మన సినిమాల్లో మహిళ- ప్రేమ

0
5

[box type=’note’ fontsize=’16’] “ప్రేమ అనే భావన లోని విభిన్న అంశాలను అద్భుతంగా చిత్రించినవి ఈ చిత్రాలు” అంటూ మూడు ముచ్చటైన తెలుగు సినిమాల గురించి ముచ్చటిస్తున్నారు ఇంద్రగంటి జానకీబాల. [/box]

[dropcap]ప్ర[/dropcap]పంచంలో ‘ప్రేమ’ అనే భావనకి మించిన అంశం మరోటి లేదు. స్త్రీ పురుషుల మధ్య ఏర్పడే ఈ ప్రేమ ఎంత శక్తివంతమైనదంటే దాన్ని మళ్ళించడం ఎవరితరమూ కాదు. అలాంటి ప్రేమలో పడ్డవాళ్ళు ఎవరు ఏం చెప్పినా వినిపించుకోరు. దాని కోసం ప్రాణాలైనా విడువడానికి సిద్ధంగా వుంటారు.

నిజానికి మన తెలుగు ప్రాచీన సాహిత్యంలో ఈ ‘ప్రేమ’ అనే భావనకి పెద్దగా ప్రాముఖ్యత లేదని అనిపిస్తుంది. మన కావ్యాలు, ప్రబంధాలు స్త్రీ బాహ్య సౌందర్యాన్ని ఆరాధించినంతగా అంతరంగ అనుభూతి అయిన ప్రేమను ఎక్కువగా పట్టించుకోలేదనిపిస్తుంది. అందుకే ఏ స్త్రీ పాత్ర చూసినా అంగాంగ వర్ణనలతో ముంచెత్తి ఆమెను ఒక భోగవస్తువుగా చూశారు. పురుషుడి దృష్టిలో ఆమెని ఒక అనుభవించదగ్గ వస్తువుగానే భావించారు గానీ ఆమెకి ఒక మనసు – అందులోని ఆవేశకావేశాల గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఇతిహాసాలలోని స్త్రీ పాత్రలకిది వర్తించదు.

ఆధునిక సాహిత్యంలో ముఖ్యంగా భావకవిత్వ ధోరణిలో ఆ ఉద్యమంలో స్త్రీకి, ఆమె మనసుకి ఆమె ప్రేమకి ఎంతో ఉన్నత స్థానం కల్పించారు. ప్రేమ కవిత్వం వ్రాయని కవి లేరు. ప్రేయసిని ఊహించని రచయిత లేరు. ఆమె ఎడబాటును నరకంగా వర్ణించి, ప్రేమ అనే ఒక మానసికావస్థకు పట్టం గట్టారు. ఒకప్పుడు ప్రేయసి మీద కవిత్వం వ్రాయడం ఒక ఫ్యాషన్‌గా మారింది. సాహిత్యంలోంచి, ప్రజల ఆలోచనల్లో నుంచి పుట్టుకొచ్చిన కళ సినిమా. అసలు సినిమా అంటేనే ఒక అబ్బాయి అమ్మాయి చుట్టూ తిరుగుతుంది కథ. ఆ కథలో ఎన్నో అంశాలు, సమస్యలు, సందర్భాలు వుండచ్చు కానీ వాటన్నిటినీ ముడిపెట్టి నడిపించే ఒక అంతస్సూత్రం ప్రేమగానే నిలుస్తుంది. కథను నడిపిస్తుంది.

ప్రేమ అనేది దావానలంలా వ్యాపించి హృదయాలను మండించి మాడి మసైపోతుంది. ఒకసారి ఆ ధ్యాసలో పడినవారు తిరిగి మామూలు మనుషులవ్వడం అసాధ్యం అని చెప్పే ఉదాహరణలు మనకు ఎన్నో వున్నాయి.

తెలుగు సినిమా 1950ల నుండి రకరకాల కథాంశాలతో అద్భుతాలు చేసింది. అపురూపమైన చిత్రాలు నిర్మించింది. తెలుగు సినిమాకి ఒక శాశ్వత కీర్తి తెచ్చిన ఆనాటి పరిశ్రమ, అందులో మేధావులు చిరస్మరణీయులు. కళ పట్ల వారికున్న లాలస, భక్తి, నిజాయితీ వారిని కళాఖండాలు నిర్మించేలా చేసి చూపించాయి.

