మై హూఁ యమధర్మరాజ్!

0
3

[dropcap]లే[/dropcap]డీస్ క్లబ్‌లో చర్చలు మహా జోరుగా నడుస్తున్నాయి. కొత్త సీఓ గారి భార్యగారు వచ్చాక, మెస్ పార్టీలల్లో, లేడీస్ క్లబ్ తరుఫు నుంచి కూడ ఓ ప్రోగ్రాం ఉండాలని ప్రతిపాదించారు.అందరమూ ఉత్సాహంగా ఓకే అనేసాము. మొదటి సారి, యూ.పి. ఆవిడ కావటంతో,ఆవిడ కోరిక మీద, చక్కగా, రంగురంగుల లక్నో కుర్తా పైజామాలు వేసుకొని, మేకప్ చేసుకొని మరీ ఖవాలీ పాడాము. పార్టీలో ఆఫీసర్స్ అందరూ తెగ మెచ్చేసుకొని, మా అందరి దగ్గరకూ వచ్చి అభినందించారు. ఆ విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో, ఈసారి పార్టీకి తయారవుతున్నాము. పైగా ఈసారి బయట నుంచి గెస్ట్‌లు కూడా వస్తున్నారు. పార్టీ చాలా పెద్ద ఎత్తున జరగబోతోంది. అందుకని వీర లెవల్లో చర్చలు జరుగుతున్నాయి. భాంగ్‌డా, లేదా ఏదైనా గ్రూప్ డాన్స్ ఇలా తలా ఒకటి చెప్పాక, ఆవిడ “ఈసారి నాటకం వేద్దాము. డాన్స్ ఐతే అందరూ చేయలేరు, నాటకం ఐతే చాలా పాత్రలు ఉండి, ఎక్కువ మందికి అవకాశం ఉంటుంది” అన్నారు. ఇందులో అభ్యంతరం ఏమీ కనిపించక అందరం వాకే అనేసాము. నేను మనసులో నాటకమైతే, ఆ శుద్ధ్ హిందీ నాకు రాదు కాబట్టి తప్పించుకోవచ్చు అమ్మయ్య అనుకున్నాను. అందరూ ఏ నాటకం వేద్దాము అని తర్జనభర్జన పడుతున్నారు. కాసేపు అన్నీ విని ఆవిడ “నేను ‘నవీన్ సావిత్రి’ అని ఒక నాటకం రాసాను. మీకు అభ్యంతరం లేకపోతే అది వేద్దాము” అన్నారు. అందరూ చేదు మాత్ర వేసుకున్న మొహం బెట్టారు.

“అది హాస్య నాటిక. అందులో సావిత్రి తల్లీ తండ్రి, అత్తామామలు, ఇలా చాలా పాత్రలున్నాయి. చాలా తమాషాగా ఉంటుంది అని చెప్పాను. మీ కభ్యంతరమైతే వద్దులే” అన్నారు కాస్త కినుకగా.

అమ్మో అభ్యంతరం ఉందని బాసుగారి పెళ్ళానికి చెప్పటమే! ఏమండీలు ఊరుకుంటారా అని మనసులో అనుకుంటూ అందరమూ మొహామొహాలు చూసుకున్నాము.

అందరిలో ముందుగా తేరుకున్న మిసెస్.తండన్ “టీక్ టీక్ హై. ఆప్ జైసే బోలేంగే వైసేహీ కరంగే” అంది. చేసేదేమీ లేక వెర్రి మొహాలేసుకొని అందరం బుర్రూపేసాము.

ఇహ పాత్రధారుల ఎంపిక మొదలైంది. చిన్నా చితకా అందరి పాత్రలు ఎన్నికైపోయాయి. ఇహ ముఖ్యమైన పాత్రలు ‘సావిత్రి’, ‘యమధర్మరాజు’ మిగిలారు. ఆవిడ ‘సావిత్రిగా నేను వేస్తాను’ అన్నారు. తప్పదుగా సరే అనేసాము. యమధర్మరాజుగా అంటూ స్లో మోషన్‌లో, సస్పెన్స్ మేంటేన్ చేస్తూ అందరినీ పరికించి చూస్తోంది. ఇంతకు ముందు పాత్రలకు ఎన్నికైన వాళ్ళు కులాసాగా మా వైపు చూస్తున్నారు. మిగితా వాళ్ళు టెన్షన్‌గా ఉన్నా నేను మాత్రం ధిలాసాగా ఉన్నాను. ఆవిడ తల ఒక్కొక్కళ్ళ వైపు తిప్పుతోంది. పిన్ డ్రాప్ సైలెన్స్. ఆవిడ చూపు తప్పుకోగానే చిన్నగా ఉఫ్ అని నిట్టూర్చేవాళ్ళ గాలి సవ్వడి కూడా వినిపించటం లేదు. ఇంతలో చిన్నగా కాదు కాదు ఢభేల్‌మని నా నెత్తిన ఏదో పిడుగు పడ్డ శబ్ధం వినిపించింది! నా వైపు చూస్తూ “ఆప్ కరేంగే యమధర్మరాజ్” అని ఏదో అన్నట్లుగా లీలగా వినిపించింది. నేను… నేను యమధర్మరాజునా – సన్నగా, పెద్ద గాలేస్తే పడిపోయేట్లున్న నేను యమధర్మరాజును, లావుగా పొట్టిగా ఉన్న ఆవిడ సావిత్రి. విధి లీల, భగవంతుని చిత్రాలు ఏవేవో గుర్తొచ్చేస్తున్నాయి.

