మనోమాయా జగత్తు-5

0
3

[box type=’note’ fontsize=’16’] పోడూరి కృష్ణకుమారి గారు వ్రాసిన నవల ‘మనోమాయా జగత్తు‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది ఐదవ అధ్యాయం మొదటి భాగం. [/box]

5

[dropcap]గౌ[/dropcap]తమీ ఎక్స్‌ప్రెస్ అందుకోవాలని పెట్టేబేడాతో బయల్దేరిన యోగి ఎక్కిన ఆటో ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కుని పది నిముషాలైంది. అంగుళం కూడా కదల్లేదు. టైమ్ చూసుకుని కంగారు పడి మాత్రం చేసేదేముందని ఇంకేదైనా రూట్లో పోవడానికి కుదురుతుందా అని ఆటోవాలాని ఆడగాలనుకుని అసలు వెనక్కి తిరగడానికి కూడా వీల్లేకుండా ఇరుక్కుపోయాం అని గ్రహించి ఎలా బయటపడడమా అని ఆలోచించాడు. దిక్కుతోచలేదు. ఇక్కడ దిగి నడుచుకుంటూపోయి కాస్త క్లియర్‌గా ఉన్న చోట మరో ఆటో కేచ్ చేద్దామా అని కూడా ఆలోచించాడు. అదీ కుదిరేలా కనిపించిలేదు.

“ఏంటి భాయ్ ముందేమైనా ఏక్సిడెంటా? ఏమయింది?” తన ముందున్న ఆటోలోకి తొంగిచూస్తూ అడిగాడు ఆటోవాలా.

“సిన్మా సూటింగు. సిరంజీవి కొడుకంట ఫైటింగు చేస్తన్నాడు పోయి చూద్దామా?” అన్నాడు కుడిపక్కన ఆగిన ఆటో అబ్బాయ్.

“కాదన్నా ఎదర స్టూడెంట్ల ర్యాలీ. పోలీసులు లాటీ చార్జింగు. మద్దెలో పోతే మనకీ పడతాయ్” అన్నాడు ఎడం పక్కని ఆటోవాలా. చుట్టుపక్కల వాహనాల్లోంచి ఘొల్లున నవ్వులు. ముందున్న ఆటోవాలా వెనక్కి తిరిగి చూస్తూ “అరే ఊర్కోండి భాయ్. ఎదర నీలాంబరీ మాత ఎలక్షన్ కాంపెయినింగ్ చేస్తాంది. కనిపిస్తే దండం పెట్టాలే” అన్నాడు కాస్త భక్తిగా. కాసేపు నిశ్శబ్దంగా చూసారందరూ అందరూ ఆవిడ దర్శనం అవుతుందేమోనని. కాసేపు రాజకీయాలమీద వాహన చోదకుల మధ్య చర్చలు జరిగాయి.

ఇంతలో ఏంబులెన్స్ సైరన్ వినబడింది. “అదిగో చెప్పానా ఏక్సిడెంటనీ?” అన్నాడొకడు.

ఎదురుగా బైక్ తోసుకుంటూ చచ్చీచెడీ దారి చేసుకు వస్తున్నవాడొకడు కనిపించాడు.

“ఏంటి భాయ్ ఏక్సిడెంటేనా?” అడిగారు ఆత్రంగా.

“ఏక్సిడెంటంటే ఏక్సిడెంటూ కాదు. ఒకడెవడో సడెన్‌గా రోడ్డుమధ్యలో పడ్డాడు. ఆడికే వెహికిలూ కొట్టలా. అయినా లేపితే లేవట్లా. చచ్చిపోయాడని ఖంగారు పడ్తున్నారు ట్రాఫిక్ పోలీసోళ్ళంతా. మెంటలాస్పత్రి నించి పారిపోయి వొస్తున్నాడని చెప్పుకుంటున్నారు అక్కడందరూ. ఆ ఆస్పత్రి అంబులెన్సో పక్కనించి, మామూలు నూటెనిమిదో పక్కనించి ఒచ్చిపడ్డాయ్” తనకు తెలిసిన పూర్తి సమాచారాన్నందించాడు బైక్ తోస్తున్నవాడు.

అందరికీ సాధికారికమైన వార్త అందుకున్న తృప్తి కలిగింది. మెంటలాస్పత్రోళ్ళు పేషెంట్లని అస్సలు జాగ్రత్తగా చూడరనీ, పైగా హీనంగా చూస్తారనీ రకరకాల టాపిక్కుల మీద చర్చలు ఉధృతంగా మొదలయ్యాయి.

చుట్టుపక్కల సంభాషణ యథాలాపంగా వింటున్న యోగికి ‘రమేష్ స్కీజోఫ్రేనియాకి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడు తెలుసా’ అన్న ఇన్‌స్పెక్టర్ నిగమ్ మాటలు గుర్తొచ్చాయి కారణం లేకుండా.

‘ఇంక ఇవాళ్ఠికి రైలందుకునే ప్రసక్తే లేదు’ అనుకున్నాడు టైమ్ చూసుకుంటూ. ఇంతలో సెల్ ఫోను ఆగకుండా గోలపెట్టింది. ‘విమల్’.

“ఏమిట్రా నాయనా సందట్లో నీ హడావిడి?” తను ట్రాఫిక్ జామ్‌లో ఇరుక్కున్న సంగతి చెప్పబోయేంతలో… “రమేష్ చచ్చిపోయాడురా” అన్నాడు విమల్.

