మనోమాయా జగత్తు-4

0
4

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది నాల్గవ భాగం. [/box]

4

[dropcap]నీ[/dropcap]లాంబరీదేవి కుటీరప్రాంగణం తెల్లవారకముందే కల్లాపి జల్లుకుని ముగ్గులేయించుకుని పచ్చని చెట్లతో కళకళలాడిపోతోంది. శిష్యసన్యాసులు లేత నీలంరంగు వస్త్రాలు ధరించి కుండలతో నీళ్ళు తెచ్చి మొక్కలకు పోస్తూ, ఇతరవిధులు నిర్వహిస్తూ గలగలలాడుతూ హడావిడిగా తిరుగుతున్నారు. వాళ్ళు ఆ ఆంగణంలోని మొక్కల్లో నడిచే నీలినీలిమొక్కల్లా కనిపిస్తున్నారు. కుటీరపు ఆఫీసులో విధులు నిర్వహించే ఉద్యోగులు కూడా ఊళ్ళోంచి సిటీ బస్సులు దిగి కుటీరం చేరుకుంటున్నారు. వాళ్ళు ప్యాంట్లు, షర్టులు, చీరలు లాంటి మామూలు బట్టలే లేత నీలం రంగువి వేసుకున్నారు. వాళ్ల యూనిఫామ్ అది. కుటీరమని పేరే గానీ అరడజను కంప్యూటర్లతో సహా ఆధునిక సదుపాయాలన్నీ ఉన్న సంపన్న పర్ణశాల అది.

కుటీరద్వారం దగ్గర నిలబడి జరుగుతున్న కార్యక్రమాన్ని చిరునవ్వుతో పర్యవేక్షిస్తోంది దేవీ నీలాంబరి. లేత నీలంరంగు వస్త్రాల్లో ఉన్న నీలాంబరి ఆకాశాన్ని చుట్టబెట్టుకున్న నల్లరాతి విగ్రహంలా నున్నగా మెరిసిపోతోంది. మెట్లమీద నుంచున్న ఆవిడ పాదాలనించీ గేటు వరకూ విస్తరించిన పూలచెట్లు రకరకాల రంగులు విరజిమ్ముతూ, నవరత్నాలూ దండిగా పొదిగిన రత్నకంబళిలా వెలిగిపోతోంది ఆ ప్రాంగణం. నీలాంబరి ముఖంలో ఉన్న అపారమైన జనాకర్షణ శక్తి ఆవిడని దర్శించుకోడానికి వచ్చే భక్తులనే కాక కుటీరంలో ఆవిడని నిత్యం చూస్తుండే పరివారాన్ని కూడా అబ్బురపరుస్తూ ఉంటుంది.

ఆ ప్రాతః సమయంలో నీలాంబరి తన సామ్రాజ్యాన్ని ఆనందంగా అవలోకిస్తున్నవేళ కుటీరం గేటు దగ్గర ఓ కారొచ్చి ఆగింది. అది బాగా పరిచయం ఉన్నభక్తుల కారే అవడంతో సెక్యూరిటీ ఆ కారుని లోపలికి రానిచ్చి పార్కింగ్ వైపు పంపించాడు. కార్లోంచి దిగిన ఇండస్ట్రియలిస్ట్ రాజేశ్వర్రావు, భార్య సుమతి ఎదురుగానే నీలాంబరి దర్శనం కావడంతో ఆనందంతో గబగబా నడిచొచ్చి ఆమె పాదాలకు భక్తిగా నమస్కారం చేసారు.

“ఇప్పుడెలా ఉన్నాడు మన రమేశుడు?” లోపలికి దారి తీస్తూ అడిగింది నీలాంబరి.

“గండం గడిచినట్టే అన్నారు. దేవి దయవల్ల ఇంకేం కాంప్లికేషనూ రాలేదు” చేతులు జోడించి ఉంచే ఆవిడని అనుసరిస్తున్న రాజేశ్వర్రావు మరింత వొంగుతూ జవాబు చెప్పాడు.

ఆ జవాబుని ముందే ఊహించినట్టు నీలాంబరి చిరునవ్వు నవ్వింది.

