[box type=’note’ fontsize=’16’] అతీంద్రియ శక్తి పొందిన సూపర్ కిడ్ చుట్టూ తిరిగే ఊపిరి సలపనివ్వని వండర్‌ఫుల్ కథనం!! హించని మలుపులతో వేగంగా చదివించే ఎనుగంటి వేణు గోపాల్ నవల ‘ట్వింకిల్ ట్వింకిల్ వండర్ స్టార్‘!! [/box]
[dropcap]మా[/dropcap]ట్లాడమంటే అఖిల్ ఏదో ఒకటి గలగలా మాట్లాడగలడు. రకరకాల ప్రశ్నలతో ఎదుటి వారిని బెంబేలెత్తించగలడు. అలాంటిది చీటిలో రాసినట్లుగా డాన్స్ చేయాలంటే మాత్రం గుండె దడ ప్రారంభమయ్యిందతనిలో.
అందుకే అందరి వైపు బెరుగ్గా చూశాడు.
ఆ కుర్రాడింకా నిల్చున్న చోటు నుండి కదలక పోయేసరికి, “నిట్టూ.. కమాన్ తర్వగా వచ్చేసేయ్!” అంటూ ఎంకరేజ్ చేసింది సుధా మేడమ్.
సంకోచిస్తూనే అడుగులో అడుగు వేస్తూ అందరి మధ్యలోకి వచ్చాడు.
ముద్దొచ్చే మోము. చురుకైన కళ్ళు, వినయం ఉట్టిపడే నడక. అందరినీ ఆశ్చర్యపరిచే మేధస్సు. ఆ కుర్రాడ్ని చూస్తే చూపరులిట్టే ఆకర్షితమౌతారు. ఇక స్కూల్ టీచర్స్ విషయం చెప్పనక్కర్లేదు. అఖిల్‌ని అందరూ లైక్ చేస్తారు.
సుధా మేడమ్ టేప్ ఆన్ చేసింది. సన్నగా మ్యూజిక్ మొదలయ్యింది.
“డ్యాన్స్ విత్ మ్యూజిక్” అనే సరికి పిల్లల్లో తిరిగి ఉత్యాహం ఉరకలు వేసింది. సంగీతానికి అనుగుణంగా తలల్ని ఊపసాగారు.
ఒక్కసారి జరగాల్సింది జరగక పోవడంలోనే థ్రిల్ వుంటుంది!
అందుకేనేమో అందరూ వూహించినట్లుగా మూవ్ కాలేదు అఖిల్. బొమ్మలా కదలకుండా ఉన్నాడు.
వాడినలాగే వదిలేస్తే బావుండేది.
కానీ.. జరగలేదలా!
సుధా మేడమ్ అలలా అఖిల్‌ని చుట్టేసి “కమాన్ బాయ్! స్టార్ట్. డాన్స్ విత్ మీ” అంటూ వాడి రెండు చేతుల్ని పట్టుకొని తనతో పాటు డాన్స్ చేయించబోయింది.
అచేతనంగా మేడమ్‌తో పాటు మూవ్ అవబోయాడు.
కానీ, అంతలోనే జరిగిపోయిందా అపురూప ఘటన.
ఆ సరదా ఘడియల్ని అద్భుత క్షణాలుగా మలిచేస్తూ.
అఖిల్ ముఖం వివర్ణమయ్యింది. ముక్కుపుటాలదరసాగాయి. కళ్ళలోంచి వింత కాంతి ప్రసరిస్తోంది. శరీరంలోని అణువణువూ రెట్టింపు చైతన్యాన్ని సంతరించుకుంటున్న భ్రాంతి.
క్షణక్షణానికి వాడిలో కల్గుతున్న అనూహ్యమైన మార్పులకి అదిరిపడింది మేడమ్. షాక్ తిన్నదానిలా చప్పున వాడ్ని వదిలేసి అప్రయత్నంగా రెండు మూడడుగులు వెనక్కి వేసింది. ఆమె నాడీ వేగం పెరిగింది.
ఆ చిన్నారి మెదడులోకి సంకేతాలేవో ఇంజక్టవుతుంటే భారంగా తలపట్టుకున్నాడు. చెవుల్లో శబ్దతరంగాల హోరు.