ఏ రమేష్? అనబోయి ఆగాడు. రాజేశ్వర్రావు కొడుకని గుర్తొచ్చింది. “అదేంటీ? ఎలా?” ఎన్నో ప్రశ్నలడగాలని పించింది. “నువ్వర్జంటుగా రా” అంటున్నాడు విమల్. ఆలోచనల్లోంచి తేరుకుని ట్రాఫిక్ సంగతి చెప్పా డు.

“క్లియరయ్యీ అవగానే ఆటో వెనక్కి తిప్పించి వచ్చేయ్ చాలా మాటాడాలి. పోలీసులు పోస్ట్ మార్టెమ్ అంటున్నారు రాజేశ్వర్రావ్ నీలాంబరి చెప్పందే పోస్ట్ మార్టెమ్‌కి ఒప్పుకోడంటున్నారని చెప్పుకుంటున్నారు. సరే నువ్వురా. డైరెక్ట్‌గా నా రూమ్ కొచ్చేయ్” విమల్ కట్ చేసేసాడు.

యోగి చుట్టూ చూసాడు. ఇంకా పోలీసులు వస్తున్నట్టనిపించింది. అందరూ నిస్సహాయంగా కూచున్నారు. మళ్ళీ సెల్ మోగింది. ఉలిక్కిపడి ఆలోచనల్లోంచి తేరుకుని నంబర్ చూసాడు ‘నిగమ్’ డిస్ప్లే వస్తోంది. ఆన్సర్ నొక్కాడు. “హల్లో మిస్టర్ నిగమ్” మనసులో విసుగు గొంతులోకి రాకుండా జాగ్రత్త పడ్డాడు.

“రమేష్ పోయాడుట కదా?”

“తెలిసిందన్నమాట”.

“విమల్ చెప్పాడు.”

“మరణానికి కారణం ఏంటన్నాడు మీ ఫ్రెండు?”

“ఏమీ చెప్పలేదు. నన్ను హాస్పిటల్‌కి రమ్మన్నాడు. నేనసలు స్టేషన్‌కి బయల్దేరాను” అంటూ తన పరిస్థితి వివరించాడు. “ఆఁ ఇప్పుడే కదిలుతోంది ట్రాఫిక్—హా! మళ్ళీ ఆగింది”. రన్నింగ్ కామెంటరీ ఇచ్చాడు.

“ఎగ్జాక్ట్‌గా ఎక్కడున్నారు?” చెప్పాడు.

“అక్కడే ఉండండి, నేనొస్తాను. మా వేన్‌లో హాస్పిటల్‌కి వెడదాం. ఓకేనా?” అడిగాడు నిగమ్.

“వస్తాను. నావి రెండు సూట్కేసులున్నాయి. ఫర్వాలేదా?”

“నోప్రాబ్లెమ్. మీరక్కడే ఉండండి.”

‘ఈ గందరగోళంలో ఈయన మాత్రం ఈ స్పాట్ కి ఎలా వస్తాడు ఎంత పోలీసయితే మాత్రం!’ సెల్లు బెల్టు పౌచ్‌లో పెట్టేసుకుంటూ అనుకున్నాడు. ఆ చుట్టుపక్కలే ఎక్కడయినా ఉన్నాడేమోనని చూసాడు. లక్షా తొంభై మంది పోలీసులు కనిపించారు దూరంగా. ఈ ఒక్క కేసు కోసం ఇంతమందా! వాళ్ళల్లో ఎక్కడైనా ఉన్నాడేమో అని చూసాడు. కనపడలేదు.

ఉన్నట్టుండి “డాక్టర్ యోగీ” అన్నపిలుపు వినబడి వెనక్కి చూసాడు. ఒక కానిస్టేబుల్ ఆటో దగ్గరకొచ్చి తనని పిలుస్తున్నాడు.

“మా సార్ రమ్మంటున్నారు సార్” రోడ్డు పక్క పార్క్ చేసి ఉన్నజీపులో కూచునున్న నిగమ్‌ని చూపించాడు. ‘ఎలా ప్రత్యక్షమయ్యాడీయన?’ అనుకుంటూ దిగి ఆటోకి డబ్బిచ్చాడు. తన సూట్‌కేసుల్లో ఒకదానిని పోలీసతను అందుకున్నాడు. రెండోది తనే పట్టుకున్నాడు. వాహనాలు తప్పించుకుంటూ వెళ్ళి జీపు చేరారు ఇద్దరూ.

యోగి ఎక్కగానే జీపు ముందుకు సాగింది. హాస్పిటల్ వరకూ వెళ్ళే దాకా నిగమ్ ఏమీ మాటాడలేదు. యోగి కూడా మౌనంగానే కూచున్నాడు.

***

యోగితో పాటూ తన రూమ్‌లోకి వస్తున్న నిగమ్‌ను చూసి కొంచెం ఆశ్చర్యపోయాడు విమల్. ఏమీ మాటాడకుండా విష్ చేసి కూచోమన్నాడు.

“రమేష్ చావుకు కారణమేంటో తెలిసిందా?” అడిగాడు నిగమ్.

‘వస్తూనే ఇంటరాగేషన్ మొదలెట్టాసాడు గురుడు’ అనుకున్నాడు విమల్. ఇప్పుడు తనేం మాటాడితే ఏం తప్పో అని చిన్న జంకు కలిగింది మొదట. తెలియదు అన్నట్టు తలూపాడు.

