[dropcap]కూ[/dropcap]లిన కలలు
నీ పై నా ఆశలు
బిందువులై పోనీ
కడలి కన్నీరవనీ
వగచిన వలపు
నిను కానని చూపు
విడిపడి రానీ
మోడై పోనీ
పరివర్తనమెరుగని మనసు
మరిమరి పతనమయిపోనీ
పగలెరుగని పాడు ప్రేమ
పడి పడి లేవక పగిలి పోనీ
కానగ రాని కరుణ
అస్పృస్యమాయె
మనదన్న పయనం
దారితప్పి పోయె
కదలని మెదలని కాలం
కళ్శప్పగించె
అలసిన విసిగిన
మది స్తంభించె
నిను చేరిన నాలో
నను కానని నైరాశ్యం
మాటలు దొరకని మనసున
మోసపు మాయాజాలం
రాగలవా తేగలవా
నీకర్పించిన జీవన మాధుర్యం
ఇచ్చుకుంటా పుచ్చుకుంటావా
నీవిచ్చిన బడబాగ్ని ఫలం
శరణం రణమవుతున్నది
మోహం క్రోధమవుతున్నది
తపన దహనమవుతున్నది
నీ దూరం అవగతమవుతున్నది
కలగన్నానా నినుగన్నానా
విషము చిమ్మిన నీ వైరం
ప్రతిఘటించమంటున్నది
ప్రతిధ్వనిస్తున్నది
కదలిపో వదలిపో
కారుణ్యమెరుగని అరణ్యాన
మిగిలిపో విరిగిపో
నిను వదలని నైరాశ్యాన