[dropcap]ఆ[/dropcap]రంభం నుంచీ సంచికను సర్వాంగ సుందరంగా, సర్వజనామోదకరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ వీలయినంతమంది పాఠకులను అధిక సంఖ్యలో ఆకర్షించాలని సంచిక ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా, ఈ నెల నుంచీ విశాఖదత్తుడు రచించిన ‘ముద్రారాక్షసం’ ప్రతిపదార్థ వ్యాఖ్యాన సహిత తెలుగు అనువాదాన్ని అందిస్తోంది. శ్రీ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ గారు సంచిక కోసం ప్రత్యేకంగా ఈ అనువాదం చేశారు. మన ప్రాచీన వాఙ్మయం గురించి మాట్లాడే వారెక్కువ, చదివిన వారు తక్కువ. అందుకని, అందరూ ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడకుండా తమంతట తామే చదివి తెలుసుకునే వీలు కల్పించాలన్నది సంచిక ఆకాంక్ష.
ముద్రారాక్షసంతో పాటూ ఇతర ప్రాచీన వాఙ్మయానువాదాలనూ అందించాలని సంచిక ప్రయత్నిస్తోంది. మన సాహిత్యాన్ని ఇతరుల దృష్టితో కాక మన దృష్టితో, మన మనస్సుతో మనం చూసే వీలుకల్పించాలన్నది సంచిక అభిలాష. త్వరలో మరిన్ని సంస్కృత కావ్యాల అనువాదాలను సంచిక అందిస్తుంది. మనల్ని మనం తక్కువ చేసుకుంటూ మన పూర్వీకులను విమర్శించే ముందు కనీసం వారి సృజనను తెలుసుకోవాలి. ఈ అనువాదం మీ అందరి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము. ఇంకా ఇతర భాషలలోని పలు విశిష్టమయిన రచనలను తెలుగు పాఠకులకు అందించాలన్నది సంచిక ఆలోచన. ఈ ఆలోచననే ఆహ్వానంగా భావించి రచయితలు తాము మెచ్చిన ఇతర భాషల రచనలను అనువదించి సంచికకు అందించవలసిందిగా ప్రార్ధన.
నిజానికి, కాస్త సంకోచిస్తూనే సంచిక ఒక విషయాన్ని ప్రస్తావిస్తోంది. ఎన్నెన్నో రకరకాల రచనలు, వ్యాసాలు పాఠకులకు అందించాలని సంచిక ప్రయత్నిస్తోంది. కానీ, అడుగడుగునా, నాణ్యమయిన రచయితల కొరత స్పష్టంగా కనిపిస్తోంది. రచయితలు గిరిగీసుకుని తమ తమ నిర్దిష్ట పరిథుల్లో వుండిపోతున్నారు. యువ రచయితలు అరుదయిపోయారు. వున్న యువ రచయితలు ఏదో ఒక ముఠాలో చేరి రాయకుండానే బోలెడంతా రాసిన ఖ్యాతిని పొందటం వైపు దృష్టి సారిస్తున్నారు తప్ప, రచనను తపస్సులా స్వీకరించి సాధన చేసేందుకు సుముఖులుగా లేరు. అందుకే, ఇప్పుడు ప్రతి సందర్భంలో వినపడి, కనపడే యువ రచయితలను చూస్తే, వారి రచనలు వాసి సంగతి అటుంచి, రాశి కూడా భూతద్దంలో వెతికాల్సివస్తుంది. గాడిదను కూడా పదే పదే సింహం అంటే తనను తాను సింహం అనుకుంటూంటే, దాన్ని అందరూ సింహంగా భావిచిన చిన్నపిల్లల కథలను తలపుకు తెస్తోంది యువ రచయితల వ్యవహారం.
ఇది అత్యంతా శోచనీయమైన పరిస్థితి. పేరుపొందిన రచయితలంతా జ్ఞాపకాలు రాసుకునే సంధ్యా వేళలో వుంటే, యువ రచయితలు రంగుల కలల్లో విహరిస్తూంటే, నాణ్యంగా, విభిన్నంగా రచనలు చేసే రచయితల కరువు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంకో పదేళ్ళ తరువాత తెలుగు పత్రికల మనుగడ అటుంచి, నాణ్యమైన రచయితలు లేని దుస్థితిని ఎదుర్కోవాల్సివస్తుందేమోనన్న భయం మనసును పట్టి పీడిస్తోంది.