“వైటల్ సైన్సన్నీ నార్మల్ గానే ఉన్నాయి పొద్దున్న వరకూ. అతన్ని నేను ట్రీట్ చెయ్యట్లేదు. లాబ్ రిపోర్ట్స్ బట్టీ చెపుతున్నాను. కుతూహలం కొద్దీ కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకుని ఫాలోఅయ్యానా కేసు. గంట క్రితం హి వజ్ డిక్లేర్డ్ డెడ్. అసలతను కత్తిపోట్లు తిన్నరోజునుంచీ అతనికి స్పృహ రాలేదు. అలాగని ప్రాణాంతకమైన సింప్టమ్స్ కూడా ఏమీ లేవు. పోస్ట్ మార్టమ్ తరవాత గానీ అసలు కారణం తెలియదు.”

“ప్రాణం పోయినప్పుడు అతనితో ఎవరున్నారు?”

“నాకా వివరాలు తెలియవు. వార్డ్‌కి వెళ్ళి కనుక్కోవాలి.” అన్నాడు విమల్. కాసేపాగి అతనే మళ్ళీ అన్నాడు. “మాసివ్ హార్టెటాక్ వల్ల పోయాడని కొందరు చెప్పుకుంటున్నారు. పక్కా న్యూస్ కాదనుకోండి. అదికాదు నన్ను బాదర్ చేస్తున్న విషయం” అని ఊరుకున్నాడు.

విమల్ ఇంకా ఏదో చెప్పడానికి సంకోచిస్తున్నాడని గ్రహించారు నిగమ్, యోగి. ఇద్దరూ మౌనంగా చూసారు.

“రమేష్‌కి హీమోఫిలియా ఉంది. ఆ జబ్బున్న వాళ్ళకి రక్తం అంత తొందరగా గడ్డ కట్టదు తెలుసా?” నిగమ్ ని అడిగాడు, అతనికి తెలుసోదెలియదో అన్నట్టు.

తెలుసునన్నట్టు తలూపాడు నిగమ్. “కానీ ఆరోజు ఉన్నట్టుం డి చాలా తొందరగా …..”

“అదే నాకూ అర్థం కానిది” అన్నాడు విమల్ ఆలోచిస్తూ.

“రక్తం గడ్డకట్టేందుకు అతనేమయినా మందులు వాడుతున్నాడేమో! మందులు వాడినా కూడా అంత తొందరగా గడ్డకట్టడం నార్మల్‌గా కూడా జరగదు. అందుకే కొంత ఆశ్చర్యంగా ఉంది” అన్నాడు విమల్. కొన్ని క్షణాలు ఆలోచిస్తున్నట్టు కూచుని “థేంక్యూ డాక్టర్ నేను వెడతాను” లేచాడు నిగమ్.

“రండి డాక్టర్ యోగి, మిమ్మల్ని ఇంటి దగ్గర దింపాల్సిన బాధ్యత నాది” అన్నాడు.

“నా కార్లో దింపుతా లెండి” అన్నాడు విమల్.

“ఓకే. ఒక్క విషయం డాక్టర్ విమల్! రమేష్ ఏదైనా ఆయుర్వేదం మందు తీసుకుంటున్నాడైమో తెలుసా?” అనడిగాడు నిగమ్.

“తెలీదు”.

“ఐ విల్ ఫైండవుట్” అనేసి వెళ్ళిపోయాడు నిగమ్.

“నిన్ను రమ్మంటే ఈ పోలీసునెందుకు తీసుకొచ్చావూ?” యోగిని అడిగాడు విమల్.

“అతనే నన్ను తీసుకొచ్చాడిక్కడికి. ఇక్కడ ఏసి ఛాంబర్లో కూచునున్నావు. ఇవాళ రోడ్లమీది ట్రాఫిక్ జామ్ గురించి నువ్వు ఊహించను కూడా ఊహించలేవు. నీ డ్యూటీ అయ్యి నన్ను దింపి నువ్వింటికెళ్ళేసరికి అర్ధరాత్రయినా అవుతుంది”. అన్నాడు యోగి.

“ఇవాళ నీలాంబరీదేవి ఎలక్షన్ కేంపెయిన్ స్టార్ట్ చేస్తున్నట్టుంది. ర్యాలీ కాక స్టేడియమ్‌లో బహిరంగ సభ కూడా ఉన్నట్టుంది.”

“అవన్నీ ఇవాళ కాదు. ఎల్లుండినించీ. ఇవాళ స్టేషన్ కెళ్ళే రూట్లో ట్రాఫిక్ జామ్ నీలాంబరీ దేవి ర్యాలీ కన్నా పదిరెట్లుంది. ఎవరో అనామకుడు హఠాత్తుగా రోడ్డుమీద పడిపోయి అక్కడికక్కడే చచ్చిపోయాడుట” తను రోడ్డుమీద సంభాషణలో విన్న విషయాలు చెప్పాడు. “ఆ పడిపోయిన వాడు మెంటల్ హాస్పిటల్ నించి పారిపోయి వస్తున్నాడని చెప్పుకుంటున్నారు” అంటూ చటుక్కున ఆగి, “అన్నట్టు రమేష్ స్కీజోఫ్రేనియాకి ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాడని తెలుసా నీకు?” అనడిగాడు విమల్ ని.

“నీకెలా తెలుసు?” అన్నాడు విమల్.

“ఆ రోజు రాత్రి నిగమ్ మనతో మాటాడ్డానికి వచ్చాడే అప్పుడు నేను జీపు వరకూ వెళ్లి సాగనంపాను కదా. అప్పుడు నిగమ్ చెప్పాడు.”

“అబ్బ ఈ నిగమ్ చాలా స్పీడుగా ఉన్నాడే. నాకిందాకే తెలిసింది” అంటూ తెరిచి ఉన్న తలుపు వైపు చూసి చటుక్కున మాటలాపేసాడు. యోగి కూడా అటు చూసాడు. అక్కడ మళ్ళీ ప్రత్యక్షమైన నిగమ్‌ని చూసి ఆశ్చర్యపోయారు విమల్, యోగి.

