జీవన రమణీయం-44

0
8

[box type=’note’ fontsize=’16’] టీవీ, సినీరంగాలలో తనదైన ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న సుప్రసిద్ధ రచయిత్రి బలభద్రపాత్రుని రమణి నిజజీవితంలోని రమణీయ అనుభవాల రమణీయమైన కథనం ‘జీవన రమణీయం‘ ఈ వారం. [/box]

[dropcap]నే[/dropcap]ను ఎప్పుడో అనుకున్న పాయింట్ ఒకటి, ప్రేమకథగా మలిచి కె.ఎస్. రామారావుగారికి చెప్పాను. ఆయనకి వినగానే నచ్చింది. సాయి బాలాజీ, భానూశంకర్ అనే ఇద్దరు దర్శకులకి ఆ కథ వినిపించారు. అది ఓ వెడ్డింగ్ ప్లానర్‌ని గూర్చిన కథ. అప్పటికింకా, అంటే 2002లో మన భారతదేశంలో మేరేజ్ బ్యూరోలున్నాయి కానీ వెడ్డింగ్ ప్లానర్స్ లేరు! కొత్త సబ్జెక్ట్. హీరోయిన్ వెడ్డింగ్ ప్లానర్.

అసలు మా శాయి భాస్కర్ బాబాయి సరదాగా మా చిన్నప్పుడే, ” ‘శుభ’, ‘అశుభ’ అనే రెండు కౌంటర్లు పెట్టి, ఒకదానిలో శుభకార్యాలకి కావలసిన సరంజామా, ఇంకో దానిలో అశుభకార్యాలకి సంబంధించినవీ సప్లై చేస్తే, సగం త్రిప్పట తగ్గుతుంది, కార్యం చేసేవాళ్ళకి” అని చెప్తుండేవాడు. అవన్నీ ఇందులో పెట్టి కామెడీ కూడా రాసాను.

కానీ తానొకటి తలిస్తే, దైవం ఒకటి తలచిందన్నట్లు, ఆ కథ ఉదయ్ కిరణ్‍కి చెప్పలేదు. కె.ఎస్. రామారావు గారి శ్రీమతి ప్రమోద గారికి వాళ్ళ అబ్బాయి ‘వల్లభ’ని హీరో చెయ్యాలని అభిలాష కలిగింది. అందులో సమంజసం వుంది. అందరూ వారి వారి పిల్లలని హీరోలని చేసేసుకుంటున్నారు. నాగేశ్వరరావుగారూ, రామానాయుడుగారితో ప్రారంభం అయి అల్లు అరవింద్ గారూ మొదలైన ప్రొడ్యూసర్లు కూడా!

నేను ఉదయ్‍కిరణ్‍కి అనుకున్నాను. కానీ ప్రొడ్యూసర్ గారు పిలిచి “మా అబ్బాయికి” అంటే ‘సరే’ అన్నాను.

భానూశంకర్‌ని దర్శకుడిగా పెట్టారు. అతను స్క్రీన్‍ప్లే కూడా సమకూర్చుకొచ్చాడు. కోడైరక్టర్ నందు వుండేవాడు. ‘తొలిప్రేమ’కీ, ఆ తర్వాత కూడా కరుణాకరన్ వద్ద కోడైరక్టర్ అతను. హీరోయిన్స్‌ని ఎవరిని పెట్టాలీ అన్నది సమస్య అయింది. కొద్దిగా ఎస్టాబ్లిష్ అయిన హీరోయిన్స్, మరీ కొత్త అబ్బాయి, మొదటి చిత్రం అంటే ఒప్పుకోకపోవడం అప్పుడూ వుంది!

‘అలెగ్జాండర్ వల్లభ’ అతని పూర్తి పేరు! అతనికి డాన్సులూ, కొద్దిగా ఫైట్లూ శిక్షణ ఇప్పించడం, ఏక్టింగ్‌కి దీక్షితులుగారి స్కూల్‌కి పంపడం మొదలయింది.