ఈ పరిస్థితిని మెరుగు పరచేందుకు సంచిక ఆసక్తి వున్న యువ రచయితలనుంచి రచనలను ఆహ్వానిస్తోంది. కథలు, కవితలు, వ్యాసాలు, అభిప్రాయాలు ఏవయినా రాసి పంపించండి. సంచిక వాటిని పరిష్కరించి ప్రచురిస్తుంది. అవసరమయితే, రచనలో మెళకువలు సూచించి విశిష్టమయిన పద్ధతిలో రచనలను సృజించటం నేర్పిస్తుంది. సృజనాత్మక రచనలో నైపుణ్యం అలవరచేందుకు నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టే యోచనలోవుంది సంచిక. ఈ వివరాలు త్వరలో ప్రకటిస్తాము.
సంచిక ఆరంభమయి ఈ ఉగాదికి సంవత్సరం పూర్తవుతుంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఒక పెద్ద సభను నిర్వహించాలని, సంచిక సాహిత్య పురస్కారాన్ని ఇవ్వాలని సంచిక ఆలోచించింది. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో అది అంత సాధ్యమయిన పనిగా అనిపించకపోవటం వల్ల ఆ ఆలోచనను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము. ఇందుకోసం ఖర్చయ్యే ధనాన్ని సైన్యం కోసం ఏర్పాటు చేసిన నిధికి అందించాలని సంచిక సంపాదక వర్గం నిశ్చయించింది. అయితే, ఉగాదికి సంచిక తయారుచేస్తున్న క్రీడాకథల సంకలనం మాత్రం యథాతథంగా అనుకున్నట్టుగానే విడుదలవుతుంది.
ఈ నెల సంచిక మీకోసం ప్రత్యేక శ్రద్ధతో మోసుకువచ్చిన రచనల వివరాలు ఇవి…
సంభాషణం: – శ్రీ మేడిశెట్టి తిరుమల కుమార్ అంతరంగ ఆవిష్కరణ – సంచిక టీమ్
ప్రత్యేక వ్యాసం: విలయ విన్యాసం – కోవెల సంతోష్‍కుమార్
ధారావాహికలు:
ముద్రారాక్షసమ్ – ఇంద్రగంటి శ్రీకాంతశర్మ
నీలమత పురాణం-13- కస్తూరి మురళీకృష్ణ
తమసోమా జ్యోతిర్గమయ – 8- గంటి భానుమతి
అంతరం – 7 – స్వాతీ శ్రీపాద
కాలమ్స్:
రంగులహేల-12- పగలూ – ప్రతీకారాలూ – అల్లూరి గౌరీలక్ష్మి
మానస సంచరరే -14: తోకలేని పిట్ట తోడుగా… – జె. శ్యామల
వ్యాసాలు:
సాంఖ్యము- పరిచయము: ఇ.ఎన్.వి. రవి
మానవ జీవన లక్ష్యం – డా. సమ్మెట విజయ
మరుగున పడ్డ మన సంస్కృతి – మార్గోన్లు – నల్ల భూమయ్య
కథ – మానవసంబంధాలు – ఎం.కె. కుమార్
కథలు:
తలంపు – జొన్నలగడ్డ సౌదామిని
అందుకే దూరం పెరిగింది – గంగాధర్ వడ్లమన్నాటి
నిన్నటిదాకా శిలనైనా – ఆనంద్ వేటూరి
సీరియల్ భయం! – పెయ్యేటి శ్రీదేవి
కవితలు:
వసంతతిలకము – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
దుఃఖం – శ్రీధర్ చౌడారపు
అడవితల్లి ఆవేదన – కొప్పుల ప్రసాద్
సోయి ఉండాలే – సామల కిరణ్
నా కల – ఎస్. కె. జహంగీర్
కలమే నా ఆయుధం – బాల కృష్ణ పట్నాయక్
బాల సంచిక:
బుల్లి పైలట్ – శాఖమూరి శ్రీనివాస్
పుస్తకాలు:
‘సిగ్నల్’ – పుస్తక పరిచయం
కార్టూన్లు:
కెవిఎస్-10
జెఎన్మెమ్-2
ఎప్పటిలాగే సలహాలు సూచనలతో పాఠకులు, రచనలతో రచయితలు సంచికను ప్రోత్సహించాలని అభ్యర్ధిస్తున్నాము.
సంపాదక బృందం