మనోమాయా జగత్తు-3

0
4

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది మూడవ భాగం. [/box]

3

[dropcap]ఆ[/dropcap] రాత్రి ట్రాఫిక్ జామ్ క్లియర్ అయ్యే వరకూ సుశీల కోసం వచ్చిన మహిళలెవరూ ఇళ్ళకి వెళ్లలేకపోయారు. రోడ్డు మీది రద్దీ తగ్గి, అందరూ ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళేసరికి దాదాపు పదకొండయింది. అందరినీ పంపి అప్పుడు లోపలకొచ్చి పడుకున్నారు సుశీల, సిరి,విరి. పడుకున్నారే గానీ ఎవరికీ ఓ పట్టాన నిద్ర పట్టలేదు.

కళ్ళు మూసుకుని మాటాడకుండా పడుకుందే గానీ సుశీల చెవుల్లో “బాబూ! నితిన్! నిత్తూ బాబూ! నిత్తూ బాబూ!” అన్నకేకలు ఘంటారావంలా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ‘నిత్తూబాబూ’ అన్నమాట క్రమంగా మారి, “ఒరేయ్ నిత్యం, నాయనా, నిత్యం బాబూ, నిత్తుబాబాయ్! నిత్తుబాబాయ్!” అన్నట్టు హోరెత్తుతున్నాయ్. ఒకటి కాదు రకరకాల జ్ఞాపకాలు. కళ్ళు మూసుకునున్నా సుశీల మెలుకువగానే ఉందని గ్రహించింది సిరి.

నెమ్మదిగా పక్కన చేరింది. “అమ్మా! ఇప్పుడైనా చెప్పమ్మా నువ్వు ఇంత ఇదిగా ఎందుకు బాధపడుతున్నావు?” అడిగింది. విరి కూడా వచ్చి కూచుంది. “చెప్పమ్మా. నితిన్ సంఘటన నీకింకేదైనా గుర్తుకు తెచ్చిందా?”

“ఊఁ.” మూలిగింది.

‘ఒకటా రెండా ఎన్నో! ఎన్నెన్నో! ఏమని చెప్పాలీ పిల్లలకి? వీళ్ళు విన్నా పెద్దగా బాధ కలగని జ్ఞాపకాలనే చెప్పాలి. ప్రస్తుతానికంతే. నా మనసును నిజంగా మథిస్తున్న జ్ఞాపకాలను ఇప్పుడు వీళ్లతో పంచుకోలేను’ నిశ్చయించుకుంది. కాసేపు ఆలోచించి లేచి దిండుకానుకుని కూచుంది.

“మీకిదివరకెప్పుడైనా చెప్పానోలేదో, నాకు ఒక బాబాయ్ ఉండేవాడు. ఆయన పేరు నిత్యానందం. నిత్యం, నిత్తూ అని పిలిచేవారు మానాన్న. నేను నిత్తు బాబాయ్ అనేదాన్ని” విరి, సిరి శ్రధ్ధగా వింటున్నారు. “నితిన్ ఇంట్లోంచి నిత్తుబాబూ అంటూ ఏడుపులు వినిపించినప్పుడు నాకు నిత్తుబాబాయ్ గుర్తుకొచ్చాడు”.

“ఆయన కూడా నితిన్ లాగా కొంచెం మెంటల్…” విరి ప్రశ్న పూర్తి కాకుండానే అవునన్నట్టు గబగబా తలూపింది సుశీల.

“అప్పట్లో నాకు తెలిసేది కాదు. ఏదో, బాబాయ్ ఎక్కువ మాటాడడు, అదోరకంగా ఉంటాడు అనుకునే దాన్ని. మీరింతకు ముందు నితిన్ గురించి చెప్పుకున్నారే, తనలో తను మాట్లాడుకోడం అదీ చేసే వాడని అలాగే ప్రవర్తించేవాడు. మీరిద్దరూ నవ్వుకున్నారే, నితిన్‌కి మానస పుత్రులు అని సరిగ్గా అలాగే ఆయన తనకూ ఓ సంసారం ఉన్నట్టు ఊహించుకునేవాడు. ఆ వయసులో నాకు అర్థమయ్యేది కాదుకానీ అప్పుడప్పుడు నేను గట్టిగా అరిచి పాటలు పాడుకుంటూ నాలో నేను ఆడుకుంటుంటే హుష్, సుశీ అరవకు మీ పిన్ని నిద్రపోతోంది అని నన్నక్కడి నించి పంపించేసేవాడు. ఈ పిన్ని ఎవరో తెలియక చాలా అయోమయంలో పడేదాన్ని. తరవాత తరవాత, అంటే కొద్దిగా బాబాయి ఊహించుకునేవాడేమోనని అనుకునేదాన్ని. అయితే నాకామాత్రం అవగాహన కలిగే వయసొచ్చేటప్పటికి ఆయన పోనే పోయాడు.”

