ఎక్ లడకీ కో దేఖా తో ఐసా లగా

1
4

[box type=’note’ fontsize=’16’] “వినోదాన్ని పంచడంతో పాటు ప్రేక్షకుడిలో క్రమంగా సానుకూల మార్పులు రావాలని, సమాజం ముందుకు వెళ్ళడానికి అది దోహదపడాలని అనుకుంటే ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాల్సిన అవసరం వుంది” అంటున్నారు పరేష్ ఎన్. దోషిఎక్ లడకీ కో దేఖా తో ఐసా లగా” చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]1[/dropcap]994 లో వచ్చిన “1942: అ లవ్ స్టోరి” సినెమాలో పాటే దీనికి శీర్షిక. వో అమ్మాయిని చూస్తే గుండెల్లో కలిగే గుబులు గురించిన పాట ఆ సాహిత్యం కారణంగా, ముఖ్యంగా పంచం దా సంగీతం కారణంగా హిట్ అవడమే కాకుండా ఇప్పటికీ సజీవంగా వుంది. ఆ పాట ఈ చిత్రానికి యే విధంగా సరిపోయిందో ఇది చదివేసరికి అర్థమవుతుంది.

స్వీటీ చౌధరి (సోనం కపూర్) తండ్రి విధురుడైన బల్బీర్ చౌధరి (అనిల్ కపూర్). అన్న, తండ్రి, నానమ్మలతో వుంటుంది స్వీటి. అందరి గారాల పట్టి. మొదటి సన్నివేశంలోనే ఈ కుటుంబం వో వివాహానికి వెళ్ళడం, అక్కడ కుహు (రెజినా కసాండ్రా) కలిసి తన అన్న రాజా (అక్షయ్ ఒబెరొయ్) ఆమెను ఇష్టపడుతున్నాడని, ఆలోచించుకొమ్మని చెబుతుంది. తాము లండన్‌కు వెళ్ళి పోతున్నాము ముందే యే సంగతీ తేల్చుకొమంటుంది. ఆ మాటను దాటేస్తుంది స్వీటి. మరో పక్క సాహిల్ మిర్జా (రాజ్ కుమార్ రావు) వో నాటక రచయిత. తండ్రి (కఁవల్‌జీత్ సింఘ్) ఆస్తిపరుడైనప్పటికీ ఇంటి నుంచి డబ్బు తీసుకోకుండా వొక్కడే తన ప్రయత్నాల మీద వుంటాడు సాహిల్. తల్లి ప్రోత్సహించినా తండ్రికి ఈ నాటకాల వ్యవహారం పని దండగ అనిపిస్తుంది. కాని నాటక రంగంలో కూడా సాహిల్‌కి సాఫల్యం లభించదు. అలాంటి వొక రోజున యెవరి నుంచో పారిపోయి అతని స్టుడియోలోకి అడుగు పెడుతుంది స్వీటి. ఆమెను వెంబడిస్తున్న ఆమె అన్న అక్కడ కూడా వెతుక్కుంటూ రావడంతో సాహిల్ చేయి పట్టుకుని పరుగు తీస్తుంది. నాటక రంగంలో ప్రదర్శింపబడుతున్న ప్రేమ కథ చప్పగా యెందుకుందీ, ఇప్పుడు అనుకోకుండా తన జీవితంలో ఇంత ఉత్సాహం, హడావిడీ, ఆసక్తీ యెలా వచ్చాయో, స్వీటి చెబుతున్నప్పుడు కాకుండా ఇప్పుడర్థమవుతుంది సాహిల్ కి. తనకు తెలీకుండానే ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. ఇక్కడి నుంచి డ్రామా మొదలవుతుంది. బల్బీర్ వో వస్త్రాల ఫేక్టరి యజమాని. అతనికి వంట చేయడం ఇష్టం. కాని అది మగవాళ్ళు చేసే పని కాదని అతని తల్లి వంటింట్లోకే రానివ్వదు. ఈ ఉపకథ యెందుకో తర్వాత్తరువాత అర్థమవుతుంది. స్వీటి అన్న స్వీటి వొక ముస్లిం కుర్రాడితో ప్రేమలో పడిందని, తను వారించినా వినకుండా దొంగచాటుగా ఢిల్లీకి వెళ్ళొస్తుందని, ఇప్పుడు లండన్ కూడా వెళ్ళాలని చూస్తుందనీ అంటాడు. ఆ పంజాబి కుటుంబం మొత్తం ముస్లిం అన్న మాట వినగానే మొహాలు మాడ్చుకుంటారు.

