[box type=’note’ fontsize=’16’] తమ కాలనీలో జరిగే సరదా ఘటనలనూ, వేడుకలను, కాలనీవాసుల ప్రవర్తనను చమత్కారంగా వివరిస్తున్నారు ఆనందరావు పట్నాయక్ ఈ ‘కాలనీ కబుర్లు‘ కాలమ్‌లో. [/box]
[dropcap]వ[/dropcap]చ్చే జీతం డబ్బు నామమాత్రమే. కాని ఖర్చు కానరానిది. జల్సాలకు రూకలు కావాల్సివచ్చేది కుమార్‌కి.
చీకటి పడ్డాక ఒక తైనాతీని తీసుకొని స్టూడెంటు కుర్రాళ్లు ఉండే మెస్సులకు వెళ్లేవాడు. అప్పటికి వేషభాషలు మారిపోయేవి. కాళ్లకు హై హీల్ షూస్, కళ్లకు నల్ల కళ్లద్దాల పెట్టుకొని అచ్చం ఆంగ్లో ఇండియను గర్ల్‌లా తయారయి సైకిలు ముందున్న రాడ్ మీద కూచుని పోనీయమనేవాడు కుమార్. స్టూడెంట్లు ఎలా ఆడవాసనకు ఐసు అయిపోతారో ముందుగా కనిపెట్టి తోడు దొంగను పంపించి డీల్ కుదుర్చుకొనేవాడు. చిమ్మచీకటిలో ఏకాంతంలో కాంత ముందు చేరబోతున్న బకరాకి విజిలు వినిపించేది. పోలీసు, పోలీసు.. అని దళారీ కేకలు పెట్టుకొని రావడం ఏమిటి, గుండుకు దొరక్కుండా తప్పించుకొనేవారంతా. పాపం విటుడు తేలు కుట్టిన దొంగలా ఎవరికీ చెప్పుకోలేక, చేసేది లేక ఊరుకోవడం ఉత్తమమైన మార్గమని నోరు మెదపక ఉండేవాడు.
కమ్యూనిటీ హాలులో పార్టీ ఉందని కుమార్ మమ్మల్ని ఆహ్వానించాడు ఒక రోజు. దేనికీ అంటే.. సస్పెన్సు.. వస్తే తెలుస్తుంది అని చెప్పాడు. కాలనీలో ఉన్న మాలి కూతురితో షాదీ, బాద్ మే దావాత్. పెళ్లికూతురు పేదదయినా మంచి పిల్ల, చక్కని చుక్క ఈ మాయగాడి వలలో ఎలా పడిందో అనుకొన్నాం. అక్షింతలు వేసి వచ్చిన వాళ్లం అమ్మాయి చేతిలో నగదు బహుమానం సమర్పించి వచ్చాం. మర్నాడే కుమార్‍కి సింగిలు ఆర్ అలాట్ అయింది. కారణం అతగాడు అప్పటికే యూనియను బుల్లి లీడరు. యాజమాన్యానికి తెలుసు ఎలా వాళ్లను గుప్పెట్లో పెట్టుకోవడం.
రవుడీ షీటరు ముదిరి రాజకీయనాయకుడయినట్లు కుమార్ యూనియనులో కీలకపాత్ర వహించి చక్రం తిప్పుతుండేవాడు. దశ తిరిగింది. వరుసగా పిల్లలు పుట్టడం, ప్రమోషను రావడం, టూ. ఆర్.క్వార్టరుకి మారిపోవడం జరిగింది. ఖర్చులు పెరిగాయి. దానికి తగ్గట్టు ఆదాయం పెరగలేదు. నాథ్ బాబు అని జూనియరు ఇంజనీరు స్టోరు ఇన్‌ఛార్జు ఉండేవాడు. కుమార్ స్టోరు సామాన్లు అడిగాడు. అప్పటికే సీలింగు ఫ్యేన్లు తీసుకుపోయి తిరిగి వాపసు చెయ్యలేదు. ఆడిట్ పార్టీ వస్తుంది, స్టాక్ వెరిఫికేషను జరిగితే రిమార్కు అన్నాడు నాధ్ బాబు. మాట మాట పెరిగి, కోపం పట్టలేక కుమార్ కాలి చెప్పు తీసి ఎడాపెడా వాయించేసాడు. ఎవ్వరూ ఊహించని సంఘటన ఇది. అందరం మంత్రించిన మనుష్యుల్లా చూస్తూ ఉండిపోయాం.