“డాక్టర్ యోగీ, మీ లగేజ్ నా జీప్ లోనే ఉండిపోయింది” అని కొంచెం పక్కకి జరిగాడు నిగమ్. ఒక పొడుగ్గా ఉన్న వ్యక్తి రెండు సూట్ కేసులు తెచ్చి లోపల పెట్టాడు. వాళ్ళిద్దరూ వెళ్లిపోయారు.

“ఇతనెవరో! ఇందాక మాతో జీపులో ఉన్న కాన్ స్టేబుల్ ఇతను కాదే.” అన్నాడు యోగి.

“హాస్పిటల్లో మఫ్టీలో పోలీసులు తిరుగుతున్నారన్నమాట” అన్నాడు విమల్.

‘మరి ఇంత విఐపి కేసు ఎడ్మిటై ఉన్నప్పుడు పోలీసు పహరా మామూలే’ అనుకున్నాడు యోగి. బయట మళ్ళీ బూట్ల చప్పుడు విని ఇద్దరూ మౌనంగా ఎదురు చూసారు. వాళ్ళనకున్నది కరెక్టే.

“సారీ డాక్టర్స్! నేను మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నాను” నిగమ్ లోపలకొచ్చి కుర్చీలో కూచున్నాడు.

“డాక్టర్ విమల్, రమేష్‌కి నిన్నా ఇవాళ కూడా రక్తపరీక్షల్లాంటి ఇన్వెస్టిగేషన్స్ ఏవో చేయించారు కదా వాటి జిరాక్స్ కాపీలు తెప్పించి నాకివ్వగలరా?” అనడిగాడు.

“ష్యూర్” విమల్ ఫోనందకుని డయోగ్నోస్టిక్స్ విభాగానికి ఫోన్ చేసాడు.

యోగి ఆలోచిస్తున్నాడు. రమేష్ పరిస్థితి స్టేబుల్‌గా ఉందనుకుంటుండగా హఠాత్తుగా పోయాడు. రోడ్డుమీద వ్యక్తి నడుచుకుంటూ పోతున్నవాడు ఉన్నట్టుండి పడిపోయి మరణించాడు. రమేష్ స్కీజోఫ్రేనియా పేషెంటు. రోడ్డు మీద హఠాత్తుగా చనిపోయిన అతని జబ్బు ఏమిటో గానీ మెంటల్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటున్నాడు. అంటే మానసికరోగి అతను కూడా. ఇంకా ఇలాంటివో రెండుమూడు మరణాలు జరిగితే? ఆలోచిస్తున్నాడు. తను తొందరపడి ఓ నిర్ణయానికొచ్చేస్తున్నాడా?

“ఏం డాక్టర్ ఏదో ఆలోచనలో పడ్డారు?” మృదువుగా అడిగాడు నిగమ్.

‘ఇతనికి చాలా మెత్తగా అవతలవాళ్ల మనసులో మాట బయటికి లాగగలిగే టాలెంటుంది. తనకి కావలసిన సమాచారం కోసం ఇతను థర్డ్ డిగ్రీ ఉప యోగించాల్సిన అవసరం లేదు’ అనుకున్నాడు విమల్.

యోగి తనకొచ్చిన ఆలోచన చెప్పి నవ్వాడు “అఫ్ కోర్స్ ఏవో రెండు మరణాల్లో కాస్త పోలికుందని మనం అదే స్టాటిస్టిక్స్ అనుకోకూడదనుకోండి” నవ్వాడు.

“నువ్వింకో కేసు మర్చి పోయావ్ షెర్లాక్స్ హోమ్స్! పిజ్జా పేలెస్ నించి ఇంటికి దారెలాగా అని వెతుక్కుంటుంటే ఓ ఆత్మహత్య ఎదురైంది.”

“ఏస్. గుర్తొచ్చింది. ఆ అబ్బాయిని మెలాంకలిక్ పెర్సన్‌గా వర్ణించాడు రోడ్డుమీద పెద్దాయన. మెలాంకలీ – స్కీజోఫ్రేనియా అయ్యుండచ్చు.”

“రమేష్ ఇన్సిడెంట్ రోజునే జరిగిందా ఆ సూయిసైడ్? ట్రాంక్విల్ కాలనీ బైలేన్‌లో ఇల్లా?” అడిగాడు నిగమ్.

కొంచెం ఆశ్చర్యపోయారు యోగి విమల్. మొత్తం మహా నగరమంతా ఇతని జూరిస్‌డిక్షనేనా! అతని ప్రశ్నకి అవునన్నట్టు తలూపారు. నిగమ్ ఇంకేమైనా చెప్తాడేమోనని చూసారిద్దరూ. అతనింకేం మాటాడలేదు. ‘హమ్మా! తను మాత్రం ఒక్క అక్షరం కూడా అదనపు ఇన్ఫర్మేషనివ్వడు దొంగ! కాదు కాదు పోలీస్!’ అనుకున్నాడు విమల్. ఇంతలో తలుపు తట్టి వార్డ్ బోయ్ ఒకతను వచ్చాడు. రమేష్‌కి ఆ హాస్పిటల్లో జరిగిన పరీక్షలన్నిటికీ రిపోర్టుల కాపీలు తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు.

విమల్ అవి చూస్తూ “అరే!” ఆశ్చర్యంగా అంటూ తను చూసిన కాగితం యోగికి అందించాడు యోగి దాన్ని చూస్తూ ఆలోచనలో పడ్డాడు.