ఆవిడ వైపు అయోమయంగా చూస్తూ “నాకు స్టేజ్ ఎక్కాలంటే భయం “అన్నాను నంగిరి నంగిరిగా.

“భయమెందుకు? ఐనా వెల్ఫేర్ సెంటర్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తావు కదా” అన్నది.

“అక్కడ అంతా ఆడవాళ్ళు, ఓ పది మందే ఉంటారు” అన్నాను చిన్నగా. అదైనా నా మొహం తప్పనిసరై చేస్తున్నాను అంతే కాని ఆ కాసేపు నా కాళ్ళూ చేతులూ ఎంత వణికిపోతుంటాయో!

“మొన్న ఖవాలీలో ఉన్నావుగా?” అంది.

ఏదో గుంపులో గోవిందమ్మలాగా అటో చప్పట్లు, ఇటో చప్పట్లు కొట్టానే కాని నేను చేసింది ఏముంది దానికీ ఆ తరువాత ఏమండీగారు, “చప్పట్లు కొట్టటానికి కూడా అంత భయమెందుకు?” అని ఎంత క్లాస్ పీకారో! అని ఆమె వైపు గుడ్లప్పగించి చూస్తూ, చివరాఖరురుగా “మేరేకో హిందీ టీక్ సే నై ఆతా” అన్నాను హైదరాబాదీ స్టైల్‌లో..

“కోయీ బాత్ నై. ఆప్ కో జ్యాదా డైలాగ్స్ నహీ రహతా. నేను నిన్ను ‘ఆప్ కౌన్ హో’ అని అడుగుతాను. ‘మై హూఁ యమధర్మరాజ్’ అని మీసం మేలేస్తూ, గంభీరంగా చెప్పాలి. మధ్య మధ్య ‘సావిత్రీ’ అని భీకరంగా అరవాలి. అంతే” అందావిడ సింపుల్‌గా.

గంభీరంగా, భీకరంగానా? నా బొంద నలుగురి ముందు గొంతే పెగలదు. చచ్చేంత టెన్షన్. అట్లా అని ఈవిడకు ఏమీ చెప్పలేని మొహమాటం. అంతే అంటుంది కాని అది ఎంతో ఆమెకేమి తెలుసు. ఈ మొహమాట మోక్షంతో ఏమి చేయాలో తోచక చుట్టూ అందరి వైపు చూసాను. అందరూ ఏమి మాట్లాడితే ఏమో, ఎక్కడ ఈ యమధర్మరాజు పాశం వాళ్ళ మెడకు చుట్టుకుంటుందో అని నిశ్శబ్దంగా మా ఇద్దరినీ కళ్ళప్పగించి చూస్తున్నారు. మనసులో ‘బాగైందిలే లల్ల లల్లా’ అని పాడుకుంటూ నవ్వుకుంటున్నారేమో కూడా అని ఓ డౌటనుమానం వచ్చింది.

“రేపు ఆదివారం కదా, ఎల్లుండి నుంచి రిహార్సల్ మొదలు పెడుదాము. వారం రోజులే ఉంది టైం” అని అదే ఫైనల్ అన్నట్లు చెప్పి లేచింది. నా వైపు జాలిగా చూస్తున్న ఎవరినీ పట్టించుకోకుండా నీరసంగా నేనూ ఇంటికి బయలుదేరాను.

డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు సద్దుతున్న నన్ను “ఎట్లా ఐంది మీ లేడీస్ మీట్? ఈ సారి ఏమైనా ప్రోగ్రాం చేస్తున్నారా?” అని అడిగారు ఏమండి. నేను ఏమీ మాట్లాడలేదు. పరధ్యానంగా, నీరసంగా ఉన్న నన్ను చూసి “ఏమైంది? అట్లా ఉన్నావు” అన్నారు.

“ఏమీ లేదు. ఈసారి ‘నవీన్ సావిత్రి’ అని నాటకం వేస్తున్నాము” అన్నాను ముభావంగా.

“వెరీ గుడ్. నువ్వేమైనా వేషం వేస్తున్నావా?”అని అడిగారు.

అప్రయత్నంగా ‘మై హూఁ యమధర్మరాజ్’ అన్నాను.

నోట్లో పెట్టుకోబోతున్న ముద్దను ఆపి “ఏమిటి?” అన్నారు.

“అవును. నేను యమధర్మరాజ్ వేషం వేస్తున్నాను” అన్నాను. ఏమండి నావైపు విచిత్రంగా చూస్తూ “మరి సావిత్రి ఎవరు?” అడిగారు.

“ఇంకెవరూ మీ బాస్ పెళ్ళాం” అన్నాను కసిగా.