యాభైలలో వచ్చిన మూడు ముచ్చటైన సినిమాల గురించి ముచ్చటించుకుందాం అని ఈ ప్రయత్నం. ఈ మూడు సినిమాల్లోనూ ప్రధానాంశం ‘ప్రేమ’. కానీ ప్రేమ రూపం చాలా భిన్నంగా ఉంటుంది. అలా ప్రేమ అనే భావన లోని విభిన్న అంశాలను అద్భుతంగా చిత్రించిన మూడు చిత్రాలు మన తెలుగు సినిమా కళాఖండాలు.

అవి (1) మల్లీశ్వరి 1951 (2) దేవదాసు 1953 (3) పాతాళభైరవి 1951

ఒకటి జానపద కథ – కృష్ణదేవరాయల కాలంనాటి కథగా నడుస్తుంది.

రెండోది శరత్‌బాబు (శరత్ చంద్ర ఛటర్జీ బెంగాలీలో) రచించిన దేవదాసు నవల ఆధారంగా నడుస్తుంది. జమీందారుల కాలం నాటి సంస్కృతి, సంప్రదాయం, సంపద, వాటి వెనుక వుండే అహంకారాలు ఇందులో కనిపిస్తాయి.

మూడవది పాతాళ భైరవి. పదహారణాల భారతీయ జానపద కథ. ఇందులో మాయలు – మర్మాలు – నరబలులు – ఉపాసన – మాంత్రికులు – ధైర్యసాహసాలు గల సామాన్య యువకుడు రాజకుమారిని ప్రేమించి ఆ ప్రేమ కోసం సాహసం చేయడం – ఆ ప్రేమను సాధించుకోవడమే సినిమా.

***

మళ్లీ మొదటి కొద్దాం – మల్లీశ్వరి సినిమా మొదటినుంచి సున్నితంగా, సుకుమారంగా, అందంగా, హాయిగా సాగే సినిమా. దానికి కూర్చిన సంగీతమూ అత్యంత లాలిత్యంతో అద్భుత సంగీత ప్రతిభతో అలరారుతుంది. ఈ కథ రేఖామాత్రంగా బుచ్చిబాబు గారు వ్రాసిన ‘రాయలు కరుణ కృత్యం’ అనే రేడియో నాటకం ఆధారం అంటారు. దానిని బి.యన్.రెడ్డి (దర్శకులు) సినిమాకి అనుకూలంగా మలచుకున్నారు. ఈ మల్లీశ్వరి సినిమాకి కథ, మాటలు, పాటలు అన్నీ శ్రీ దేవులపల్లి వేంకటకృష్ణశాస్త్రి గారు. ఈ ‘మల్లీశ్వరి’ సినిమాకి కథ, దర్శకత్వం, నటీనటులు ఎంత అందంగా కుదిరాయో, అంతకుమించి సాలూరి రాజేశ్వరరావు సమకూర్చిన సంగీతం అమరింది.

నాగరాజుది, మల్లీశ్వరిదీ అందమైన బాల్యం. వాళ్ళిద్దరూ బావా మరదళ్ళు. బట్టలు నేయడం కులవృత్తిగా గలవారు. స్వేచ్ఛా స్వాతంత్రాలతో బతుకుతూ వుంటారు. మల్లీశ్వరి తండ్రి స్థితిమంతుడు గానీ, నాగరాజు తండ్రి చిన్నతనంలోనే చనిపోవడం వల్ల నాగరాజు కుటుంబం పేదరికంలోనే మగ్గుతూ ఉంటుంది. ఆ తల్లీ కొడుకులకు మల్లి అంటే ప్రాణం.