కళ్ళుమూసి వేదనగా కణతల్ని తన చిట్టి చేతుల్తో నొక్కుకుంటూ అరిచాడు “వొద్దొద్దని.”
అంతే!
అక్కడేదో విస్ఫోటనం జరిగినట్లు భయకంపితులయ్యారంతా. ఆ హఠాత్ సంఘటనకి హతాశయులై ఆందోళనగా చూస్తుండిపోయారు.
స్ప్లిట్ సెకండ్ అనంతరం-
అతడి వదనంలో ప్రశాంతత. తేజోవంతమైన పవిత్రత. ఒక తపస్విలా.. మహర్షిలా.. గోచరిస్తున్నాడిప్పుడు.
కంటి పొరల ముందు అస్పష్టపు దృశ్యలేవో లీలగా కదలాడుతుంటే-
నెమ్మదిగా, నెమ్మది నెమ్మదిగా..
అప్పటికే పూర్తిగా పెదాలు విప్పాడు!
అప్పటికే పూర్తిగా ట్రాన్స్‌లోకి వెళ్ళిపోయాడా కుర్రాడు.
కొన్ని సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో అదే మామిడిచెట్టు కింద జరిగిన ఓ యథార్థ సంఘటనని తాను స్వయంగా చూసినట్టు చెప్పుకుపోతున్నాడా అబ్బాయి.
విస్తుపోయి వింటున్నారంతా!
1990వ సంవత్సరం-
పదిహేనేండ్ల ప్రాయంలోనే భరతనాట్యంలోని మెలుకువలన్నీ నేర్చుకుందో అమ్మాయి. పేరు పూజిత. నృత్య ప్రదర్శన నిమిత్తమై రిహార్సల్స్ కొరకు అభ్యాసం జరపుతోందక్కడ.
అయితే ఆమె నర్తించే ప్రతిసారీ కొన్ని సెకన్లపాటు గాలిలో తేలుతూ స్టెప్స్ వేయడం అందర్నీ విస్మయపరిచింది. అక్కడున్న వారెవరికీ మింగుడు పడలేదీ విషయం.
భౌతికశాస్త్రానికి విరుధ్ధంగా భూమ్యాకర్షణశక్తిని కాదని, ఎలాంటి ఆధారం లేకుండా ఒక మనిషి తనకు తానే స్వేచ్ఛగా గాలిలో ఎగరడం అత్యద్భుతం. మానవమాత్రులెవరూ ఊహించలేనిదీ ప్రక్రియ. దైవాంశ సంభూతులకు సైతం ఇప్పటి వరకూ సాధ్యం కాలేదిది.
పూజిత నృత్య సమయంలో గాలిలో తేలుతోందనే విషయాన్ని నిర్ధారించడానికి ఫిజిక్స్ ప్రొఫెసర్ రామానందమూర్తి ప్రత్యేకంగా ఆహ్వానించబడ్డాడు. స్వయంగా తిలకించాడామె నృత్యాన్ని.
అనంతరం పూజితని ఇంటర్య్వూ చేశాడు.
“అలా గాలిలో ఎగిరే సమయంలో నీలో అంతర్గతంగా భౌతిక, మానసిక మార్పులేమైనా జరుగుతున్నాయా?” అంటూ ప్రశ్నించాడు.
అందుకామె-
“మానసికంగా ఎలాంటి మార్పులు కలగడం లేదు. కానీ ఆ సమయంలో ఎవరో దేవత నన్ను పైకెత్తి ఆడిస్తున్నట్లుగా అనుభూతి కల్గుతోంది” అని బదులిచ్చింది.
అయితే ఆ అమ్మాయి నృత్యం చేస్తూన్న ప్రతిసారీ గాలిలో ఎగిరే ఆ కొన్ని సెంకడ్ల సమయంలో నిజంగానే ఆమె ముఖంలో మార్పు వచ్చేది. వింతకాంతి దేదీప్యమానమై వెలిగేది.
ప్రొ.రామనందమూర్తి పై విషయాన్ని ధ్రువపరిచాడు.
కొన్ని సెకన్లపాటు భూమ్యాకర్షణ శక్తికి వ్యతిరేకంగా గాలిలోనే వుండి ఆ అమ్మాయి చేసే అపురూప నృత్యం పలువుర్ని విబ్రాంతికి గురిచేయడంతో పాటుగా.. ఫిజిక్స్ సిద్దాంతాలకే అతి పెద్ద ఛాలెంజింగ్‌గా మారింది!