“అతనికి బ్లడ్ కేన్సర్ ప్రారంభదశలో ఉన్నట్టుంది ఆ రిపోర్ట్‌లో” నిగమ్ తో చెప్పాడు విమల్.

“ఇంతకు ముందు డిటెక్టవలేదు కాబోలు. ఇప్పుడు చెకప్‌లో బయటపడింది.”

“ప్రారంభ దశ కాబట్టి హఠాన్మరణానికి అది కారణం కాదు. అంతేకదా?” డాక్టర్లిద్దరినీ ప్రశ్నించాడు నిగమ్. అవునన్నట్టు తలూపారు.

“ఇప్పుడు పోస్ట్ మార్టెమ్‌లో ఇంకేం బైట పడతాయో!” అంటూ రిపోర్టులన్నీ తీసుకుని లేచి, మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు కుర్చీలో కూచున్నాడు.

“మాకిద్దరికీ ఇది చాలా ఇంటరెస్టింగ్‌గా ఉంది. పోస్ట్ మార్టెమ్ పూర్తయ్యాక రిపోర్ట్ వివరాలు అడిగితే మాకు చెప్తారా?”

“మోస్ట్ వెల్కమ్. తప్పకుండా. అఫిషియల్‌గా కాకుండా కాస్త గుంభనంగా ఏదైనా ఇన్పర్మేషన్ కావాల్సొస్తే నేను మిమ్మల్ని కన్సల్ట్ చేస్తాను. ప్రస్తుతం నాకొక వివరం కావాలి. ఈ స్కీజోఫ్రేనియా అనేది మానసిక వ్యాధి అని తెలుసు. కానీ దాని లక్షణాలేంటో ఖచ్చితంగా తెలియదు. నాక్కొంచెం స్కీజోఫ్రేనియా అంటే ఏంటో సింపుల్ గా చెప్పండి” అడిగాడు.

“మన వాడు నడిచే టెక్స్ట్ బుక్ లెండి. క్లాసు తీస్కుంటాడు.” అన్నాడు విమల్.

“బాబోయ్! పెద్ద క్లాసొద్దు. అసలదేంటో ఒక ఐడియా ఉంటే నా ఇన్వెస్టిగేషన్‌లో కొంచెం ఉపయోగపడుతుందని. సింపుల్‌గా చెప్పండి.” రిక్వెస్ట్ చేస్తున్నట్టన్నాడు నిగమ్.

“టూకీగా తెలుగులో చెప్పాలంటే వీళ్ళ ఆలోచనా విధానం సవ్యంగా ఉండదు. లోపభూయిష్టంగా ఉంటుంది. థింకింగ్ డిస్టర్బెన్స్ అంటాం. వాస్తవంగా ఆలోచించలేరు. వక్రంగా ఆలోచిస్తారు. వీళ్ళు చాలారకాల భ్రమల్లో ఉంటుంటారు. లేని శబ్దాలు, మాటలు వినబడుతుంటాయి. ఏవో దృశ్యాలు కనబడుతుంటాయి. హాల్యూసినేషన్స్ – అంటే ఎవరో తమతో మాటడుతున్నట్టు ఏవేవో మాటలు వినబడుతుంటాయి. వాళ్ళ కళ్ళముందు ఎవరికీ కనబడని దృశ్యాలు కనబడుతుంటాయి. ఆ మాటలు దృశ్యాలు వాస్తవం అని నమ్ముతారు. అందరూ తమ గురించే మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఇతరులతో కలవడానికి, సోషల్‌గా మూవ్ అవడానికి ఇష్టపడరు. అసలెందులోనూ పెద్ద ఆసక్తి ఉండదు. సరిగ్గా మాటాడలేరు. వాళ్ళ అనుభూతులను సరిగ్గా వ్యక్తం చెయ్యలేరు. మొత్తంమీద తమదైన ప్రత్యేకలోకంలో ఉన్నట్టుంటారు. తమకే జబ్బూ లేదని నమ్ముతారు. ఈ జబ్బు ఉన్న చాలామందిలో తాగుడు లాంటిమాదక ద్రవ్యాల వ్యసనం కూడా ఉంటుంది. వీళ్ళు స్థిరంగా ఉద్యోగాలు చెయ్యలేరు. ఇలా ఇంకా చాలా ఉన్నాయి.”

“ప్రస్తుతానికి ఇవి చాలు మహాప్రభో! రోగం గురించి కొంచెం తెలిసింది. దీనికి ట్రీట్‌మెంటుందా? ఐ మీన్ మందు లున్నాయా? మనోవ్యాధికి మందులేదంటారుగా?”

“అది మూఢనమ్మకం మాత్రమే. మందులు ఉన్నాయి. సైకోథెరపీ కూడా చేస్తాము. పేషెంటు కుటుంబసభ్యులకు కూడా అతనితో ఎలా ప్రవర్తించాలి, రోగిని ఎలా చూసుకోవాలి మొదలైన విషయాల్లో సైకో ఎడ్యుకేషన్ ఇస్తాము. దాన్నే ఫ్యామిలీ థెరపీ అని కూడా అంటాం. మరీ ఎక్స్‌ట్రీమ్(extreme) కేసుల్లో అంటే బాగా వయొలెంటుగా ఉన్న పేషెంట్లకీ, ఆత్మహత్యా ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎలెక్ట్రో కన్వల్సివ్ థెరపీ – ఇ.సి.టి. (Electro Convulsive Therapy -ECT) అంటే షాక్ ట్రీట్‌మెంట్ అంటుంటారు మామూలుగా, ఆ ట్రీట్‌మెంట్ కూడా ఇస్తాం.”