“కూచోండి. సరిగ్గా పూజ ప్రారంభించే సమయానికి వచ్చారు. మీ అదృష్టం. పూజ ముగిసే వరకూ ఉండి తీర్థప్రసాదాలు తీసుకు వెడుదురుగాని” నీలాంబరి పూజా గృహంలో ప్రవేశించింది.

రాజేశ్వర్రావు, సుమతి దేవికి ఆంతరంగికులైన భక్తులకు కేటాయించిన విశాలమైన భక్తదర్బార్ గదిలో పరిచిన కాశ్మీరీ కార్పెట్ మీద సుఖాసీనులయ్యారు తమకు అనుకోకుండా కలిసొచ్చిన మహద్భాగ్యానికి మురిసిపోతూ.

నీలాంబరి పూజాగృహంలో తనకే పరిచిఉన్న కృష్ణాజినం మీద ధ్యానముద్రలో కూచుంది. ఆవిడ పూజ కోసం అన్నీ అమర్చి పెట్టిన ఆవిడ తండ్రి వెంకట్రావు బయటకు వెళ్ళబోతూ గుమ్మం దగ్గర ఆగి కూతురివైపు కళ్ళారా చూసుకున్నాడు. అతనికెంతో గర్వంగా అనిపించింది. చిన్నవయసులోనే యోగినిగా ప్రసిధ్ధురాలైన నీలాంబరి భక్తప్రజాబాహుళ్య పార్టీ(బి.పి.బి.పి.) స్థాపించి రాజకీయాల్లో కూడా ప్రముఖంగా ఎదిగింది.

అప్పోజిషన్ వాళ్ళు, ‘బి.పి.బి.పి. డబుల్ బిపి. ఈ పార్టీలో చేరితే బిపి లేని వాళ్ళకి వస్తుంది, ముందే బిపి ఉన్నవాళ్ళకి రెట్టింపవతుంది’ అని ప్రచారం చేసారు. నీలాంబరి వాళ్ళకేం సమాధానం చెప్పలేదు. ఏ రకంగా నూ స్పందించలేదు. “ఆవిడచేత తిట్లు తినడానికి కూడా అపోజిషన్ వాళ్ళకు అర్హత లేదు. ఏనుగు వెడుతూంటే గజ్జిపట్టిన ఊరకుక్కలరుస్తాయే అలాగన్నమాట వీళ్ళ అరుపులు. ఇగ్నోర్ చెయ్యడం కంటే బెస్ట్ ఇన్సల్ట్ ఏముంది?” అని వ్యాఖ్యానం చెప్పారు కార్యకర్తలు.

దేవీ నీలాంబరి ప్రఖ్యాతి పెరిగిందే తప్ప తరగలేదు.

ఇటు ఆధ్యాత్మికంగానూ అటు రాజకీయంగానూ అంచెలంచలుగా ఎదిగి ఆధినాయకురాలైంది. రేపోమాపో ఆంధ్ర ప్రదేశ్‌కే తొలి మహిళా సన్యాసినీ ముఖ్యమంత్రిగా గద్దెనెక్కబోతోంది. అటువంటి కూతురిని చూస్తూ గర్వపడకుండా ఉండడం ఏ తండ్రికైనా సాధ్యపడుతుందా? వెంకట్రావు తన కూతురు స్థాపించి, విస్తరింపజేసిన కుటీర సామ్రాజ్యాన్నంతా తిరుగుతూ అక్కడ రోజూ జరిగే కార్యక్రమాలు ఒక్కనిముషం తేడా లేకుండా జరిగిపోతూండడం చూసి సంతోషించుకుంటూ ముఖ్య కార్యాలయం (మెయిన్ ఆఫీసు) చేరాడు.

నీలాంబరి ధ్యానం, పూజ ముగించి ఇవతలకొచ్చేసరికి రాజేశ్వర్రావు సుమతులే కాక ఇంకా కొంతమంది భక్తులు కూచుని దర్శనంకోసం ఎదురుచూస్తున్నారు. అందరినీ చిరునవ్వుతో చూసింది నీలాంబరి. చేతిలో చంటిపిల్లతో ఉన్న ఒక నడివయసు మహిళను చూసి ఆదరంగా దగ్గరకు రమ్మన్నట్టు తలూపింది. ఆవిడ తనకే ఆహ్వానం అందినందుకు పరమానందపడిపోతూ గబగబా చంటిపిల్లతో సహా లేచొచ్చింది. పాపని నీలాంబరి కాళ్ళ దగ్గర పడుకోబెట్టి సాష్టాంగ నమస్కారం చేసింది.