“ఓ బావా! నా బావా! ఓ రాజా! నా రాజా!” అంటూ సాగుతూ – “కోతీ బావకు పెళ్ళంటా – కోవెల తోటా విడిదంటా” అంటూ ఆనందంగా సాగుతూ – ఒకసారి అనుకోని వర్షంలో చిక్కుకొని – “పిలిచినా బిగువటరా” అని పాట పాడి రాజుగారి కంట పడుతుంది మల్లీశ్వరి – ఆకతాయితనంగా అడిగిన రాణివాసపు పల్లకి వాకిట్లో వచ్చి నిలుస్తుంది. నాగరాజు లేని సమయంలో మల్లీశ్వరి రాణివాసపు పల్లకి ఎక్కి రాణిగారి ఇష్టసఖిగా కుదురుకుంటుంది. అక్కడినుంచి అన్నీ అద్భుతమైన పాటలు – విరహ గీతాలు – ఆటవిడుపు ఆశలు – అన్నీ మనల్ని సంగీత సాహిత్య సౌరభాలలో ముంచెత్తుతాయి.

ఎవ్వరేమని కందురూ – ఎవ్వరేమని విందురూ –

ఈ జాలిగాథా – ఈ విషాద గాథా –

నెలరాజా – వెన్నెల రాజా

ఈ పాటలకి ఆరో ప్రాణం పి.భానుమతి గళం. ఆమె పాడిన తీరు, చూపించిన ప్రతిభ, ఎవరికీ లొంగని గమకం, ఎవ్వరినీ పోలని కంఠ మాధుర్యం – ఇవన్నీ భానుమతిని శిఖరాగ్రాన నిలబెట్టాయి.

‘అందాల ఓ మేఘమాల’ యుగళగీతంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన తీరు, పలికిన దుఃఖం ప్రేక్షక శ్రోతలను మైమరపింపచేశాయి.

‘అవునా! నిజమేనా’ అంటూ కృష్ణశాస్త్రి చాలా మామూలు మాటలతో కోటలు కట్టి, వాటి మీంచి మన అందరినీ దూకించారు – అన్నీ అద్భుత బాణీలే.

అయిష్టంగా మల్లీశ్వరి రాజాంతఃపురంలో ఒకపక్క – పిచ్చివాడై దేశాలు పట్టి రాజుగారి నిర్మించే చిత్రంలో శిల్పిగా నాగరాజు మరోపక్క.

‘ఎందుకే నీకింత తొందర’ – ప్రియసఖి జలజ సాయం – దాన్నంటి పెట్టుకుని అపాయం – బందీ అయిన ప్రియుడు – అతన్ని కాపాడాలని ప్రియురాలు.

ఇద్దరినీ మన్నించి తమ గొప్ప మనసు చాటుకున్న శ్రీకృష్ణదేవరాయలు.

“మనసున మల్లెల మాలలూగెనే

కన్నుల వెన్నెల డోలలూగెనే”

అనేది ఆంధ్రులు మరువలేని అద్భుత గీతం.

‘మల్లీశ్వరి’ – వాహిని వారి సినిమా – 1951 రిలీజ్

దర్శకత్వం – బి.ఎన్.రెడ్డి

రచన – శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి

సంగీతం – సాలూరి రాజేశ్వరరావు

ప్రధాన నటీనటులు – నందమూరి తారక రామారావు, భానుమతి

ఈ సినిమాలో భానుమతి పాటలు ఒక ప్రత్యేకం. అవి నభూతో నభవిష్యతి, అంతే.

ఈ సినిమా రూపుదిద్దుకోవడానికి కృషి చేసిన యూనిట్ అందరూ అభినందనీయులే. కళాదర్శకులు, కెమెరా చేసిన వారు, ఆహార్యం చూసిన వారు, ఎంత చిన్న పాత్రలోనైనా అద్భుతంగా నటించి రక్తికట్టించిన ప్రతివారు చిరస్మరణీయులు, అభినందనీయులు. అదీకాక ఈ చక్కని సంగీత చిత్రానికి గొప్ప విజయాన్ని చేకూర్చిన తెలుగు ప్రేక్షకులు అభినందనీయులు. ‘మల్లీశ్వరి’ సుఖాంతం అవడం వల్ల అందరూ హాయిగా ఊపిరి పీల్చుకుని బయటకు వస్తారు. ‘మల్లీశ్వరి’ అనే పేరును మళ్లీ మళ్లీ ఉపయోగించినా ఇలాంటి సినిమా తీయడం సాధ్యం కాదు ఎవరికి.