విన్నదంతా ఆకళింపు చేసుకోవడానికన్నట్టు కాసేపు మౌనంగా కూచున్నాడు నిగమ్.

“ఓకే. అడిగినవాటి కన్నిటికీ జవాబులు చెప్పి ఇప్పటి వరకూ సహకరించినందుకు థేంక్స్” వెళ్ళిపోయాడు నిగమ్.

“కమాన్. ఈయనకన్నా ముందు మనం ట్రాంక్విల్ కాలనీ బైలేన్‌లో ఇన్వెస్టిగేషన్ చెయ్యాలి” ఉత్కంఠ తట్టుకో లేనట్టు స్ప్రింగులా చిన్నగా గెంతుతూ అన్నాడు యోగి.

విమల్ నవ్వాడు. “నాకూ పెద్ద డిటెక్టివునై పోవాలని ఉంది కానీ ఇంక ఇవాళ్టికి రాత్రయిపోయింది కాబట్టి లాభంలేదు. ఇంటి కెళ్లి తిని తొంగుందాం. రేపు నేను తొందరగా పని ముగించుకొస్తాను. అప్పుడు మొదలు పెడదాం ఇన్వెస్టిగేషన్.”

“ఆల్రైట్ మళ్ళీ పిజ్జాపేలెస్ నించీ మొదలెడదాం డిటెక్టివ్ వర్క్” ఇద్దరూ నవ్వుకుంటూ బయటపడ్డారు.

***

నితిన్ ఇంట్లోకి ఇద్దరు పోలీసులు వెళ్ళడం చూసింది విరి. ఆసక్తిగా వరండాలో నిలబడింది. “సిరీ,సిరీ! రావే. నితిన్ వాళ్ళింటికి పోలీసులొచ్చారు. పోస్ట్ మార్టమ్ రిపోర్ట్ తెచ్చారనుకుంటా” చిన్న గొంతుతో పిలిచి తొందర పెట్టింది. ‘ఇంకా అది నితిన్ వాళ్ళిల్లే’ సిరి మనసెందుకో విషాదంగా మూలిగింది.

ఆ గేటు ముందాగిన జీపు లోంచి మరోఇద్దరు కాన్స్టేబుల్స్ విరి వైపు ఆసక్తిగా చూడ్డం గమనించింది.

“ముందు నువ్వు లోపలికి రా” పళ్ళు బిగించి ఆజ్ఞాపించినట్టంది.

“ఎందుకంత కోపం? ఊఁ వచ్చా” విసుగ్గా లోపలికెళ్ళింది విరి.

వీధి తలుపు సగం మూసి, “చూడు ఆ పోలీసులు నిన్నే కన్నార్పకుండా చూస్తున్నారు. నీకెందుకంత ఆసక్తి? అని కూపీ లాగుతారు. లేకపోతే కాలక్షేపానికి వెకిలి వాగుడు వాగుతారు. ఎందుకొచ్చిన గొడవ” అంది.

“సరేలే వాళ్ళెళ్ళి పోయాక అంకుల్‌నే అడుగుతాను వాళ్ళెందుకొచ్చారని” కిటికీ పక్క కుర్చీలో కూలబడి కర్టెన్ సందుల్లోంచి చూసింది. ఆ ఇద్దరు కానిస్టేబుల్సూ విరి కనబడకపోయేసరికి అటూ ఇటూ చూసి దూరంగా కనబడ్డ లైమ్ సోడాబండీ వాడికి రెండు పట్రా అని సైగ చేసారు. “పోలీసెంకటసామిగారికి సోడా సమర్పయామీ – ఫ్రీగా” అని కామెంటరీ ఇచ్చింది విరి.

నవ్వితే విరి ఇంకా రెచ్చిపోతుందని నవ్వాపుకుని పుస్తకంలో తల దూర్చింది సిరి. “అమ్మ కాలేజీనిం చొచ్చే సరికి నిన్ను టొమేటోలు ఉల్లిపాయలు తరగమంది. నాకు కేబేజీ ప్లస్ అల్లం అండ్ పచ్చిమిరప కాయలు ఇవాళ్టి ఎసైన్ మెంట్. మొదలెడదామా?”

“మరి మేడమ్ సీతమ్మగారు ఏం చేస్తార్ట?” కోపంగా అంది విరి.

“ఇవాళ నితిన్ వాళ్ళింట్లో డ్యూటీ వేసింది అమ్మ. వాళ్ళకి వంటకెవరైనా కుదిరేదాకా హెల్ప్ చెయ్యమని పంపింది. చాలామందున్నారుగా వాళ్ళింట్లో చుట్టాలు.”

విరి కిటికీలోంచి చూడ్డం ఆపి కొంచెం విచారంగా మొహం పెట్టుకుని, “అసలంతమంది చుట్టాలేంటి వాళ్ళకి? మనకేమో ఎప్పుడూ అమ్మమ్మా తాతగారూ తప్ప ఎవరూ లేరు” అంది.

సిరి మాటాడలేదు.

“మాటాడవేం?” రెట్టించింది విరి.

“ఏముంది మాటాడేందుకు. మనకెక్కువ చుట్టాల్లేరు. ఏక్సెప్ట్ ఇట్. కొన్నివాస్తవాలను మనం అంగీకరించక తప్పదు.”