‘ఓ అందుకే అమ్మ అంత ఆవేశ పడింది. తన బాబాయిని కూడా మేం వేళాకోళం చేసినట్టని పించుంటుంది అమ్మకి’ అనుకుంది సిరి.

“ఆయన కూడా నితిన్ దారిలోనే పోయాడు”.

సుశీల మాట అర్ధం అయి ఉలిక్కి పడ్డారు విరి,సిరి.

“అంటే ఆత్మహత్యా?”

“ఊఁ. పొద్దున్న పక్కింట్లోంచి నిత్తూ బాబూ అని ఏడుపు వినబడుతుంటే నిత్యంబాబాయి జ్ఞాపకాలు ముంచు కొచ్చి భరించలేకపోయాను. అందుకే.. అందుకే…” ఇంక మాటాడలేక కళ్లు తుడుచుకుంది సుశీల.

తల్లి వెన్ను నిమురుతూ ఓదార్చింది సిరి.

“బహుశా మీ బాబాయికీ నితిన్ లాగే స్కీజోఫ్రేనియా ఏమో” అంది విరి.

సుశీల నిట్టూర్చింది. “ఏమో. ఆరోజుల్లో ఇంత అవగాహన ఉండేది కాదుగా. చాలా మంది ఇళ్లల్లో మా నిత్యం బాబయి లాంటి వాళ్లు ఉంటూనే ఉండేవారు. ఏదో తిక్క వాడనీ, స్థిమితం లేనివాడనీ చెప్పుకుని సద్దుకుపోతుండేవారు. మరి ఇప్పుడు ఇన్నిరకాల వైద్యాలొచ్చాయి. అందరికీ అవేర్‌నెస్ పెరిగింది. అయినాకూడా నితిన్ అలా…. ఏమయిందో! వాళ్లసలు వైద్యం చేయించట్లేదేమో! చాలా కాలం పడుతుంది ట్రీట్‌మెంటు. సహనం ఉండాలి” గొణుక్కుంది సుశీల.

“ఇంక అవన్నీ మర్చిపో. ఆలోచించకు. నిద్రకి ప్రయత్నించు” నెమ్మదిగా తల్లి వీపు మీద రాస్తూ అంది విరి. తన పక్కనే పడుకుని తల్లిలా తన కూతురు జో కొడుతుంటే సుశీల మనసుకు ఎక్కడలేని ప్రశాంతత దొరికింది.

విరి ఆరోజు నితిన్ ఇంట్లో జరిగినదంతా చెప్పడం మొదలెట్టింది. తను ఎవరెవరికి ఫోన్లు చేసిందీ ఎవరెవరు ఎలా రెక్కలు కట్టుకు వాలారు, ఎవరు ఇష్టంలేనట్టు వచ్చారు చెప్పింది. అక్కడ చేరిన వాళ్ళంతా నితిన్ గురించి ఏమేం మాటాడుకున్నారో విరి చెప్తుంటే ఆసక్తిగా విన్నారు.

“నువ్వు మీ బాబాయిని గురించి చెప్పినట్టే నితిన్ కూడా ఒక్కోసారి రోజుల తరబడీ మాటాడేవాడు కాదుట. నితిన్‌ని వాళ్ళ మామయ్యే ట్రీట్ చేస్తున్నాడమ్మా. ఆయన సైకియాట్రిస్టుట. అక్కడ చుట్టాలందరూ ఆ అంకుల్ని పట్టుకుని వైద్యం జరుగుతున్నా కూడా వాడి పరిస్థితి మెరుగవ్వాల్సింది పోయి దిగజారిందేవిటీ అని ఒకటే గొడవ. నితిన్ వాళ్ళమ్మ, అదే, శాంతా ఆంటీ చెప్పడం ఏవిటంటే ఒక్కోసారి మింగమని చేతిలో వేసిన మాత్రలు మింగకుండా నోట్లో వేసుకున్నట్టు నటించే వాడేమో అంటుంది. ఒక్కోసారి అతని చొక్కా జేబుల్లోనూ, పరుపు కిందా మాత్రలు కనిపించేవిట. అందుకే అతని మూడ్స్‌లో ఎగుడుదిగుళ్ళు కనిపించేవి అంటాడాయన. అసలతను చాలాకాలం మందులు వాడాల్సిందేనుట. అతనే తనంత తను వేసుకుంటే బాగుండని చూసేదిట ఆంటీ. కానీ అలా అలవాటవలేదంటుంది.”