సినెమాలో కొంత మసాలా వుండాలి. చివర్లో బల్బీర్ మనసును కూతురి పట్ల కరిగించేలా చేయడానికి, అనునయ పరచడానికి హృదయానికి దగ్గరైన పాత్ర కావాలి కదా. దాని కోసమే ఛతరో (జుహీ చావలా) పాత్ర. తను వో లోకల్ ఫిలిం ఇస్టిట్యూట్లో నటనకు శిక్షణ పొంది, తానొక గొప్పనటి అని నమ్ముతున్న పాత్ర. సినెమా వాళ్ళకు దగ్గరగా వుందామని వాళ్ళకు కేటరింగు చేస్తుంటుంది. వంట అనేది ఇద్దరి మధ్య కలిసిన ఇష్టం కాబట్టి బల్బీర్, ఛతరోలు దగ్గరవుతారు. స్వీటి కి దగ్గరవ్వాలని ఆమె వుంటున్న వూరు మోగా కు సాహిల్ బయలుదేరితే, ఛతరో కూడా వెళ్తుంది.

అక్కడ తన మనసు విప్పిన సాహిల్‌కు నిరాశే దొరుకుతుంది. యెవరికీ చెప్పని, గుండెల్లోనూ తన డైరీల్లోనూ దాచుకున్న విషయాన్ని స్వీటి సాహిల్‌కు చెబుతుంది. ఆమెకు పురుషులపట్ల ఆసక్తి వుండదు, అమ్మాయిల పట్ల తప్ప. తన అన్న కోసం మాట్లాడవచ్చిన కుహూతో ఆమె ప్రేమలో పడుతుంది. కుహూ కూడా తన లాంటిదే కావడంతో వాళ్ళు దగ్గరవుతారు. అందుకే చాటుమాటు కలయికలు. అయితే తన తండ్రిని బాధ పెట్టడం, కుటుంబ పరువు పోవడం ఇష్టం లేని ఆమె తండ్రి కుదిర్చిన యేదో సంబంధం చేసేసుకుందామనుకుంటుంది. తమ మధ్య ప్రేమ లేకపోయినా, గట్టి స్నేహమే వుంది అని చెప్పి ఆమెను తొందరపడవద్దని, తాను చక్రం తిప్పుతానని హామీ ఇస్తాడు సాహిల్. ఆ తర్వాత ఆ కుటుంబ సభ్యులకు దగ్గరై, వాళ్ళు అనుకుంటున్న ఫేషన్ షో స్థానంలో వో అద్భుతమైన నాటకం తను రూపొందిస్తానని, కుటుంబ సభ్యులందరిచేతా చేయిస్తానని చెప్పి వొప్పిస్తాడు. నాటకీయంగా స్వీటి స్థితిని అందరి ముందు పెట్టి, అది తప్పో, రోగమో మరొకటో కాదని, వాళ్ళ ప్రేమలను కూడా ఇతర ప్రేమలకు మల్లే ఆదరించాలని చెప్పి ముగించాలి నాటకం. అదీ ప్రణాళిక.

మొదట్లో కొంత తర్జన భర్జనలు, అయిష్టాలు, లేచి వెళ్ళిపోవడాలు, వగైరా అయ్యాక చివరికి బల్బీర్ కూతురు ప్రేమను ఆదరించి ఆశీర్వదిస్తాడు.

