[dropcap]ఇ[/dropcap]క ఎప్పటికీ తిరిగిరాని నా నేస్తానికి,
నీ కందని నా ప్రేమలేఖ ఇది. ఏమంత అత్యవసరమైన కార్యముందని అలా తరలి వెళ్ళిపోయావు చెలీ? ఎల్లప్పుడూ జనులందరినీ నీ చిరునవ్వు పువ్వుల గెలిచే సఖీ, ఇప్పుడెందుకిలా ఆరని కన్నీటి వరదను మిగిల్చి వెళ్ళిపోయావు?
నిన్న గాక మొన్ననే కదూ, మనం రాజమండ్రీలో మీ ఇంట కలిసింది? చక్కని అల్పాహారం, మరింత రుచికరమైన మృష్టాన్నభోజనం పెట్టి నీ నేస్తాలమైన మమ్మల్నిద్దరినీ సత్కరించావు కదా… ఎన్ని కబుర్లు చెప్పుకున్నాము? గంటలు ఎంత వేగంగా గడచిపోయి చూస్తూనే క్షణాలుగా మారిపోయాయి?
నాలుగేళ్ళు ఇట్టే గడచిపోయినా, నిన్ననే జరిగినంత తాజాగా లేదూ? ఆ తరువాత ఒక్క మూడు నాలుగు సార్లు తప్ప మనం కలిసింది లేదు, వివరంగా, విశదంగా మాట్లాడుకున్నదీ లేదు… నీ పుస్తకం ఆవిష్కరణ జరిగినప్పుడు ఒక సారీ, మన లేఖిని సెమినార్ లో ఒక సారీ, మానస పుస్తకావిష్కరణలో ఒకసారి, ప్రరవే సమావేశంలో ఒక సారీ… అన్నిటికన్నా ఇంకొంచెం ఎక్కువ సమయం నీతో గడపినది, మొన్ననే నవంబరు మాసంలో, కోసూరి ఉమాభారతి గారి ఆత్మీయ సమావేశంలో… చాలా సేపు కలిసి కూర్చున్నాము, ఫోటోలు తీయించుకున్నాము… కబుర్లు చెప్పుకున్నాము… నవ్వుల ముత్యాలను కురిపించాము… అతి త్వరలో హైదరాబాద్ కి వచ్చేస్తున్నానని అన్నావూ, ఈలోగా వీలు చేసుకుని రాజమండ్రి ఒక సారి రమ్మని పిలిచేవూ… ఇంతలోనే ఆ అనారోగ్యపు మహమ్మారి నిన్ను చుట్టుముట్టాలా? నిన్ను మాకు దూరం చేయాలా?
అకస్మాత్తుగా ఏదో వాట్సాప్ సమూహములో నీ గురించిన ఈ వార్త విని నెత్తిన పిడుగు పడినట్టు అయింది. వార్తను జీర్ణం చేసుకొనేందుకే అసాధ్యం అయిపోయింది. ఆ తరువాత శరీరమూ, మనస్సూ శిలైపోయిన భావన… జీవచైతన్యం ఒక్కసారిగా స్తంభించిపోయినట్టు నిర్వేదం… కన్నీరు కూడా చాలా సేపటి వరకూ ఘనీభవించిన స్థితిలోనే ఉన్నది సఖీ… చేతనావస్థలోకి వచ్చి చూసేసరికి ఫేస్ బుక్ లోని పోస్ట్ లు నన్ను మరింత దుఃఖసాగరంలోకి నెట్టివేసాయి… ఇది నిజం కాదు, కాదు! అని మనస్సు ఘోషిస్తున్నా, ఒప్పుకోక తప్పని చేదు నిజం ఇది…
ఎక్కువగా కలుసుకోకపోయినా నన్నెంతో ప్రభావితం చేసిన చక్కని వ్యక్తిత్వం నీది. చక్కని చిరునవ్వు నీకు పెట్టని ఆభరణం. సౌమ్యమైన పలకరింపు, కన్నులలోనుంచి వర్షింప జేసే ప్రేమ నీ సంపదలు. ఒక్క మాటలో చెప్పాలంటే, ‘నీలా’ ఉండాలనిపించే చక్కని వర్తన నీది.
ఈ కల్మషపు ప్రపంచానికి దూరంగా దైవ సన్నిధిలో సేదదీరుతున్నావు కదూ? సెలవు నేస్తం…
నిన్నెప్పటికీ మరువలేని నీ ‘నేను’
(ఈ నెల తొమ్మిదవ తారీఖున అనంత తీరాలకు వెడలిపోయిన నేస్తం, ప్రముఖ రచయిత్రి, విహంగ అంతర్జాల మాసపత్రిక సంపాదకురాలు, అందరికీ ఆత్మీయురాలు అయిన శ్రీమతి పుట్ల హేమలత గారి దివ్య స్మృతికి ఆవేదనాభరిత హృదయముతో…)