గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 27: తూములూరు

1
3

[box type=’note’ fontsize=’16’] “గుంటూరు జిల్లా భక్తి పర్యటన – 27” వ్యాసంలో తూములూరు లోని శ్రీ గంగా బాలాత్రిపురసుందరీ సమేత లక్ష్మణేశ్వరస్వామి ఆలయం, శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం గురించి వివరిస్తున్నారు పి.యస్.యమ్. లక్ష్మి. [/box]

శ్రీ గంగా బాలాత్రిపురసుందరీ సమేత లక్ష్మణేశ్వరస్వామి ఆలయం

[dropcap]ఒ[/dropcap]క కిలోమీటరే గనుక తూములూరు తొందరగానే చేరుకున్నాము. ఆలయం కొత్తగా వేసిన రంగులతో మిలమిలలాడుతూ, మేము వెళ్ళాల్సిన ఆలయం ఇదేనా అనే అనుమానం కలిగించింది. అనుమాన నివృత్తికి ఆలయం బయట ప్రహరీగోడకి వున్న ఆర్చిలో చాలా పెద్ద అక్షరాలతో ఆలయం పేరు.. శ్రీ గంగా బాలాత్రిపురసుందరీ సమేత లక్ష్మణేశ్వరస్వామి ఆలయం.. అని కనిపించింది. మా సమాచారం ప్రకారం ఇది రామ సహోదరుడు లక్ష్మణుడు ప్రతిష్ఠించిన ఈశ్వర లింగం. మరి లక్ష్మణుడు ప్రతిష్ఠించినదంటే అతి పురాతన ఆలయం కదా. ఇదేమిటి నిన్న మొన్న కట్టినట్టుంది మా అనుమానాన్ని అక్కడ వున్న పూజారిగారిని అడిగాము. వివరాలు చెప్పమని కోరాము. ఆయన చెప్పిన విశేషాలు..

       

బ్రహ్మ హత్యాపాతకాన్ని పోగొట్టుకోవటానికి శ్రీరామచంద్రుడు చిలుమూరులో ఉభయ రామలింగేశ్వరుణ్ణి ప్రతిష్ఠించ సంకల్పించాడు. ఆంజనేయ స్వామి షరా మామూలే శివలింగాన్ని తీసుకు రావటంలో ఆలస్యం చేశారు. చిలుమూరులో రాములవారు సైకత లింగాన్ని ప్రతిష్ఠించారు. మరి ఆంజనేయస్వామికి కోపం రావాలి కదా. ఆయన కోపంతో తను తెచ్చిన లింగాన్ని తోకతో చుట్టి విసిరేస్తే అది ఐలూరులో పడింది. ఇక్కడ లక్ష్మణుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఈయన లక్ష్మణేశ్వరస్వామి అయ్యాడు. అభిషేకం పూర్తయ్యి లింగానికి విభూతి, కుంకుమ కలిపి లేపనం పట్టించారు. స్వామి చాలా అందంగా కనిపించారు.

ఆలయం మధ్యలో లక్ష్మణేశ్వరస్వామి కొలువు తీరితే స్వామికి ఎడమవైపు ఉపాలయంలో అమ్మవారు బాలా త్రిపుర సుందరీదేవి, కుడివైపు ఉపాలయంలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి.

పక్కనే ప్రత్యేక ఉపాలయంలో శ్రీ అభయ ఆంజనేయ స్వామి. ఇంకా నవగ్రహాలు సతీ సమేతంగా కొలువున్న మండపం. ప్రహరీ గోడ బయట, లోపల దేవతల విగ్రహాలు, పురాణాలలోని కొన్ని ఘట్టాలు అందమైన శిల్పాలుగా చెక్కించారు.

1.3 కోట్ల ఖర్చుతో పునర్నిర్మాణం జరిగిన తర్వాత పునః ప్రతిష్ఠ మహోత్సవంలో భాగంగా 2014 జూన్ 1, 2, 3 తేదీలలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉపాలయాలలో విగ్రహ ప్రతిష్ఠ జూన్ 5వ తేదీన నిర్వహించారు. మేము వెళ్ళేసరికి ఇంకా బయట పని కొంచెం జరుగుతోంది.

