[dropcap]వూ[/dropcap]పిరి ఆడడం లేదు –
గాలి కోసం ఊపిరితిత్తులు ఎగిరెగిరి పడ్తున్నాయ్ –
కిటికీ తలుపులు తీశాను –
ఓ గాలి తెమ్మెర అలా అలా – వచ్చినట్టు –
అరక్షణమే ఆ అనుభూతి…
మరుక్షణం గాలికి శిక్ష వేసినట్టు –
భరించలేని దుర్గంధం –
ఆ కారణం వల్లనే ఫ్యాన్ వేసుకున్నా, ఇబ్బందిగా వున్నా, యింటి కిటికీలు తీయం -!
ఎవరో పరిశ్రమ వాడు గుట్టుచప్పుడు కాకుండా అర్ధరాత్రి విషవాయువులు వదిలేస్తున్నాడు –
ఎవరికి ఫిర్యాదు చేయాలి –
ప్రకృతి పట్ల మర్యాద లేకపోయినప్పుడు ఎవరికి ఫిర్యాదు చేసి ఏం లాభం?
యిల్లు విడిచి –
బయటకు నడిచాను –
అంత రాత్రీ, పొగ వొదుల్తూ వేగంగా కార్లు వెళ్తున్నాయ్-
పెట్రోల్, డీజిల్ వాసన విరజిమ్ముతూ –
‘గాలి’… గాలి కోసం… గాలింపు…!
హాలాహలం మింగినట్టు వుంది గాలి…
పరిశ్రమలు… వాహనాలు…
నాలుగు రోజుల క్రితం –
కడుపునొప్పి వస్తే – డాక్టర్ దగ్గరకి వెళ్ళాను.
పరీక్ష చేసి ‘ఫుడ్ పాయిజన్’ అన్నాడు –
ఐదు నక్షత్రాల హోటల్లో భోజనం చేస్తే – ఫుడ్ పాయిజనా?
“ఇందు గలడందు లేడని సందేహం లేదు… కాంతి వెళ్ళని చోటుకు సైతం కాలుష్యం వెళ్లిపోయింది…” అని దగ్గాడు.
డాక్టర్ గారికి, ‘గిరాకీ’ కోసం సెంటర్‌లో పెడ్తే, దుమ్మూ ధూళీ వల్ల దగ్గు చుట్టుకుంది.
“కానీ…” ఏదో చెప్పబోతుంటే –
“నీళ్ళు తాగారా?” డాక్టర్ అడిగాడు అదో తప్పయినట్టు –
“మినరల్ వాటర్”
అనుభవజ్ఞుడైన రోగిలా నవ్వాడు డాక్టర్.
“మినరల్ వాటర్ యింకొటనీ లేదు… నీళ్ళు తాగితే లోపలికి క్రిములను పంపినట్టే…” గట్టిగా నవ్వి, నవ్వులోంచి దగ్గులోకి జారుకుని, విమర్శించిన నీళ్ళనే తాగాడు.
వెంటనే, ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో ఓ పెద్దాయన యింట్లో మినరల్ వాటర్ తాగి అనారోగ్యం పాలైన సంగతి గుర్తొచ్చింది.
“ప్రాణాయామం…” నేనడిగేలోపే –
“సిటీలో వున్న వాయువును పీలిస్తే ‘ప్రాణాయామం’ కాదు… ‘ప్రాణాపాయం’ అవుతుంది…” అన్నాడు చర్మరోగానికి మందు రాసుకుంటూ –
“మేమూ మీ లాంటి వాళ్ళమే…” అని సర్ది చెప్పి –
మందులు రాసి –
“హాయిగా పడుకోండి…” అన్నాడు.
యిదిగో –
నిద్ర పట్టక ఇలా రోడ్డున పడ్డాను.
***
మర్నాడు –
నిరంతర వార్తావాహినిలా ప్రవహిస్తున్న ముక్కుని తుడుచుకుంటున్న డాక్టర్ దగ్గరకు వెళ్ళి –
“మందు పనిచేయలేదు… నిద్ర రాలేదు…” అన్నాను.
“మందులు కూడా కాలుష్యం బారినపడి కల్తీ అయ్యాయేమో…” హఛ్ఛమంటూ పెద్దగా తుమ్మేస్తూ అనేశాడు.