“చాలాకాలం మందులు వాడాలా? ఏం స్కీజోఫ్రేనియా జబ్బు తగ్గదా?”

“ఆయనలాగే అన్నాడు. ఏ బి.పి.యో, డయాబిటీసో వచ్చిన వాళ్ళయితే జీవితాంతం మందులు వేసుకుంటూనే ఉండాలి కదా? అలాగే ఈ మానసిక రోగాలుకూడా అంటూ చెప్పుకొచ్చాడాయన.” విరి చెప్తున్న కబుర్లు వింటూ కళ్ళు మూసుకుంది సుశీల.

రోజంతా అనుభవించిన మానసిక వేదన, అలసట వల్లనేమో నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. సుశీల నిద్రపోయిందని చూసి విరి, సిరి నిశ్సబ్దంగా లేచి తమ గదిలోకి వెళ్ళారు.

“ఎప్పుడో చిన్నతనంలో జరిగిన సంగతి, ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ అమ్మని బాధిస్తున్నాయంటే ఆశ్చర్యంగా ఉంది.” అంది విరి తనలో తను అనకుంటున్నట్టు.

“కొన్ని కొన్ని బాధలు అలాంటి సంఘటన మళ్ళీ ఎప్పుడు జరిగినా గుర్తొచ్చి పీడిస్తాయనుకుంటా. బాధంటే మామూలు బాధ కాదు ‘ట్రామా’ అంటామే విపరీతమైన వేదన. అది. అదంత త్వరగా వదిలిపెట్టదేమో” అంది సిరి.

“ఏమో నాకేంటో ఎక్కడో ఏదో లోపం ఉన్నట్టనిపిస్తోంది”.

“అదికాదు విరీ, వాళ్ళ బాబాయి ఆత్మహత్య అమ్మనెంతో కుంగదీసింది. మళ్ళీ మళ్ళీ అలాంటి సంఘటన ఎప్పుడు జరిగినా అది అప్పటిలాగే బాధిస్తోంది. అలాంటి అనుభవం ఉన్నవాళ్ళకి అది సహజమే నేమో. ఆ ట్రామా నించి తేరుకోడానికి వాళ్లకి ఒక జీవితం సరిపోదేమో!” తత్త్వవేత్తలా అంది సిరి.

“అమ్మ అన్ని మాటలు చెపుతుంది. అన్ని జ్ఞాపకాలు మనసునిండా దాచుకుంటుంది. కానీ మన నాన్న గురించి మాత్రం ఒక్క మాట కూడా చెప్పదు. ఒక్క జ్ఞాపకం కూడా మనతో షేర్ చేసుకోదు. అసలింట్లో ఒక్క ఫొటో కూడా లేకుండా చేసేసింది” తన మనసులో ఎప్పుడూ ఉండే ఉక్రోషం బయట పెట్టింది విరి.

సిరి ఏం మాటాడలేదు. కళ్లల్లో నిండుతున్న కన్నీళ్ళని నిశ్శబ్దంగా తుడుచుకుంది. “అమ్మ ప్రవర్తన చూస్తుంటే నాకొక అనుమానం వస్తుంది”

ఏమిటన్నట్టు మూగగా చూసింది సిరి.

“ఒకవేళ మన నాన్న కూడా స్కీజో…” విరి నోరు చేత్తో గట్టిగా మూసేసింది సిరి.

***

ఆ రాత్రి యోగికి కూడా నిద్ర పట్టలేదు. తన లాగే నిద్రపట్టక మెడికల్ జర్నల్ తిరగేస్తున్న విమల్‌తో ఆరోజు జరిగిన హత్య, ఆత్మహత్యల గురించి చర్చిస్తున్నాడు.