అత్యవసర సమావేశానికి రమ్మనిమని పిలుపు వచ్చింది. ఇంజనీర్లకు కూడా పటిష్ఠమైన యూనియను ఉంది. పోలీసు కేసయింది. కుమార్ అండరుగ్రౌండుకి వెళ్లిపోయాడు. రోజులు, వారావు, నెలలు దొర్లిపోతున్నాయి. అవి ఆగవు కదా. వాడి పెళ్లాం, పిల్లలు ఆకలి రోకటి పోటుకి అల్లాడిపోతుండేవారు. పాపం మాలి అంత బీదరికంలో కూడా తను పస్తు ఉండి మనవలకు తిండి పెట్టేవాడు. ఒకరోజు కోర్టులో వాది, ప్రతివాది హాజరయ్యారు. రెండు పార్టీలు రాజీ కుదుర్చుకోవడం, నాథ్ బాబు కేసు ఉపసంహరించుకోవడం జరిగింది. జడ్జిగారి ఆశ్చర్యానికి అంతులేదు. ఆఫీసరుని కొట్టడం నేరం. సాక్ష్యధారాలు బలంగా ఉన్నాయి. కనీసం మూడేళ్ల కఠిన కారాగార శిక్ష వేసే ఉత్సుకతలో ఉన్నాడాయన. అతని ఉత్సాహంపై నీళ్ళు చల్లాడు కుమార్.
అంతా యాంత్రికంగా బస్సుల్లో కూచున్నాం. రావిగుడకి పాతిక కిలోమీటర్ల దూరాన ఉన్న సింఘానియా టెంపుల్ దర్శించాం. ఫ్లడ్ లైట్ల వెలుతురులో ఆలయం అత్యద్భుతంగా కనపడుతోంది. హోమం జరుగుతోంది. డబ్బాల కొద్దీ ఆవు నెయ్యి ఆహుతి అవుతోంది. వారం రోజుల పాటు జరిగే ఆ హోమానికి చాలా నెయ్యి ఖర్చవచ్చని పూజారి చెప్పాడు. చెప్పొద్దూ నాకు ఒళ్లు మండింది. పౌష్టికాహారం లేక శిశువులు రోగ పీడితులవుతుంటే మంచి నెయ్యి నేల పాలవుతుంది. ‘మతచాందసులారా మరణించండి’ అని గొణగుతూ బయటపడ్డాను. ‘తీర్థం తీసుకోకుండా ఎక్కడికి పోతున్నారు వెర్రి వెంగళప్పలా’ అని కౌంటర్ వేసేసరికి సైలంటు ఆయిపోయాను.
తిరుగుదలలో మా బస్సు కాలేజీ మీదుగా పోతుంది. మొదట్లో ఆర్టు సబ్జక్టుతో ఆరంభమయి, ఇప్పుడది గవర్నమెంటు కాలేజయి కూచుంది. మాకు ఇంజనీరింగు సబ్జక్టు మీదనే కాకుండా కామర్సు సబ్జక్టు మీద కూడా అవగాహన ఉండాలి.. అందుకోసం నేను కూడా కాలేజీలో చేరాను. అప్పుడు సామ్యుయేల్ అనే కామర్సు లెక్చరరు ఉండేవాడు. పొద్దున్నే కాలేజీకి వచ్చి ఎవరి నెత్తిన చెయ్యి పెట్టాలా అని చూసేవాడు. బకరా కావాల్సి వచ్చింది.
హోటలుకి చేరాం. అలసటగా ఉంది. ఏమీ తినాలనిపించలేదు. కాన్ఫరెన్సు హాలులో అంత్యాక్షరి కార్యక్రమం ఏర్పాటు చేసాడు లక్కీ. నేను రానన్నాను. మారు మాట లేకుండా వెళ్లిపోయారు వాళ్ళంతా. నాకు ఓం గుర్తుకొచ్చాడు. ఫోను చేసాను. వస్తానన్నాడు. నా ఆలోచనల స్రవంతి గతం వైపు మళ్ళింది.
(తరువాయి వచ్చే సంచికలో)