***

రెండో సినిమా దేవదాసు:

శరత్ చంద్ర ఛటర్జీ (శరత్‌బాబుగా ప్రసిద్ధులు) బెంగాలీలో వ్రాసిన నవల ‘దేవదాసు’. దాన్ని ఆధారం చేసుకొని హిందీలో కూడా రెండు మూడుసార్లు సినిమాలు తీశారు. నవల అనువాదం ఆధారంగా తెలుగులో వినోదావారు ఈ ‘దేవదాసు’ చిత్రాన్ని నిర్మించారు. అయితే ఆర్థికంగా బలహీనంగా ఉన్న ఆ సంస్థ చాలా కష్టాలు పడి పూర్తి చేసింది. సాంకేతికపరమైన ఏ హంగులు ఇందులో కనిపించవు. అందువల్ల ‘మల్లీశ్వరి’, ‘పాతాళభైరవి’ సినిమాల ముందు ఇది టెక్నికల్‌గా తక్కువ స్థాయిగా కనిపిస్తుంది.

అయితే ఈ ‘దేవదాసు’కు రచన, దర్శకత్వం, నటీనటుల ప్రతిభ, సంగీతం అద్భుతంగా అమరాయి. సముద్రాల రాఘవాచార్య, వేదాంతం రాఘవయ్య, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ఈ సినిమా వల్ల శాశ్వత కీర్తిని మూట కట్టుకున్నారు.

సి.ఆర్.సుబ్బరామన్ సంగీతం అత్యంత ఉన్నత స్థానంలో కుదిరింది. గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రతి ట్యూన్‌కీ ప్రాణం పోశారు. కె.రాణి ఈ ‘దేవదాసు’తో శాశ్వతంగా సినిమా చరిత్రలో నిలిచిపోయారు. నేపథ్య సంగీతం అద్భుతంగా, అర్థవంతంగా సమకూర్చారు సి.ఆర్.సుబ్బరామన్.

ఇందులో కొన్ని పాటలు సముద్రాల వారికి వెనుకగా మల్లాది రామకృష్ణశాస్త్రి గారు వ్రాశారని సినీ చరిత్రకారులు చెబుతారు. ఆ పోకడలు కనిపిస్తూంటాయి కూడా. అప్పట్లో నెంబర్ వన్‌లుగా ఉన్న నేపథ్య గాయనులు పి.లీల, జిక్కి పాడకపోవడానికి వీరు ఎక్కువ పేమెంట్ చేయలేకపోవడమేనని జిక్కి (పి.జి.కృష్ణవేణి) ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అందుకే ఆమె ‘ఓ దేవదా’ (పెద్దయ్యాక) మాత్రమే ఘంటసాల వారితో పాడారు. ‘చెలియ లేదు’, ‘అంతా భ్రాంతియేనా’ కె.రాణి పాడారు.

అయితే ఎవరు పాడారు అనేది శ్రోతలు పట్టించుకోనంత గొప్ప ట్యూన్స్ (బాణీలు) సి.ఆర్.సుబ్బరామన్ చేశారు. దేశమంతా ఆ పాటలతో మారుమోగిపోయింది. ఈనాటికీ నిత్య నూతనంగా వినిపిస్తూనే వున్నాయి. ఒక్క రావు బాలసరస్వతి పాడిన మూడు పాటలు ఆమెకు ఎనలేని కీర్తిని ఆర్జించి పెట్టాయి. అప్పటికే ఆమె నెంబర్‍ వన్ గాయని. డబ్బు పట్టించుకోకుండా పాడిన గాయని.

  1. అందాల ఆనందం ఇందేనయ్యా
  2. ఇంత తెలిసి యుండి (మువ్వగోపాల పదం)
  3. తానే మారేనా గుణమే మారెనా -.

ఇలాంటి పాటలు మరింక రాలేదంటే అతిశయోక్తి కాదు. అటు సాలూరి వారి బాణీలు, ఇటు సుబ్బరామన్ బాణీలు వేటికవే ధ్రువతారల్లా నిలిచాయి.

