగకు. మనదారిని మనం పోదాం.” బెదిరింపూ, బతిమలాడ్డం కలగలపు చేసి అన్నాడు. “నేనేం మాటాడను. నీకేం భయం అక్కరలేదు.” అన్నాడు యోగి వెంకటేశ్వరస్వామిలా అభయహస్తం చూపించి.

దానయ్యగారికి పచ్చడాబా దాకా చేరుకోడం కష్టం అయింది కాబోలు మళ్ళీ గుంపులోంచి యోగి వాళ్ళున్న చోటికి తిరిగొచ్చాడు. అప్పుడే వీధిలోకి వస్తున్న మరో ఆయన్ని చూసి, “తెలిసిందా మేష్టారు? నితిన్ పోయాడుట, ఆత్మహత్యట?” అన్నాడు.

“ఆఁ! ఏంటి? రామంగారబ్బాయి నితినే? అయ్యయ్యయ్యో!” అన్నాడు మేష్టారు. “ఏదీ, నేనివాళ పొద్దున్నే వెళ్ళిపోవాల్సొచ్చింది. ఇప్పుడేవస్తున్నా. ఎంత ఘోరం! అయ్యోపాపం!” మేష్టారికి అంతకంటే మాటలు దొరకట్లా.

“ఘోరమేలెండి. ఏదో కుర్రాడు కొంచెం మెంటల్లా ఉండేవాడు కానీ మరీ.. ఇలా..”

“అవునవును కాస్త మేదకుడిలా కనపించేవాడు. కానీ ఏం వినయవండీ! కనపించినప్పుడల్లా నమస్కారం పెట్టేవాడు. అసలు ఈ కాలం కుర్రాళ్లల్లా వేషాలేవీ ఉండేవికావు.” పెద్దలిద్దరూ కుర్రాడి జ్ఞాపకాల్లో మునిగారు. ‘వీళ్ళంతా ఈ వీధిలో చాలాకాలంగా ఉంటున్నవాళ్లలా ఉన్నారు’ అనుకున్నాడు యోగి. ఆ ఇంట్లోంచి ఏడుపులు వీళ్ళవరకూ వినిపిస్తున్నాయి.

ఇంతలో పచ్చడాబా లోంచి పోలీసులు ఇవతలకొచ్చారు. ఏంబులెన్స్ లోకి దుప్పటి కప్పిన దేహాన్నెక్కించారు. ఇంకా కొందరు కుటుంబసభ్యులు కాబోలు ఎక్కారు. ఒకాయన హడావిడిగా వచ్చి “పోస్ట్‌మార్టమ్ చేసాకే పార్థివ శరీరాన్ని అప్పగిస్తాం అంటున్నారీ పోలీసులు. పాపం పిల్లాడి తల్లిదండ్రుల దుఃఖం చూడలేకపోతున్నా మనుకోండి” అన్నాడు. నిట్టూర్పులతో వాతావరణం బరువెక్కింది. నెమ్మదిగా ఇంటిముందు జనం చెదిరి పోతున్నారు. కొందరు ఇంట్లో ఉన్న బంధువులతో మాటాడదామని లోపలికి వెడుతున్నారు. రోడ్డు ఖాళీ అవుతోంది. యోగి కారు స్టార్ట్ చెయ్యబోతుంటే ఆగమని, “పోయిన కుర్రాడికి మెంటల్ ప్రాబ్లెమ్ ఉండేదా?” అనడిగాడు విమల్ ఇందాకటి దానయ్యని. “మెంటలంటే మరీ పిచ్చి పిచ్చిగా ఉండేవాడు కాదనుకోండి. ఏదో ముభావంగా తనలో తను అన్నట్టుండేవాడు. కనిపించినవాళ్ళందరినీ మీదపడి కొట్టటాల్లాంటి వేమీ లేవు. మరీ అంత పిచ్చి కాదనుకోండి.” ఎలా చెప్పా లో తెలీక అవస్తపడ్డాడాయన. “ఒక్కోసారి తనలోతనే ఏదో మాటాడుకుంటు న్నట్టూ మధనపడిపోతున్నట్టూ ఉండేవాడు. పాపం! షేక్‌స్పియరు వర్ణించాడు చూడండి మెలాంకలీ అని. అదిగో సరిగ్గా ఆ మెలాంకలీ కనిపించేది అతని మొహంలో” అన్నాడు మేష్టారు. “ఎంత వయసువాడు?” కుతూహలంగా అడిగాడు విమల్. “ఎంతా! ఇంటరు చదువుతున్నాడు. ఇరవై లోపే.” ఎవరో తెలిసిన వాళ్లు కనబడడంతో దానయ్య, మేష్టారు అటువెళ్ళారు.