“ఇందాకటి వాడి స్టాబ్ వూండ్స్ చూసావా? బ్లీడింగ్ చాలా ఎబ్రప్ట్‌గా ఆగిపోయింది. పెక్యూలియర్!” అన్నాడు యోగి. విమల్ కొంచెం ఆలోచించాడు. “నిజానికి నేను సరిగ్గా అబ్సర్వ్ చెయ్యలా. నువ్వంటుంటే నిజమే అనిపిస్తోంది.” అన్నాడు. “అయినా అక్కడ ప్రొఫెషనల్ పొడిచినట్టు లేదు గట్రా వాగుతావెందుకు పెద్ద షెర్లాక్ హోమ్స్ లాగా? ఊరికెనే దూసుకుంటూ పోయి అన్నిట్లోనూ వేలుపెడతావ్. ఎప్పుడో ఎక్కడో ఇరుక్కుపోతావ్. పోలీసులకి కావాల్సిందల్లా ఎవడో ఒక స్కేప్ గోట్. ఓ బలిపశువు. నీ వాగుడు చూసి నీకేదో సంబంధం ఉండే ఉంటుందని మూసేస్తాడెవడో. ఒదిలిపోతుంది జలుబు.” అతని మాట పూర్తికాగానే కాలింగ్ బెల్ మోగింది. “అదిగో మోగింది జేగంట. పోలీసులే. నీకోసమే. వచ్చారు. వెళ్లు.” అన్నాడు విమల్. చేతిలో ఉన్నజర్నల్ పక్కన పెట్టి లేచాడు యోగి వచ్చిందెవరో చూద్దామని.

“ఒరేయ్ ఢామ్మని తలుపు తెరిచెయ్యకు. కిటికీలోంచి చూడు దొంగో దొరో” సలహా ఇచ్చాడు విమల్.

కిటికీరెక్క ఒకటి తెరిచి తొంగి చూసాడు యోగి. ‘ఇతనికి యూనిఫామ్ అవసరంలేదు’ అని తను అనుకున్న పోలీస్ ఆఫీసర్ గుమ్మం అవతల నిలబడి కిటికీలో కనిపించిన యోగి ముఖారవిందం చూసి చిరునవ్వు నవ్వాడు.

“ఓ! గోచీ పోలీస్!” అప్రయత్నంగా యోగి నోట్లోంచి వచ్చేసింది.

“వాట్!” వింతగా చూసాడవతలి వ్యక్తి.

గబుక్కున తలుపు తెరిచి, “రండి” అన్నాడు చిన్నగా నవ్వి.

“నేను ఇన్‌స్పెక్టర్ నిగమ్. సిఐడి. మీరేనా డాక్టర్ యోగి?” అన్నాడతను.

“అవును. రండి లోపలికి రండి. కూచోండి” అన్నాడు. అతను సోఫాలో సెటిలవుతుంటే విమల్ దివాన్ మీద నించి లేచి కుర్చీలో కూచున్నాడు.

“ఇతను డాక్టర్ విమల్” క్లుప్తంగా పరిచయం చేసాడు యోగి.

“ఇందాక కిటికీలోంచి నన్ను చూసి ఏదో అన్నారు?” కుతూహలంగా అడిగాడు నిగమ్.

“సారీ” అంటూ చిన్నగా నవ్వి అతన్ని మొదటిసారి చూసినప్పుడు తనకు ఏమనిపించిందో చెప్పి, అనుకోకుండా తను అనేసిన “గోచీ పోలీస్” అన్నమాట కూడా చెప్పాడు. అది విని పకపకా నవ్వాడు నిగమ్.

‘పోలీసులక్కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుందా? హాస్యం తెలుసా? వాళ్లు కూడా తమమీద వెయ్యబడ్డ జోకులకు తామే నవ్వగలరా?’ విమల్ ఆశ్చర్యానికి అంతులేదు.

అతను నవ్వడం ఆపేసరికి యోగి మైక్రోవేవ్‌లో కాఫీ వేడి చేసి తీసుకొచ్చి ఓ కప్పు నిగమ్ చేతిలో పెట్టాడు. విమల్‌కి ఒకటిచ్చి తనొకటి తీసుకున్నాడు.

“ఇందాక పిజ్జాహట్ లో జరిగిన ఇన్సిడెంట్‌లో కత్తిపోట్ల మీద మీరేదో అబిప్రాయం చెప్పారు?” అడిగాడు నిగమ్

‘అయిందా పెళ్ళి? బుక్కయిపోయావ్ ఫో’ అన్నట్టు చూసాడు విమల్.

“ఆ పోట్లు అలవాటుగా, లేక వృత్తిగా హత్యలు చేసేవాడు పొడిచినట్టులేవు. కసాపిసా పొడిచాడు చేతకానివాడు కూరలు తరిగినట్టు” అన్నాడు యోగి.

“ఆ కత్తి కూడా కూరలు తరిగే కత్తే. క్రిమినల్స్ వాడేది కాదు” నవ్వాడు నిగమ్.

“ఇంకా ఏమిటి మీ అబ్సర్వేషన్స్?” మళ్ళీ అడిగాడు.

‘ఇదేం లీడింగ్ కొస్చనో! వీడు నోరుమూసుకుంటే బాగుణ్ణు’ అనుకున్నాడు విమల్.