“మరెలా?”
“మీదే వూరు?”
మా పల్లె పేరు చెప్పాను
“వెరీ గుడ్…” అని ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ అందుకుని –
“పల్లెకి వెళ్ళి … స్వచ్ఛమైన గాలి పీల్చి, నీటిని తాగి ఆరోగ్యవంతులు కండి…” అని రాసి –
“ఇంతకు ముందు ఎలా వున్నా… యిప్పుడు సగం రోగాలకి కారణం కాలుష్యమే…” ఖండితంగా చెప్పేసాడు ప్రిస్క్రిప్షన్ అందిస్తూ! నాకు ఆనందం, ఆశ్చర్యం కలిగాయి!!
***
ఎప్పట్నించో మా వూరు తీసుకెళ్ళమని పిల్లలు అడుగుతున్నారు. ఎప్పుడూ పరీక్షల హడావిడి.
ఈసారి డాక్టర్ సలహా మేరకు వెళ్ళాల్సి వస్తోంది కనుక సకుటుంబంగా బయలుదేరాము.
మా పల్లె –
అందమైనది. పచ్చదనం. పెద్ద చెరువు. పూలు, చెట్లు. మా ముత్తాత ఆ వూరు రావడం గురించి యిప్పటికి మా వాళ్ళు ఆ విషయం గొప్పగా చెప్పుకుంటారు.
“… సాంబయ్య తాత యిక్కడికి వచ్చినప్పుడు యిదంతా బీడు నేల… వ్యవసాయం చేయడానికి వచ్చారు… అన్నీ రాళ్ళూరప్పలు… అంతా బీడు… చాలా రోజులు చాలా రకాలుగా ప్రయత్నాలు చేశారు. చివరికి విరక్తి కలిగి విసిగి అక్కడ్నించి వెళ్ళిపోదామనుకున్నారు… కానీ ఏదో చిన్న ఆశ… నీరు పడితే… నీటి ప్రయత్నాలు ఫలించలేదు. రామకృష్ణ పరమహంస గారు చెప్పినట్లు ‘మనసారా ఏడిస్తే దేవుడే కనబడతాడు’ అని ఓ పెద్దాయన సాంబయ్య తాతయ్యకి చెప్తే… ఆయన ఆ నేల మీదకి ఒదిగిపోయి, ఏం చేయలేని స్థితిలో కన్నీళ్ళు కార్చాడుట… అలా ఎన్ని పగళ్ళో, ఎన్ని రాత్రుళ్ళో గడిచాకా… అక్కడ ఓ మొక్క… చాలా చిన్నది… మూడు ఆకులతో… సన్నగా తీగలా… భూమిలోంచి పైకి వచ్చిందట…. అంటే… ఆ చిన్న మొక్క యిచ్చిన మొక్కవోని ధైర్యం అక్కడ వూరు రావడానికి కారణమయ్యింది. ఒక యిల్లు.. రెండు యిళ్ళు… అలా… అలా… పంటలు… పక్షులు… పచ్చదనం… సాంబయ్య గట్టు యిప్పటికీ వుంది మా వూరు చెరువు గట్టున….” ఉత్సాహంగా చెప్తుంటే మా ఆవిడ పిల్లలు వుత్సాహంగా విన్నారు. ఆ మర్నాడే మా ప్రయాణం.
***
“చెరువు దగ్గరకి వెళ్దాం…” వూళ్ళో దిగిన వెంటనే మా కార్తీక్ అడిగాడు.
“… వెళ్ళాల్సిందే…” రెండోవాడు కౌశిక్ హుకుం జారీ చేశాడు.
యిద్దరికీ దారిలో చిన్నప్పుడు చెరువులో ఈదులాదిన విషయం చెప్పాను. ఆ రోజుల్లో, చెరువులో ఈదులాటల్లో తేలిపోయేవాళ్ళం.
“… స్నానం చేశాక చెరువుకి వెళ్దాం…” మా బాబాయి కొడుకు సూరిబాబు అన్నాడు.
“చెరువులోనే స్నానం…” యిద్దరు పిల్లలు ఒకేసారి అన్నారు.
“… వద్దురా…” బ్రతిమాలుతున్నట్టు చెప్పాడు సూరిబాబు.
