తమసోమా జ్యోతిర్గమయ-8

0
5

[box type=’note’ fontsize=’16’] “మాధవ్ ఆ తలుపుల వెనకాల ఉన్నాడు. తన జీవితాన్ని, డాక్టర్ల చేతుల్లో పెట్టేసాడు. ఇప్పుడు తన జీవితం, మాధవ్ జీవితం ఇద్దరి జీవితాలు, విధి చేతుల్లో ఉన్నాయి” భర్త గురించి రాధ ఆందోళనని గంటి భానుమతితమసోమా జ్యోతిర్గమయ’ ధారావాహిక ఎనిమిదవ భాగం చెబుతుంది. [/box]

[dropcap]మ[/dropcap]ళ్ళీ రాధ ఒక్కత్తే. విశాలంగా ఉన్న ఆ విజిటర్స్ హాల్లో కూచుని కళ్ళు మూసుకుంది. ఆమెకు జరిగింది ఆలోచిస్తూంటే ఓ కల లాగా అనిపిస్తోంది. నిజంగా కల అయితే ఎంత బావుండును…. కల కాదు. నిజం పీడకల. నిద్ర పోతున్నప్పుడు వచ్చిన కల. మేలుకోవాలి. నిద్ర అయింది. మేలుకోవడం కూడా అయింది. జరిగింది కొంచెం కొంచెంగా తెలుస్తోంది. ఈ తెలుసుకోవడం కల లోకి వస్తుందా… ఒకవేళ కలే అయితే,అది ఇప్పుడే మొదలయింది.

అంతలో సెల్ మోగింది.. తీసి చూసింది. నారాయణ. మాట్లాడింది.

నారాయణ వాళ్ళన్నయ్య తీసుకుని, పోలీస్ స్టేషన్‌కి వెళ్ళాడు. అక్కడి నుంచే ఫోన్ చేసాడు. ప్రతీ ఐదు నిమిషాలకి, ఓ సారి హాస్పటల్‌లో ఉన్నవాళ్ళకి ఫోను చేస్తున్నాడు. మధ్య మధ్య ఎస్సెమ్మెస్‌లు ద్వారా విషయాన్ని అందిస్తూనే ఉన్నాడు.

ఆఖర్న తేలిన విషయం ఏమిటంటే… సెటిల్ చేసుకోవడమే, అదొక్కటే మార్గం. కాదు, ఆ డబ్బు మాకొద్దు, మేం తీసుకోము, ఇంకా ముందుకి వెళ్తాం అంటే మిగిలేది కాలిన చేతులు.

రాధ ఆశ్చర్యపోయింది. ఈ యాక్సిడెంట్లకి సెటిల్‌మెంటు ఒక్కటే పరిష్కారమా….! ఇది అన్యాయం కాదా…! మనిషి ప్రాణానికి, పూడ్చలేని గాయాలకి విలువ ఎలా కడ్తారు..! ఏ బేసిస్ పైన కడ్తారు… మరి వాళ్ళ నిర్లక్ష్యానికి ఖరీదు ఇలా డబ్బులా…! యాక్సిడెంటు చేసిన ఆ మనిషికి జరిగిన దానికి బాధ్యత వహించాల్సిన నైతికత ఉండదా….!

అంతలో మళ్ళీ అందరూ కలిసి రాధ దగ్గరికి వచ్చారు, నారాయణ జరిగినది, అందరి ముందు మరోసారి చెప్పాడు. అంతా ఆశ్చర్యపోయారు.

“ఓ లాయరు యిలాంటి సలహా ఇవ్వగలడా… అతను న్యాయ శాస్త్రాన్ని చదివాడు. దాన్ని న్యాయస్థానంలో ఉపయోగిస్తున్నాడు, లేకపోతే వాడుతున్నాడు. ఓ న్యాయవాది వేసుకునే నల్ల కోటు వేసుకుంటున్నాడు. సగం రోజు, న్యాయం అన్యాయం మధ్య ఉండిపోతున్న గీతలని చెరపడానికో లేకపోతే వాటి మధ్య ఉంటున్న గేప్‌ని తగ్గించడానికో ప్రయత్నిస్తూ, పరిష్కారం కోసం, ధర్మయుద్ధం చేస్తూ, న్యాయ స్థానంలోనే గడుపుతాడు. అతను లాయరులాగా ఆలోచించాలి కాని, ఓ మామూలు మనిషిలా ఎలా ఆలోచిస్తాడు…. అలాంటి సలహా ఎలా ఇవ్వగలుగుతాడు….. ఇతను ఎవరిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నాడు… నేరస్థుడినా… ఎర్ర లైటు పడ్డాకా కూడా బండి నడపడం నేరంకాదా… రాంగ్ సైడు నుంచి రావడం నేరం కాదా… యాక్సిడెంటు చేసేసి, ఆగకుండా వెళ్లిపోయాడు, అది నేరం కాదా….. ఆ డ్రైవరు కచ్చితంగా నేరస్తుడే. అతడిని పట్టుకుని జైల్లో వెయ్యాలి. ముందు అరెస్ట్ అయినా చెయ్యాలి. మనం చట్టాన్ని ఉపయోగిచుకోవాలి. కాంపన్సేషన్ అన్న దానికి వెళ్ళకూడదు” అక్షయ్ అన్నాడు.