“మెలాంకలీ – డిప్రెషన్‌కి మరో పేరు. అందమైన పేరు” అన్నాడు విమల్. యోగి ఏమీ మాటడలేదు. “ఏం నీకేం వొచ్చిందీ? మాటపడిపోయిందా బాబూ?” వెటకారంగా అడిగాడు విమల్ కొయ్యలా పెట్టిన యోగి ముఖం చూసి. “మాటాడనని మాటిచ్చాగానీకు” అన్నాడు యోగి. “సరే. పోలీసులు పోయారుగా ఇంక మాటాడచ్చు” అన్నాడు విమల్ నవ్వుతూ.

“మెలాంకలీ అంటే డిప్రెషన్ ఒకటే కాదు. డిజెక్షన్, డెస్పాండెన్సీ, సీరియస్‌నెస్, థాట్‌ఫుల్‌నెస్, డోల్‌ఫుల్, గ్లూమీ, గ్లమ్, సారోఫుల్ ఇలాంటి అర్థాలు చాలా ఉన్నాయి. ఆఖరికి హైపోకాండ్రియా అన్న అర్థం కూడా ఉంది కాబట్టి తొందరపడి ఒక నిర్ణయానికొచ్చెయ్యకు” అన్నాడు యోగి గంభీరంగా. “గొప్పే. అక్కడ పేద్ద డిటెక్టివ్ లాగా వాగావ్. ఇక్కడ నడిచే డిక్షనరీ లాగా పోజూ నువ్వూనూ. నీ గొప్ప లన్నీ నాదగ్గరే!”

“ఎవరిదగ్గరైనా చెప్పగలను. మెలాంకలీ అనే పదం స్కీజోఫ్రేనియా పేషెంట్లకు కూడా అతికినట్టు సరిపోతుంది”. “సరే బాబూ. ఇంక పోనీయ్” యోగి ఇంక ఆగలేదు. డుర్రుమని కారు లాగించేసాడు.

***

సిరి తల్లి మంచం దగ్గరికీ, వీధి గుమ్మంలోకీ కాళ్ళు నెప్పెట్టేలాగా తిరుగుతూనే ఉంది. పక్కింటికీ తమింటికీ మధ్య ఉన్నగోడమీంచి చూస్తూ విరి కోసం ఎదురు చూస్తూనే ఉంది. రెండుసార్లు సుశీలకి కొద్దిగా పాలు కలిపి ఇచ్చింది, కాస్త కోలుకుంటుందని. తనకేం తోచక మూడుసార్లు కాఫీ కలుపుకు తాగింది. సుశీల మాటా పలుకూ లేకుండా ఏదో ఆలోచించుకుంటూ కొంత సేపు ఏడ్చి మెల్లిగా నిద్రలోకి జారుకుంది. నితిన్ ఇంటిముందు పోలీసులు వెళ్ళిపోయాక జనం పల్చబడడం గమనించింది సిరి. ఇంక విరి తనే వస్తుందిలే అనుకుని హాల్లోకి వచ్చి సోఫాలో కూలబడింది. అప్పటికి సాయంత్రం ఏడయింది. గేటు దగ్గర మాటలు వినబడి చూసింది. విరి, సీతమ్మతో బాటు మరో ముగ్గురు ఆడవాళ్ళు లోపలికొస్తున్నారు. వాళ్ళంతా అదే కాలనీలో ఉంటున్న వాళ్లు. సుశీలకు స్నేహితులు.