కథను తెలుగు వాతావరణానికి చక్కగా మలచారు. ఆర్భాటాలు లేని దృశ్యాలు, అత్యంత సహజమైన సంభాషణలు, సన్నివేశాలు – సన్నివేశాలకు అనుగుణంగా నటీనటుల అభినయం చిత్రాన్ని ఉన్నతస్థానంలో వుంచాయి. ఎస్.వి.రంగారావు, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, పేకేటి శివరాం, సురభి కమలాబాయి మొదలైన అందరూ చిన్న చిన్న పాత్రల్లోనూ ఎంతగానో గుర్తుండిపోతారు. వారక్కడ అలాగే వుండాలనిపిస్తుంది. మరోలా ఊహించే అవకాశమే లేకుండా వుంటుంది. అది రచయిత, దర్శకుల ప్రతిభగానే చెప్పుకోవాలి. సావిత్రి పార్వతిగా – లలిత చంద్రముఖిగా ఆ పాత్రలో జీవించారు (లలిత – పద్మిని- రాగిణి తిరువాన్కూర్ సిస్టర్స్‌గా, డాన్సర్లుగా అప్పటికే ప్రసిద్ధులు).

‘దేవదాసు’తో అక్కినేని నాగేశ్వరరావు ఆకాశాన్నంటే కీర్తి సంపాదించుకున్నారు. చివర దేవదాసు – పార్వతీ కలుసుకోని విషాదాంత గాథ ఈ ‘దేవదాసు’. అయినా విరగబడి చూసి, కళ్ళు వాచిపోయేలా ఏడ్చి, మళ్లీ మళ్లీ వెళ్లి చూసి పాటలు విని, బయటకొచ్చి పాడి ఆంధ్రులు దుఃఖంతో ఆనందపడ్డారు.

‘మల్లీశ్వరి’ సొగసుల సౌందర్యాల అందమైన ప్రేమ కథ. అది సుఖాంతం. నాటకం ఎంత నడిచినా చివరికి నాయికా నాయకులు కలుసుకుంటారు. వారి ప్రేమలో అందం, ఆనందం, త్యాగం అన్నీ సంగీత సాహిత్యాల మిళితమై హృదయాలను అలరించాయి. కానీ ‘దేవదాసు’ సినిమాలో సమాజం ఇద్దరు ప్రేమికుల్ని విడదీసిన తీరు – సాంఘిక కట్టుబాట్లు – దేవదాసు తెగువలేనితనం – పార్వతి పరాధీనత – చంద్రముఖి విలువ కట్టలేని ప్రేమ – సేవ – పెద్దల పట్టుదల – పడుచు మనసులు బలి అయిన తీరు – దుఃఖమే దుఃఖం.

అప్పట్లో ప్రతి అబ్బాయిలో ఒక దేవదాసు – ప్రతి అమ్మాయిలో ఒక పార్వతి వున్నట్లు యువతరం భ్రమసిపోయింది.

సాంకేతికంగా అంత గొప్పగా లేకపోయినా ఆ సినిమాలోని ప్రాణశక్తి దాన్ని విజయం వైపు నడిపించింది. వినోద వారి ‘దేవదాసు’ను మించిన దేవదాసు ఇంతవరకు రాలేదు. ముందు ముందు ఉండదు.

దేవదాసు లాంటి మెత్తని మనసున్న వాడు –

పార్వతి లాంటి ఆత్మాభిమానం గల యువతి

భగవాన్ లాంటి తొందరపాటు గల మంచి మిత్రుడు

కళావంతుల ఇంట పుట్టి అభిమానవతి ఆదర్శ స్త్రీగా మారిన చంద్రముఖి

మరింక మరెప్పుడు తెలుగు సినిమాల్లో కనిపించరు.

  1. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్, ఓడిపోలేదోయ్’-
  2. ‘జగమే మాయ – బ్రతుకే మాయ’,
  3. ‘అంతా భ్రాంతియేనా’,
  4. ‘చెలియ లేదు – చెలిమి లేదు’,
  5. ‘పల్లెకు పోదాం – పారును చూద్దాం’
  6. ‘ఓ దేవదా -‘
  7. బాలసరస్వతి పాడిన మూడు పాటలు ఆణిముత్యాలు – మళ్ళీ మళ్ళీ దొరికేవి కావని అందరికీ తెలుసు.