“నేననేదేంటంటే ఈ కేసులు ఎప్పటికీ తెగవు, ఏళ్ళ తరబడి, అలా సాగుతూ ఉంటాయి, విసుగేసి లాయర్లు అలా చెప్పడంలో ఆశ్చర్యం ఏంలేదు. అందుకే ఇలాంటి కేసులన్నీ కూడా ఇచ్చిపుచ్చుకోడాలతోనే ముగుస్తాయి….”

అంతవరకూ నిశ్శబ్ధంగా వాళ్ళ మాటలు వింటున్నరాధ ఉలిక్కి పడింది

“ఇవాళ జరిగిన విషయం తీసుకుందాం… ఇది ఓ పాఠం. దీన్నుంచి మనకి ఏం తెలుస్తోంది.. యాక్సిడెంటు అయిన వెంటనే తీసుకువెళ్ళి ఉంటే మనిషి బతుకుతాడు. లేకపోతే కష్టం. ఇప్పుడు జరిగినది కూడా అదే కదా, వెంటనే వెళ్ళీ ఉంటే ఇంత రక్తం పోయేది కాదు అని. లైఫ్ సపోర్టింగ్‌వి అన్ని ఇమ్మీడియెట్‌గా అందేవి. ఇంత తీవ్రత ఉండేది కాదు. అని…. అది ఎందుకు అలా జరిగింది..? చూస్తున్న వాళ్ళు తొందరగా సాయం చేయడానికి రాలేదు. ఎందుకు…? కోర్టు ఇబ్బందులకి భయపడి సాయం చేయలేదు. సాక్ష్యం చెప్పేవాళ్ళు ఈ కోర్టుల చుట్టూ తిరగడం అన్నది ఎంత వరకూ సబబు.?.. ఆ కోర్టు, న్యాయ సంబంధమైన గొడవలు అంటే ఎవరికీ నచ్చదు. పైగా భయం. అందుకే ఇలా జరుగుతూంటాయి. ఇలా వైద్యం సమయానికి అందక, ప్రాణాలు పోతున్నాయి. ఈ భయాలూ అవీ లేకపోతే.. సాయం చెయ్యడానికి సాక్షులు ముందుకొస్తారు. ముందే తీసుకురావలసింది అన్న మాటలు వినాల్సిన ఖర్మ పట్టదు…….” అని అంది సౌమ్య.

“అసలు ఈ హిట్ అండ్ రన్ కేసులన్నీ ఇంతే. ప్రాణం పోయినా, కాళ్ళూ చేతులూ పోయినా, వాటి ముగింపు ఇలాగే ఇలాగే లావాదేవీలూ, ఇచ్చి పుచ్చుకోడాలూ, వీటి మధ్యే ఉంటుంది. పోయిన వాడికి, దెబ్బలు తగిలిన వాడికి న్యాయం జరగడం కష్టమే.

నిజంగా న్యాయం జరగాలంటే, సరి అయిన చట్టం రావాలి. యాక్సిడెంటు అయ్యాకా, గాయపడ్డవాళ్ళకి, సాయపడ్డవాళ్ళని, సాక్షులనీ చూడాలి. న్యాయసంబంధమైన గొడవలూ అవీ రాకుండా కాపాడాలి. సాక్షులని ఒక్కసారి మాత్రమే పిలవాలి. స్పెషల్‌గా ట్రీట్ చెయ్యాలి. అలా అయితేనే ప్రమాదం జరిగిన వెంటనే సాయం చెయ్యడానికి చాలా మంది ముందుకి వస్తారు. అప్పుడే చాలా మంది ప్రాణాలు కాపాడగలుగుతాం. గాయపడ్డ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. నిజంగా ఈ చట్టాలకి నోరుంటే, అవి ఎన్నో చెప్పగలుగుతాయి. అవి ఏవీ జరగడం లేదు, కాబట్టి రోడ్డు మీద జరిగే ప్రమాదాలకి, వెంటనే సాయం అందడం లేదు. అందకపోతే ఏం జరుగుతుంది. మన అందరికి తెలుస్తోంది. మాధవ్‌ని బ్రతికించడం కోసం అక్కడ యుద్ధం చేస్తున్నారు. ఇది మరో కేసు, అదే ముగింపు…”

“చట్టాలు రావడం కష్టం… ఎన్నో ఏళ్ళు పడుతుంది. అసలు, రోడ్డు మీద వాహనాలు నడిపేవాళ్ళు నిబంధనలు పాటించాలి. అదే గనక చేస్తే ఇన్ని ప్రమాదాలు జరగవు. అయినా దీని గురించి ఎవరూ చెప్పక్కర్లేదు. ఇవన్నీ ఎవరి మటుక్కు వాళ్ళకే తెలియాలి. కొంచెం సివిక్ సెన్స్ ఉండాలి. అదే కనక లేకపోతే, ఇలాగే ప్రమాదాలు జరుగుతూంటాయి. మనిషి మారనంతవకూ ఏ చట్టాలూ, న్యాయాలు పనిచెయ్యవు. మనం ప్రతీసారీ ప్రతీ దానికి న్యాయం కావాలంటే కోర్టుకి వెళ్ళాలి. వెళ్తున్నాం. మనషులు మారాలి.”