అఖిల్ చెప్పింది రెప్పార్పకుండా విన్నారంతా.
కళ్ళలో కదలాడిన అక్షరాలే పేపర్‌పై అచ్చై అచ్చెరువుకి గురిచేసినట్టు… మనసున మెదలిన భావాలే స్క్రీన్‌పై ప్రాణం పోసుకొని చిత్రాలుగా ఎదుట నిలిచినట్టు.. అమితమైన ఆశ్చర్యానికి లోనయ్యారు.
– చెప్పడం పూర్తయ్యాక ఆయాసంతో ఆగిపోయాడా కుర్రాడు. శరీరమంతా ఎవరో పట్టుకుని కుదిపినట్లు ఊగిపోయింది.
సంకేతాలు మెదడికి అందడం ఆగిపోయాయి. చెవుల్లో హోరు తగ్గింది. ముఖంలోని తేజస్సు మటుమాయమయ్యింది. అంతర్గత అలజడి లేదు.
క్షణంలో సాధారణ బాలుడిగా మారిపోయాడతను.
నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. చూపులు నిర్మలంగా వున్నాయి.
ఫ్రెండ్సతో పాటు మేడమ్స్ తన చుట్టూ చేరి, అదోలా చూస్తూంటే ప్రశ్నార్థకంగా ముఖం పెట్టాడు. ఎందుకలా తన వంక చూస్తున్నారో అర్థం కాలేదు వాడికి.
ఇందాక జరిగిందేంటో తాను చెప్పిందేంటో అఖిల్‌కి తెలిస్తేగా?
ఆ కుర్రాడి చెంతకు ఒక్కుదుటున వచ్చి చేరింది హెడ్.
“ఏమైంది నిట్టూ” అని అడిగింది.
సరదాగా పిల్లలకి పిక్‌నిక్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తే, హఠాత్తుగా వీడిలా ప్రవర్తించడం హెడ్ ఆఫ్ ది ఇన్‌స్టిట్యూషన్‌గా ఆమెను ఆందోళనకి గురిచేసింది.
ఆమె ప్రశ్నకు వాడి దగ్గర నుండి సమాధానం రాలేదు.
అందేకే “నిన్నే అఖిల్ ఏం జరిగిందంటే బదులివ్వవేం” అంటూ సీరియస్‌గా రెట్టించి అడిగింది.
“నాకా ఏం జరగలేదు మేడమ్” కాస్త జంకుతూ అమాయకంగా బదులిచ్చాడు వాడు.
అవాక్కయ్యిందామె.
మిగతా వాళ్ళు ఆశ్చర్యచకితులై ఆ కుర్రాడ్ని మార్చి మార్చి చూస్తున్నారు.
“డాన్స్ చేయమంటే చేయలేదు. ఆ తర్వాత ఏం జరిగిందో గుర్తులేదా” మళ్ళీ తనే అడిగింది.
“తెలీదు మేడమ్. సుధా మిస్ వచ్చి డాన్స్ చేయించడానికి నా చేతులు పట్టుకున్నారు. తర్వాత మీరు వచ్చి ఏం జరగిందని అడుగుతున్నారు” అంటూ సమాధానమిచ్చాడు.
ఈ సారి ఆశ్యర్యపోవడం ఆ కుర్రాడి వంతయ్యింది.
ఆలోచనల్లో పడింది హెడ్.
ఇంత క్రితం జరిగిందేమీ గుర్తున్నట్టు లేదు. ఆ అబ్బాయికి స్పృహ లేకుండానే జరిగినట్లుందా సంఘటన. ఆ విషయం స్పష్టంగా అర్థమైందామెకు. అందుకే కుర్రాడ్ని మరింకేం అడగలేదు.
ఆ సంఘటనతో అందరి మూడ్ అవుట్ కావడం గమనించింది. పిక్నిక్ ప్రోగ్రామ్‌ని అర్ధాంతరంగా ఆపివేస్తున్నట్లు వెంటనే ప్రకటించింది. తలలూపారంతా.
నిజానికి అందరిలోనూ ఓ రకమైన భయం చోటు చేసుకుంది.
