[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
కర్తవ్యోత్ర ప్రతీకారో మయా తీర్థ సమాప్తితః।
తీర్థయాత్రామ్ సమాప్తైవ శీఘ్రమేతత్కరో మి తే॥
[dropcap]నీ[/dropcap]లుడు కశ్యపుడికి కశ్మీర్ దుస్థితిని వివరించాడు. తాను సంగ్రాముడి పుత్రుడు జలోద్భవుడిని పెంచి పెద్ద చేయడం చెప్పాడు. బ్రహ్మదేవుడి వరాలతో జలోద్భవుడు ఉన్మత్తుడై, అంధుడై ప్రజలను పీక్కు తినడం వివరించాడు. దార్వాభిసార, గాంధార, జుహుందర, అంతరగిరి, బహిర్గిరి వంటి ప్రాంతాలు నిర్మానుష్యమైన విషయం వివరించాడు. విశ్వకళ్యాణం కోసం జలోద్భవుడిని అరికట్టమని ప్రార్థించాడు.
అది విన్న కశ్యపుడు ‘అలాగే’ అన్నాడు. తీర్థయాత్ర ముగించుకున్నాడు. పరిసర ప్రాంతాలలో ఉన్న తీర్థాలన్నింటిలోనూ స్నానం చేశాడు. సతీ సరోవరం చేరాడు. పవిత్ర జలంలో పరిశుద్ధుడయ్యాడు. సతీ సరోవరంలో స్నానం చేసిన తరువాత స్వశక్తితో బ్రహ్మలోకం చేరుకున్నాడు. తనతో పాటు నీలుడిని కూడా తీసుకువెళ్ళాడు.
బ్రహ్మలోకంలో వాసుదేవుడు, ఈశ్వరుడు, అనంతుడు వంటి దేవతలంతా ఆ సమయాన ఉన్నారు. బ్రహ్మతో పాటు అక్కడ ఉన్న దేవతలందరినీ గౌరవించాడు కశ్యపుడు. వారందరికీ జలోద్భవుడి క్రూర చర్యలను, పాశవిక ప్రవృత్తిని గురించి వివరించాడు.
అప్పుడు బ్రహ్మ ఇతర దేవతలందరి వైపు చూసి – “మనందరం సౌబంధనకు వెళ్ళాలి. హరి జలోద్భవుడిని సంహరిస్తాడు” అన్నాడు.
ఆ మాట వింటూనే హరి తన వాహనాన్ని అధిరోహించాడు. హరుడు నంది వైపు వెళ్ళాడు. బ్రహ్మ హంసను పిలిచాడు. నీలుడు మేఘం ఎక్కాడు. కశ్యపుడు తన అతీంద్రియ శక్తితో ప్రయాణమయ్యాడు.
ఇది విన్న ఇంద్రుడు తనతో ఉన్న దేవతలతో సహా ప్రయాణమయ్యాడు. యముడు, అగ్ని, వరుణుడు, వాయువు, కుబేరుడు, నిరుత్తి, ఆదిత్యులు, వసువులు, రుద్రులు, విశ్వదేవులు, మరుత్తులు, అశ్వినులు, భృగులు, సాధ్య, అంగీరసుడు పుత్రులు, మునులు, యోగులు, గంధర్వులు, అప్సరసలు, దేవతల పత్నులు, దేవతల తల్లులు, విద్యాధరులు, యక్షులు బయలుదేరారు. సముద్రాలు, నదులు అన్ని అక్కడికి ప్రయాణమయ్యాయి.
గంగ మొసలిపై, యమున తాబేలుపై, శతద్రు ఎద్దుపై, సరస్వతి గేదెపై ప్రయాణమయ్యారు. వివిశ గుర్రంపై, ఇరావతి ఏనుగుపై, చంద్రభాగ సింధులు పులిపై సవారీ చేస్తూ వెళ్లారు. దేవిక అడవిదున్న పైన, సరయు లేడి పైన వెళ్ళగా, మందాకిని మహిషిని, పాయోగ్ని మేకను వాహనం చేసుకున్నాయి.
నర్మద నెమలిని, గోమతి హరిణాన్ని, గోదావరి గొర్రెను, కంపన హంసను వాహనం చేసుకున్నాయి. గండకి కొంగను, కావేరి ఒంటెను, సుమతి మొసలిని, పవిత్ర సీత హంసను వాహనంగా చేసుకున్నాయి. లౌషిత్య కొమ్ములున్న లేడిని, వంక్షు వేగంగా పరిగెత్తే పందిని, హ్లాదిని గోరింకను, హాదిని కోడిని, పావని గుర్రాన్ని, సోనా పామును, కృష్ణవేణి మేఘాన్ని, భువన హరిణాన్ని వాహనం చేసుకున్నాయి. ఇవి కాక ఇతర నదులు తమ తమ వాహనాలను అధిరోహించి బయలుదేరాయి.
జలోద్భవుడితో దేవతలకు జరిగే యుద్ధాన్ని దర్శించేందుకు అందరూ ఉత్సాహంతో బయలుదేరారు.
దేవతలంతా సౌబంధన చేరారు.
సంరంభంగా దేవతలంతా రావడం జలోద్భవుడు చూశాడు.
జలోద్భవుడికి తెలుసు – దేవతలు ఎంతమంది ఎన్ని రకాల ఆయుధాలతో వచ్చినా నీటిలో ఉన్నంతవరకు తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని. అందుకే సతీ సరోవరం నీటి అడుగుకు చేరాడు. బయటకు రాలేదు.
రుద్రుడు హరి సౌబంధన శిఖరం చేరారు.
దేవతలు అసురులు వారిని అనుసరించారు.
అప్పుడు జలోద్భవుడిని సంహరించే ఉద్దేశంతో జనార్దనుడు అనంతుడితో – “వాడు నీటిలో ఉన్నంతవరకు వాడిని ఎవరూ ఏమీ చేయలేరు. సతీ సరోవరం నీరు బయటకు వెడలేట్టు చేయాలి. హిమాలయాలను ఛేదించు. దాంతో నీరు బయటకు పారుతుంది. నీటి రక్షణ పోవడంతో జలోద్భవుడు బలహీనుడు అవుతాడు. వాడిని సంహరించవచ్చు” అని అన్నాడు. అతని మాటలు వింటూనే అనంతుడు – స్వయంగా పర్వతమంతటివాడు, వెన్నెల వన్నె కలవాడు – తన శరీరాన్ని పెంచటం ప్రారంభించాడు.
(మిగతాది వచ్చే వారం)