“నితిన్ వాళ్ళమ్మకి మాటిమాటికీ ఫిట్సొచ్చి పడిపోతోంది. కాస్త కాస్త గ్లూకోజ్ తాగించమంటున్నాడు వాళ్ళ డాక్టరు. సీతమ్మకి గ్లూకోజిచ్చి పంపిస్తాను” అంటూ విరి వంటింటి అల్మైరా దగ్గరకెళ్ళింది. “ఏంటమ్మా సిరి, అమ్మ నితిన్ సంగతి వింటూనే విరుచుకు పడిపోయిందిట కదా.” అంది ఒకావిడ సిరి దగ్గరగా వచ్చి నెమ్మదిగా.

“ఇప్పుడెలా ఉంది?”

“నిద్రపోతోంది. ఏమిటో బాగా ఏడ్చింది ఆంటీ” దిగులుగా అంది సిరి.

మాటలు విన పడ్డాయి కాబోలు, సుశీల కదిలి మంచం మీద లేచి కూచుంది. “అదిగోలేచింది” సంతోషంగా చిన్న కేక పెట్టింది సిరి. అందరూ ఆ గదిలోకి వెళ్ళారు. వాళ్ళలో శ్యామల అన్నావిడ మంచంమీద కూచుని సుశీల చుట్టూ చెయ్యేసి హత్తుకుంది. “ఏమిటి సుశీలా, అలా బెంబేలెత్తిపోకమ్మా ఏదో జరుగుతూంటాయి. కాస్త గట్టిగా నిలబడాలి ఏమొచ్చినా. సిరి ముఖం చూడు. పొద్దున్నించీ నీకోసం దిగులుపడి ఎంతలా పీక్కుపోయిందో!”

“ఏదోలే శ్యామలా, ఏవో జ్ఞాపకాలు. తట్టుకోలేకపోయాను.” అంది సుశీల.

అందరూ కాసేపు మౌనంగా ఉండిపోయారు. విరి గుమ్మం దగ్గరకొచ్చి సిరినివతలకి రమ్మని సైగచేసింది. “ఈ ఆంటీ వాళ్ళంతా నాలాగే పొద్దున్నించీ అక్కడే ఉన్నారు అందరికీ కాఫీ ఇద్దాం. హెల్ప్ చేస్తావా?” అనడిగింది. ఇద్దరూ కలిసి వంటింట్లోకెళ్ళారు.

సుశీల నితిన్ ఇంట్లో విషయాలు నెమ్మదిగా అడిగి తెలుసుకుంటోంది. సన్నగా వినిపిస్తున్న తల్లిగొంతు సిరి చెవులకి మధుర సంగీతంలా వినిపిస్తోంది. పొద్దున్న నించీ తనుపడిన ఆందోళనంతా తీరిపోయి మనసు తేలికైంది.

“అసలక్కడంతమంది ఉండగా నువ్వెందుకక్కడ చేరావ్? ఇంత సేపూ ఇక్కడ అమ్మకెలా ఉందో అనిపించలా? మధ్యలో ఒక్కసారొచ్చి చూసిపోతే ఏంపోయిందీ? అన్నిటికీ తగుదునమ్మాంటూ పెత్తనానికి పోతావ్” విరిని ప్రేమగా కసిరింది సిరి.