ఆలయం చాలా అందంగా, ఆకర్షణీయంగా వున్నది. కానీ మాకు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఈ ఈశ్వరుడు లక్ష్మణుడి ప్రతిష్ఠ అంటే ఎంత పాత ఆలయమో కదా. ఆలయం తర్వాత పెరిగి, తర్వాత వచ్చిన రాజులు, దాతల చేత అభివృధ్ధిగావించబడి వుండవచ్చు. కానీ ప్రస్తుతం ఆ ఛాయలే కనబడటంలేదు. ఇప్పుడే కట్టిన ఆలయంలా వుంది. పురాతన ఆలయ సందర్శన కోసం ఆసక్తి చూపించే మాకు ఇది కొంచెం బాధాకరంగానే వుంది. అక్కడ వున్న పూజారిగారిని అడిగాము. ఆయన చరిత్ర ఏమీ చెప్పలేక పోయారు. అసలు పురాతన ఆలయాల గురించి మనవారు ఏమీ శ్రధ్ధ తీసుకోవటం లేదు. కనీసం అక్కడ వివరాలు తెలుపుతూ ఒక బోర్డు పెట్టవచ్చు. ఆలయాలనుంచి అనేక విశేషాలు తెలుసుకోవచ్చు. ఆ నిర్మాణం కాలంలో సమాజం ఎలా వుండేది, ఏ రాజులు పరిపాలించారు, ఏసందర్భంగా ఆ ఆలయాన్ని నిర్మించారు వగైరా ఎన్నో విషయాలు. కానీ ఆలయాలు కేవలం భక్తి మార్గాలో, ఆదాయ మార్గాలుగానో వున్నాయిగానీ, చారిత్రక అంశాలకి ఎవరూ ప్రాముఖ్యత ఇవ్వటం లేదు. చాలామందిది ఒక్కటే సమాధానం .. ఓ ఇప్పటిదా .. మా తాత ముత్తాతల కాలం నాటిది…

ఈ పునర్నిర్మాణంలో అసలు నిర్మాణపు ఛాయలేమీ కనిపించకుండా చేశారేం? పాత నిర్మాణాన్ని అలాగే వుంచి, దానిని బలపరచి వుండాల్సిందికదా అని అడిగితే ఆయనేమీ సమాధానం చెప్పలేకపోయారు. గర్భగుడి ప్రవేశ ద్వారం, అక్కడి గోడ మాత్రం పురాతనమైనవే అనిపించింది.

పాత ఆలయాల్లోకి వెళ్ళగానే ఒక విధమైన చల్లదనం, ప్రశాంతత లభిస్తాయి. మనసుకి హాయిగా వుండి అక్కడ కొంచెం సేపు వుండాలనిపిస్తుంది. ఆ వాతావరణం ఎందుకో నాకు కొత్తవాటిలో కనబడదు. ఆలయ పునర్నిర్మాణాలు చేపట్టేవారు సాధ్యమైనంతమటుకూ పూర్వపు కట్టడాలను అలాగే వుంచి ఆనాటి నిర్మాణ శైలిని కాపాడమని కోరుతున్నాము.

ఈ ఆలయానికి ఎదురుగానే శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం వుంది. దానికి బయల్దేరాము.

శ్రీ శ్రీదేవీ, భూదేవీ సమేత చెన్నకేశవ స్వామి ఆలయం

ఇది కూడా పురాతన ఆలయమే. 2014లో పునః ప్రతిష్ఠ కావించబడింది. ఆలయం చాలా అందంగా వుంది. కానీ పురాతన ఛాయల్లేవు.

 

ఇందులో శ్రీ ఆంజనేయస్వామి ఆలయం కూడా వుంది. దర్శనం చేసుకుని 9-55కి చివలూరు బయల్దేరాము.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here