“అతని రక్తస్రావం చాలా సడెన్‌గా ఉన్నట్టుండి ఆగిపోయింది. అప్పటికప్పుడు అట్టకట్టేసింది కూడాను” ఆ దృశ్యం గుర్తు తెచ్చుకుంటూ నదురూ బెదురూ లేకుండా తన అభిప్రాయం ప్రకటించాడు.

“రైట్” తన అభిప్రాయం కూడా అదే అన్నట్టు తలూపాడు నిగమ్.

“మీరెక్కడ వర్క్ చేస్తున్నారు? ఇంటి ఎడ్రస్ మటుకే ఇచ్చారు మా వాళ్ళు రాసుకున్నప్పుడు. సొంతంగా నర్సింగ్ హోముందా?” అడిగాడు.

“లేదు నేను గవర్న్‌మెంట్ డాక్టర్ని. ఓ గ్రామంలో పనిచేస్తున్నాను గోదావరితీరంలోని మల్లిప్రోలు అనే పల్లెటూరు” చెప్పాడు (మల్లిప్రోలు అనే ఊరు ఏదీలేదు. కేవలం రచయిత కల్పన).

“ఆ ఊరి పేరు చెప్తే ఎవరికీ తెలియదులెండి కాకినాడకి గంట ప్రయాణం” అన్నాడు.

“నాకు తెలుసా ఊరు. నా స్కూలు, కాలేజీ చదువంతా ఉభయగోదావరి జిల్లాల్లోనూ జరిగిందిలెండి” అన్నాడు నిగమ్.

‘హ్యూమన్ సైడ్ ఆఫ్ ఎ పోలీస్ ఆఫీసర్. పోలీసాయన వ్యక్తిత్వంలో మానవీయకోణం’ అనుకున్నాడు విమల్ వ్యంగ్యంగా. ఇంత స్నేహపూర్వకంగా ఈయన మాటాడ్తున్నాడంటే ఏదో పెద్ద కారణమే ఉండుంటుందని అతని అనుమానం.

“ఇక్కడ మా పేరెంట్సుంటారు. సిటీలో నాక్కొంచెం పనుండి వచ్చాను. నేను వాడుతున్న కారు మా నాన్నగారిది. మా పేరెంట్సు చుట్టాలింట్లో పెళ్లికి వెళ్ళారు. విమల్ ఇవాళ నాతో గడపడానికి వచ్చాడు” చెప్పాడు యోగి.

“మీరెక్కడ?” విమల్ వైపు తిరిగి అడిగాడు నిగమ్.

తనుపని చేస్తున్న కార్పొరేట్ హాస్పిటల్ పేరు చెప్పి, “యోగికి డబ్బు రంధి లేదు. ప్రైవేట్ ప్రాక్టీస్ చెయ్యడు. పదవీ వ్యామోహం అంతకంటే లేదు. అందుకని గ్రామీణ ప్రాంతాల హాస్పిటల్ ఉద్యోగాన్ని వరించాడు” అన్నాడు విమల్.

“ఇందాక పిజ్జాపేలెస్‌లో గాయపడ్డవాడిని మీ హాస్పిటల్‌కే షిఫ్టు చేసారు. మెడికల్ కాలేజీ హాస్పిటల్‌కి తీసుకెళ్లి పరీక్షచేయించారు మావాళ్లు. సర్టిఫికెట్లన్నీ తీసుకున్నాక మీ హాస్పిటల్లో ఎడ్మిట్ చేస్తామని అతని ఫ్యామిలీ రిక్వెస్ట్ చేసారు” అన్నాడు నిగమ్.

ఆ సంఘటన జరిగి చాలా సమయం గడిచిపోయింది. అర్ధరాత్రి దాటింది. ఇంత రాత్రప్పుడు తాము మేలుకునే ఉంటామన్న నమ్మకంతో ఈ పోలీసాయన ప్రశ్నలు గుప్పించడానికొచ్చాడు!

“ఇంతకీ ఎవరతను? ఆ సూట్లో ఉన్నాయన అతని తండ్రేనా? ఎక్కడో చూసినట్టుందాయన్ని” అన్నాడు యోగి.

‘వీడికెవర్ని చూసినా ఎక్కడో చూసినట్టే ఉంటుంది కాబోలు’ ఆవలింత అణుచుకుంటూ విసుక్కున్నాడు విమల్.