“గొడ్రాలిగానే జీవితం గడిచిపోతుందనుకున్న నాకు ఈ వయసులో మాతృత్వవరం ప్రసాదించావు మాతా” ఆనందాశ్రువులు జలజలా రాలుస్తూ పాదాల మీద తలనానించింది.

“పిచ్చిదానా, అంతా ఆ నీలమేఘశ్యాముడి దయ. మనం నిమిత్తమాత్రులం” శాంత వదనంతో చిరునవ్వు నవ్వింది.

“తల్లీ నువ్వు ప్రసాదించిన ఈ పసిదానికి నువ్వే నామకరణం చెయ్యాలి” పిల్లతల్లి లేవకుండా అలాగే కూచుని తలెత్తి చూస్తూ అంది.

నీలాంబరి తలవంచి చంటిదాన్ని చూసింది. ఆలోచించి, “సునీల” అని పిల్చుకోమ్మా అంటూ ఆ మహిళతో వచ్చిన వాళ్ళకు సైగచేసింది. ఆ మహిళ తల్లి గాబోలు వొచ్చి చంటిపాపని ఎత్తుకుంది. ఆమె భర్తలా కనిపిస్తున్న వాడు ఆమెను నెమ్మదిగా లేవదీసాడు.

తరవాతి భక్తుల పాదనమస్కారాలు చేసుకుంటూ విన్నవించుకుంటున్న విన్నపాలు వింటూ తగిన సమాధానాలు చెప్పింది నీలాంబరి. అరగంట గడిచాక శిష్యుడొకడు వచ్చి “ఇంక సమయం ముగిసింది” అని భక్తులకు చిన్నగా చెప్తుండగా తిరిగి పూజాగృహంలోకి వెళ్ళిపోయింది నీలాంబరి.

***

ముఖ్యకార్యాలయంలో ముఖ్యకార్యదర్శిగా విధులు నిర్వహించే ముఖ్యస్వాములవారు – శంకరభక్తానంద స్వామి. ఆయన పూర్వాశ్రమంలో శంకర్రావుగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో హోదాగల పదవుల్లో పని చేసి సెక్రటరీ శంకరంగా పేరు తెచ్చుకున్నాడు. ఆ కాలంలోనే దేవీ నీలాంబరికి పరమభక్తుడాయన. చాలాకాలం సంసార జీవితం అనుభవించి భార్య పరమపదించాక సన్యాసం స్వీకరించి కుటీరంలోనే గడుపుతూ ఇలా కార్యనిర్వహణాధికారిగా తనవంతు సేవలందిస్తున్నాడు. సన్యాసాశ్రమంలో ఆయన నామధేయం శంకరభక్తానందస్వామి. అంత పెద్ద పేరును కుటీరవాసులు ‘సెక్రటరీ స్వాములవారి’గా కుదించారు. ఈ ప్రశాంతమైన ఉదయవేళ చల్లగా కూచుని సెక్రటరీస్వామి తను చూడవలసిన ఫైల్సు, కాగితాలు ఒక పధ్దతిలో అమర్చుకున్నాడు. తెల్లారకుండానే వచ్చిపడిన తెలుగు, ఇంగ్లీషు పేపర్లలో నీలాంబరి చూడవలసిన ముఖ్యాంశాలను హైలైటర్‌తో మార్క్ చేసుకుని చిన్నచిన్న వ్యాఖ్యలు రాస్తున్నాడు. కుటీరాన్నంతా పర్యవేక్షించి వొచ్చి ఆఫీసురూములో ఓ మూల ఉన్న పడక్కుర్చీలో అలిసిపోయినట్టు కూలబడిపోయాడు వెంకట్రావు.