అసంతృప్తిగా కదిలారు.
పిల్లలైతే అఖిల్ ప్రక్కన కూచోవడానికే జడుసుకున్నారు. అందుకే హెడ్ వాడ్ని స్టాప్ దగ్గర కూర్చోబెట్టింది.
అఖిల్ మాత్రం ఏమీ ఎరగనట్లు కామ్‌గా ఉడిపోయాడు.
అన్నీ సర్దాక అరగంటలో స్కూల్ బస్ భారంగా కదిలింది.
బస్ ప్రయాణిస్తుంటే సుధారాణి ఆలోచనల్లో పడింది.
“అఖిల్ చెప్పిన నృత్య కళాకారిణి పూజిత న్యూస్ నిజంగా జరిగిందే! యస్. ఆ విషయం ఎప్పుడో పేపర్లో చదివినట్టు లీలగా గుర్తు. అప్పడింకా వీడు పుట్టి వుండదు.”
మరి! ఇదెలా సాధ్యం?
ఆ న్యూస్ ఎక్కడైనా చదివి బట్టీ పట్టి వీడిప్పుడు అప్పచెప్పలేదు కదా! అలా చేయాల్సిన అవసరం వీడికేముంది? ఆటపట్టించడానికో ఆశ్చర్యపర్చడానికో చేసి వుండడు.
తన ప్రమేయం లేకుండానే జరిగిపోయిందటున్నాడు. అలాగయితే వీడిలో ఏదో మహత్తు ఉంది ఉండాలి. ఇలా రకరకాల సందేహాలు ఆమెలో.
మరింక ఆలోచటనల్ని కంటిన్యూ చేయలేక భారంగా తల విదిల్చింది.
***
అతని పేరు పాండవీయం.
పేరే కాదు. అతను కూడా విభిన్నమైన వ్యక్తి, సమర్థుడు. తన మనసులో ఒక ఆలోచన రూపుదిద్దుకుంటుండగానే దాన్ని ఆచరణ సాధ్యం చేయగల మేధావి.
అందుకనే, ఒకప్పుడు నెంబర్ వన్‌గా వెలుగొంది.. నేడు కష్టమర్లే దాని పేరు మరచిపోయిన పరిస్థితికి చేరుకున్న.. మనీ మనీ కో-ఆపరేటివ్ బ్యాంక్‌కి కొత్త మేనేజర్‌గా బదిలీ చేయబడ్డాడు.
ఆ బ్యాంక్ పునర్‌వైభవాన్ని ప్రతిష్ఠించే బాధ్యతని పాండవీయం భుజస్కందాలపై మోపబడ్డపుడు-
“ఇది సాధ్యమయ్యే పనేనా?” అనుకున్నాడతను.
అంతటి ఇటలిజెంట్ అలా అనుకోవడంలో తప్పులేదు.
బట్..
అతడు సైతం ఊహించని రీతిలో.. తన ప్రయేయం లేకుండా మనీ మనీ బ్యాంక్ మళ్ళీ ఒక విశిష్ట స్థానాన్ని అక్రమించుకోబోతోందని ఆ క్షణంలో పాండవీయానికి తెలియదు.
బ్యాంక్ మేనేజర్‌గా ఛార్జ్ తీసుకున్నాడు.
దోపిడీ ఘటన జరిగాక బ్యాంకులన్నీ కట్టుదిట్టం చేశారు. అలాగే ఈ బ్యాంకుకి కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మునుపెన్నడూ లేని విధంగా సెక్యూరిటీ నియమించబడింది.
ఈ ఏర్పాటు అనవసరమన్పించింది పాండవీయానికి. అదే విషయాన్ని పై ఆఫీసర్స్ దృష్టికి తీసుకుపోయాడు. వాళ్ళు పరిశీలిస్తామని చెప్పారు.
జాయిన్ ఆయన గంటకే అసిస్టెంట్ మేనేజర్‌కి చెప్పి హడావిడిగా బయటపడ్డాడు పాండవీయం.
ఎప్పుడైతే పాండవీయం కొత్త మేనేజర్‌గా రాబోతున్నాడని, మనీ మనీ బ్యాంక్‌కి మెసేజ్ వచ్చిందో..
అదిగో అప్పుడే బ్యాంక్‌ని దోపిడీ చేసిన నేరస్థులు అలర్టయ్యారు.
