[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా రాజస్థానీ సినిమా ‘మేరో బద్లో’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘మేరో బద్లో’
[dropcap]నే[/dropcap]టి రాజస్థానీ సినిమాలూ మసాలా కమర్షియల్సే. గుణాత్మకంగా మార్పేమీ రాలేదు. పైగా ఏడాదికి నాలుగైదు సినిమాలకి మించి నిర్మించే ఆసక్తి లేదు. స్థానిక కళాకారులు బాలీవుడ్‌కే వలస పోవడమనే పోకడతో రాజస్థానీ సినిమా పరిశ్రమ థార్ ఎడారిలా తయారయ్యింది. కానీ ఇక్కడ షూటింగులు మాత్రం జోరుగా జరుగుతూంటాయి. దేశంలో ఇతర భాషా చిత్రాల షూటింగులతో వివిధ లొకేషన్స్ నిత్యం ఎంతో బిజీగా వుంటాయి. బయటి సినిమాలకి లొకేషన్స్ కోసం తప్ప, ప్రాంతీయంగా రాజస్థానీ సినిమా పరిశ్రమకి కేంద్రం కాదన్నట్టుగా తయారయ్యింది రాష్ట్రం.
విడుదలయ్యే నాల్గైదు సినిమాలు కూడా రెండు మూడు నెలల్లో యూట్యూబ్‌లో ఉచితంగా అందుబాటులో కొచ్చేస్తాయి. రాజస్థానీ సినిమాల సమాచారం కోసం నెట్‌లో సెర్చి చేస్తే కన్పించేవి యూట్యూబ్‌లో సినిమాలే. సమాచార పేజీలు కన్పించవు. మీడియా వీటి కవరేజీ కూడా మానేసినట్టుంది. ఇంత వెనుకబడి వున్న రాజస్థానీ ప్రాంతీయ సినిమా పేరుకే ప్రాంతీయ సినిమా గానీ, నిర్మించేది మొదట్నుంచీ అవే కుటుంబ డ్రామాలతో కూడిన సెంటిమెంటల్ లేదా మసాలా యాక్షన్ సినిమాలు.
ఇలాటి ఇంకో యాక్షన్ మసాలానే ‘మేరో బద్లో’ (నా ప్రతీకారం) అనే విచిత్ర కథాకథనాలతో కూడిన కమర్షియల్. సినిమాలు ఇలా కూడా తీస్తారా అన్పించే తమాషా క్రియేటివిటీ. చెప్పి మొదలెట్టిన పాయింటుకీ చూపించే కథకీ సంబంధం వుండదు. ఆ కథ ముగించాక తిరిగి మొదట్లో చెప్పిన పాయింటే చెప్పేసి ముగించడం. ఇలా అసలు పాయింటులోకే వెళ్ళని కథ ఇలా వుంటుంది…
శివ (మహేంద్ర గౌర్) ఒక మంత్రి ముందు అమ్మాయిల మీద పెరిగిపోతున్న అత్యాచారాల గురించి మాట్లాడతాడు. అమ్మాయిలు ఎందుకు బలహీనంగా వుండాలి? వాళ్ళని బలీయంగా తయారుచేయాలి… ఆత్మరక్షణా పోరాటాలు నేర్పాలి… ఇది పాఠశాలల నుంచే మొదలెట్టాలి… అని అంటూ, ఇక నుంచి తన జీవితాశయం ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపునందుకుని అమ్మాయిల రక్షణేనంటూ ప్రతిజ్ఞ కూడా చేస్తాడు. ఇక స్కూల్లో బాలికలతో ఆ మేరకు నినాదాలిప్పిస్తాడు. వూళ్ళో అమ్మాయిల్ని వేధిస్తున్న పోకిరీలకి బుద్ధి చెప్తాడు. దీంతో తన ఫ్లాష్ బ్యాక్ మొదలెట్టుకుంటాడు.