‘ఈయనొకడూ రాజమాతలాగా! అన్నిచోట్లా పెత్తనం’ మనసులో కించిత్ విసుక్కున్నాడు సెక్రటరీస్వామిగా ప్రసిధ్దుడైన శంకరభక్తానందస్వామి – ఇంకా పూర్వాశ్రమం వాసనలు పూర్తిగా వదలక. అతనికి నీలాంబరీదేవి మీద అంతులేని గౌరవం. వెంకట్రావంటే ఇంతింతని చెప్పలేని ఇరిటేషన్. ‘ఏమిటో సినిమాల్లోనూ కథల్లోనూ ఎంతసేపూ జరీ ముసుగులేసుకుని తిరుగుతూ రాజమాతలే ఉంటారు. రాజపితలెందుకుండరో! రేపు దేవీ నీలాంబరి సిఎమ్మైతే ఈనగారు రాణీపిత అవుతారు’. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. కొంచెం చిరాకు తగ్గినట్టయింది. ‘ఆ మూల అలా గుడ్లగూబలా గుడ్లేసుకు చూస్తూ కూచోడం తప్ప ఎందులోనూ అనవసరంగా కల్పించుకోడు. పాపం. రాణీపిత మంచివాడే’ అనుకుని మెత్తబడ్డాడు. వెంకట్రావు వైపు చూసి ప్రసన్న వదనంతో నవ్వాడు. రాణీపిత అరచెయ్యెత్తి ఊపాడు. ఆశీర్వదిస్తున్నాడో అభయం ఇస్తున్నాడో అర్థం కాలేదు సెక్రటరీ స్వాములారికి.

గుమ్మం దగ్గర హఠాత్తుగా ప్రత్యక్షమైన దేవీ నీలాంబరిని చూసి లేచినిలబడి నమస్కరించాడు. ‘ఈవిడిలా సడెన్‌గా ఎలా ప్రత్యక్షమవుతుందో అర్థంకాదు’ కంగారుగా అనుకున్నాడు. నీలాంబరి గదిలోపలికి వస్తుంటే, ఘుప్పున కల్తీలేని హారతి కర్పూరపు సుగంధం గదంతా వ్యాపించింది. సెక్రటరీ స్వామికిదీ ఆశ్చర్యమే. అతనికి తెలిసి కర్పూరపు వాసనొచ్చే సెంటు ఏదీ లేదు. ‘ఈవిడ తనతోబాటు ఈ వాసన రావడానికి ఏ ట్రిక్కు చేస్తుందో!’ అనుకుని వెంటనే మనసులోనే చెంపలు వేసుకున్నాడు. ‘ఛ ఇంత తెలిసుండీ ఏమిటి ఇవేళ ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? మెడిటేషనులో మరో గంటఎక్కువ సేపు కూచోవాలివాళ. పాపపు తలపులు రానే రాకూడదు.’

వార్తా పత్రికల్లోవచ్చిన రాజకీయవార్తలు, తను హైలైట్ చేసిపెట్టుకున్న ముఖ్యాంశాలు చెప్పడం మొదలెట్టాడు. చిరునవ్వుతో వింది నీలాంబరి. కొన్ని వార్తలను తను స్వయంగా పేపరు తీసుకుని చదివింది. తరువాత ఫైల్స్ పరిశీలించింది.

“ఇవాళ పొద్దున్నే ఎనిమిదంటికల్లా పార్టీ నాయకులు వస్తారు మాతా.” గుర్తుచేసాడు.

తెలుసునన్నట్టు తలూపింది. ఒకసారి తలతిప్పి మూలకుర్చీలో కూచున్న వెంకట్రావు వైపు మెత్తగా నవ్వుతూ చూసింది. సిగ్నల్ అందుకుని లేచి బైటికెళ్ళిపోయాడతను. ‘ఎంతవాళ్ళనైనా హద్దుల్లో పెట్టేస్తుంది గొప్ప టాలెంట్’ అనుకున్నాడు మనసులో సెక్రటరీ శంకరం. ‘ఛుప్ నోర్మూసుకో’ అన్నాడు మనసులో నే సెక్రటరీస్వామి. వెడుతున్న రాణీపిత వైపు జాలిగా చూసాడు. అతన్ని ఎందుకు బయటకు పంపించేసిందో గ్రహించాడు. అలా ఇట్టే గ్రహించే శక్తి ఉండడం వల్లనే కదా జీవితం సెక్రటరీ పదవిలో నిరాటంకంగా గడిచిపోతోంది.