“మార్పు రావాలంటే మనిషి యాటిట్యూడ్ మారాలి.”

“ఆ కారు నడిపింది ఎవరో తెలిసింది. ఓ పిల్లాడు” అంటూ వచ్చాడు వరుణ్.

“ఎవరూ ఓ పిల్లాడా….. పిల్లాడు ననడిపించడం ఏఁవిటీ..”

“పిల్లాడంటే మరీ చిన్నవాడు కాదు కొంచెం పెద్దవాడే. వాడు ఓ వ్యాపారస్తుడి కొడుకుట. చిన్నవాడు కాదు కానీ ఓ పద్దెనిమిది ఏళ్ళవాడుట. పొద్దున్న అయితే… ట్రాఫిక్ ఎక్కువ ఉండదని, రోడ్లు ఖాళీగా ఉంటాయని, ఫాస్ట్‌గా నడప వచ్చని, కారు తీసుకుని వెళ్ళాడుట. ఆ పిల్లాడు ఒక్కడూ అయితే భయం అని ఇంట్లో వాళ్ళు డ్రైవరుని కూడా ఇచ్చి పంపారుట. కానీ ఆ పిల్లాడు డ్రైవర్ని తోసి నడపడం మొదలెట్టాడుట. పక్కనున్న డ్రైవరు వద్దని అంటున్నా మరీ వేగంగా వస్తూంటే, గ్రీన్ లైటు రెడ్‌గా మారడం చూడలేదుట. యాక్సిడెంటు చేసానని, ప్రమాదం జరిగిందని తెలుసు, కానీ ఏం చెయ్యాలో తెలీలేదుట. కారుని ఆపేస్తే చుట్టూ మూగిన జనం కొడతారేమో అన్న భయంతో ఇంకా స్పీడు పెంచి, అక్కడినుంచి వెళ్ళిపోయాడుట. ఇంటికి రాగానే,భయపడుతూనే జరిగినది చెప్పాడుట. వెంటనే ఆ పిల్లాడి పేరెంట్సుకి పోలీసు స్టేషన్‌కి వెళ్ళి చెప్పడానికి ధైర్యం చాల్లేదుట. డ్రైవరుని బాగా తిట్టారుట” అని ఆగి అందరిని చూసాడు.

నేను వెళ్ళేసరికి ఆ పిల్లాడి పేరెంట్స్ అక్కడ అప్పటికే ఉన్నారు. వాళ్ళంతట వాళ్ళే వచ్చి వాళ్ళబ్బాయి చేసినది చెప్పారు.. అప్పటికే కేసు రిజిస్టరు అయిపోవడంతో ఏం చెయ్యలేమని అనేసారు. నేను వెళ్ళేసరికి వీళ్ళంతా నా చుట్టూ చేరి, ఆ ఇంటరు చదువుతున్న ఆ పిల్లాడి మీద జాలి చూపించమన్నారు. ఆ పిల్లాడి భవిష్యత్తు ఏంటని, తప్పయిపోయింది క్షమించమని కళ్ళ నీళ్ళు పెట్టుకున్నారు.

నేను వెంటనే అనేసాను, మీ పిల్లాడి నిర్లక్ష్యం ఓ మనిషి చావుబతుకుల మధ్య ఆపరేషన్ థియేటరులో యుద్ధం చేస్తున్నాడు. నాకేం తెలీదు శిక్షపడాల్సిందే అని అన్నాను. ఏ హాస్పటల్ అని అడిగారు. చెప్పాను. రాధని అడగడానికి వస్తారేమో….” అని అన్నాడు.

రాధ ఏం మాట్లాడలేదు.కళ్ళు మూసుకుని ఉంది. అందరూ రాధనే చూస్తున్నారు.

“క్షమించకూడదు. రాధా నువ్వు జాలి చూపించకు… ఆ పిల్లాడికి శిక్ష పడాల్సిందే…. అప్పుడు కానీ ఆ పెద్దవాళ్ళకి తెలీదు వాళ్ళు ఎంత నేరం చేసారో అని.