ఇది చదివితేనే యెంత నాటకీయంగా వుందో అర్థం అయిపోయింది కదా. సామాన్య జనాలకు చివరి దాకా కూర్చుని చూసేందుకు హాస్యం, డ్రామా వగైరాలు పెట్టారు. బానే వుంది. రాజ్ కుమార్ రావు నటన యెప్పటి లాగే బాగుంది. అలాగే అనిల్ కపూర్, జుహీ చావలా, అన్నగా చేసిన అతను, సీమా పహ్వా, బ్రిజెంద్ర కాలా ల నటన కూడా బాగుంది. స్వీటి బాల్యంలో పాత్ర చేసిన సారా అర్జున్ కూడా ఆ ద్వైదీ భావన, ఆ అవమానం పాలు కాలేక పడ్డ నరకం, ఘర్షణ వగైరాలు బాగా చేసింది. యెటొచ్చి సోనం నటనే పాత్రకు న్యాయం చేయలేదు. బహుశా కొంత దర్శకురాలు కారణం అనుకోవచ్చు. యెందుకంటే సోనం రెజీన ల మధ్య ప్రేమను చాయామాత్రంగా చూపించింది ఆమె. యవ్వనంలో ఆ పాత్ర పడే రకరకాల నరకాలను కథలో కలుపుకోలేదు. అవి లేకపోతే కథలో దమ్మే వుండదు. అయినా వొకందుకు ఈ చిత్రాన్ని మెచ్చుకోవాల్సిందే. 377 సెక్షన్ ను పాక్షికంగా రద్దు చేసిన తర్వాత, స్వలింగ సంపర్కాన్ని నేరచట్రం నుంచి విడుదల చేసిన తర్వాత వచ్చిన తొలి లెస్బియన్ కథ ఇది. అదీ సానుకూల దృక్పథంతో. ఆ మేరకు మెచ్చుకోవచ్చు. లేకపోతే మన చిత్రాలలో ఈ విషయం వో హాస్యానికి పరిమితం చేసి వున్నారు కదా. గే కథలు ఓనిర్ చిత్రాలలో, లెస్బియన్ కథ “మార్గరీటా విత్ అ స్ట్రా” లాంటి చిత్రాలలో అద్భుతంగా చిత్రించినా తేడా యెక్కడ వుందంటే అవన్నీ సీరియస్ చిత్రాలు. అందరూ చూసేవి కావు. వాటికి ప్రత్యేకమైన ఆడియన్సు వుంటుంది. కాని ఈ చిత్రం వో పూర్తి మసాలా చిత్రం, సామాన్యులకోసం. ఆ తేడా ని దృష్టిలో పెట్టుకుంటే లోతు అర్థమవుతుంది. మరో మెచ్చుకోతగ్గ విషయం సోనం పాత్ర వో చిన్న టవునులో వుంటున్న పాత్ర కావడం. యెందుకంటే చాలా మందికి వొక అపోహ వుంది, ఈ స్వజాతి ప్రేమలూ అవీ పట్టణాలలో, ఇంగ్లీషు చదువుకున్న వారిలో, ఇంటర్నెట్టు వగైరా అందుబాటులో వున్నవారిలో పుట్టే రోగం అని. అది ప్రకృతి పరంగా పల్లెలలో కూడా కనబడవచ్చు అన్నది చెప్పడానికి మోగా లో జరిగిన కథగా చూపించడం బాగుంది.

వినోదాన్ని పంచడంతో పాటు ప్రేక్షకుడిలో క్రమంగా సానుకూల మార్పులు రావాలని, సమాజం ముందుకు వెళ్ళడానికి అది దోహదపడాలని అనుకుంటే ఇలాంటి చిత్రాలు మరిన్ని రావాల్సిన అవసరం వుంది. ఆ దిశలో దర్శకురాలు షెల్లి చోప్రా ధార్, కథలో తోడు బాధ్యత తీసుకున్న గజల్ ధలీవాల్ లు వేసిన ఈ అడుగును అభినందించాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here