ఈ ఫ్లాష్‌బ్యాక్‌లో వూళ్ళో తను టీచర్. తనకి భార్య పార్వతి (హీరో శివ కాబట్టి హీరోయిన్ పార్వతిగా పేర్లు కలవాలేమో), ఓ నెలల పిల్లాడు వుంటాడు (వీడికి గణపతి అని పేరు పెట్టలేదు). ఒక తల్లి కూడా వచ్చి వుంటుంది. జీవితం హాయిగా గడిచిపోతూంటుంది. ఊళ్లోనే యువరాజ్ (హిసాన్ ఖాన్) అనే మాఫియా వుంటాడు. ఇతను డ్రగ్స్, కిడ్నాప్ బిజినెస్సులు చేస్తూంటాడు. వీటిని బయట పెడుతున్న రిపోర్టర్‌ని చంపించేస్తాడు. దీనికి శివ ప్రత్యక్ష సాక్షిగా వుంటాడు. పోలీసులకి చెప్పేస్తాడు. దీంతో యువరాజ్ తన గ్యాంగుతో వచ్చేసి శివ ఇంటిమీద దాడి చేసి తల్లినీ భార్యనీ చంపేస్తాడు. శివ మీద హత్యాప్రయత్నం చేస్తాడు. పారిపోయిన శివ కొన్నాళ్ళకి తిరిగి వచ్చి పగబడతాడు. ఈ పగదీర్చుకోవడమే మిగతా ఫ్లాష్ బ్యాక్.
ఒక కేసు విషయంలో జరిగిన సంఘటనతో తన వ్యక్తిగత ప్రతీకారానికీ, అమ్మాయిల ఆత్మరక్షణ అనే పాయింటుతో సంబంధమే వుండదు. అతడి ప్రతిజ్ఞ కేసుల్లో దాడులు చేసే ఇలాటి మాఫియాల మీద వుండాల్సింది వుండక, అర్ధరహితంగా అమ్మాయిలకి రక్షణ అంటూ మార్షల్ ఆర్ట్స్ నేర్పుతూంటాడు. అసలే అమ్మాయి మీదా కథలో దాడి ఎక్కడా జరగదు.
ఇక కేసులో సాక్షిగా వున్నందుకు హీరో ఇంటి మీద విలన్ వచ్చి దాడి చేసినప్పుడు, సాక్ష్యం చెప్పవద్దని బెదిరిస్తాడు. అందుకు వాళ్ళు అంగీకరించినా, సాక్ష్యం చెప్తే చంపేస్తానని హింసిస్తూ వుంటాడు. హింసించి హింసించీ చంపేస్తాడు. అతడి బెదిరింపులకి లొంగాక కూడా ఇంకా చంపడమేమిటో అర్థంగాదు.
ఇక విలన్‌ని చంపి ప్రతీకారం తీర్చుకున్నాక, మంత్రి దగ్గరి కెళ్ళి – అమ్మాయిల మీద అత్యాచారాల గురించి లెక్చరిస్తాడు. అమ్మాయిలకి మార్షల్ ఆర్ట్స్ నేర్పడమే తన జీవిత లక్ష్యమని ప్రకటిస్తాడు. తలాతోకా లేని లక్ష్యం. నీ ఇంట్లో నీ వల్ల నీ వాళ్ళు చచ్చిపోయారు, దాంతో మాకేం సంబంధం, మేమంతా బాగానే వున్నాం, నువ్వు మాకేమీ నేర్పక్కర్లేదు పొమ్మని అమ్మాయిలంటే, ఏం చేస్తాడో.
ఈ హీరో శివ పాత్ర వేసిన మహేంద్ర గౌర్ ఈ సినిమాకి దర్శకుడు కూడా. టీనా రాథోడ్ భార్యగా నటించింది. ఈమె వున్న ఏ సీన్లో చూసినా బియ్యం ఏరుతూనో, పిండి రుబ్బుతూనో, మిరపకాయలు దంచుతూనో, వడియా లేస్తూనో ఆహారోత్పత్తి చేస్తూ వుంటుంది. ఇది చూసి యూట్యూబ్ ప్రేక్షకోత్తముడు కామెంట్ పెట్టాడు – రాజస్థానీ సంస్కృతి బాగా చూపెట్టారని. ఇక పగబట్టిన హీరోగా మహేంద్ర గౌర్ పరాక్రమం చెప్పాల్సిన పనిలేదు, అద్భుతమైన రెండు డ్యూయెట్లు సహా.
తీసే నాల్గైదు సినిమాల నాణ్యత కూడా ఇలా వుంటోంది. 2015లో తీసిన మూడు సినిమాల్లో ఇదొకటి.