ఈ బెయిలూ, ఫైను కట్టడం అనేవి పెద్ద శిక్షలోకి రాదు. ఇలా కట్టేసి అలా వెళ్ళిపోతారు. అదేదో స్కూలు ఫీజు కట్టినంత సులభంగా. శిక్ష అంటే కఠినంగా ఉండాలి. మరోసారి వాళ్ళు ఇలాంటి ఘోరాలు చెయ్యడానికి భయపడాలి.. పిల్లలకి వాహనాలు ఇంక చస్తే ఇవ్వరు. వాళ్ళు ఇవాళ ఏదో ఓ సమయానికి వస్తారు, ఎంతో కొంత డబ్బిచ్చేస్తారు. చేతులు దులిపేసుకుంటారు. వాళ్ళ బాధ్యత అయిపోయిందనుకుంటారు. మనం ఇలాంటి దానికి ఒప్పుకోకూడదు. చదువుకున్న వాళ్ళం న్యాయపరంగా వెళ్దాం. కాంపన్సేషన్ మాటెత్తకు……”.

“ఈ సమయంలో ఇలాంటి మాటలెందుకూ… నేనేం మాట్లాడే స్థితిలో లేను. నన్ను వదిలేయండి,ప్లీజ్….”

“అవును తను ఇప్పుడేం మాట్లాడుతుంది. రాధని ఒంటరిగా ఉండనీ. ప్రస్తుతం ఈ టాపిక్‌ని వదిలేద్దాం.”

“అసలు ఈ మాటలు వినడానికే చాలా బాధగా ఉంది. ఇలాంటి హిట్ అండ్ రన్ కేసులన్నీ ఇంతేనా ఇలాగే… ఈ కాంపన్సేషన్‌తోనే ముగుస్తాయా. డబ్బులు ఇవ్వడం పుచ్చుకోవడం ఒక్కటే పరిష్కారమా… నిజానికి మనకి చట్టాలున్నాయి, కోర్టులున్నాయి, కానీ మనం ఉపయోగించుకోలేకపోతున్నాము. ఇప్పుడేం చెయ్యాలి. ఏం చూడాలి న్యాయమా… మానవత్వమా… ఏ కోణంలోంచి చూసి తీర్పు ఇవ్వాలి…..”.

“ఆ పిల్లాడిని అరెస్ట్ చేయిస్తే మాధవ్ తిరిగొస్తాడా.. నేను ఇవేవి వినలేను.. నాకు పిచ్చి పట్టేట్లుంది” అని రెండు చేతుల్ని చెంపలకి ఆనించుకుంటూ చెవులు మూసుకుంది. టైము చూసింది. ఆరు దాటింది. ఆపరేషన్ చేస్తున్నారో లేదో తెలీదు.

ఆ వెంటనే రాధ లేచి, ఆపరేషన్ థియేటరు వైపు వెళ్ళింది. అక్కడంతా నిశ్శబ్ధంగా ఉంది. ఆ పక్కనే ఓ రూం ఉంది. తలుపులు మూసి ఉన్నాయి. పైన గాజు, కింద తెల్లటి చెక్కతో చేసిన తలుపు అది. పైన గాజు లోంచి చూసింది. ఓ ఇద్దరు అమ్మాయిలు, థియేటర్ డ్రెస్‌లో ఉన్నారు కళ్ళు మాత్రం కనిపిస్తున్నాయి.. వాళ్ళు అన్నీ ట్రేల్లో సద్దుతున్నారు. అక్కడి నుంచి థియేటర్‌లోకి దారి ఉంది. అది కనిపిస్తోంది. మెల్లిగా తలుపు తోసింది. తలని మాత్రం లోపలికి పెట్టింది. అలికిడికి ఆ ఇద్దరూ కూడా రాధని చూసారు. డాక్టరు వచ్చారా అన్నట్లుగా చేతులతో సైగ చేసింది. కళ్ళతోనే వచ్చారు అన్నట్లు తల ఊపారు. హమ్మయ్య అనుకుంటూ బయటికి వచ్చి కూచుంది

అంతలో డాక్టరు వచ్చారు. “మీరు పేషెంటు వైఫ్ కదా.. ఈ కాయితాల మీద సంతకం పెట్టండి” అని కాయతాలని రాధ ముందుంచారు. సంతకం ఎక్కడ పెట్టాలో చూపించి, పెట్టించుకున్నారు.

“ఆఫీసులో డబ్బు కట్టేయండి” అని వెళ్తూ వెళ్తూ చెప్పి వెళ్ళాడు….

“రాగానే కట్టినట్టున్నాము కదా” అని మెల్లిగా తనలో తనే అనుకుంటున్నట్లుగా అన్నాడు ప్రశాంత్.

“డాక్టర్, ఒక్కనిమిషం. ఎంత కట్టాలి” అని అడిగింది రాధ.

“అక్కడ ఆఫీసులో కనుక్కోండి….. అక్కడ వాళ్ళు చెప్తారు…..” అంటూ వెళ్ళిపోయాడు

అదే విషయాన్ని వాళ్ళు వెయిటింగ్ హాలులో కూచున్నవాళ్ళ దగ్గరికి వచ్చి చెప్పారు..