“గుర్తు పట్టలేదా? ఇండస్ట్రియలిస్ట్ రాజేశ్వర్రావ్! నీలాంబరీదేవికి పరమ భక్తుడు” కొంచెం ఆశ్చర్యంగా ముఖం పెట్టి అన్నాడు నిగమ్.

“ఓ! య్యా!” యోగికి గుర్తొచ్చింది.

“అందుకా నీలాంబరి వాళ్ళతో ఉంది?” అన్నాడు.

“రాజేశ్వర్రావ్ కొడుకుని పొడిచినవాడు కూడా దొరికాడు” నిగమ్ చెప్పాడు.

“ఎక్కడ?” విమల్‌కి విసుగుమాయమై కుతూహలం పుట్టింది.

“అక్కడికి దగ్గర్లో ఓ బైలేన్‌లో పడున్నాడు. జనాలు మూగుతుంటే మేం చూసి ఆగాం. వాళ్లతో పాటు ఒక అమ్మాయి ఉందికదా, ఆ అమ్మాయి గుర్తు పట్టింది. అదే ఏంబులెన్స్‌లో వేసి పట్టుకుపోయాం.”

“ఇంతకీ ఆ అమ్మాయి ఎవరూ?” విమల్ కి కుతూహలం రెట్టింపయింది.

“రాజేశ్వర్రావు కొడుకు సెక్రటరీ.”

“ఏం చేస్తాడు రాజేశ్వర్రావు కొడుకు?”

“అతని పేరు రమేష్ లెండి. ప్రస్తుతం ఏమీ చెయ్యట్లేదు. ఏదైనా చేద్దాం అన్న సదుద్దేశంతో ముందుగా లేడీ సెక్రటరీని ఎపాయింట్ చేసుకున్నాడు” నవ్వుతూ చెప్పాడు నిగమ్.

‘ఈ పోలీసు నవ్వుతుంటే బావున్నాడు’ అనుకున్నాడు విమల్.

“పొడిచిన వాడు రమేష్ ప్రెండేట. వాడూ ట్రీట్‌మెంట్‌లో ఉన్నాడు. అమ్మాయి కోసం తగాదా. పనీపాటా లేని గొడవలు” నిగమ్ మాటలు వింటూ ఇద్దరూ మౌనంగా కూచున్నారు.

“ఆల్రైట్ నేను వెడతాను” అని లేచాడు నిగమ్.

‘అసలెందుకొచ్చినట్టు?’ అన్నది విమల్ మనసులో మూగ ప్రశ్న.

“గవర్న్‌మెంట్ హాస్పిటల్లో డాక్టర్ కూడా ఇందాక మీరన్నట్టే రమేష్ రక్తం గడ్డకట్టడం గురించి ఏదో కామెంట్ చేసాడు. ఓకె. మీకింకేమైనా పాయింట్స్ తడితే నా సెల్‌కి ఫోన్ చెయ్యండి” గుమ్మం దగ్గర ఆగి కార్డిచ్చాడు నిగమ్. అతనితో పాటు జీపుదాకా నడిచాడు యోగి.

“నీలాంబరి ఆయుర్వేదమో మూలికా వైద్యమో ఏదో చేస్తుంది తెలుసా?” అడిగాడు నిగమ్ జీపు ఎక్కబోతూ.

“తెలియదు. ఎక్కడ చదివింది ఆయుర్వేదిక్ మెడిసిన్?” యథాలాపంగా అడిగాడు యోగి.

“చదువా? అలాంటి దేమీలేదు. హిమాలయాల్లో సాధువుల దగ్గర నేర్చుకున్నానని చెప్తూంటుంది. రమేష్ స్కీజోఫ్రేనియాకి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడుట” నిగమ్ జీపెక్కి వెళ్లిపోయాడు.

ఆలోచిస్తూ నుంచుండిపోయాడు యోగి. ‘రమేష్ స్కీజోఫ్రేనిక్ అని తనకెందుకు చెప్పాడు? తను సైకియాట్రిస్ట్ అని నిగమ్‌కు తెలుసా? తను చెప్పలేదే!’

***

తెల్లవారి ఆలస్యంగా తొమ్మిదింటికి నిద్ర లేచిన సిరి, సుశీల అప్పటికే లేచి ఇంటిపనులు చేసుకుంటుండడం చూసి సంతోషించింది.

“అమ్మా, ఇవాళ నువ్వు కాలేజీకెడతావా?” అనడిగింది వంటింట్లో తల్లి వెనక చేరి, ఆవిడ కొంగుతో ముఖం తుడిచేసుకుంటూ.

సుశీల నవ్వుతూ మెత్తగా ఓ మొట్టికాయవేసి “ఇవాళ ఆదివారం మర్చిపోయావా” అంది.