తక్షణం అతని కదలికలపై ప్రత్యర్థుల నిఘా ఏర్పాటుయ్యింది.
అలా జరుగుతుందని పాండవీయానికేం తెలుసు!
***
పిక్‌నిక్‌లో జరిగిన ఘటన అక్కడితో సమసిపోతే బావుండేది.
ఆ సంఘటనని అంతా మరచిపోయి అసలేమీ జరగనట్టు ఎవరి మట్టుకు వాళ్ళు ఊర్కుండి తిరిగి వెళ్ళిపోతే ఈ కథ ఇన్ని మలుపులు తిరిగి వుండేది కాదు.
కానీ జరిగిందాలా!
స్కూల్ బస్ నేరుగా అఖిల్ ఇంటికి వెళ్ళింది.
మధ్యంతరంగా స్కూల్ వాళ్ళు ఇంటికి రావడంతో ఆశ్చర్యపోయింది నివేదిత. ప్రోగ్రామ్ ప్రకారం సాయంత్రం ఆరూ – ఏడూ ప్రాంతంలో రావాల్సింది.
అందుకే అడిగింది.
“పిక్‌నిక్ నుండి వచ్చే సరికి సాయంత్రం అవుతుందన్నారు. మరేంటీ మధ్యాహ్నమే తిరిగి వచ్చారు?”
అఖిల్‌ని వెంటేసుకుని లోపలికి వచ్చిన హెడ్ మిస్‌ని, సుధా మేడమ్‌ని ప్రశ్నార్థకంగా చూసింది నివేదిత.
మళ్ళీ వెంటనే “సారీ ముందు మీరు కూర్చోండి. నిలబడే మాట్లాడ్తున్నారు” అంది వాళ్ళకెదురుగా కూర్చుంటూ.
సోఫాలో కూర్చున్నారిద్దరు.
అఖిల్ పరుగున వెళ్ళి తల్లి ఒడిలో గువ్వలా ఒదిగాడు.
“మీకో విషయం చెప్పి వెళదామని వచ్చాం” కాస్త సంశయంగా అంది సుధారాణి.
అప్పుడు గమనించింది నివేదిత ఇద్దరి మొహాలు ఆందోళనా భరితమై వుండడాన్ని. అందుకే చప్పున అడిగింది.
“అసలేం జరిగింది” అని.
“నథింగ్ అంతగా కంగారు పడాల్సిందేం లేదు” అంటూ అఖిల్ వైపు చూస్తూ “నిట్టూ నువ్వు లోపలకి వెళ్ళి రెస్ట్ తీసుకో” అంది హెడ్ మిస్. తలాడిస్తూ వాడక్కడి నుండి బెడ్ రూమ్‌లోకి వెళ్ళిపోయాడు.
వాళ్ళిద్దరి హడావిడికి “ఎవరికీ ఏం కాలేదుగా?” అంటూ ఆతృతగా అడిగింది నివేదిత.
ఆమె కొడుకు నిక్షేపంగా ఉండడంతో హాయిగా ఊపిరి పీల్చుకుంది. కానీ పిక్‌నిక్‌లో కుర్రాడికెవరికైనా ఏమైనా ప్రమాదం జరగలేదు కదా అనే శంక మొదలయ్యిందామెలో. అయినా ఆ విషయం తనకెందుకు చెప్పడం అనుకుంది.
“ఏమీ కాలేదు బట్.. ఓ విషయం అడుగుతాను. అది కూడా మీరు ఫీలవను. అంటేనే..” అంది హెడ్.
“అదేం లేదు. నిర్భయంగా అడగండి..” అందామె.
“మీ అబ్బాయి అఖిల్ ఆరోగ్యం బాగానే వుందా?”
“ఊ..” అంటూ తలూపింది
ఒక్క క్షణం ఆగి.
“ఐ మీన్.. శారీరకంగా లేదా మానసికంగా ఎనీ ప్రోబ్లమ్స్?” నివేదిత ఫీలింగ్స్ అబ్జర్వ్ చేస్తూ ప్రశ్నించింది.
“లేదే? వాడు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అసలు తలనొప్పి ఎరుగడు. అడపా తడపా జలుబు, జర్వం మినహా మరే వ్యాధీ ఎటాక్ చేయలేదు.”