“ఈ కార్పొరేటు ఆసుపత్రులన్నీ అంతే. అన్నింటికీ డబ్బుతో ముడి పెడతారు. ఇప్పుడు చూడు, డబ్బు కట్టి రమ్మన్నాడు. అక్కడ ఉదయం డబ్బు కట్టాకే, లోపలికి రానిచ్చారు. ఇప్పుడు ఇక్కడ డబ్బు కట్టాకే ఆపరేషన్ చేస్తారు…. కట్టక పోతే చెయ్యరా. అంతే.. ముందు డబ్బు, ఆ తరవాతే ఆపరేషన్….”

“అనుకోడానికి లేదు. ఇంత స్టాఫ్‌ని మెయిన్‌టెయిన్ చెయ్యాలి కదా, స్పెషలిస్ట్ డాక్టర్లు, ఏసీ గదులు ఖరీదైన మెషినరీ.. ఎఫీషియెంటు స్టాఫ్, నీటుగా ఉంచడం…. అన్నింటిని మెయిన్‌టెయిన్ చెయ్యాలి, వీటికి డబ్బు ఎక్కడినుంచి వస్తుంది….. మన దగ్గరి నుంచే కదా తీసుకునేది……”

“ఏదయితేనేం మనం ఇప్పుడు కట్టాలి….. పూర్తిగా కాకపోయినా సగం ఇచ్చినా, చేసేస్తారు.ఆ తరవాత మిగిలింది….. ఇప్పుడు మనం ఆఫీసులో తెలుసుకోవాలి, ఎంత కట్టాలి” అని వరుణ్ లేచి వెళ్ళబోయాడు

“వరుణ్ ఇదిగో ఈ డబ్బు తీసుకెళ్ళు” అంటూ బాగ్ తీసింది రాధ.

రాధ లేచి వరుణ్ దగ్గరికి వెళ్ళి, అంతకు ముందు ఏటిఎం నుంచి తెచ్చిన డబ్బు వరుణ్ చేతిలో ఉంచింది.

మరో పది నిమిషాలకి డాక్టరు వచ్చారు. వస్తూనే రాధని చూస్తూ అడిగాడు “డబ్బు కట్టారా……” అని,

“సగం కట్టాం” అని అన్నాడు వరుణ్… అతను ఓ సారి అందరిని చూసాడు.

“సరే, మిగిలింది తరవాత కట్టేసేయండి…. ఎందుకంటే ఆపరేషన్ మామూలుది కాదు పెద్ద ఆపరేషన్. మగ్గురు న్యూరో సర్జన్‌లని పిలిపించాం. న్యూరో ఫిజీషియన్. అది కాకుండా మత్తు మందు ఇచ్చిన డాక్టరు కూడా ఉన్నారు.. అందరూ స్పెషలిస్టులే……”.

“తప్పకుండా కట్టేస్తాం… మీరు మాత్రం…. ఎంత డబ్బైనా తీసుకోండి, పరవాలేదు, అతడిని ఎలాగైనా బతికించండి….” అంది రాధ.

“మా ప్రయత్నంలో లోపం ఉండదు…. మీకు తెలుసో లేదో, మేము ప్రతీ సారీ థియేటరుకి రాగానే దేవుడికి దండం పెట్టుకుంటాం. ప్రతీ ఆపరేషన్ మాకు ఓ పరీక్ష.. పరీక్షకి తయారైనట్లే మేము కూడా ప్రార్థన చేసి తయారవుతాం…. ఆ తరవాతే థియేటరు డ్రెస్ వేసుకుంటాం. మీరు ధైర్యంగా ఉండండి..” అంటూ వెళ్ళిపోయాడు.

అందరూ రాధని చూసారు.

“ఆ డాక్టరు మనకి ఓ దేవుడు. అతని మీద ఆధారపడ్డాం. అన్నీ అతని చేతుల్లో ఉన్నాయి” అంది రాధ.

 “ఏఁవిటో మనం డాక్టర్లతో ఎంతో దీనంగా మాట్లాడుతాం. ఎలాగైనా సరే… ఎంత డబ్బైనా సరే…. బతికించండి అని అంటాం… రాధా నిన్ను అనడంలేదు. జనరల్‌గా మనం అందరం అంతే….. మనకి వాళ్ళ మీద అంత నమ్మకం, వాళ్ళ కాండక్ట్ మీద, వాళ్ళ అనుభవం మీద, వాళ్ళ వయసు మీద నమ్మకం అంతే…. అది మన సంస్కృతి అనుకో సంస్కారం అనుకో. మనకి వీళ్లని గౌరవించడం మాత్రమే తెలుసు…. ఎలా అయినా బతికించండి అని జాలిగా అడుగుతాం..” అని ప్రశాంత్ అన్నాడు.

“ఎందుకంటే అక్కడ మనముందు కనిపిస్తున్నది, ప్రమాద స్థితిలో ఉన్న మన మనిషి. ఆ టైములో ఎవరైనా అంతే అలాగే మాట్లాడుతారు. ఇప్పుడు మనకి మాధవ్ ప్రాణాలు ముఖ్యం, దాన్ని కాపాడగలిగేది డాక్టరొక్కరే. అందుకే అన్నింటిని ఓ పక్కకి పెట్టేసి, ప్రాధేయపడడం.”