“మీరు సెలవిచ్చినట్టు ‘ఎల్ సెవెన్ కెత్రీ’ డ్రగ్ గురించి ఇంటర్నెట్లో చూసానమ్మా” చెప్పి ప్రింటవుట్ చేతికందించాడు. “సర్ప్రైజింగ్‌లీ, ఇవాళ న్యూస్ పేపర్లో కూడా ఈ డ్రగ్ గురించి చిన్న ఆర్టికల్ వచ్చింది” పేపర్‌లో వచ్చిన సైన్స్ సప్లిమెంట్‌లో ఓ కార్నర్‌లో పడ్డ ఆర్టికల్ చూపించాడు.

“వెరీ గుడ్” నీలాంబరి కుర్చీలో వెనక్కి వాలి చకచకా చదివింది. ఆవిడకి ఇంగ్లీషుభాష మీద బాగా కమాండ్ ఉందని శంకరానికి తెలుసు. ఆవిడ అన్ని భారతీయ భాషలూ, చాలా విదేశీభాషలూ అనర్గళంగా మాటాడేస్తుందని కొందరు కార్యకర్తలు, భక్తులు విస్తృతంగా ప్రచారం చేస్తుంటారు. అది అబధ్దం అని శంకరానికి, కొందరు ఆంతరంగికులకూ మాత్రమే తెలుసు.

“ఫారిన్ కంపెనీ ట్రీటికావారి రిప్రజెంటేటివ్ తెల్లవారుజామునే వచ్చి మీ దర్శనం కోసం నిరీక్షిస్తున్నాడు”. అన్నాడు సెక్రటరీ స్వామీజీ. ‘తమరి దయవల్ల స్వదేశీయులకే కాక విదేశీయులకి కూడా తెల్లారకుండా లేచి పనులు మొదలెట్టుకోడం అలవాటైపోతోంది. ఇంక ముఖ్యమంత్రయ్యాక జనాలెవ్వరికీ నిద్రలుండవు’ అనుకున్నాడు సెక్రటరీ శంకరం.

“మీరు వెళ్ళి అతన్ని పంపించండి స్వామీజీ. నేను పిలిచినప్పుడు మీరు మళ్ళీ లోపలికొద్దురుగాని” అంది మాతాజీ.

‘గెటవుట్ అనడం కూడా ఎంత సున్నితంగా అనగలవు తల్లీ! అందుకే ఇంత ఉన్నత శిఖరాలనందుకుంటున్నావు’ సెక్రటరీ స్వాములు నిష్క్రమించారు.

తను చదివిన పేపర్లు తీసి పక్కన చిన్నబల్లమీద పడేసింది. పేపర్లలోనూ ఇంటర్నెట్లలోనూ వచ్చేసిన డ్రగ్ గురించి నీలాంబరికి చింతలేదు. తనని కలుసుకుని తనతో ప్రపోజల్స్ పెట్టిన ఆయా మందుల కంపెనీ వాళ్ళు తనకి తెలియకుండా సమాచారమేమైనా దాచారేమో తెలుసుకోడానికే సెక్రటరీకి ఇంటర్నెట్ చూడమని పురమాయించింది. అటువైపునించి ప్రమాదం ఏమీలేదు. ప్రపంచానికి ఇంకా తెలియని మందులు ఎన్నో కనిపెడుతున్నారు రకరకాల కంపెనీలవాళ్ళు. వాటిని మానవాళికి ఉపయోగపడేలా మలచడమే తన ఆశయం. గుంభనంగా నవ్వుకుంది.