వాటిని మళ్ళీ మళ్ళీ నెమరేసుకొని వింటూ కాలక్షేపం చేయడమే తెలుగువారి పని – అంతే.

***

ఇక మన మూడో సినిమా ‘పాతాళభైరవి’ (1951). ఇది విజయా ప్రొడక్షన్స్ వారి రెండో సినిమా. ఈ ‘పాతాళభైరవి’ రసవత్తరమైన లబ్జుగా నడిచే వీరోచిత ప్రేమ కథ. ‘ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు’ – అంటూ ఆంధ్రులందరూ ఏకకంఠంతో పాడుకున్న అద్భుత ఘట్టమది.

ఈ ప్రేమ కథ సుఖాంతం కావడంతో ప్రేక్షకులు హాయిగా ఊపిరి పీల్చుకొని పాటలు పాడుకుంటూ బయటకు వస్తారు. మాయలు – మంత్రాలు – వేరే లోకాలు – దేవతలు – ఇవన్నీ ప్రేక్షకులను అద్భుతాశ్చరాలతో ముంచెత్తి వేస్తాయి.

ధైర్యసాహసాలు గల తోటరాముడు (ఎన్.టి.ఆర్), మాయల ఫకీరు (ఎస్.వి.రంగారావు), మెత్తని మనసు గల రాజు (సి.ఎస్.ఆర్.), రాణిగారి తమ్ముడు (రేలంగి) ముద్దులగుమ్మ రాజకుమారి ఇందుమతి (మాలతి) – ఇంకా ఎందరో వుండి కథ నడిపిస్తారు.

ధైర్యసాహసాలు గల తోటరాముడు – ఒక అనుకోని సందర్భంలో రాజకుమారిని చూసి వెంటనే ప్రేమించేస్తాడు. ఆమెను పెళ్ళాడాలంటే సిరిసంపదలు, భోగభాగ్యాలు, మందీమార్బలం ఉండాలని రాజుగారు ఆంక్ష పెడతారు.

సాహసవంతుడు – ఏ మచ్చలేని వీరుడైన యువకుడిని బలి చేస్తే పాతాళభైరవి ప్రత్యక్షమై కోరికలు తీరుస్తుందని మాయల ఫకీరు అలాంటి వారి కోసం వేట మొదలు పెడతాడు. ఉజ్జయిని వస్తాడు. వీరుడైన తోటరాముడు మాంత్రికుడిని బోల్తా కొట్టించి పాతాళభైరవి బొమ్మతో వస్తాడు. పెళ్ళిపీటల మీద మోసం బయటపడి, మళ్లీ మామూలు స్థితికి వస్తాడు. అయితే అతని సాహసం, మాంత్రికుడి స్త్రీ వ్యామోహం కథను సుఖాంతం చేస్తాయి. పింగళి నాగేశ్వరరావు రచనకి కె.వి.రెడ్డి దర్శకత్వం అడుగడుగునా ఆశ్చర్యం, ఆనందం, ఉల్లాసంతో కథ ముందుకు నడుస్తుంది. బంగారు కిరీటానికి వజ్రాలు పొదిగినట్లు ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీతం, పాటలు చెవులకింపుగా వినిపిస్తాయి. పింగళి గారి పాటలు కొత్త తరహా పలుకుబడులతో హుషారు కలిగిస్తాయి.

తీయని ఊహలు హాయిని గొలిపే (పి.లీల)

ఎంత ఘాటు ప్రేమయో (పి.లీల, ఘంటసాల)

కలవరమాయే మదిలో నా మదిలో (పి.లీల, ఘంటసాల)

ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు (పి.జి.వర్మ)

కనుగొన గలనో లేనో (ఘంటసాల)

వినవే బాల నా ప్రేమ గోల (రేలంగి వెంకట్రామయ్య)

ఇంకా ‘ఇతిహాసం విన్నారా’, ‘వగలోయ్ వగలు’ లాంటివి కథని అనుసరిస్తూ వుంటాయి.