“ఐసీ!”
“అసలెందుకివన్నీ అడుగుతున్నారు?”
ఇద్దరూ మౌనం వహించారు.
“నా దగ్గర మీరేదో దాచే ప్రయత్నం చేస్తున్నారు. అసలేం జరిగింది? పిక్‌నిక్‌లో మా వాడికేం కాలేదుగా?”
తనకి తెలియకుండానే అప్పుడు మొదలయ్యిందామోలో భయం. ఏమీ జరగి వుండకూడదని వెంటనే మనసులో దేవుడికి మొక్కుకుంది.
“మీరు అనవసరంగా వర్రీ అవకండి. మీ వాడికేమీ జరగలేదు. హీ ఈజ్ ఆల్‌రైట్. ఆయితే పిక్‌నిక్ జరిగిన ఒక సంఘటన మాత్రం వినండి” అంటూ సుధారాణి వివరించిందా ఘటనని.
మధ్యలోనే ఏడ్పు ప్రారంభించింది నివేదిత.
“చూడండి. అక్కడ జరిగింది మీకు చెప్పి మిమ్మల్ని బాధపెట్టడానికి మేమిక్కడికి రాలేదు. ఈ సంఘటన మరో ప్రమాదానికి దారితీయకూడని ముందుగానే జాగ్రత్తపడమని చెప్పడానికి వచ్చాం” అంది హెడ్.
“పైగా ఈ విషయం ఎవరికీ చెప్పకండి. అనవసర ప్రచారం జరుగుతుంది బాబు మీద. మేం కూడా ఈ క్షణాన్నే దీన్నిమరచిపోతాం” చెప్పింది సుధారాణి.
అలా ఆమెకి ధైర్యం చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు.
తాను చదివిన చదువు అదొక మానసిక బలహీనతగా నిర్ధారిస్తుంటే, తాను పెరిగిన గ్రామీణ వాతావరణం అఖిల్‌ని ఏదైనా దుష్టశక్తి ఆవహించిందేమోనని అనుమానిస్తోంది.
ఎటూ తేల్చుకోలేని మానసిక సంఘర్షణలో పడిందామె.
కానీ ఒక్కటి మాత్రం నిజం. నా చిట్టి తండ్రికి ఏదో జరుగుతోంది. వాడికే తెలియకుండా అక్కడే ఏదో జరిగి వుంటుంది. పిక్‌నిక్‌కి పంపాల్సింది కాదు. మొన్న బెలూన్ సాహసమంటూ అలా ప్రమాదం తప్పిపోయింది. క్షేమంగా బ్రతికి బయటపడ్డాడనుకుంటే ఈ రోజు ఇలా జరిగింది.
రేపేం జరుగుతుందో?
అలా జరక్కూడదు.
నా బాబు సమస్యలు వలయంలో చిక్కుకోకుండా ఆపాలి.
కానీ ఎలా?
అప్పుడు తట్టిందామెకో ఆలోచన.
అదే ఆమె తీసుకున్న తప్పుడు నిర్ణయం!
మరోసారి ఇలా జరిగితే చూద్దామనుకొని ఈ సమస్యని అంతటితో వదిలేస్తే బాగుండేది. సీరియస్‌గా తీసుకుందామె.
తన ఆలోచన మరో అధ్యాయానికి మలుపు తిప్పబోతోందని కనీసం ఊహించనైనా లేదామె.
ఊహించి ఉంటే..!?
***
ఆయన పేరు షణ్ముగం.
నగరంలో పలుకుబడి కల్గిన వ్యక్తుల్లో ఒకడు. ఆర్థికంగా ఆరా తీస్తే టాప్ టెన్ సిటీజన్స్‌లోకి వస్తాడు.
వయసు నలభై అయదు. కానీ వంశపారంపర్యంగా వచ్చిన బట్టతల, అక్కడక్కడా నెరుస్తున్న గడ్డం. అతన్ని మరింత వయసు పైబడ్డ వ్యక్తిలా కన్పించేలా చేస్తాయి.
అతను చేపట్టని వ్యాపారం లేదు. చేయని పని లేదు. రాజకీయంగా కూడా చాలా ఇన్‌ఫుయన్స్ వుంది. ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు అందరితోనూ స్నేహ సంబంధాలున్నాయి. మంచి విలువ కూడా ఉంది.