ససేమిరా అన్నారు పిల్లలు.
తప్పక కదిలాము.
చెరువు అంత దూరంలో వుండగానే ముక్కుపుటాలు బద్దలయ్యే పరిస్థితి. అపరిశుభ్రంగా వుందక్కడ.
పిల్లలు నిరాశగా చూశారు. స్నానానికి బయలుదేరిన వాళ్ళు భయపడ్తూ ఆగిపోయారు.
సాంబయ్య గట్టు పగిలి శిథిలావస్థలో వుంది. చుట్టూ ఎండుటాకులు, పిచ్చి మొక్కలు.
గట్టుని చూసినా పిల్లల్లో ఉత్సాహం కలగలేదు. కానీ తప్పక కాసేపు అక్కడ వున్నాము.
సాయంత్రం ఆరు గంటలప్పుదు మా వాడు అడిగాడు –
“పోనీ పక్షులనేనా చూద్దామా?” అని.
మా వూరు దగ్గరున్న కొల్లేరుకి పక్షులు వలసకి రావడం, వాటితో మేం గడిపిన విషయం గొప్పగా చెప్పాను. అది గుర్తుకువచ్చి అడిగారు.
నేను మాట్లాడేలోపు సూరిబాబు యింటి లోపలికి వెళ్ళి ‘సలీం ఆలీ’ పుస్తకం తీసుకొచ్చి –
“… యిందులో బోలెడు పక్షులు వున్నాయి…” అన్నాడు.
“…యిందులోనా….” పుస్తకం అనాసక్తిగా తీసుకున్నారు.
“… వాతావరణంలో మార్పుల వల్ల, ప్రపంచంలో పలు ప్రాంతాల్లో వలస పక్షులు చనిపోతున్నాయి. రావడం లేదు. వాతావరణం మారింది…”
“… వాతావరణం మార్పా?… అయినా ఎక్కడో పక్షులు చనిపోతున్నాయా?”
“ఆ… కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు… పక్షులు అంతరించిపోవడానికి చాలా కారణాలు వున్నాయిలే…”
ఆ సాయంత్రం పక్షుల పుస్తకంతోనే పిల్లలు గడిపారు!!.
పిల్లలకి చక్కటి నీళ్ళున్న చెరువుని –
కువకువలు వినిపించే పక్షులని-
కాలుష్య ఛాయలు కన్పించని వూరుని చాలా చాలా చూపెట్టలేకపోయాను.
ఈ వూరంతా మారిపోయింది –
ఉదయం అయితే చాలా వాహనాల మోతలతో మారుమోగిపోతోంది.
చెరువు దగ్గరకెళ్తేనే జబ్బులు వచ్చే పరిస్థితి –
పక్షుల జాడ లేదు – !
పల్లె, పట్నం లేకుండా నరక ప్రాయమయిపోయాయి.
***
నిద్ర పట్టక లేచాను.
యథాలాపంగా పక్కనే పడుకున్న పిల్లల కోసం చూశాను.
యిద్దరూ కనిపించలేదు.
ఈ వూళ్ళో ఎక్కడికి వెళ్ళి వుంటారు?
సూరిబాబు నేను టార్చిలైటు వేసుకుని పిల్లల్ని వెతుక్కుంటూ వెళ్ళాము.
ఆ వీధిలో కన్పించలేదు.
పక్క వీధికి వెళ్ళాము.
అక్కడా లేరు.
చెరువు గట్టుకి చేరాము. ఊహూ…
ఎక్కడికి వెళ్ళినట్టు –
కాసేపు అక్కడే ఆగాము –
మెల్లగా ఆ నిశిలో, ఎవరో ఏడుస్తున్న శబ్దం…
అటుగా చూశాము – కాస్త దూరంగా –
సాంబయ్య గట్టు దగ్గర మా యిద్దరు పిల్లలు వినయంగా నిలబడి, కన్పించని దేవుడికి దండం పెడ్తూ, ‘మనసారా ఏడుస్తున్నారు’. మురికి కాలవగా మారిన చెరువు కోసం, ఋతువులని గుర్తు చేస్తూ వచ్చే వలస పక్షుల కోసం!!
ఓ చిన్న మొక్కని అక్కడ నాటే ప్రయత్నం చేస్తూ!