“నువ్వంగీకరిస్తే గీకరించు. నేను గీకరించను. కొంత డిటెక్టివ్ వర్క్ చేస్తా. మనకీ ఎక్కడో మంచి మంచి చుట్టాలు ఉండే ఉంటారు. మనం ఇక్కడున్నామని తెలియక గిజగిజలాడుతూండి ఉంటారు. వాళ్ళని నేను కనిపెడతా. చివరిసీనులో అందరం కలుసుకునేలా చేస్తా.”

“దేనికి చివరిసీను? మన జీవితాలకా? అంటే నువ్వు వాళ్ళనెవరినో కనిపెట్టేసరికి మన జీవితాలు చివరి సీనులోకొస్తాయ్. ఆ లెక్కన నువ్వు కనిపెట్టకుండా ఉంటే నాలుక్కాలాలపాటు బలుసాకైనా ఏరుకు బతకచ్చుకదే.”

“నువ్వసలు బలుసాకంటే ఏం ఆకో కనిపెట్టు ముందు. ఆఁ! పోలీసాళ్ళు వెళ్లిపోతున్నారు” కర్టెన్ల సందులోంచి చూస్తూ లేచింది విరి. వరండాలోకొచ్చి చూసింది. అప్పటికే దుమ్మురేపుకుంటూ వెళ్ళిపోతోంది జీపు.

ఇంతలో ఇంకో కారొచ్చి ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం దగ్గర ఆగింది. అందులోంచి ఇద్దరు యువకులు దిగి నితిన్ ఇంటి వైపు చూస్తూ వాళ్ళలో వాళ్ళేదో మాటాడుకుంటున్నారు. నితిన్ వాళ్ల చుట్టాలేమో. ఇల్లు ఇదేనా కాదా అని తర్కించుకుంటున్నారేమో అనుకుంది విరి. ఇంతలో మరో కారొచ్చి ఆ ఇద్దరు యువకులూ ఆగిన చోటే ఆగింది. ఆకారులోంచి ఓ నడివయస్కుడు దిగాడు. ‘ఓరిబాబోయ్ చూడగానే ఏ మిలిటరీఆఫీసరో కనీసం పోలీసాఫీసరో అనిపించేలా ఉన్నాడు’ అనుకుంది విరి. ఆ భారీ మనిషిని చూసి ఆ యువకులిద్దరూ కొంచెం ఆశ్చర్యపోవడం గమనించింది. తరువాత వాళ్ళు ఒకళ్ళనొకళ్లు పలకరించుకుని నవ్వుకోడం చూసింది.

సైకియాట్రిస్ట్ అని తనకు పరిచయం చెయ్యబడ్డ నితిన్ మేనమామ సుబ్బారావుగారు ఇంట్లోంచి బయటకొచ్చి వరండాలోనుంచుని ఏవో కాగితాలు పరిశీలించడం చూసింది విరి.

కారు దిగి నిలబడ్డ యువకుల్లో ఒకతను ఆయన్ను చూసి చకచకా వాళ్ళగేటు దగ్గరకి నడిచాడు. “హలో సర్” అన్నాడా యువకుడు. సుబ్బారావు తలెత్తి చూసాడు. “హలో…లో.. డాక్టర్ యోగీ!వాటె సర్ప్రైజ్! రండి రండి లోపలికి రండి” అన్నాడు.

విరి ఆసక్తిగా చూసింది. కారుదిగిన రెండో ఆయనతో మొదటి ఆయన (యోగి ట అదేం పేరో!),ప్లస్ మిలిటరీ వాలా ముగ్గురూ ఇంట్లోకెళ్ళడం చూసి కాస్త నిరుత్సాహపడింది. ఇప్పుడీ కొత్త చుట్టాలెవరో వచ్చారు. లగేజ్ తీసుకురాలేదు కాబట్టి కాసేపు కూచుని పరామర్శించి వెళ్ళిపోయే రకాలని ఊహించింది. కాసేపంటే ఎంత సేపో! వాళ్ళు వెడితే గానీ అంకుల్‌ని పలకరించి కబుర్లు చెప్పడానికి లేదు. మళ్ళీ ఇంట్లో కొచ్చింది.

ఏదో టెన్షన్‌లో ఉన్నట్టు అటూ ఇటూ పచార్లు చేస్తున్న విరిని చూసి నవ్వుకుంది సిరి. తనకీ పక్కింటికి వెళ్ళి వాళ్ళతో మాటాడాలనీ వాళ్ళని ఇంకా ఓదార్చాలనీ ఉంది. నితిన్ అంటే కొంచెం వేళాకోళం ఉన్నా అతని తల్లి అంటే ఇద్దరికీ ఇష్టమే. అందుకే ఈ దుఃఖసమయంలో ఆవిడతో ఎక్కువ సేపు స్పెండ్ చెయ్యాలని తహతహలాడుతోంది విరి. పచార్లు చేస్తున్న విరికేసి జాలిగా చూసింది సిరి. మరీ ఇంత ఇమోషనల్ అయితే కష్టం అనుకుంది.

“అమ్మా, విరీ ఒక్కసారిలా వస్తావూ” అని నితిన్ తండ్రి రామారావు పిలుపు పక్కింటి వరండాలోంచి వినప డింది. విరి ముఖం వికసించింది. “వొస్తున్నానంకుల్” రివ్వున పరిగెత్తింది.

అక్కడ డా. సుబ్బారావుతో పాటు ఇందాక కారులో వచ్చిన ముగ్గురూ కూచునున్నారు.

“రామ్మా విరీ” అని ఆహ్వానించి, “ఇదిగో ఈ అమ్మాయే నేను చెప్పానే మా నితిన్ క్లాస్‌మేటనీ, ఈ అమ్మాయి పేరు విరి” పరిచయం చేసాడు.