ఆ మధ్య జరిగిన ఎలక్షన్స్‌లో తాను కోరుకున్న నియోజిక వర్గం నుండి యం.పి.గా పోటీ చేయమని అన్ని పార్టీల నుండి విడివిడిగా ఆఫర్స్ వచ్చాయి.
ఏదో ఒక వర్గానికో, పార్టీకో, వ్యవస్థకో కట్టుబడి వుండడం తనకి ఇష్టం లేదు. అందుకే చిరునవ్వుతో వారి అభ్యర్థనను సున్నితంగా తిరస్కరించాడు.
ఒక్కగానొక్క కొడుకు అమెరికాలో ఇంజనీరింగ్ చదువుతున్నాడు. తనకి దూరంగా ఉండి కొడుకు చదువుకోవడం ఇష్టం లేదతనికి. కానీ కొడుకు పట్టుబట్టడంతో గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పింది కాదు.
భార్య చనిపోయి పదేళ్ళయ్యింది. కన్న కొడుకు మీద మమకారంతో మళ్ళీ వివాహం చేసుకోలేదు.
ఉన్నత కుటుంబీకులైన కొందరు స్త్రీలతో షణ్ముగానికి రహస్యంగా లింక్స్ వున్నాయని జనం చాటుగా చెవులు కొరుక్కుంటారు.
ఉదయం.
సమయం తొమ్మిది.
షణ్ముగం పూజ గదిలో నుండి హాల్‌లోకి వచ్చాడు.
“నమస్కారమండీ” అని విన్పించింది.
తలెత్తి చూశాడు.
బదులుగా ప్రతి నమస్కారం చేశాడు.
తన ఆగమనంతో లేచి నిలబడిన ఆ అపరిచిత వ్యక్తిని కూర్చోమని సైగ చేస్తూ, ఆ వ్యక్తికి ఎదురుగా సోఫాలో కూర్చున్నాడు షణ్ముగం.
“నా పేరు దశరథ నాయుడంటారండి. ఇప్పటి దాకా ఉల్లి వ్యాపారం చేసి నాలుగు రాళ్ళు సంపాదించానండి. ఏ నాటికైనా ఓ సినిమా తీయాలన్న కోరికొకటి బలంగా నాటుకుపోయిందండి. సరిపడా డబ్బు చేతిలో పడగానే ఆ కోరిక వటవృక్షమై విస్తరించడంతో వచ్చి హైద్రాబాద్‌లో పడ్డానండి.
శివనాగేశ్వరరావు దగ్గర పలు సినిమాలకు కోడైరెక్టర్‌గా పన్చేసి అనుభవం సంపాదించిన మా వూరి గురుమూర్తిని డైరెక్టర్‌ని చేస్తూ ఓ కామెడి పిక్చర్ లోబడ్చెట్‌లో తీసినానండి. ఆలీ, కొత్తమ్మాయి హీరో హీరోయిన్లండి.
అరవై అవుద్దేమోననుకున్నానండి. ఎనభై లక్షలు దాటిందండి. ఇంకో పదిహేనయితే గానీ ప్రసాద్ ల్యాబ్ నుండి బయటపడి రిలీజ్ అయ్యేట్టులేదండి. అందుకని మీ సాయం కోసం పరుగెత్తుకొచ్చానండి” వినయంగా తన గోడు వెళ్ళబోసుకుంటూ వాపోయాడు ఛోటా నిర్మాతగా మారిన ఆ ఉల్లిగడ్డల వ్యాపారి.
అతని మాటల్లోని నిజాయితీ గుర్తించాడు షణ్ముగం.
దశరథనాయుడు చెప్పిందంతా ఓపిగ్గా, సావధానంగా విన్న షణ్ముగం అతన్ని ప్రశ్నించాడిలా.
“చేసేది, చేయించేది అంతా నేనే – అనేది శ్రీకృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. మన చేతల్లో ఏముంది? అయినా నీ సినిమాకి బయ్యర్స్ లేరా?”