“హుర్రే! నువ్వింట్లోనే ఉంటావా గ్రేట్!” సంతోషంగా చిన్నకేక పెట్టింది.

“పాపం, సిరెమ్మ నిన్న మీ పరిస్తితి చూసి దడిసి పోయిందండమ్మా” అంది ఇల్లూడుస్తున్న సీతమ్మ.

“ఏంటో నిన్న నేనెందుకో తట్టుకోలేకపోయాను. పిల్లలే నయం” గొణుక్కుంది సుశీల.

“విరెమ్మగారమ్మా… ఆ శాంతమ్మగారి బర్తా, ఆరి తాలూకు చుట్టాలొచ్చే వరకు ఆ ఇంటికి పెద్దకొడుకులా ఆదుకుందమ్మా. మన విరెమ్మ ముందు మగపిల్లలు కూడా ఎందుకూ పనికిరారమ్మా” మెచ్చుకుంది సీతమ్మ. నిద్రపోతున్న విరి వైపు వాత్సల్యంగా చూసింది సుశీల.

ఆ రోజు మధ్యాహ్నం భోజనాలు చేసి తీరిగ్గా కబుర్లు చెప్పకుంటూండగా ఉన్నట్టుండి ఏదో గుర్తొచ్చినట్టు లేచింది విరి.

“ఏమిటి కంగారు? స్థిమితంగా కూచో. ఎప్పుడూ ఏదో తొందరే. ఎక్కడికి బయల్దేరావు?” ప్రేమగా కసిరింది సుశీల.

“కాదమ్మా ఇవాళ నితిన్ పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ వచ్చేసుంటుంది. వెళ్ళి అంకుల్‌ని అడుగుదామని” అంది విరి.

“వస్తే మాత్రం నువ్వేంచేస్తావు? చూడూ, ఇప్పుడు వాళ్లింటినిండా బంధువులున్నారు. వాళ్ళూ వాళ్ళూ చూసుకుంటారు. మన అవసరం ఉంటే వాళ్ళే పిలుస్తారు. మనం మాటమాటికీ వెళితే బావుండదు. నిన్నంటావా, అప్పుడు ఆంటీ ఒక్కరే ఉన్నారింట్లో. ఇరుగపొరుగుల అవసరం అప్పుడెంతైనా ఉంటుంది. మనం సాయం చెయ్యడం ధర్మం కూడానూ” అంది.

ఇంతలో “సుశీలా” అని పిలుస్తూ శ్యామల, సరోజా వచ్చారు.

“ఇవాళ ఎలా ఉంది సుశీలా ఒంట్లో? నిన్న నీ పరిస్థితి చూసి హడిలిపోయాం అనుకో” అంది శ్యామల. సుశీల మొహమాటపడిపోయింది.

“సరేగానీ నువ్వు కూడా ఓసారి శాంతని పలకరిస్తే బాగుంటుంది సుశీలా. వెడదాం వస్తావా?” అంది.

“వస్తా” అని చెప్పులు తొడుక్కుని బయల్దేరింది సుశీల.

వాళ్లు పక్కింటికి వెళ్ళగానే విరి, “చూసావా సిరి, నాకేమో ఏవేవో నీతులు చెప్పేసింది. ఇప్పుడు తను వెడుతోంది అమ్మ” చాడీ చెప్పింది.

“ఏడిశావులే తెలివి” అంటూ నవ్వింది సిరి.

విరి గదిలోకి వెళ్లి కంప్యూటర్ ఆన్ చేసింది.

“మళ్ళీ స్కీజో ఫ్రేనియానే పట్టావా?” అడిగింది సిరి.

“తప్పదు. నితిన్ గురించి చాలా తెలుసుకోవాలని ఉంది. అతను ఉండగా అతని సమస్య గురించి చాలా చిన్న చూపు చూసాము. మనం ఈ మానసిక వ్యాధుల గురించి బాగా తెలుసుకోవాలి.”

“ఇప్పుడు తెలుసుకుని ఏం చేస్తాం?” నితిన్ గుర్తుకొచ్చి బాధగా కళ్ళు మూసుకుంది సిరి.

“ఎందుకంటే ఇక ముందెప్పుడూ అలాంటి పొరబాటు మళ్ళీ చెయ్యకూడదని”

“మనకెప్పుడూ ఎవరో ఒకరు మానసిక జబ్బులున్న వాళ్ళు తగులుతూంటారా?”

