[dropcap]ఉ[/dropcap]ద్వేగపు అలల మీద అనంత సంభాషణల్ని పూయించి
విధ్వంసాన్ని విదిల్చిన నిశ్శబ్దాన్ని మననం
చేసుకుంటున్న అమానుషత్వం
కలల కారిడార్‌ను కూప్పకూల్చింది.
నిద్రిస్తున్న నగరానికి, కాపుకాస్తున్న కాలాన్ని
నా గదిలో బంధించానని తెలియక పోవచ్చు
ముగియని చివరి మాట ఫంక్తుల్లో మొలిచిన ప్రశ్నలకు
పోగవుతున్న ఆలోచనలకు విరామం వుండటం లేదు
ప్రోగవుతున్న మనుషులు రాత్రి, పగలను కూడగడుతున్నారు
అపరిచిత చిరునవ్వుల్ని సేకరిస్తున్నారు.
మాయమై పోయిన నులివెచ్చని స్మృతుల్ని
కళ్లతోనే ఆలింగనం చేస్తున్నారు
సమాజపు నగ్న దేహాన్ని కప్పటానికి
వెర్రిప్రేమను కురిపిస్తున్నారు.
బంధించలేని పిరికితనానికి ‘చే’ నినాదపు హోరులను
పోస్టర్లుగా అతికిస్తున్నారు
దుఃఖానికి శిలువచేసి, విశ్వాసానికి వూపిరినూది
భవిష్యత్తును నిచ్చనేస్తున్న బక్కచిక్కిన
నా దేహానికి భరోసానిచ్చే స్పర్శ కావాలి.