సీరియల్ భయం!

2
4

[dropcap]టి.[/dropcap]వి.లో ‘భయం….భయం….’ సీరియల్ సీరియస్‌గా చూస్తోంది అయిదేళ్ళ శిరీష వాళ్ళమ్మ జయంతితో కలిసి.

‘ఈరోజు అటో ఇటో తేలిపోవాల! మర్నాడు ఆడు నా కంటికి కనబడకూడదు. ఏం చేస్తావో చెయ్యి. ఇదిగో లక్షరూపాయలు. పనయ్యాక ఇంకో లక్ష. మన సేతికి మట్టంట కూడదు. ఎళ్ళు. పని గానీ.’

బొర్రమీసాల వాడు. బుగ్గన పెద్ద పుట్టుమచ్చ. గళ్ళలుంగీ. చుట్టూ నల్లటి బెల్టు. బట్టతల. లావుగా చూడటానికి భయంకరంగా, చిన్నపిల్లలు జడుసుకునేలా వున్నాడు. వాడి చేతిలో పెద్ద లావుపాటి కత్తి వుంది. రాత్రి అందరూ పడుకున్నారు. నిశ్శబ్దంగా వుంది. చిన్న బెడ్ లైట్ వెలుతురులో నెమ్మదిగా ఆ యింటి యజమాని మంచం దగ్గిరకి వచ్చాడు. ఆయన మంచి నిద్రలో వున్నాడు. వాడు కత్తి పైకి లేపాడు. ఆయనను గట్టిగా పొడవబోతుంటే….

కరెంటు పోయింది!

‘ఏమే! ఇంకా పడుకోలేదా జయంతీ? పదవుతోంది. ఎల్లుండేగా మీ బాబాయి కూతురి పెళ్ళి? ఉదయమే మనం ట్రెయిన్‌కి బయలుదేరాలి. బట్టలవీ సర్దావా? ఆ చెత్త సీరియల్సు నువు చూస్తున్నదే కాక పిల్లక్కూడా చూపిస్తావు. అదేమో పీడకల వచ్చిందంటూ నిద్దట్లో లేచి భయంతో కెవ్వున అరుస్తుంది. మళ్ళీ పొద్దున్న లేవాలి. కరెంటు పోతే గాని టి.వి. సీరియల్స్ చూడడం ఆపవు. శిరీ! రామ్మా, పడుకుందాం. మళ్ళీ ఉదయమే లేవాలి.’ అన్నాడు తండ్రి శేఖరం.

***

మర్నాడు రాత్రి పెళ్ళివారింట్లో బయట చిన్నగది వద్ద తలుపు చాటు నుంచి కళ్ళప్పగించి భయం భయంగా చూస్తోంది శిరీష.

అచ్చం రాత్రి సీరియల్‌లో చూసిన వాడిలాగే నల్లగా, లావుగా, బుర్రమీసాలు, బుగ్గన నల్లటి మచ్చ, గళ్ళలుంగీ, నల్లబెల్టుతో వున్న సీరియల్‌లో చూసిన అబ్బాయి క్రూరంగా చూస్తున్నాడు. ఆ సీరియలబ్బాయి ఇక్కడెందుకున్నాడో అనుకుంటూ ఏం చేస్తాడా అని భయంగా చూస్తోంది శిరీష. ఒక పక్క మంచం మీద ఎవరో పడుకున్నారు. ‘అమ్మో! ఆ పడుకున్న అబ్బాయిని కత్తితో పొడుస్తాడా?’

ఆ బుర్రమీసాలతను ఇంకో చిన్నబ్బాయితో చెబుతున్నాడు, ‘అదిగో, అక్కడున్న ఆ పెద్దకత్తిలా పట్రా. పదునుందా? దీని సిగ తరగ! ఇయ్యాల అటో ఇటో తేలిపోవాల! నాల్రోజుల మట్టి అమ్మగారు సెబుతావుండారు. అలాగే వస్తా అన్నాను. కత్తికి పదును లేదని రాలేదు. ఇయ్యాల కుదిరింది.’