“తల బరువుగా ఉంది. కాస్త కాఫీ తాగితే కొంచెం తగ్గుతుందేమో…..”అంది సౌమ్య

అందరూ మరోసారి కాఫీలు తాగడానికి లేచారు. రాధ కదల్లేదు.

“రాధా, ఏం పరవాలేదు. నాకు మాత్రం చాలా ధైర్యంగా ఉంది. లోపల ఒకరు కాదు ఇద్దరు కాదు, నలుగురు డాక్టర్లున్నారు. అన్నీ అందించడానికి ముగ్గురు నర్సులున్నారు. అందరూ ఎఫీషియెంట్. నాకు నమ్మకం ఉంది, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మాధవ్ సేఫ్ హాండ్స్‌లో ఉన్నాడు…. రా….. కాస్త కాఫీ తాగి వద్దాం….” అని సౌమ్య రాధ చేయి పట్టుకుంది.

 ఆ మాటతో ధైర్యం అందరిలో ఒక్కసారిగా వచ్చేసింది. అంతా బాగానే ఉన్నట్లుగా అనిపిస్తోంది. మెల్లిగా బయటికి నడిచారు. గేటుకి అవతల ఓ ఉడిపి హోటలుంది. అందరూ అందులో టిఫిన్ కాఫీ తీసుకున్నారు.

 రాధ కూడా కొంచెం తేరుకుంది. మామూలుగా అయింది. మధ్య మధ్య ఏదో ఒకటీ అర మాట్లాడుతోంది. జవాబులిస్తోంది. కాఫీ తాగేసరికి అందరూ మామూలైపోయారు. ఆఫీసు విషయాలు దొల్లుతున్నాయి. కబుర్లు చెప్పుకుంటూ హాస్పటల్ లోపలికి వచ్చారు. రిసెప్షన్ హాల్లోంచి, నడుచుకుంటూ థియేటరుకి కొంచెం దూరంగా ఉన్నవెయిటింగ్ హాలు దగ్గరికి వచ్చారు. వస్తూనే వాళ్ళకి అక్కడ కూచున్న ఓ జంటని చూసారు. వాళ్ళ వయసు అరవై పైనే ఉంటుంది.

ఓ పెద్దావిడ, ఆవిడ పక్కన ఓ పెద్ద మనిషి కూచుని ఉన్నారు.. ఆవిడ వీళ్ళు రావడం చూసింది, రాధ ఆమెని గుర్తు పట్టింది. ఆమె మాధవ్ తల్లి, సుందరి. ఆమెని చూడగానే రాధకి ఒక్కసారి దుఃఖం వచ్చేసింది. ఆమె దగ్గరికి వెళ్ళి కూచునేంత చనువు లేదు, ఆ చనువు ఆమె ఏనాడూ ఇవ్వలేదు. దగ్గరికి తీసుకుని తన ఇంటి కోడలిగా ఆహ్వానించలేదు. ఇంటికి తీసుకుని వెళ్ళలేదు. అంతగా అవమానించిన మనిషి ఇప్పుడు ఎదురుగా ఉంది. కాని ఆమెకి ఈ క్షణాన అవి ఏవీ గుర్తులేదు. అన్నీ మరిచిపోయింది. ఆమె మాధవ్ తల్లి. మాధవ్‌కి కావలసిన వ్యక్తి, తనకి కూడా కావలసిన మనిషే అంతే.

అందుకే వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళింది. ఆమె నిర్వికారంగా కళ్ళెత్తి రాధని చూసి, వెంటనే తల తిప్పుకుంది. రాధకి ఎంతో బాధ కలిగింది. తమ మధ్య దూరం ఏం తగ్గలేదు. ఇప్పుడు ఇంకా ఎక్కవైంది. ఏం చేయాలో తెలీక మొహం కప్పుకుంది. సౌమ్య గబుక్కున వచ్చి,తన రెండు చేతులతో రాధ రెండు భుజాలని పట్టుకుని సుందరి పక్కన కూచోపెట్టింది. ఆమె అడగకపోయినా సౌమ్య ప్రమాదం ఎలా జరిగిందో చెప్పింది అంతా వినింది.. ఆవిడ కళ్ళు తుడుచుకుంది.

“వద్దన్నా వినకుండా ఈ పెళ్ళి చేసుకున్నాడు….ఏం సుఖపడ్డాడు? అప్పుడో రకంగా ఏడిపించాడు, ఇప్పుడు ఏకంగా కడుపు కోతే మిగిల్చాడు….”.

ఆమె రాధ వినాలని అందా..! బాధతో అందా..! ఏదైతేనేం రాధ మాత్రం వినింది. అందుకే వెంటనే లేచింది. అక్కడి నుంచి వెళ్ళి ఓ కుర్చీలో గబుక్కున కూచుండిపోయింది, వెంటనే అక్కడున్న అందరూ రాధ వెనకే వెళ్ళి, ఏడుస్తున్న ఆమెని ఓదారుస్తున్నారు..