ఏమండీ చేతిలోని ముద్ద జారిపోయింది. ఒక్క క్షణం బిత్తరపోయి, అప్పటి వరకూ మా ఇద్దరి సంభాషణను కూతూహలంగా వింటున్న పిల్లల వైపు చూస్తూ “మీ అమ్మ యమధర్మరాజు… ఆహాహా ఓహోహో” అంటూ తలపైకెత్తి నవ్వారు పెద్దగా. పిల్లలూ శృతి కలిపారు. ఆ ముగ్గురి నవ్వునూ చూస్తూ ఉక్రోషంగా అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయాను.

రాత్రి తెల్లవార్లూ కలలో యమధర్మరాజు దున్నపోతెక్కి వచ్చి ‘మై హూఁ యమధర్మరాజ్’ అని భీకరంగా అరుస్తున్నాడు. లేచాక కూడా వెనకెనకే దున్నపోతుమీద తిరుగుతున్నాడు. ఆ యముడి బాధ భరించలేక, అన్యధా శరణం నాస్తి అని సాయంకాలం ఏమండీగారిని, ఈ యమధర్మరాజ్ బారి నుంచి నన్ను రక్షించండి అని వేడుకున్నాను. శ్రీకృష్ణపరమాత్మలా చిరునవ్వు నవ్వి అభయ హస్తం చూపించి “పద” అన్నారు. ఎక్కడికి అని మారు మాట్లాడకుండా వెనకాల నడిచాను.

ఇద్దరమూ బాస్ గారింటికి చేరుకున్నాము. బాస్ గారు సాదరంగా ఆహ్వానించారు. బాస్ గారి పెళ్ళాం గారు కూడా కాఫీ టిఫినూ పెట్టి మర్యాద చేసింది. అవును మరి ఎంతైనా యమధర్మరాజును కదా ఎందుకు చేయదు అని నోట్లోనే కనిపించకుండా పళ్ళు నూరుకున్నాను. బాస్ గారితో పిచ్చాపాటి మాట్లాడుతున్న ఏమండీగారి వైపు ఏమిటీయన ఎందుకు వచ్చాము, ఏమి మాట్లాడుతున్నారు అని చూస్తూ ఆవిడ అడిగిన దానికి ఏదో చెపుతున్నాను. కాసేపైనాక, ఏమండి ఆవిడవైపు చూసి,”మేడం మీరు నాటకంలో మా ఆవిడకు ఇంపార్టెంట్ పోర్షన్ ఇచ్చారట కదా. చాలా థాంక్స్” అన్నారు. నేను గాభరాగా ఏమండీ వైపు చూసాను.

“ఏమి పోర్షన్ ఇచ్చావు?” అని బాస్ గారు ఆవిడను అడిగారు.

“మేము నేను రాసిన ‘నవీన్ సావిత్రి’ నాటకం వేస్తున్నాము. అందులో నేను సావిత్రి, తను యమధర్మరాజ్” అంది నోరంతా తెరిచి నవ్వుతూ సంబరంగా. ఆయన ఆవిడ వైపు కాసేపు సాలోచనగా చూస్తూ, “నువ్వు సావిత్రిగా వేస్తున్నావా, వెరీ గుడ్. చాలా బాగుంటావు. నాటకం కూడా బాగుంటుంది” అన్నారు.

“మేడం మీరు పాటలు కూడా రాసి బాగా పాడతారట. పార్టీలో మీరు రాసిన పాట మాకు వినిపించవచ్చు కదా” అన్నారు ఏమండీ.

“పాటకు, నాటకానికి సమయం సరిపోదేమో” అన్నారు బాస్ గారు.

“నాటకం మేము ఎప్పుడైనా చూస్తాము. వచ్చే గెస్ట్‌లకు మేడం పాట వినిపిస్తే బాగుంటుంది కదా” అన్నారు ఏమండి ప్లీజింగ్‌గా.

ఆవిడ మురిసిపోతూ “సరేలెండి పాటే పాడుతాను. ఇప్పుడు నాటకం రిహార్సల్‌కు టైం కూడా ఎక్కువ లేదు. నాటకం ఇంకోసారి వేయొచ్చు” అంది.

అమ్మయ్య ఆవిడ పాట పాడేందుకు ఫిక్సైపోయింది. ఈవిడ పాటలు కూడా పాడుతుందా అదీ సొంతంగా రాసి. అబ్బో ఎన్ని కళలున్నాయో! బాగా పాడుతుందా? పోనిద్దూ ఎట్లా పాడితే నాకేమిటి? బాగో వోగో బాసమ్మగారి పాట వినక చస్తారా? ఇప్పటికి నా గండం గడిచింది. ఎంతైనా ఏమండీ గారి బుర్రే బుర్ర. వాళ్ళకో నమస్కారం, ఓ థాంక్స్ పడేసి, బతుకుజీవుడా అనుకుంటూ బయటపడ్డాను. లేకపోతే నేనేమిటి యమధర్మరాజ్ ఏమిటి? నన్ను యమధర్మరాజ్‌గా సెలెక్ట్ చేసుకున్న బాసమ్మకు జోహార్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here