శిరీషకి భయం ఎక్కువయింది. అచ్చం రాత్రి సీరియల్ లో చూసినట్టుగానే చేస్తున్నాడు వీడు కూడా. ఆ మంచం మీద పడుకున్న అబ్బాయిని ఏం చేస్తాడా అని భయంగా, ఆత్రంగా చూస్తోంది….. చూస్తోంది. రాత్రి సీరియల్‌లో ఇలా చూస్తుంటేనే కరెంటు పోయింది. ఆఖరికేమయిందో తెలీదు.

ఇదుగో, ఇప్పుడు ఈ నల్లబ్బాయి కూడా ఒక్క దెబ్బకి అయిపోవాలంటూ, పెద్దకత్తితో ఒక్కటేసాడు.

‘అమ్మా!’ అంటూ భయంతో అరిచింది శిరీష. ఆ అరుపు విని ఏదన్నా కరెంటు షాకేమో అనుకుని మెట్లమీంచి వస్తూ శిరీష ఇరవయి ఏళ్ళ మావయ్య వాసు మెయిన్ ఆఫ్ చేసాడు.

హాయిగా ఓపక్క నిదరోతున్న పెంపుడుకుక్క ఎవరో కొత్తవాళ్ళొచ్చారనుకుని ‘భౌ…భౌ…భౌ…’ అంటూ వాళ్ళ మీద అరవటానికి వీధిగుమ్మం వైపు వెళ్ళింది.

మెట్లకింద తన పిల్లలకి పాలిస్తూ హాయిగా పడుకున్న తల్లిపిల్లి కంగారుగా తన పిల్లల మీదకెవరన్నా వస్తున్నారేమో అనుకుని ‘మ్యావ్… మ్యావ్….’ అంటూ అరుస్తూ చుట్టూ చూసి, ‘ఏం లేదులే’ అనుకుని మళ్ళీ పిల్లల దగ్గరకెళ్ళి పడుకుంది.

పక్కనే కుళాయి దగ్గర పెళ్ళికి వంటగిన్నెలు కడుగుతున్న పనమ్మాయి కంగారుగా పరిగెత్తుకు వచ్చింది, ‘ఏటయినాది మావా? చెయ్యిగాని తెగ్గోసుకున్నావా? అంటూ.

పెళ్ళిపనుల హడావిడిలో వున్న శిరీష అమ్మమ్మ ఏమయిందో అనుకుని కంగారుగా వస్తూ చీకట్లో కాలు జారి పడింది.

‘ఏమర్రా! కరెంటు పోయింది. టార్చ్ లైటు కొంచెం ఇలా పట్రండి. కొవ్వొత్తులెక్కడో పెట్టాను’ అని అరిచింది జయంతి పిన్ని.

‘కరెంటు పోలేదు పిన్నీ. వాసుగాడు ఆ అరుపు విని ఎవరికన్నా కరెంటు షాకు కొట్టిందేమో అనుకుని మెయిన్ ఆఫ్ చేసివుంటాడు.’

‘హు, వీడొకడు! మొన్న తన ఫ్రెండుకి షాక్ కొట్టిందట. అప్పట్నించీ వీడికిదో భయం. ఎవరైనా అరుస్తే మెయిన్ ఆఫ్ చేస్తాడు. ఒరేయ్ వాసూ! ఎవరికీ కరెంట్ షాక్ కొట్టలేదు గాని ముందర మెయిన్ ఆన్ చెయ్యరా నాయనా!’ అంటూ తాతగారు అరిచారు.

వాసు మెయిన్ స్విచ్ ఆన్ చేసాడు.

‘ఏమే శిరీషా! నువ్విక్కడున్నావా? పిల్లలందరూ అక్కడ ఆడుకుంటూంటే నువ్విక్కడేం చేస్తున్నావు? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నా. ఎందుకంత గట్టిగా అరిచావు?’ అడిగింది తల్లి.

