[dropcap]ఆ[/dropcap]ద్మీ ముసాఫిర్ హై. ఆతా హై, జాతాహై. ఆనే జానేకా రాస్తే మే యాదేఁ ఛోడ్‌కర్ జాతే హైఁ.
‘నామాలు లేని’ ఏడుకొండలవాడిని ఎవరైనా చూశారా? చూసి ఎరగము. అయితే ఈ నామాల ఆవిర్భావం ఎక్కడి నుంచి? ఎన్నాళ్ళ నుంచి? ఆయనకే ఎందుకిలా జరుగుతుంది (అనేది మనకి తెలియదు). అది తెలుసుకొనే ప్రయత్నాన ఈ నామాలు పెట్టుకొనే సుద్దముక్కలు ఏ ‘కార్ఖానా’నా తయారయ్యేవి కావని అర్థమైనది.
మన లోకాన ఎక్కడ వెంకటపతి ఉన్నా ఆయనకు వేసే నామాలు, అందుకు ఉపయోగించే నామపు (కొమ్ములు) తయారయ్యేది మాత్రం ఈ మొత్తం దేశాన ఒకే ఒక్క పల్లెలో. ఆ పల్లె పేరు ‘జడేరి’ దానికి మరో పేరూ ఉంది. దాన్ని సడయేరి అని కూడా అంటారు.
ఇది నైసర్గికంగా మూడు జిల్లాల సరిహద్దు ప్రాంతం.
కామక్షమ్మ వెలసి నడయాడుతున్న కాంచీపురం.
అరుణాచలస్వామి నెలవుగా తలచే తిరువణ్ణామళై.
జలకంఠేశ్వరుని పాదునున్న బేళూరు.
ఈ మూడింటి మధ్యనున్నదే సడయేరి.
***
ఇన్ని రాష్ట్రాల మారుమూలనున్న ఈ చిన్న పల్లెన అంతా కలిపితే రెండు వందలలోపు గడప ఉంటుంది. దానికి తగ్గ జనాభా. ఇది మెట్ట ప్రాంతం. ఇక్కడ పల్లెవాసులకు వ్యవసాయం వృత్తి కాదు. అంతగా నీటి వనరులు లేని వర్షాధారంతో మెట్ట పైర్లు మాత్రం అడపా తడపా పండిస్తుంటారు (రాగులు, సజ్జలు, జోన్నలు, అలసందలు వగైరా). ఇక్కడ అంతా కలిపితే ఓ పది కుటుంబాలు తప్ప నిత్యం వ్యవసాయం చేసేందుకు శ్రద్ధ చూపరు.
జగత్ప్రసిద్ధమైన ఏడుకొండలవానికి అదే మన శ్రీనివాసునికి నిత్యం పెట్టే నామపు ఉండలు మాత్రం ఇక్కడే తయారు చేస్తారు. అక్కడ ఉన్న ప్రతీ గడపన ఉన్న చిన్న పిల్ల మొదలు ముసలీ, ముతకతో సహా అందరి వృత్తీ వ్యాపకం వెంకటేశ్వర నామాల సుద్దలు తయారు చేయడమే.
ఈ నామాలు పెట్టే సుద్ద ముక్కలే నాం కొమ్ములుగా జగత్ర్పసిద్ది.
అర్చకులు మాత్రం వీటిని చాలా గౌరవంగా ‘తిరుమణి’ అని పిలుస్తారు. ఈ నామాల తయారీకీ ఉపయోగించేది కాల్చిన సున్నమో, సుద్దో కాదు. వట్టి మట్టి మాత్రమే.
మనకు ఈ పల్లెన అడుగు పెడుతుంటేనే ప్రతీ గడప ముందూ కాల్చిన ఈ మట్టి దిబ్బలే కన్పడుతుంటాయి.
ఈ మట్టిన శ్రమిస్తూ కన్పించే గృహస్తులూనూ.
ఈ మట్టి కొమ్ములు తయారైన తరవాత తీక్షణమైన ఎండన ఆరబెట్టడం, పొరపాటున చినుకు పడే జాడ కనిపిస్తే వాటిని చినుకు పడకుండా భద్రంగా నీడకు చేర్చడం ఇదంతా వీరి దిన చర్య.
నిత్యం పొద్దు పొడుపుతో మొదలయ్యే ఈ పని పొద్దు భూమిన చేరిందాక నిరంతరం అలుపెరగక చేస్తూనే ఉంటారు.
ఇక విషయంలోకి వస్తున్నాం. ఈ జడేరి పల్లెకు రాకుండనే ‘టెన్‌పూండిపట్టి’ అనే పల్లె ఉంది. జడేరికి ఇది హ్యమ్లెట్ పంచాయితీ. న్యాయానికి జడేరి, ఇదీ ఒక పంచాయితీలోని పల్లె.