ప్రతి పాటలోనూ పింగళి వారి చమత్కారం తళుక్కుమంటుంది. ఘంటసాల వారి నిబద్ధత కనిపిస్తుంది. చిత్రీకరణలో కొత్తదనం ముగ్ధుల్ని చేస్తుంది. పాతాళభైరవి పామరుల్నీ – సామాన్యుల్నీ – అత్యంతంగా ఆకర్షించిన చిత్రం. ఈ సినిమాకి వాడిన కెమెరా (మార్కెస్ బార్ట్ల్), సౌండు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ రీతిలో వుంటాయి.

***

అయితే మూడు సినిమాలు మహా విజయాలు సాధించి ప్రేక్షకులను అలరించినా మల్లీశ్వరికి ఒకలాంటి పేరు – దేవదాసుకు మరో రకమైన కీర్తి – పాతాళభైరవికి విచిత్ర ఆకర్షణ లభించాయి. సంగీతం అత్యంత ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ సంగీతపరంగా మల్లీశ్వరికీ, దేవదాసుకి ప్రత్యేక స్థానం లభించింది. సాలూరి రాజేశ్వరరావు, సి.ఆర్.సుబ్బరామన్ ఈ విషయంలో ఘంటసాల వెంకటేశ్వరరావు కంటే ఎక్కువ మార్కులు కొట్టేశారు. ఒకదానితో మరొకదాన్ని తూచడం కష్టమే అయినా ప్రేక్షక శ్రోతలు ఒకలాంటి తూకపురాళ్ళని ఉపయోగించారనిపిస్తుంది.

ఈ మూడింటిలో రెండిట్లో ఎన్.టి.రామారావు, ఒకదానిలో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్రలు పోషించారు.

భానుమతి – సావిత్రి ఇద్దరూ ప్రతిభావంతులే. భానుమతి పాట – సావిత్రి నటన ఆ రెండు సినిమాలకు ఎంతో దోహదపడ్డాయి. మాలతి అంత పెద్ద నటి కాదు. ఆమెకంత పాత్ర కూడా లేదు. అందుకే ముద్దు ముద్దుగా ముచ్చటగా చూపించి రక్తి కట్టించారు దర్శకులు.

ఎన్ని కాలాలు మారినా, యుగాలు గడిచినా స్త్రీ పురుషుల మధ్య ‘ప్రేమ’ అనే భావం నశించిపోదు. దానికి కులం – మతం – జాతి – దేశం – ప్రాంతం – ఇలాంటి భేదభావాలు వుండవు. అలాగని ఎవరు ఎవర్ని ఎప్పుడు ప్రేమించి బాధల్లో పడిపోతారో ఎవ్వరూ కనిపెట్టలేరు.

అలాంటి ఒక ‘ప్రేమ’ సినిమాకి ఆరో ప్రాణం. అది ఏ కథతో నడుస్తున్నా దానికి అనుసంధానమైన ప్రేమ కథ ఉంటుంది. ఆ ప్రేమను దక్కించుకోవడం కోసం ఆ ప్రేమికులు నానా పాట్లు పడతారు. ఒకసారి ఆ యుద్ధంలో నెగ్గుతారు, మరోసారి పరాజయం పొందుతారు. ఏది ఏమైనా ప్రేమ ప్రేమే. అది లేని ఏ కళారూపమైనా నెగ్గుకు రావడం కష్టమే. అందుకే అధ్వాన్నంగా రూపొందించినప్పటికీ ‘ప్రేమ’ అనే వస్తువుని ఎక్కడో ఒకచోట పెడతారు. కాలం మారి నిజమైన ప్రేమ స్వభావం కూడా సినిమాల్లో మారిపోయింది. 1951, 1953లో వచ్చిన ఈ మూడు ప్రేమ కథా చిత్రాలు తెలుగు సినిమా చరిత్రలో కళాఖండాలుగా నిలిచాయి. వీటిలో ప్రేమ అనేది ఎన్ని రకాలుగా వుంటుందో అనేది అర్థమవుతూ ఉంటుంది.

ఇంకా ఎన్నో కథలున్నాయి. వీలును బట్టి వాటి గురించి మాట్లాడుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here