[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం’ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]
[dropcap]అ[/dropcap]నంతుడు తన శరీరాన్ని ఆకాశం, భూమిని ముంచెత్తేంతగా పెంచాడు. అతడిని చూసి దేవతలు, దయ్యాలు భయపడ్డాయి.
శిరస్సున నీలి కిరీటం ధరించి, దేవతలందరూ చూస్తుండగా, అనంతడు తన శరీరాన్ని హిమాలయాల చుట్టూ తిప్పి, పర్వతాలను కదిలించాడు.
దాంతో సతీసరోవరంలోని నీళ్ళన్ని పెద్ద శబ్దంతో, అత్యంత వేగంగా ప్రవహించటం ప్రారంభమైంది. పర్వతాలను ముంచెత్తుతూ, ఆకాశాన్ని తాకే హిమాలయాల చుట్టూ మలుపులు తిరుగుతూ నీరు ప్రవహించింది. ప్రజలంతా భయభ్రాంతులయ్యారు.
నీరు బయటకు వెళ్ళిపోవటం జలోద్భవుడిలో కంగారు పుట్టించింది. అతడి శక్తి నీటిలో ఉన్నంత వరకే. అందుకని తన మాయా శక్తితో జగతినంతా చీకటితో నింపేశాడు. ప్రపంచం అంధకారమయం అయిపోయింది.
జలోద్భవుడి ఆటలను పరమశివుడు గ్రహించాడు.
శంభుస్తదా చంద్ర దివాకరౌ ద్వౌ జగ్రాహ దేవోత్య కరద్వయేన।
ప్రకాశమాసీ జగతో నిభేషాఢ ధ్వస్తం తథా సర్వమయాన్ధకారమ్॥
శివుడు రెండు చేతులతో, చంద్రుడిని, సూర్యుడిని ఎత్తి పట్టుకున్నాడు. దాంతో క్షణ కాలంలో ప్రపంచమంతా వెలుతురు మయమయింది.
జగతి వెలుగు మయవటవంతోటే, అతి చతురుడైన హరి, యోగశక్తి సంపూర్ణంగా గల యోగి శరీరం ధరించాడు. జలోద్భవుడితో యుద్ధానికి దిగాడు. ఈ యుద్ధాన్ని మరో శరీరంతో నిర్భావంగా హరి తిలకిస్తూండి పోయాడు.
విష్ణువుకూ, జలోద్భవుడికీ నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. చివరికి విష్ణువు జలోద్భవుడి శిరస్సును ఖండించాడు.
జలోద్భవుడిని సంహరించటం తోటే దేవతలు, జనులు సంబరాలు చేసుకున్నారు.
బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తాము నిలిచిన మూడు శిఖరాలకు తమ నామాలను ఇచ్చారు.
నౌబంధ శిఖరం యత్తు స వేయ నృప శంకరః।
దక్షిణే చ హరిః పార్శ్వే వామే బ్రహ్మ ప్రకీర్తితః॥
నౌబంధ శిఖరం శంకరుడు. దానికి కుడి వైపున ఉన్నది విష్ణువు. ఎడమవైపున ఉన్నది బ్రహ్మ. విష్ణు పాద స్పర్శతో పవిత్రమైన శిఖరాలివి. ఉత్తర దిశలో బ్రహ్మ ఆశ్రమాన్ని నెలకొల్పాడు. పశ్చిమాన కశ్యపుడు ఆశ్రమాన్ని నెలకొల్పాడు. విష్ణువు పాదాలు మోపిన పర్వతంపై శివుడు ఆశ్రమాన్ని నిర్మించాడు. మరో వైపు విష్ణువు ఆజ్ఞానుసారం అనంతుడు ఆశ్రమాన్ని నెలకొల్పాడు.
మహాదేవుడి ఆశ్రమానికి పశ్చిమాన సూర్యచంద్రులు సుందరమైన ఆశ్రమాలు నిర్మించారు. మహాదేవుడి ఆశ్రమానికి ఒకింట నాలుగు వంతుల యోజనాలు తక్కువ ఒక యోజనం దూరంలో విష్ణువు నరసింహుడిగా ఆశ్రమాన్ని నిర్మించాడు.
బ్రహ్మవిష్ణుమహేశ్వరుల పాదాలతో పవిత్రమై, వారి పేర్లతోనే గుర్తింపు పొందిన ఈ శిఖరాల దర్శనంతోటే పాపాలు నశిస్తాయి. ఎంతటి ఘోర పాపాత్ములైనా ఈ శిఖర దర్శనంతో పవిత్రులవుతారు.
బ్రహ్మవిష్ణుమహేశ్వరులు ఇక్కడ ఆశ్రమాలు నిర్మించుకోవటంతో ప్రపంచం మొత్తం ఈ ప్రాంతం లో నివాసాలు ఏర్పర్చుకునేందుకు తహతహలాడింది.
దాంతో కాశ్మీరం అణువణువూ అతి పవిత్రమై, అత్యద్భుతమై దైవశక్తితో, కళకళలాడింది.
అయితే, జలోద్భవుడి శిరస్సును ఖండించిన సుదర్శన చక్రం, జలోద్భవుడి రక్తం మత్తులో పడి జనశూన్య ప్రదేశాలలో విశృంఖలంగా, గమ్యరహితంగా తిరుగుతుంటే శంకరుడు దాన్ని పట్టుకున్నాడు. దాని విహారాన్ని ఆపాడు.
అది చూసి విష్ణువు నవ్వుతూ శంకరుడి దగ్గరకు వచ్చాడు.
నవ్వుతూ శంకరుడితో అన్నాడు – “ఓ దివ్యాత్మా, నా సుదర్శన చక్రాన్ని నాకు ఇచ్చెయ్యి”.
దానికి సమాధానంగా శంకరుడు నవ్వుతూ, “నీ సుదర్శన చక్రం నాకు దొరికింది కాబట్టి అది నాది. అయితే నీది నీకు ఇవ్వాలంటే నాకో బహుమతి కావాలి” అన్నాడు.
(సశేషం)