[dropcap]ఒం[/dropcap]టరితనం చుట్టుముట్టేస్తే
మనసు దుఃఖపు దీవిగా మారిపోయింది
దిగులు మేఘాలు అల్లుకొన్న మానసమంతా
అమావాస్య చీకట్లు అలుముకున్నాయి
వీడి వెళ్ళిపోయినవో
పోరాడి దూరం అయినవో
ఓడి ఒదిలేసుకున్నవో ఒడిలోంచి జారిపడినవో
ఏవో ఏవో బంధాలు, ఆత్మీయ అనుబంధాలు
జ్ఞాపకాల గాలానికి గుచ్చుకున్నాయి
గొంతు పంజరంలోని వేదన పక్షి
సన్నసన్నగా రోదన గీతాన్ని ఆలపిస్తుంటే
ఎగిసిపడుతోన్న ఎదుర్రొమ్ము
ఎక్కిళ్ళ తాళం ఎడతెగకుండా వేస్తూపోయింది
కంటి చెలిమలలో దాగి ఉన్న కన్నీరు
అంచులు దాటని తన ప్రకృతిని వీడి
పాయలు పాయలుగా చీలి
చెంపలవాలుల వెంబడి పొంగిపారడం మొదలైంది
గుండెల్లోని దుఃఖపు మంచుకొండ
మెల్లమెల్లగా కరిగి నీరైపోతూ
తన బరువు తనకుతానే దించుకుంటుంటే
తొలగిపోయిన బాధ సేదతీర్చే పిల్లగాలియై
దిగులు మబ్బుల్ని చెదరగొట్టేస్తే
మది నిండా తుఫాను తరువాతి ప్రశాంతత
ఎద అంతా ఎదురుచూసిన నులివెచ్చని ఉష్ణోగ్రత