దగ్గరగా వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. కుటీరంలో స్వాములు, సన్యాసినులు పాంకోళ్లు ధరిస్తారు. వాటితో నడవడం చేతకాని వాళ్ళు ఎంతటివారైనా సరే ఉత్తకాళ్ళతో నడవవలసిందే. అడుగుల చప్పుడు బట్టి వస్తున్నమనిషి సన్నగా పొట్టిగా ఉంటాడని అంచనా వేసుకుంది నీలాంబరి. ఆమె అంచనా తప్పలేదు. సన్నగా పొట్టిగా గులాబి రంగులో ఉన్న వ్యక్తి గుమ్మం వద్ద నుంచున్నాడు. చిన్నచిన్న నల్లని కళ్ళతో ఎర్రని జుట్టుతో కొంచెం విచిత్రంగా ఉన్న కనుముక్కు తీరుతో వింతగా ఉన్నాడా మనిషి. ఈ దేశం, ఈజాతికి చెందినవాడు అని ఖచ్చితంగా చెప్పలేనట్టున్నాడు మొత్తానికి. ‘ఎవరో సంకరజాతివాడై ఉంటాడు’ అనుకుంది. అతనికి “సంకరుడు” అని మానసికంగా నామకరణం చేసుకుంది. “ప్లీజ్ కమిన్” గౌరవంగా పిలిచింది. “రండి కూచోండి” ఉచితాసనం చూపించింది.

“మా కంపెనీ ప్రయోగాత్మకంగా తయారుచేసిన ఫెర్టిలిటీ డ్రగ్ ‘ఓవన్ యూటు’ను ప్రయోగించి రిజల్టు చూసుకో డానికి వీలు కల్పించినందుకు మా కంపెనీ తరఫునుంచి కృతజ్ఞతలు” విచిత్రమైన యాసతో ఇంగ్లీషులో చెప్పాడతను. “మా ప్రయోగాన్ని విజయవంతం చేసినందుకు కంపెనీ తరఫునుంచి కుటీరాన్ని పరిపాలించే తమ ఇష్టదైవానికి ఆభరాణల కానుక” చేతిలోని బ్రీఫ్ కేసు తెరిచి అందులో కుక్కి ఉన్న సువర్ణాభరణాలను క్షణంపాటు చూపించి ఠప్పున మూసేసి నీలాంబరి టేబుల్ మీద పెట్టాడు.

“శ్రీనీలమేఘశ్యార్పణం!” భ్రీఫ్ కేసు వైపు చేతులు చాచి కళ్ళకద్దుకుంటూ అంది నీలాంబరి.

“మీరు సూచించిన హెర్బల్ ఫార్ములా మిక్స్ చేసి అల్లోపతిక్ డ్రగ్ తయారు చెయ్యడానికి మా కంపెనీకి అభ్యంతరం లేదు. అయితే టెస్ట్ చేసి ఫలితం చూసుకోవాల్సిన స్టేజ్‌లో మాత్రం…..” నీళ్లు నమిలాడు సంకరుడు.

“మా సహకారం సంపూర్ణంగా ఉంటుంది.”

‘అఫ్ కోర్స్ కానుకలెలాగూ ఉంటాయి” నవ్వాడు సంకరుడు.

“కానుకలమీద ఆశకాదు. మానవకళ్యాణమే మాకైనా మీకైనా ముఖ్య ఆశయం” నీలాంబరి దరహాసం వెలిగించింది.

“య్యాయ్యా అఫ్‌కోర్స్” ఒప్పసుకున్నాడు సంకరుడు ఆ మహిమాత్మకమైన మందహాసాన్ని కన్నార్పకుండా చూస్తూ. ఇంకేం మాటాడలేదు నీలాంబరి. అతనికింకేం మాటాడాలో తోచలేదు. పూర్తిగా మూడునిముషాలు మౌనంగా గడిస్తేగానీ అర్థం కాలేదు సంకరుడికి తనింక నిష్క్రమించాల్సిన సమయం ఆసన్నమైందని. లేచి అంతగా అలవాటులేని నమస్కారం చెయ్యబోయి ఎబ్బెట్టుగా చేతులు జోడించి వెళ్ళిపోయాడు. అతను వెళ్లగానే బల్లకింద ఉన్న మీట నోక్కింది నీలాంబరి. గది తలుపు నిశ్శబ్దంగా మూసుకుపోయింది. బ్రీఫ్ కేసును తీసి తన కుర్చీకి వెనకగా ఓ పక్కనున్న చిన్న ఇనపబీరువాలో దాచి తాళం పెట్టింది. మళ్లీ కుర్చీలో కూచుని వెనక్కివాలి కళ్లు మూసుకుంది.

