[box type=’note’ fontsize=’16’] ఉదయం లేస్తే చుట్టూ జరుగుతున్న సంఘటనలు ఒక్కొక్కసారి ఆనందాన్ని, ఇంకొక్కసారి సంభ్రమాన్నీ కలిగిస్తున్నాయని, వాటిని అక్షరమాలికలుగా చేసి సంచిక పాఠకులకు అందిద్దామనే ఆలోచనే ఈ శీర్షికకు నాంది అంటున్నారు ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి. [/box]
[dropcap]ఒ[/dropcap]కరోజు నేనూ, మా అమ్మాయీ శిరిడీ నుంచి వెనక్కి వస్తుంటే ఫ్లయిట్ బాగా లేటయి, కాబ్ తీసుకుని ఇంటికి బయల్దేరేటప్పటికి రాత్రి 11 గంటలు అయింది. ఇద్దరం కాస్త భయపడుతూనే కూర్చున్నాం. ఇంతలో డ్రైవర్ చేతిలో స్టీరింగ్ కంట్రోల్ తప్పి కాబ్ అటూ ఇటూ ఒక్క ఊగు ఊగి పక్కకి వచ్చి ఆగిపోయింది. హడిలిపోయాం. ఏవిటయ్యా అని డ్రైవర్ ని అడిగితే “ఈ తిరగడంలో నిద్ర లేదండీ. కొంచెం తూలానూ, అంతే, ఖంగారు పడకండి” అన్నాడు. మా అమ్మాయికి ఏం చెప్పాలో తోచక అతని నిద్ర ఆపడానికి ఆ డ్రైవర్ని కబుర్లలో పెట్టి, అతని కుటుంబం, పిల్లలు వగైరా అడగడం మొదలుపెట్టింది.
ఇంక అంతే, అతను విజృంభించేసేడు. ఏకధాటిగా అతను చెప్పుకుపోయిన అతని విశేషాలేంటంటే, యేడాది క్రితం వరకూ అతను పెద్ద బిజినెస్ చేసేవాడుట. బంజారాహిల్స్‌లో పెద్ద ఇల్లు తీసుకుని తల్లితండ్రులూ, భార్య, ఇద్దరు పిల్లలతో చాలా గొప్పగా ఉండేవాడుట. ఆ టైమ్‌లో అన్న పిల్లల చదువులకీ, పెళ్ళిళ్ళకి సాయం చేసేడుట. భార్యనీ, పిల్లల్నీ ప్లెజర్ ట్రిప్ అంటూ సింగపూర్ తీసుకెళ్ళేట్ట. పిల్లల పుట్టినరోజులొస్తే బాగా డబ్బు ఖర్చు చేసి పార్టీలు అవీ ఇచ్చేవాడుట. అలాంటివాడు బిజినెస్‌లో చేసిన ఏదో పొరపాటుకి మొత్తం డబ్బులన్నీ పోయేయిట. ఒక చిన్న అద్దింట్లోకి మారిపోయేడుట. అన్నదమ్ములు సరే తల్లీ, తండ్రీ కూడా ఇప్పుడితని దగ్గరికి రావటం లేదుట. అందుకని ఎలాగైనా మళ్ళీ బోల్డు డబ్బు సంపాదించాలని అనుకుంటున్నాడుట. ఇలా కాబ్ తీసుకుంటే ఆదాయం బాగానే ఉందిట. తొందరలోనే మళ్ళీ డబ్బున్నవాణ్ణయిపోతానని అతను చెప్తుంటే నేనూ, మా అమ్మాయీ నోరెళ్ళబెట్టి వింటుండిపోయేం.
నాకన్నా మా అమ్మాయే ముందు తేరుకుని, “ఈసారి మళ్ళీ డబ్బు వచ్చేక, ఇంకెవర్నీ దగ్గరికి రానియ్యొద్దూ” అని ఓ ఉచిత సలహా పడేసింది. దానికతను “అలా ఎలా కుదుర్తుందండీ. నాకు మళ్ళీ డబ్బొస్తే ఆ విషయం మావాళ్లక్కూడా తెలియాలి కదండీ. మళ్ళీ మా అమ్మనీ, నాన్ననీ నా దగ్గరికి తెచ్చేసుకుంటానండీ. డబ్బొస్తే వాళ్ళొచ్చేస్తారు” అంటున్న అతన్ని చూస్తుంటే మాకేం చెప్పాలో తెలీలేదు.
ఇంతకీ ఈ విషయం ఎందుకు చెప్పాల్సివచ్చిందంటే కొంతమంది మనుషులు అనుభవాలని బట్టి పాఠాలు నేర్చుకుంటారు. మరికొంతమంది ఎన్ని అనుభవాలు ఎదురైనా మారరు. చాలామందికి డబ్బు విషయంలో ఇలాంటి అనుభవాలు ఉండుంటాయి. అందుకే డబ్బు సంపాదించడం గొప్ప కాదూ, దానిని సవ్యంగా ఖర్చుపెట్టడం తెలిసుండాలీ అంటారు.
కొంతమంది వచ్చిన ఆదాయాన్నంతా ఖర్చు పెట్టేస్తుంటారు. వాళ్ళకున్నాయి, మనకి లేవనుకుంటూ కావల్సినవీ, అఖ్ఖర్లేనివీ కొనేస్తుంటారు. బడ్జెట్ వేసుకుని, సరిగ్గా అలాగే నియంత్రణగా ఉండేవాళ్ళు తక్కువమందుంటారు.
అందులోనూ, ఈ రోజుల్లో అన్నీ వాయిదాల మీద అమ్ముతుండడంతో ముందు వస్తువు తెచ్చేసుకోవడం, తర్వాత దానికి డబ్బులు కట్టుకోవడం చాలామందికి అలవాటైపోయింది. అది మంచిదా కాదా అన్న విషయం పక్కన పెడితే ఈ రోజుల్లో అందరూ చేస్తున్న పనే అది.
లక్ష్మిని లక్ష్యపెడితేనే మన దగ్గరుంటుంది. డబ్బుని విసిరేస్తున్నా కూడా యెంచి విసిరేయమన్నారు మన పెద్దలు.
బతకడానికి డబ్బు చాలా అవసరం. అందుకే పెద్దలు ఎప్పుడో చెప్పారు డబ్బు మనని గమ్యం చేర్చడానికే కానీ డబ్బే గమ్యం కాకూడదూ అని.