అదేం అదృష్టమో, లేక భగవదనగ్రహమో కానీ టెన్‌పూండిపట్టి మట్టి మాత్రమే స్వామి వారి నామాల తయారికి ఉపయోగిస్తారు. ఈ తయారు చేసే పద్దతిలో సున్నం వగైరాలు పొరపాటున కూడా కలపరు. నియమంగా ఈ మట్టితోనే స్వామి వారి నాం కొమ్ములు తయారు చేస్తారు. ఇప్పుడు కాదు, ఏడుకొండల స్వామి పుట్టినప్పటి నుంచీ. ఇంతెందుకు అనాదిగా ఇంతే. అయితే మొదటి రోజులలో స్వామి వారికి కదా అని ఈ మట్టిని ఊరికే త్రవ్వుకోనిచ్చేవారు. మన ప్రభుత్వం చేస్తున్న చాతాళాన బ్రతుకులు బరువై నిత్య అవసరాల ఖర్చులు పెరిగి లోగా మాదిరిగా ఈ మట్టిని జడేరి వారికి త్రవ్వకొనిపోనిక బండి మట్టికి ఇంత ఖరీదు అని నిర్ణయించుకొని వసూలు చేయడం ప్రారంభించారు. అది మొదలు పది రూపాయలు నుంచి ప్రారంభమై మన ప్రభుత్వాల ప్రజాసేవ అధికం కావడంతో ప్రస్తుతం బండికి ఆరు వందల రూపాయలు దాకా చెల్లిస్తున్నారు.
ఈ మట్టి తప్ప తిరుమలవాసుని నామాలకు మరేదీ పనికి రాకపోవడంతో ఇది తప్పడం లేదు.
ఈ కొమ్ములు చేసేందుకు ఈ మట్టిని ఎలా రుజువు చేస్తారంటే మొదట బండ్లలో తెచ్చిన మట్టిని ప్రతీ ఇంటికి గడప ముందుకు తోలుకుని జారుస్తారు. ఈ మట్టిని కార్చినాక మొట్టమొదటగా గానుగలో పోస్తారు. ఆ గానుగను సున్నం గానుగ తిప్పినట్టు మూడు, నాలుగు గంటలకు పైగా ఎద్దులతో త్రిప్పుతారు. గానుగలోని మట్టి పూర్తిగా మెదిగిన తరవాత ఆ మెత్తటి మట్టిని సిమెంట్ తొట్టిలలో గుమ్మరిస్తారు. గుమ్మరించిన దానిపై నీరు పోసి నెమ్మదిగా మట్టిని దేవుతూ, కలుపుతూ చెత్తా రాళ్ళు తీసేస్తారు. అతి చిన్న రాళ్ళూ మిగలకుండా. అది శుభ్రపడిన తర్వాత ఆ తొట్లలోనే మూడు, నాలుగు దినాలు నానబెడతారు. ఇలా కనీసం మూడు సార్లయినా ఉంచి మిగిలి కనిపించిన పుల్లలనూ, చెత్తా పూర్తిగా ఏరివేసి పూర్తి సంతృప్తి కలిగాక, మట్టి తేరుకొనేలాగ చేసి నీరు ఒంపి ఒక విడత ఆగి తెల్లటి దుప్పట్లు పరచి వాటిపై ఎండబెడతారు. ఇక అది ఎండడం మొదలైన తరవాత చిన్న చిన్న ముద్దలుగా తయారు చేస్తారు. తరవాత చెక్కల సాయంతో నామాల ముద్దలను కొమ్ములుగా తయారు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఎండబెడతారు. అవి ఎండడం మొదలైన తర్వాత బంగారు (గోల్డ్) వర్ణానికి వస్తుంది. అయితే ఇది పూర్తిగా ఎండిన కొద్దీ శంఖంలాంటి తెలుపు రావడం మొదలవుతుంది(నామాల కొమ్మలకు). దీనిలో మరే రకమైన రసాయన ప్రక్రియలూ కలుపరు. కళ్ళు చెదరే తెలుపు వచ్చిన తర్వాతనే తీస్తారు. బాగా ఎండిన నామాల కొమ్ములను ఓ పూట నీడన ఆరబెట్టి మర్నాడు బస్తాలలో ఎత్తి వ్యాపారస్థుల వద్దకు తీసుకెళ్తారు.
***
ఈ నామాలు తయారు చేయడం శేషశైలవాసుడైన శ్రీ వెంకటేశ్వరుడి అనుగ్రహంతో ప్రారంభమైందని అక్కడి పెద్దల నమ్మకం. జడేరి గడపన ఎంత పండు ముసలీకీ ఈ ప్రశ్న వేసినా మా తాతగారు వాళ్ళ తాతగారు కాలం నుంచీ చేస్తున్నామనడం వారి నోట వింటాం. మనకది ఆశ్చర్యంగా కనిపిస్తుంది.