“సరేలే! ఈ ఆంటీలందరూ నితిన్ వాళ్లమ్మతో పాటూ ఏడుపే ఏడుపు! నేనే అందరిలోకీ కాస్త నయం. వాళ్ల ఫేమిలీ డాక్టర్ని పిలుచుకొచ్చి ఆంటీకి మందిప్పించాను ఫిట్సొచ్చినప్పుడు. ఆ అంకుల్‌కి ఫోన్లు చేసీ, ఆయనొచ్చే లోపల చుట్టాలందరికీ ఫోన్లు చేసీ, వర్కింగ్ డే కదా అంకుల్సెవరూ ఇళ్ళల్లో లేరు” చెపుతూనే దిగులు ముఖం పెట్టింది విరి. “ఏంటోనే. మనం నితిన్ గురించి మరీ అన్యాయంగా రెచ్చిపోయి జోకులే సేసుకున్నాం ఇవాళ” కళ్లల్లో నీళ్ళు ఉబికొచ్చాయి. సిరిక్కూడా ఏడుపొచ్చింది. ఇద్దరూ కళ్లు తుడుచుకుని, ట్రే లో కాఫీ కప్పులు పట్టుకుని సుశీల గదిలోకెళ్ళారు. “సుశీలా నీ పిల్లలు ముత్యాలు. నిజంగా పొద్దున్నించీ విరి ఒక మగపిల్లాడిలా చేసింది.” శ్యామల మెచ్చుకుంది.

అందరికీ కాఫీలందించి ఇవతలకొచ్చారు విరి, సిరి. “అసలు పోలీసులెందుకొచ్చారు?” హాల్లోకూచున్నాక నెమ్మదిగా అడిగింది సిరి. “అదే ఎవరికీ అర్థం కాలా. పోలీసులకెవరు ఇన్ఫార్మ్ చేసారో! పాపం అంత కష్టంలో ఉన్నారు ఆ ఆంటీ వాళ్లు. మధ్యలో పోలీసులొచ్చి అందరినీ ఏవేవో అడగడం. పోస్ట్‌మార్టమ్ కోసం తీసుకెళ్ళి పోయారు. నీకు తెలుసా నితిన్‌కి చాలాకాలం నించీ సైకియాట్రిక్ ట్రీట్‌మెంటిప్పిస్తున్నార్ట. అంటే తెలుసా? మెంటల్ ప్రాబ్లెమ్‌కి ట్రీట్‌మెంట్.”

“తెలుసులే ఆమాత్రం”.

సిరి ఆలోచనలో పడింది. ఏవేవో సందేహాలు. ఎవరు చెప్తారు జవాబు?

“అన్నట్టసలు వాళ్ళ మేనమామ ఒకాయన సైకియాట్రిస్టుట. ఆయనే ట్రీట్ చేస్తున్నాడ్ట నితిన్‌ని. ఆయనకూడా వచ్చాడు నేనక్కడుండగానే. నితిన్‌కున్న మానసికవ్యాధి పేరు స్కీజోఫ్రేనియాట. ఆ డాక్టరు గారు స్కీజోఫ్రేనియా పేషంట్లలో ఆత్మహత్య రిస్కుంటుంది అన్నారు.” అక్కడ జరిగిన సంభాషణ మనసు లో ఇంకా ప్రతిధ్వనిస్తోంది విరికి.

“ఏంటన్నావూ ఆ జబ్బు పేరూ?” అడిగింది సిరి.“స్కీజో ఫ్రేనియా” స్పష్టంగా వినపడేలా చెప్పింది విరి.

లేచి వీధిగది తలుపు వేసింది సిరి. “ఆంటీలు, అమ్మ కబుర్లు చెప్పుకుంటున్నారులే. ఇంటర్నెట్ ఓపెన్ చేసి స్కీజోఫ్రేనియా అంటే ఏంటో చూద్దాం” ఇద్దరూ తమ గదిలోకెళ్ళి కంప్యూటర్ ఆన్ చేసారు. సరైన స్పెల్లింగ్ ఏమిటో కంప్యూటరే చెప్పింది. వికీపీడియా ఓపెన్ అవగానే మానిటర్ నిండా పరుచుకున్న సమాచారం చూసి ఇద్దరూ ఒకేసారి “వావ్!!” అని ఆశ్చర్యపోయారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here