“లేకేం? ఉన్నారండీ! వాళ్ళు చెబితేనే సినిమా మొత్తం రామోజీ ఫిలిం సిటీలో తీశాను కదండీ. కొత్త డైరెక్టర్ కదా! ప్లానింగ్ లోపంతో సినిమా బడ్జెట్ గ్రాఫ్ అనుకోకుండా పెరిగిందండీ. కొనుగోలుదార్లేమో పిక్చర్ మొదలెట్టినప్పుడెంత ఒప్పందం కుదిరిందో అంతకంటే ఒక్క నయాపైసా ఎగస్ట్రా ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పేసినారండీ. మీరే ఎలాగైనా ఆదుకోవాలండి” ప్రకంపిత కంఠంతో ప్రాధేయపడ్డాడు దశరథనాయుడు.
“ఇతరులకి అర్థం కాని వ్యక్తుల” గురించి సర్వే చేస్తే, ఆ సేకరణలో మొట్టమొదటి పేరుగల వ్యక్తిగా షణ్మగమే దర్శనమిస్తాడు.
“మీరు.. మరేమీ ఆలోచించకండి. గుంటూరులో నాకో పాతిక లక్షల బిల్డింగుందండి.. ఎలాగానా మీరే డబ్బు సర్దాలండి. మీరు సాయపడితేనే ఆ సినిమా బయటబడి.. రిలైజైతేనే నేను గట్టెక్కేదండి. లావాదేవీలు మీరేలాగంటే అలాగే చూసుకుందామండి. మీరు కాదంటే మాత్రం పత్తి రైతుల ఆత్మహత్యల పరంపరలా.. సినిమా రిలీజే చేసుకోలేని చోటా నిర్మాతల ఆత్మహత్యల లిస్ట్‌లో నా పేరు ఫస్టుంటుందండి” అంటూ కాళ్ళమీద పడ్డంత పని చేయబోయాడు.
వద్దని వారించాడు షణ్ముగం.
“చేసేది చేయించేది అంతా నేనే – అనేది శ్రీకృష్ణపరమాత్మ స్టేట్‌మెంట్. నేను నిమిత్తమాత్రుడను” అన్నాడు.
“అయ్యయ్యో అలాగనకండి. నన్నీ ఆపదనుండి రక్షించండి” దీనంగా వేడుకున్నాడా నిర్మాత.
షణ్ముగం పెదాలపై సన్నని నవ్వు.
“సర్సరే. మళ్ళీ సాయంత్రం కలువు. నేను అత్యవసరంగా ఓ కాన్పరెన్స్‌కి అటెండ్ కావాల్సి ఉంది” అన్నాడు తప్ప ఖచ్చితంగా మాటివ్వలేదు షణ్ముగం.
ఎవరికైనా అభయం ఇచ్చాడంటే అదెంత కష్టతరమైనా చేసిపెడతాడు. అది షణ్ముగానికి పుట్టుకతో వచ్చిన సుగుణం. అయితే ఈ నైజమే భవిష్యత్‌లో తనని నిలువునా ముంచేస్తుందని అతనికి కలలో సైతం ఊహకందని విషయం!
ఆ సమాధానం విని ధశరథనాయుడి కళ్ళు మెరిశాయి.
బుర్ర మీసాల తలనాడిస్తూ కృతజ్ఞతా పూర్వకంగా ‘థాంక్సండీ!’ అనేసి బయటకు నడిచాడు.
“సేమ్ టూ యూ!” అని చెప్పి లోపలికెళ్ళిపోయాడు షణ్ముగం.
అంత క్యాష్ స్పాట్‌లో షణ్ముగం దగ్గర లేకకాదు, ఆ నిర్మాతకి సాయంత్రం వరకూ గడువు పెట్టింది.
నమ్మకమైన వ్యక్తి చేత ఈ లోగా దశరథనాయుడి బయోడేటా సేకరించబడుతుంది. ఆ ఇన్‌ఫర్మేషన్ ఆధారంగా దశరథనాయుడికి సాయం చేసేది లేనిది నిర్ణయంచుకుంటాడు షణ్ముగం.
అదీ అతని పాలసీ!
ఒక వ్యక్తి తనని అవసరార్థం కలిసాడంటే అతని పుట్టుపూర్వాత్తరాలు మొత్తం షణ్ముగం కంప్యూటర్ మైండ్‌లో నిక్షిప్తమై ఉండాల్సిందే.
అలా జరగనిదే అతను మనుషుల్తో మనీ చదరంగం ఆడలేడు!
***