విరి నమస్కారం చేసింది.

“ఈయన డా.యోగి. సైకియాట్రిస్ట్. ఈయన డా.విమల్. ఫిజీషియన్. ఈయన ఇన్‌స్పెక్టర్ నిగమ్” పరిచయం చేసాడు.

“ఈ అమ్మాయి మా నితిన్‌తో పాటు ఇంటర్ చదివింది. ఇప్పుడు ఎమ్‌సెట్ కోసం ప్రిపేరవుతోంది. తనకో ట్విన్ సిస్టర్ కూడా ఉంది సిరి అని. విరీ, క్లాస్‌లో మా నితిన్ ప్రవర్తన ఎలా ఉండేది వీళ్ళకొకసారి చెప్పు” అన్నాడాయన.

విరికి ఈ సంభాషణ నచ్చలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడెందుకు ఇవన్నీ తవ్వుకుంటున్నారు వీళ్ళు? అనుకుంది.

“చెప్తాను కానీ ఆంటీ ఎలా ఉంది ఒకసారి చూసి రావచ్చా?” అడిగింది.

“తప్పకుండా. చూసి రామ్మా. పొద్దున్న తను నీకోసం అడిగింది కూడానూ” అన్నాడు రామారావు.

విరి లోపలి కెళ్ళగానే “చాలా ఆప్యాయత గల పిల్లలు” అన్నాడు.

“ఈ పిల్లలు ఇంత హెల్ప్‌ఫుల్ అని నాకు తెలీనేలేదు. తెలిసుంటే వాడిని కాలేజీలో ఓ కంట కనిపెటట్టుండమని చెప్పుండేవాడిని. అసలు వాడి జనరల్ బిహేవియర్ గురించి బాగా తెలిసేది” అన్నాడు సుబ్బారావ్.

విరి లోపలికెళ్ళేసరికి నితిన్ తల్లికి ఎవరో చుట్టాలావిడ బతిమాలి మజ్జిగ తాగిస్తోంది. కాసేపు పక్కన కూచుంది విరి. ఆవిడ విరి చెయ్యపట్టుకుని ఏడవడం తప్ప మాటాడలేదు. కాసేపు పక్కన కూచుని లేచి వరండాలోకి వచ్చింది విరి.

“రామ్మా. కూచో. డాక్టర్ సుబ్బారావు తెలుసుగా ఈ మూడురోజులుగా నీకు పరిచయమే. అనుకోకుండా ఇవాళ ఈ డాక్టర్లు కూడా వచ్చారు. మన సుబ్బారావుకి వీళ్లు స్టూడెంట్లుగా ఉన్నప్పటినించీ తెలిసిన వాళ్ళేట. కొంచెం మన నితిన్ గురించి డిస్కస్ చేస్తున్నాం. నువ్వు కూడా నీకు తెలిసింది చెప్తే బావుంటుందనుకుంటున్నాం” అన్నాడు రామారావు. ఆయన తన మనసులో బాధ మర్చిపోవడానికి కొంచెం ఎక్కువ మాటాడుతున్నట్టుంది అనుకుంది విరి.

“నితిన్ సాధారణంగా క్లాసులో ఎటెంటివ్‌గా ఉండే వాడా?” అనడిగాడు యోగి. జవాబు ఊహించగలిగినా.

“ఏమో సర్. చాలా క్వయట్‌గా ఉండేవాడు. లెక్చర్ వింటున్నాడో ఏదైనా ఆలోచించుకునేవాడో తెలియదు. ఒక్కొక్కసారి మటుకు ఏదో అర్థం పర్థం లేని విషయం పట్టుకుని లెక్చరర్‌తో పెద్ద వాదన పెంచుకునేవాడు. క్లాసు జరగనివ్వకుండా గొడవ గొడవ చేసే వాడు. ఎందుకలా చేసేవాడో అయితే నాకిప్పటికీ అర్థం కాదు.”

“క్లాసులో ఫ్రెండ్స్ ఉండేవారా? అందరితో ఎలా ఉండేవాడు?”

“ఎవరితోనూ పెద్దగా స్నేహం చేసేవాడు కాదు. పక్కింట్లో ఉన్న మాతో కూడా ఏమీ మాటాడేవాడు కాదు. ఒక్కోసారి….” ఆగిపోయింది విరి, తను ఎక్కువగా మాటాడుతోందేమోనని అనుమానం వచ్చి.

“చెప్పు ఏం చేసేవాడు.”

“ఇదివరకు కాదుగానీ ఈ మధ్య తనలో తాను మాటాడుకోడం ఎక్కువ చేసాడు.”

“ఆత్మహత్య చేసుకుంటానని ఎవరితోనైనా అన్నాడా? నీతో కాకపోయినా ఇంకా బోయ్స్ ఉంటారుగా క్లాసులో వాళ్ళెవరితోనైనా …”

“ఏమో ఎవరూ అలా ఏం చెప్పలేదు ఎప్పుడూ.”

ఆ సుబ్బారావంకుల్ కంటే ఈ కుర్రడాక్టర్ ఇంటెలిజెంట్‌గా ఉన్నాడు. ఇతను నితిన్‌ని ట్రీట్ చేసుంటే బాగుండేది అనుకుంది విరి.

“ఎందుకంకుల్ ఇప్పుడివన్నీ అడుగుతున్నారు?” ధైర్యం చేసి తన మనసులో మెదులుతున్న సందేహం అడిగేసింది రామారావు వైపు తిరిగి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here