“అలాకాదు సిరీ, నితిన్నే తీసుకో. అతనికి ఏ ఆస్మానో, లేకపోతే టిబినో ఉందని తెలిసిందనుకో మనం ఎంత సానుభూతి చూపిస్తాం! అంతెందుకు ఓ నెలరోజులపాటు టైఫాయిడ్‌తో మంచాన పడ్డాడనుకో అతని మిస్సయిన క్లాసుల నోట్సులు రాసిచ్చి, తెలియనివి ఎక్స్‌ప్లయిన్ చేసి, స్నేహితులమందరం వీలయినంత హెల్ప్ చేసుండే వాళ్ళం కాదా. మన కళ్ళకి కనిపించని అతని మనసుకు జబ్బు చేసింది కాబట్టి అతన్ని మనం చులకనగా చూసాం. కేవలం ఇగ్నోరెన్స్ – అజ్ఞానం వల్ల. తలుచుకున్న కొద్దీ బలే బాధనిపిస్తోంది. మనకి అతని సమస్య గురించి ఏ మాత్రం ఎవేర్నెస్ ఉన్నా మనం అతన్ని అంతలా హేళన చేసుండే వాళ్లం కాదు. పాపం మానసిక వ్యాధిగ్రస్తుల సమస్యలు, బాధ ఓ పట్టాన అవతల వాళ్లకర్థం కావు. కారణం మనకి తెలిసిందే. పైకి చూడ్డానికి శారీరకంగా మామూలుగానే ఉంటారు. కానీ వాళ్ళ ఆలోచనలూ, ప్రవర్తనా వేరే రకంగా ఉంటాయి. చూసేవాళ్ళకి వీడికేం పోయేకాలం ఇంత ఇలా ప్రవర్తిస్తాడు అనిపిస్తుంది. అంతే కానీ అది ఆ మనసుకు వచ్చిన సమస్య – ఆ జబ్బు లక్షణం అని అర్ధం కాదు. అందుకే పాపం నితిన్ లాంటి వాళ్లు అవహేళన పాలవుతుంటారు” విరి తన మనసులో వస్తున్న ఆలోచనలను కాస్త తంటాలు పడుతూ మాటలకు తడుముకుంటూ వివరించింది.

సిరి ఆలోచించింది. “నిజమే అనుకో. కనీసం వాళ్లమ్మైనా ఒకసారి ‘అమ్మా మావాడి సమస్య ఇది కాస్త క్లాసులో వాడి బిహేవియరూ అదీ కనిపెట్టి నాకు చెపుతుండండమ్మా’ అనుంటే మనమే కాదు అసలెవరూ అతన్ని ఆట పట్టించకుండా శ్రధ్ధ తీసుకునే వాళ్ళం కదా” అంది.

“అదే వచ్చిన గొడవ. ఇదిగో ఈ ఆర్టికిల్ చూడు. చాలామంది పేరెంట్సుకూడా మానసికవ్యాధి అంటే అదేదో సోషల్ స్టిగ్మా – ఒక మచ్చలాగా దాచిపెట్టేస్తుంటారని.”

“మన సమాజంలో అంతేలే. ఏ తప్పూ చెయ్యని అమాయకులకే అన్ని మచ్చలూ పడుతుంటాయి” యథాలాపంగా అనేసింది సిరి.

మనసులో నితిన్ మీద ఫ్రెండ్స్‌తో కలిసి వేసుకున్న జోకులు, నవ్విన నవ్వులు ప్రతిధ్వనిస్తున్నాయ్. “ఇప్పుడివన్నీ ఇంతలా స్టడీ చేసినా ఏం చెయ్యగలం?” గొణుక్కుంది.

“ఏం చెయ్యగలమంటే, ఎమ్సెట్ రాసి ఎమ్.బి.బి.ఎస్. చదువుతాం. ఎమ్. డి. చదివి సైకియాట్రిస్టులమవుతాం. వీలైతే సైకో ఫార్మకాలజీ చదివి కొత్తకొత్త మందులు కనిపెట్టి మనోవ్యాధికి మందులేదు అన్న సామెతని సామెతల లిస్టులోంచి డిలీట్ చేస్తాం” లేచి నిలబడి చిన్న డాన్స్ చేసింది విరి.

సిరి చప్పట్లు కొట్టింది.

‘డింగ్ డాంగ్’ మని కాలింగ్ బెల్ మోగింది.

“మనకి విజయం తధ్యం. అదిగో మోగింది జేగంట.”

“అమ్మొచ్చింది. ఆట్టే అల్లరి చేస్తే మోగుతుంది వీపున విమానం” తలుపు తియ్యడానికెళ్ళింది సిరి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here