నిస్సహాయంగా, ఓ చిన్న ఓదార్పు మాట కోసం తన వాళ్ళ దగ్గరనుంచి ఎదురు చూస్తున్న ఓ అమ్మాయితో సాటి స్త్రీగా మంచిగా మాట్లాడచ్చు, కానీ ఆమె ఓ మామూలు మనిషి లాగా కూడా చూడలేకపోయింది. లోపల ఎలా ఉన్నా పైకి కూడా చూపించగలిగే సంస్కారం లేకపోయింది…… రాధ ప్రెగ్నెంటని ఈమెకి తెలీకపోవచ్చు. ఒకవేళ తెలిస్తే… ఆమె వైఖరి మారచ్చేమో….. చెప్తే…. రాధకి తెలీకుండా ఏం మాట్లాడకూడదు..

“ఆపరేషన్ మొదలు పెట్టారా…….” చాలా మెల్లిగా అంది… అందరూ అటువైపు చూసారు. ఆమె సుందరి. రాధా వాళ్ళ దగ్గరికి వచ్చి నుంచుంది.

ఒక్కసారి అందరూ ఆమెని చూసారు.. ఆమె మొహం, కళ్ళు వాచి ఉన్నాయి. ఎంతైనా తల్లి తల్లే. బాధ ఉంటుంది. రాధ కన్నా ఎక్కవే ఉంటుంది. ఎందుకంటే ఓ ఇరవైఎనిమిది ఏళ్ళు ఎంతో దగ్గరగా గడిపిన మనిషి. ఇలా హటాత్తుగా ఇలాంటి విషయం వినేసరికి బాధే.

“ఇంకా లేదు, ఆఫీసులో డబ్బు కట్టమన్నారు, కట్టడం అయింది. రక్తం కావాలన్నారు. మా ఎవరి గ్రూపులు సరిపోలేదు. బ్లడ్ బేంకు నుంచి నాలుగు యూనిట్‌లు రక్తం తెప్పిస్తున్నామని అన్నారు. సరే అన్నాం. ఉదయం ఆరు గంటలకి యాక్సిడెంట్ జరిగితే…. ఇప్పుడు ఆరవుతోంది. ఓ అరగంట క్రితమే ఎనస్తీషియా ఇచ్చే డాక్టరు వచ్చి మత్తు మందు ఇచ్చి వెళ్ళారు. న్యూరోసర్జన్లు, ఫిజీషియన్ కూడా రెడీగా ఉన్నారు.. ఇంక మొదలు పెడ్తారు అని అనుకుందాం.”

“ఎలా ఉన్నాడని అంటున్నారు.”

“ఎమ్మారై చూసాక డాక్టరు కష్టం అనే అన్నారు. అయినా ఆపరేషన్ చేస్తాం కాని,. సక్సెస్ గ్యారంటి ఇవ్వడం కష్టం” అని కూడా అన్నారు.

ఆమె అక్కడినుంచి వెళ్ళిపోయింది. అంతవరకూ కొంచెం దూరంలో కూచుని ఉన్న అతను లేచి ఆమె వైపుగా నడిచి వచ్చాడు. ఇద్దరూ ఏదో మాట్లాడుకున్నారు. ఆ తరవాత బయటికి వెళ్ళారు.

మరో అరగంట తరవాత వాళ్ళిద్దరూ వచ్చారు. వస్తూనే రాధ దగ్గరికి వచ్చారు.

“ఆపరేషన్‌కి ఎంతవుతుందో తెలీదు. ఇప్పటికిది తీసుకోండి. వాడి మీద కోపం ఉండేది. కాని,ఈ సమయాన అవేం లేదు. ఎంత కాదనుకున్నా మాధవ్ మా అబ్బాయి. ఈ క్షణాన వాడు చావు బతుకుల మధ్య ఉన్నాడు. మా వంతుగా ఈ మాత్రం సాయం చేయచ్చుఅని అనుకున్నాం… ఇందులో యాభై వేలున్నాయి..” అని ఓ చేతి రుమాలుతో ఉన్నచిన్న పాకెట్ ఇచ్చింది.