‘అదుగో, రాత్రి సీరియల్లో అబ్బాయి కత్తితో చంపుదామని చూస్తుంటే భయమేసి అరిచాను. నిన్న సీరియల్లో లాగే ఇక్కడా కరెంటు పోయింది.’

‘శిరీ! ఆ భయం గొలిపే హింసాత్మక చెత్త సీరియల్సు చూడకే తల్లీ అంటే వినవు కదా? మీ అమ్మ పడుకుంటే గాని పడుకోకుండా, ఇద్దరూ కలిసి ఆ సీరియల్సన్నీ చూడడం…. ఎవరి చేతిలోనో దిండు గాని, పాలగ్లాసు గాని, కత్తి గాని కనిపిస్తే చంపేస్తారని భయం!’ అంటూ తండ్రి కూతుర్ని ఎత్తుకుని వీపు నిమురుతూ, ‘భయపడకు. సీరియల్లో వాడు విలనబ్బాయయినా నిజంగా విలన్ కాదు. అదంతా నటన. ఇతనూ విలను కాడు. రేపు భోజనాలకి పనసపొట్టు కొడుతున్నాడు. చూడు కావాలంటే.’ అన్నాడు.

శిరీష అటు తిరిగి చూసేసరికి, గంగులు తనకేమీ పట్టనట్టు పనసకాయ సగానికి నరికి, చెక్కు తీసి, కత్తితో పీట మీద టకటకా పనసపొట్టు సన్నగా తరుగుతున్నాడు.

గమ్మున శిరీష తండ్రి చంక దిగి గంగులు దగ్గరకెళ్ళి, ‘నువ్వు సీరియల్లో అబ్బాయివి కాదా? మంచబ్బాయివేనా?’ అని అడిగింది.

‘కాదు చిట్టితల్లీ! పనసపొట్టు కొట్టడానికొచ్చినా. నన్నూ, నా అవతారాన్నీ చూసి భయమేసి అరిచినావా? అందరూ కంగారుగా పరిగెత్తుకొచ్చినారు.’

‘ఐతే ఆ మంచం మీద పడుకున్నా అబ్బాయెవరు?’ అనుమానంగా అడిగింది శిరీష.

‘ఆడు మా కొడుకు. నిన్న ఇయ్యాల పెల్లి పనులు సేసి పడుకున్నాడు.’

‘ఆ కత్తి తెచ్చిన అబ్బాయెవరు?’

‘ఈడు నా సిన్నకొడుకు. ఎనిమిదో కళాసు సదువుతున్నాడు. ఇస్కూలుకి ఇయ్యేల సెలవే కదాని నాకు తోడు రమ్మన్నాను. అంట్లు తోమే మల్లమ్మ నా పెండ్లాం. పెల్లయ్యేదాకా పన్లు సేయడానికి ఇయ్యేల కాడినించి ఈ గదిలో వుండమన్నారు అమ్మగారు.’

అప్పుడు శిరీషకి గంగులంటే భయం పోయింది.

‘అయితే గంగులంకుల్! నువ్వు మంచబ్బాయి కనక నేను నీ ఫ్రెండుని ఈ రోజు నించీ. సరేనా?’

‘అలాగే బంగారూ.’

శిరీష సంతోషంగా నవ్వింది.

‘ఇదుగో అమ్మా, పనసపొట్టు. రేపు డిన్నరుకి జీడిపప్పు, కరేపాకు, వడియాలూ వేసి మాంఛి రుచిగా వండించండి. ఎవరు కొట్టారో, శానా బాగా కొట్టారని అందరూ సంతోసంగా కూరంతా లాగించేస్తారు సూడండి.’

మర్నాడు నిజంగానే పనసపొట్టు కూర బ్రహ్మాండంగా వుందంటూ పెళ్ళివారు చాలా ఇష్టంగా తిన్నారు.

శిరీష కూడా పనసపొట్టు కూరలో జీడిపప్పులు మాత్రమే ఏరుకు తిని, ‘కూర చాలా బాగుంది.’ అంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here