[box type=’note’ fontsize=’16’] 16-2-2019 భీష్మ ఏకాదశి సందర్భంగా మట్ట వాసుదేవమ్ గారు అందిస్తున్న పద్య కవిత ‘భీష్ముడు‘. [/box]
చరితగల మహాబిషుండు శంతనుడే తండ్రి ఆయె!
లోకపావనగు గంగా మాతయే నీ తల్లి అయ్యె!!
ఆఖరు వసువగు నీకు ముని శాపము దీవెనయ్యె
ఏమి జన్మ భీష్మా! ఇంకెవరికి కలదో చెప్మా!!
చిన్నప్పుడు తల్లితోడ గంగా సైకత స్థలమున ఆటలాడు
నిన్ను చూచి అమ్మ ఎంత మురిసినదో
పరశురామునంతవాడు బాణగురుండాయె నీకు
ఏమి జన్మ భీష్మా! ఇంకెవరికి కలదో చెప్మా!!
నిన్ను చూచి శంతనుడు తనయుడని తెలుసుకొని
గంగమాత అనుమతితో నిజపురముకు కొని తెచ్చెను
హస్తినలో నీ నడవడి అన్ని నోళ్ల కీర్తింపగ
బాలుడయ్యు నీవు బ్రహ్మతేజమ్మున వెలిగితివి
ఏమి జన్మ భీష్మా! ఇంకెవరికి కలదో చెప్మా!!
తండ్రి దిగులు చూసి నీవు తపన చెంది శీఘ్రముగా
దాశరాజు పల్లెకేగి సత్యవతిని కలుసుకొని
తండ్రియొక్క కోరికను తల్లికెరుక పరచితివి
దాశరాజు కోరికను దలదాలిచి బ్రతుకంతా
బ్రహ్మచర్య పాటిస్తివి బ్రహ్మ తేజముట్టిపడగ
భీష్మమైన ప్రతిన చేసి భీష్మ నామమున పరగితివి
ఏమి జన్మ భీష్మ! ఇంకెవరికి కలదో చెప్మా!!
కాశీరాజు కన్యకలను తమ్మునకు కట్టబెట్ట
అంబతోడ జగడమొచ్చి తన్ను పెండ్లియాడమనగ
ఒప్పుకొనక గురువుతోడ యుద్ధమొచ్చెనయ్య నీకు
గురువుని గెల్చిన శిష్యుని గుర్తు వచ్చె లోకములో
ఏమి జన్మ భీష్మ! ఇంకెవరికి కలదో చెప్మా!!
తమ్ముని తరపున అనేక రాజ్యమ్ములు గెలిచినావు
కౌరవ పాండవుల మధ్య సంధి పొసగచూచినావు
ధర్మమేవ జయమనుచు జోస్యమ్మును చెప్పినావు
రాజు పక్షమున పోరి అసువులనర్పించినావు
ఏమి జన్మ భీష్మ! ఇంకెవరికి కలదో చెప్మా!!
యుద్ధమందు ఎదురులేని వీరుడవై నిలచినావు
మూడుకాళ్ల ముసలయ్యవు ముక్కంటిగ మారినావు
నరనారాయణుల కూడా నరములు కదిలించినావు
ధర్మరాజు కోర ప్రాణ మర్మమ్మును తెలిపినావు
ఏమి జన్మ భీష్మ! ఇంకెవరికి కలదో చెప్మా!!
పేడి మొగము చూసి ధనుర్భానమ్ములు విడచినావు
అర్జును బాణమ్ముతోడ అంపశయ్య చేరినావు
పరమాత్మగు శ్రీకృష్ణుడు పలుకరించ మురిసినావు
ఇచ్ఛా మరణమ్ము తండ్రి ఇచ్చు వరము గాన
మాఘశుద్ధ ఏకాదశి వైకుంఠము చేరినావు!
ఏమి జన్మ భీష్మ! ఇంకెవరికి కలదో చెప్మా!!