అందులో ఇద్దరు హీరోయిన్ల కేరక్టర్లున్నాయి. ఒకదానికి, ఎవార్డు ఫిలిం ‘తిలదానం’లో చేసి ఎవార్డు పొందిన ‘జయశీల’ అనే ఒరియా నటిని కె.ఎస్. రామారావు ఎంపిక చేసారు. రెండవ హీరోయిన్ గ్లామరస్‌గా వుండాలని వెతకడం మొదలుపెట్టారు.

    

అప్పట్లో పాటలు పాడ్తూ, విలక్షణమైన గొంతుతో, ఫేమస్ అయిన ‘మాల్గాడీ శుభ’ అన్న కూతురు ఒక అమ్మాయి కూడా సెలక్షన్స్ కొచ్చింది. అన్ని విషయాల్లో కె.ఎస్. రామారావు గారు నన్ను ఇన్‌వాల్వ్ చేసేవారు. ఆ రోజు ఈ అమ్మాయి గేట్‌లోంచి వస్తున్నప్పుడే చూసి నేను “తెలుగు ఇండస్ట్రీకి మంచి హీరోయిన్ దొరికేసింది” అన్నాను. ఆ అమ్మాయి అప్పటికే భారతీరాజా సినిమాలో ఏక్ట్ చేస్తోందని నాకప్పటికి తెలీదు!

ఆ అమ్మాయే ప్రియమణి. స్క్రీన్ టెస్ట్ చేస్తే అద్భుతంగా వుంది. వాళ్ళమ్మతో కూడా పరిచయం అయింది. జయశీల కూడా వచ్చింది. ఆమె మంచి నటి. ఈ ఇద్దర్నీ పైనలైజ్ చేశారు. స్క్రిప్ట్ వర్క్ కూడా వేగంగా నేనూ, భానూ పూర్తి చేసాం.  ‘రేపల్లెలో రాధ’కి పెట్టిన మరుధూరి రాజా అన్నయ్యనే మళ్ళీ డైలాగ్స్‌కి పెట్టారు. అప్పట్లో అతను చాలా బిజీగా వుండేవాడు. నేను మాత్రం ప్రతీ రోజూ ఆఫీస్‌కి వెళ్ళి స్క్రిప్ట్ వర్క్ చేసేదాన్ని. ప్రమోద గారు కూడా అప్పుడప్పుడు మాతో కూర్చునేవారు.

సినిమాకి ‘ఎవరే అతగాడు?’ పాట విని ఇన్‌స్పైర్ అయి, అదే పేరు పెట్టారు కె.ఎస్. రామారావుగారు. సంగీతం విషయంలో ఆయనది ప్రత్యేకమైన టేస్ట్. ‘మాతృదేవోభవ’లో పాటలు వింటే అర్థమౌతుంది. అలాగే ఈ సినిమాకి కూడా కీరవాణిగారు అద్భుతమైన సంగీతం చేసి ట్యూన్స్ ఇచ్చారు.

వేటూరి గారు గీతాలని రాసారు. ఇప్పటికీ శ్రీరామ నవమి రోజున ‘సీతారాముల కళ్యాణం’ పాట వినిపిస్తూనే వుంటుంది. ‘ప్రేమ ఎంత మధురమనీ తెలియకనే ప్రేమించా’, ‘పెళ్ళికొడుకా… పెళ్ళికొడుకా’, ‘నాతిచరామీ’, ‘ఎవరమ్మా అతగాడెవరమ్మా… వివరాలే దాచక తెలుపమ్మా’, ‘ఈ దేశం..’ లాంటి మధురమైన పాటలు స్వరపరిచారు. చాలా ఉత్సాహంగా వుండేది.