అందరూ బొమ్మల్లా నుంచుండిపోయారు. ఎవరికీ నోట మాట రాలేదు. రాధ చేయి చాపలేదు. అది తీసుకోలేదు. ఆమె మరోసారి అడగలేదు. అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ వెంటనే ఆమెతో వచ్చిన మనిషి డబ్బు తీసుకుని వచ్చాడు

“నేను మాధవ్ తండ్రిని. నా పేరు అంజన్ కుమార్.. ఇన్ని ఏళ్ళూ వాడిని చూసాం, చేసాం. ఇరవై ఎనిమిదేళ్ళు పెంచి పెద్ద చేసాం. ప్రతీ తండ్రి చేస్తాడు ఇందులో మీ గొప్ప ఏం ఉంది అని అనుకోవచ్చు, మా బాధ్యతగా చెయ్యాలి కాబట్టి చేసాం అని అనుకోవచ్చు. ఈ లోకంలోకి తీసుకోచ్చినందుకు మా బాధ్యత. పెళ్ళి కూడా మా బాధ్యతే అని అనుకున్నాం. వాడి మనసు తెలుసుకోలేదు. అది ఒకటి ఉందని కూడా అనుకోలేదు. అందుకని మా బంధువుల్లో అమ్మాయినే చూసాం. కాని ఆ తరవాత అర్థం అయింది, వాడి పెళ్ళి వాడిష్టం అని. మా ఇష్టాలేం లేవు అని. పెద్ద వాళ్ళ కోపం చిచ్చుబుడ్డి లాంటిది. కాని దాన్ని మా అహంకారం కప్పేసింది. ఇప్పుడు ఈ సమయంలో కూడా ఆ అహంకారాన్ని చూపించదలుచుకోలేదు. కనీసం ఇప్పుడైనా, మామూలు తండ్రిగా నా ఈ బాధ్యతగా నన్ను నిర్వర్తించనీయండి” అని అన్నాడు. గొంతులో దుఃఖాన్ని దిగమింగుకున్నట్లుగా ఉన్నాయి మాటలు.

అతని మాటలకి అందరి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అతను అందించిన డబ్బుని రాధ తీసుకుంటూ అంది ‘థాంక్యూ’ అని.

అతను వెళ్ళిపోయాడు.

“మీ పేరెంట్స్ వచ్చారా! వస్తామని ఏమైనా మెసేజ్ ఇచ్చారా!”

దుఃఖాన్ని దిగమింగుకుంది, లేదన్నట్లు తల ఊపింది. వస్తారో లేదో కూడా తెలీదు. వస్తే బావుంటుంది. మనసు ఆమె ముందు పరిచేయాలి. కాని, రావడం అనుమానమే. ఇన్నేళ్ళ ఈ పేగు బందానికి అర్థం లేదా… ఈ బంధాలు ఇలా సన్నటి నూలు పోగుల్లా ఉండి పోయాయేంటీ…

హటాత్తుగా వెలుగు మాయమయి పోయింది.. ఆకాశం అంతా నల్లటి సిరా పూసినట్లుగా ఉంది. దట్టంగా సుళ్ళు తిరుగుతున్న మేఘాలు హడావుడిగా అటూ ఇటు పరిగెడుతున్నాయి. చీకటి బాగా పడి పోవడంతో అన్నీ లైట్లు కారిడార్‌లో వేయడంతో అర్ధరాత్రిలాగా అనిపిస్తోంది. వర్షం సన్నగా పడుతోంది. లోపల ఆపరేషనుకి తయారు చేస్తున్నారు. అంతలో మరో ఇద్దరు డాక్టర్లు లోపలికి వెళ్ళారు.

“మొత్తం ఆరు మంది డాక్టర్లున్నారు. అందరిని పిలిచారు. పాపం అందరూ కూడా పిలిచిన వెంటనే వచ్చేసారు…. మాధవ్‌ని బతికించడానికి సన్నాహం జరిగింది. ఇంక ఆపైన దేవుడున్నాడు”

ఆపరేషన్ థియేటరు ముందు ఓ పది మంది దాకా ఉన్నారు. అయినా నిశ్శబ్ధం… అందరి దృష్టి మూసిన తలుపులవైపే ఉన్నాయి.

మాధవ్ ఆ తలుపుల వెనకాల ఉన్నాడు. తన జీవితాన్ని, డాక్టర్ల చేతుల్లో పెట్టేసాడు. ఇప్పుడు తన జీవితం, మాధవ్ జీవితం ఇద్దరి జీవితాలు, విధి చేతుల్లో ఉన్నాయి. విధి ఈ గమ్యానికి తీసుకొచ్చింది. ఇప్పుడు జీవితం నలిగిపోయిన మడతలు పడిన కాగితంలా అయింది. ఒక్కొక్క మడత విప్పుకుంటూ వెళ్ళాలి.

“దేవుడా నా మాధవ్‌ని బతికించు. నాకు జీవితంలో ఉన్నది తనొక్కడే…. పెళ్ళి మా ఇద్దరిని కలిపింది,ఈ యాక్సిడెంట్ వేరు చేయకూడదు. నాకు ఎవరూ లేరు. మేం ఇద్దరం కూడా మావాళ్ళకి దూరం అయ్యాం”..

కళ్ళు మూసుకున్న అమె ఒక్కసారి కళ్ళు తెరిచింది. రెఫ్ఫల చివర జారని కన్నీటి చుక్కలు భావి జీవితాన్ని చూపిస్తున్నాయి. అది అగమ్యంగా, మసక మసకగా కనిపిస్తోంది. మాధవ్ తన దారి తాను చూసుకుంటాడా….!

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here