కాని ఇది ఎలా ప్రారంభమైందీ అన్నది మాత్రం ఎవరికీ తెలియదు. కానీ వారు ఆచరించింది మాత్రం వాస్తవం. ఇప్పటికీ అదే వృత్తిన వారి జీవితాలు వెళ్ళమర్చుకుంటున్నారు. ఒక ముసలావిడ మాత్రం ఈ సాంప్రదాయపు వృత్తి మాకు వరమే. మా జీవితాన మాత్రం బొటాబటిగా పొట్ట గడుస్తది అంది. ఈ మాట ఆవిడ చెబుతున్నపుడు ఆవిడ ముఖాన చిరునవ్వు చెదరలేదు.
ఈ మట్టిని భూమి నుంచి తీసే ముందు మాత్రం అంతా వెంకటపతికి నియమంగా పూజ చేస్తారు. ఆనకనే కొమ్ములు చేయడం ప్రారంభిస్తారు. అది ఒక్క జడేరిలో తప్ప మరెక్కడా లేదుట. అందుకు వారు గర్వంగా భావించినా వారి బ్రతుకులు మాత్రం పెరిగిన ధరలతో కటువుగానే కన్పించినయి. ఇందున్న విపరీతమేమంటే కొన్ని ఆకలి చావులు ఇక్కడా చోటు చేసుకొన్నాయని చెప్పారు. న్యాయానా వాతావరణ పరంగా చూస్తే ఇక్కడ పడే వర్షాభావమేమో వ్యవసాయానికి అనుకూలమూ కాదు. అందుచేతనే ఈ వృత్తనే వదలక అనుసరిస్తున్నారు. ఏడుకొండలవాడే దిక్కని గుండెదిటవు చేసుకుని జీవిస్తున్నారు.
***
ఓ పత్రికా విలేకరి ఆ పల్లెవాసులను వివరాలడిగితే ఒక్క ఎడ్లబండిన పట్టే మట్టికి ఆరు వందల రూపాయలు చెల్లిస్తున్నారు. ఒక్క బండి మట్టి నుంచి సజావుగా సేవ్యం అయితే ఎనిమిది బస్తాల నామం కొమ్ములు తయారైతయి. బస్తా ఒక్కటికి యాభైకిలోలు ఉంచుతారు. ఈ బండెడు మట్టితో ఇంటిల్లిపాదీ కష్టపడితే ఇరవై నుంచి ఇరవై రెండు వందలు వస్తాయి అన్నాడు. ఈ పల్లెన ఏ ఒక్కరికీ తెలుగు రాదు. వారు సరుకు కొన్న షావుకారు ఏ దేవాలయానికి ఎలా అమ్ముతాడో తెలియదు. ఒక్క తిరుపతేం ఖర్మ. ఏడుకొండల స్వామి ఎక్కడ ఉన్నా వెళ్ళే నామపు కొమ్ములు జడేరివే.
ఇది శాపగ్రస్త నిజం.
న్యాయానికి ఆ దేవునికీ, మాకూ మనసున తప్ప దేవస్థానంతో మాకు ఏ సంబంధ, అనుంబంధాలు లేవు. బహు కుటుంబీకులు మాత్రం ఇప్పుడిప్పుడు చదువుకుని దిక్కు మారి వేరే వృత్తులలోకి వెళుతున్నారు. అర్ధాకలి వారినలా చేస్తుందని చెప్పాడు.
ఇక మిగిలిన వారంటారా చదువు రాదు, వారికీ పని తప్ప మరేం తెలీదు. మా నామాలను ధరించే వెంకటపతే మా తలరాతను మార్చకపోతాడా అనుకుంటూ ఈ వృత్తిననే జీవిస్తూ ఉంటారు. నీరు లేని వ్యవసాయమూ గాలిలో దీపం కదా.
***
“తాతా ఆకలేస్తోంది సంకటి కాలే” అడిగాడు బుడతడు. మట్టి పని కాడ్నించి వచ్చి చేతులు కడుక్కొని.
“ఈ పొట్టలు నింపడం ఎలాగో అర్థం కాక చేసే పని ప్రియమై అమ్మబోతే అడవై ఏదిక్కూ కానకనే కదరా మీ అయ్య పొయంది. (ఈ ఆకలిని చంపేందుకే కదరా) ఏది కొనబోయినా ధరలేమో చుక్కలను చూస్తుండె. మనమేమో నమ్ముకొని వదలక స్వామి సేవలోనే ఉంటుంన్నాం కదా. ఆయనే ఏమీ చేయలేకపోయే” అని నవ్వి, “ఆయన్నే తినేసే మనషులేం చేస్తరు. చెయ్యి కడుక్కొని రా, ఇంత అంబలి తాగి పోదువు” అని లేచాడు. కీళ్ళు పటపటమంటూ కదిలినయి. నడక సాగక నిలబడ్డాడు. “చివరకు ఉప్పూ ప్రియమాయె. కన్నీళ్ళతో ఉప్పదనం తెచ్చుకొనే స్థితి వచ్చె” అంటూ ఆంబలి దాకా నడచాడు.