కానీ, ఈ డైరక్టర్, ఫోన్స్ తీసేవాడు కాదు! కె.ఎస్. రామారావు గారు “ఎందుకయ్యా… ఫోన్ చేస్తే తియ్యలా? రెండు రోజులుగా రాలేదూ?” అంటే, “ఫ్రెండ్‌కి ఏక్సిడెంట్ అయిందండీ” అనేవాడు. నేను ఈ మాటని చాలాసార్లు విన్నాను. ఒకరోజు అడిగితే “భాను… నిజంగానా?” అనీ, “ఫోన్స్ తియ్యలేను… అది నా ఫోభియా అండీ, ఈ అబద్ధమే ఎక్కువగా వర్క్ అవుట్ అవుతుందని వాడ్తుంటానండీ… పెద్దవాళ్ళంటే నాకు భయం అండీ!” అన్నాడు. ఏ మనిషైనా, కళ వుండీ పైకి రాలేకపోవడానికి ఇలాంటి కారణం ఏదో వుంటుంది వాళ్ళల్లో వెతికితే.  నేను సోమరులనీ, పని ఇచ్చేదాకా చెప్పులు అరిగేటట్లు తిరిగి, పని ఇచ్చిన మర్నాడు “ఊరెళ్తున్నాం అండీ, మదర్‌కి బాలేదండీ” అనే అసిస్టెంట్ డైరక్టర్స్‌నీ, రైటర్స్‌నీ చాలామందిని చూశాను. వాళ్ళకి కావలసింది ‘అడ్వాన్స్ డబ్బు’, పని కాదు! పని చెయ్యాలనుకునేవాళ్ళు ఈ రకమైన అబద్ధాలు చెప్పరు. ఈ సేమ్ దర్శకుడితో మళ్ళీ పదిహేను ఏళ్ళ తర్వాత సినిమా చేసి, స్వంత తమ్ముడిలా అభిమానించి, నేను చాలా పెద్ద దెబ్బ తినేసాను. అప్పుడూ అతను మారలేదు. ‘సేమ్ ఫోన్ ఫోబియా… ఫ్రెండ్‌కి ఏక్సిడెంట్ అయిందన్న అదే అబద్ధం’. ఆ చిత్ర విశేషాలు కూడా తర్వాత చెప్తాను. కొన్నిసార్లు దురదృష్టాన్ని మృష్టాన్న భోజనాలు పెట్టి మనం పెంచి పోషిస్తాం!

‘ఎవరే అతగాడు’ సినిమాకి పని చేస్తుండగా నా జీవితంలో రెండు మంచి మలుపులు జరిగాయి. మైలురాళ్ళు అని నా జీవితంలో చెప్పుకోవచ్చు! నేనప్పిటికింకా ‘రైటర్స్ అసోసియేషన్’లో మెంబర్ని కాదు. మెంబర్ కావాలంటే, తెర మీద పేరు పడాలి. నాకు రెండు సినిమాలకి అప్పటికే పడింది. కానీ లైఫ్ మెంబర్‌షిప్‌కి అప్పట్లో పదకొండువేలు కట్టాలి. సీరియల్స్ చేస్తున్నాను, ‘అగ్నిసాక్షి’ ఇంకా నడుస్తోంది కాబట్టి, డబ్బులు చేతిలో ఆడ్తున్నాయి. ఒకేసారి పదకొండువేలు కట్టాలంటే మాత్రం కొంచెం కష్టమే! ‘రైటర్స్ అసోసియేషన్’ నుండి అల్లూరి అనే ఆయన ఒకటి రెండుసార్లు ఫోన్ చేసి, “మీరు మెంబర్ కాకపోతే మీ సినిమా ఆగిపోతుంది. తెర మీద పేరు వెయ్యనివ్వం” అని బెదిరించారు. నేను నా జీవితంలో కామినేని ప్రసాద్ గారి అల్లుడి బెదిరింపుకి మాత్రమే భయపడి, ‘మొగుడే రెండో ప్రియుడు’ సినిమా కె.ఎస్. రామారావుగారికి ఇవ్వలేదు. అది తప్ప ఇంక దేనికీ ఎప్పుడూ బెదరలేదు. సహజంగానే భయం చాలా తక్కువ! చిన్నప్పటి నుండీ స్వాతంత్ర్య సమరయోధురాలైన అమ్మమ్మ రమణమ్మ గారి దగ్గర ఆ వీరగాథలు, మొండితనాల గూర్చీ వింటూ పెరిగినదానిని! నన్నీ బెదిరింపులు ఏం చేస్తాయి? అందుకే పట్టించుకోలేదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here