కాసేపు గతంలో విహరించింది మనసు. ఆధ్యాత్మిక గురువుగా అసంఖ్యాకమైన శిష్యగణాన్ని సంపాదించింది. వాళ్ళందరూ నీలాంబరే తమని కష్టాలకడలినుంచి దరి చేర్చే నావ అని మనస్ఫూర్తిగా నమ్మి తమ సమస్య లన్నిటికీ నీలాంబరినే పరిష్కారం చూపించమని ప్రార్థించేవారు. ఆ రోజుల్లో విపరీతమైన మానసిక ఒత్తిడికి గురైంది నీలాంబరి. ఆ ఒత్తిడినుంచి కొంతైనా తప్పించుకునే మందులాగా రాజకీయరంగంలో ప్రవేశించింది. అందులోనూ నిష్ణాతురాలై నాయకురాలైంది. అగ్రస్థానానికి చేరి రాజకీయ దిగ్గజంగా రూపొందింది. అయితే అదీ ఒత్తిడిని తెచ్చిపెట్టింది. ఆ స్ట్రెస్ నించి తప్పించుకునేందుకు హాబీగా మూలికా వైద్యం ఎంచుకుంది. తనకు మూలికా వైద్యంలో ఉన్న పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రయోగాలు చెయ్యడం ఆరంబించింది. ఇప్పుడందులోనూ అగ్రస్థానం అందుకోడానికి ఎంతో కాలం పట్టదు.

ఒక ఒత్తిడినించి తప్పించగలిగే ఔషధం మరో ఒత్తిడే అన్న నిర్ణయానికి ఆమె ఏనాడో వచ్చేసింది. ఒత్తిడినించి ఒత్తిడికి. స్ట్రెస్ నించి మరో స్ట్రెస్‌కి. ఒక ప్రెషర్ నించి మరో ప్రెషర్‌కి. సర్కస్‌లో మూడు నాలుగు బంతులు ఒకేసారి విసురుతూ పట్టుకుంటూ విసురుతూ పట్టుకంటూ ఆడి వినోదం పంచిచ్చే జగ్లర్ లాగా మూడు రకాల ఒత్తిళ్లతో తన మూడు అభిమాన రంగాలనూ బంతుల్లాగా విసిరిపట్టుకుని ఆడుకుంటూ వినోదిస్తోంది నీలాంబరి.

‘ఓవన్ యూటూ’ నెమ్మదిగా తనలోతను అనుకుంటూ నవ్వుకుంది. మందుల పరిశోధకులు కేన్సరుకు మందుకోసం పరిశోధనలు ప్రయోగాలు చేస్తూ ‘ఓవన్ యూటూ’ ఫార్ములా కనిపెట్టారు. అయితే జంతువుల మీద ప్రయోగాలుచేస్తున్నప్పుడు ఆ మందుకొక విచిత్రమైన లక్షణం ఉన్నట్టుగా కనుగొన్నారు. ఈ మందు జంతువులమీద ప్రయోగించినప్పుడు విపరీతంగా పునరుత్పత్తిశక్తిని పెంచుతోందన్న విషయం బైటపడింది. ప్రయోగాలు చేస్తున్న శాస్త్రజ్ఞులు నివ్వెరపోయారు. ఎలా ముందుకు పోవాలో తెలియలేదు. ఇటువంటి పరిశోధనల వార్తల వివరాలను ఆసక్తిగా చదివి ఆకళింపు చేసుకునే అలవాటు ఉన్న నీలాంబరీదేవి ట్రీటికా కంపెనీ వాళ్ళ రీసెర్చ్ ఒక పాయెంట్ దగ్గర ఆగిపోయిందని తెలుసుకుని తన విదేశీ భక్తుల ద్వారా తాను వారి పరిశోదనను ఫలవంతం చేయగలనని కబురు పెట్టింది. వారు ఆమె సహాయాన్ని అంగీకరించారు. నీలాంబరి మానవ కళ్యాణాన్ని దృష్టిలో ఉంచుకుని తన సంపూర్ణ సహకారాలందించింది. పరిశోధకులు ఆ మందుకున్న విచిత్ర లక్షణం నీలాంబరికి తేటతెల్లం చేసారు. నీలాంబరి అదే వైచిత్ర్యాన్ని వైశిష్ట్యంగా మార్చగలనని నిరూ పించింది. అందుకు భారతీయ సంప్రదాయపు నేపధ్యం, భారతమహిళల మనస్తత్వం పట్ల ఆమెకున్న అపారమైన అవగాహన తోడ్పడింది. అయితే తరవాత శాస్త్రజ్ఞులు ఆ మందుకి ఉన్న మరో దోషాన్ని కనుగొన్నారు. ఆ దోషం గురించి ఇంకా ఒక నిర్ధారణకు రాలేక పోయారు. నీలాంబరి వారికి అండగానిలిచింది. వాళ్ళు దోషం అనుకుంటున్న దానిని భారతీయుల సంస్కృతిలో పెద్ద దోషంగా పరిగణించరని, భారతీయుల వేదాంత ధోరణి వల్ల ఆ మందు వల్ల చిన్నపాటి నష్టం వాటల్లినా కంపెనీ మీద కేసు పెట్టి కంపెనీని అపకీర్తి పాలు చేసే స్థితి రాదని ధైర్యం చెప్పింది.

నీలాంబరి అందించిన సహాయ సహకారాల వల్ల కంపెనీ ఎన్నడూ చూడని లాభాలార్జించింది. కొందరు భక్తులు ఈ జన్మలో ఇంకెన్నడూ దొరకదు అనుకున్న జీవితానందం పొందారు. వారు ఆ జీవితానందం పొందడానికై చేసిన ఖర్చు వారికి పెద్దలెక్కలోకి రాదు. వారంతా ధనవంతులైన భక్తులు. ఇందాక నమస్కారం చేసిన నడి వయసు తల్లి గుర్తుకొచ్చింది. మరి తను ధైర్యంచేసి ప్రయోగం చెయ్యడం వల్లనే కదా పిల్లలే పుట్టరని ఆశొదులుకున్న దంపతులకు పండంటి పాప కలిగింది! ఇంకా ప్రయోగాలు జరగాలి. చికిత్సా రంగంలోను, ఔషధ పరిశోదనలోను. అప్పుడే మానవజాతి భగవంతుడికి మనస్ఫూర్తిగా కృతజ్ఞులై ఉంటారు. ఎవరూ ఏ ప్రయోగాలూ చెయ్యకపోతే అభివృద్దే ఆగిపోదా? అంతా తన గొప్పే అనుకునే మానవుడు తనకెదురయ్యే చిన్నచిన్న సమస్యలకు పరిష్కారం దొరికినప్పుడు భగవంతుని ఉనికిని నమ్ముతాడు. తనలాంటి వాళ్లల్లో భగవంతుడిని దర్శిస్తాడు.

‘అంతా ఆ నీలమేఘశ్యాముని దయ. భారతీయ సంస్కృతికి, భారతీయ మహిళకు జోహారు’. నీలాంబరి భార తీయ దృక్పధంతో ఆలోచించింది. పిల్లల్లేక గొడ్రాలన్నబిరుదుతో కుంగిపోతున్న స్త్రీకి మాతృత్వాన్నివ్వడం కన్నా గొప్ప వరం ఇంకోటిలేదు. తల్లిగా కొన్నేళ్లు జీవితానందం సంపూర్ణంగా అనుభవించిన తరవాత కేన్సరో హార్టెటాకో వస్తే మాత్రం ఏముంది నష్టం? ఎలాగూ ఏదో రోగం వచ్చి పోవలసిన వాళ్లే అందరూ. కొంచెం ముందు పోతారు. అంతే. గొడ్రాలన్న నిందతో వందేళ్లు బతకడం కంటే సంతానవతి అన్న గౌరవం పొంది నడివయసులో మరణించినా మహా అదృష్టంగా భావిస్తారు భారతస్త్రీలు. తృప్తిగా నవ్వుకుంది నీలాంబరి. కుర్చీలో వెనక్కి వాలి విలాసంగా కూచుని బల్లకింది మీట నొక్కి తలుపు తెరి చింది. తలుపు దగ్గర చేతులు కట్టుకు నిలబడి ఎదురుచూస్తున్నాడు సెక్రటరీ స్వామి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here