తిరుమలేశుని సన్నిధిలో… -3

0
7

[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]

తిరుమల/తిరుపతితో నా అనుబంధం ఐదు దశాబ్దాల పైబడినది. 1947 మాఘమాసం రథసప్తమి పుణ్యదినాన నేను శారదాంబ లక్ష్మీకాంతారావుల వ్రతఫలంగా నెల్లూరు జిల్లాలో బుచ్చిరెడ్డిపాళెమునకు సమీపంలోని జమీందారీ గ్రామం చెన్నూరులో పుట్టాను. నెల్లూరులోని కన్యకల ఆసుపత్రిలో మూడు రోజుల ప్రసవ వేదనానంతరం రథసప్తమి శుభోదయాన కర్కాటలగ్నంలో, మేష రాశిలో కుజుడు ఉచ్చస్థానంలో ఉండగా గ్రహాలన్నీ ఐదు రాశులలో వుండగా నా జననం జరిగింది.

తిరువనంతపురంలోని సంపన్న దైవం అనంతపద్మనాభస్వామి వ్రతం స్వీకరించిన సంవత్సరమే పుట్టడంవల్ల నేను ‘అనంతపద్మనాభుడి’నయ్యాను. శారదాంబా తనయుడిని గాబట్టి చదువుల తల్లి ఆశీర్వదించింది. లక్ష్మీకాంతయ్య తండ్రి గావడం వల్ల సంపదలు, పుత్రసంపదలకు కొదవ లేకుండా పోయింది.

1962-65 మధ్య నెల్లూరు వెంకటగిరి రాజా కళాశాలలో స్పెషల్ తెలుగు బి.ఏ.లో హైసెకండ్ క్లాస్‌లో ప్యాసయ్యాను. ఎం.ఏ చదవడం కోసం తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ ప్రాంగణంలోకి కాలు మోపాను. తిరుపతి రావడం ఇది ప్రథమం కాదు.

1960 జూన్ మాసంలో మా తాతగారు సుబ్బయ్య, రంగమ్మ దంపతుల సంతానం మొత్తం (పదిమంది సంతానం) మొక్కుబడిగా తిరుపతి క్షేత్రం సందర్శనం చేశాం. దాదాపు 25 మందిమి. నేను, మా పెద్దనాన్నల కుమారులిద్దరం ఆ సంవత్సరమే యస్.యస్.యల్‌.సి పరీక్షలు రాశాం. కుటుంబమంతా నెల్లూరులో రైలు ఎక్కి ఉదయానికి శ్రీకాళహస్తి చేరాం. స్వర్ణముఖీనదీ స్నానం చేస్తున్నాము. జూన్ నెల అయినా నీళ్ళు పారుతున్నాయి. ఆ శుభోదయవేళ పక్కనే బ్రిడ్జి మీద సైకిల్‌పై వెళుతూ ఓ కుర్రాడు ‘యస్.యస్.యల్‌.సి. రిజల్ట్స్’ అంటూ ఆంధ్రపత్రిక అమ్ముతూ కేకవేశాడు. ఆదుర్దాగా కొని ఫలితాలు చూశాం. నేను ప్యాసయ్యాను. శ్రీకాళహస్తీశ్వరుని సందర్శించుకొని తిరుపతి చేరుకున్నాం. ఆ రోజుల్లో రైళ్ళు రేణుగుంట వరకే ఉండేవి.

తిరుపతి సత్రంలో:

1960 నాటి మాట. సకుటుంబంగా తిరుపతి చేరిన మేము ప్రస్తుతం రైల్వే స్టేషన్ పక్కనే వున్న ఉచిత సత్రాలు – ఒకటో నెంబరులో దిగాము. కట్టెల పొయ్యి వెలిగించి భోజనాలు తయారుచేసుకున్నాం. అప్పుడు నా వయస్సు 14 సంవత్సరాలు. రెండు మూడు రోజులు క్రింద వున్న గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానురు పద్మావతీ అమ్మవారిని, కోదండరామస్వామిని దర్శించుకొన్నాం. బస్సులో తిరుమల చేరాం.

అప్పటికి మహాద్వారం గుండానే దర్శనం. 1983 తర్వాతనే వైకుంఠం కాంప్లెక్స్ దర్శనాలు మొదలుయ్యాయి. యస్.యస్.యల్‌.సి. ప్యాసైన సంతోషంలో తలనీలాలు సమర్పించాను. పాపనాశనం, గోగర్భం వగైరా ప్రదేశాలు కాలినడకనే వెళ్ళి చూసాం. పుష్కరిణీ స్నానం చేసి ఆనంద నిలయుని తనివితీరా సేవించాం.

రేవూరు వంశానికి ఇలవేల్పు శ్రీవేంకటేశ్వరుడు. మా కుటుంబానికి పెద్ద దిక్కు మా అవ్వ రంగమ్మ. మా తాత మృదువరి. కుటుంబ సంక్షేమాన్ని కోరి ఆమె తిరుమలేశునికి మొక్కుకుంది. మాకు ఆవులు, గేదెలు, వాటికి ఒక పశువుల కొట్టాం ఉండేవి. రెండేళ్ళ క్రితం ఒక ఆవుకు ‘బాపన పసి’ కోడె దూడ పుట్టింది. దానిని స్వామికి ముడుపుకట్టింది మా అవ్వ. దానిని అమ్మగా అప్పట్లో రు 250/- వచ్చింది. దాంతో యాత్ర పూర్తి చేశాం.

మా నాయనమ్మకు నేను గారాల మనవడిని. ఆమెకు రోజూ భారత భాగవత పురాణాలలోని పది పద్యాలు రోజూ చదివి వినిపించేవాడిని. ఆమెకు గ్రహణ శక్తి అపారం. ఆ పురాణ కథలన్నీ ఇతరులకు సాంగోపాంగంగా చెప్పేది. నాకు పురాణ పండితుడు అని మా బంధువులు పేరు పెట్టారు. ఆమె రోజూ నాకు జామ పండో, అరటి పండో నజరానాగా ఇచ్చేది. 1955-60ల మధ్య మా సోదరులం ముగ్గురం ఆమె పెంపకంలోనే బుచ్చిరెడ్డిపాలెం పైస్కూలులో చదివాం. మా బాబాయి వెంకటప్పయ్య మాకు మార్గదర్శి. పరీక్షలు ప్యాసయిన తర్వాత సంవత్సరానికొకసారి సినిమాకు వెళ్ళే అనుమతి లభించేది. అలా సాగిన మా చదువు క్రమశిక్షణను వినయవిధేయతలను నేర్పింది. తిరుమలేశుని దర్శనానంతరం ఎవరి గ్రామాలకు వాళ్ళు మా పెద్దనాన్నలు, చిన్నాన్నలు తిరిగి వెళ్ళారు.

1965 జూన్:

బి.ఏ డిగ్రీ పుర్తయింది. ఎం.ఏ చదవాలని కోరిక. వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (తిరుపతి) లో చేరాలని వెళ్ళాను. మా గ్రామానికి చెందిన మిత్రుడు వెంకటేశ్వరరావు ఇంజనీరింగ్ కాలేజిలో మొదటి సంవత్సరం సివిల్స్ చదువుతున్నాడు. మంచాల వీధిలో ఒక రూమ్ తీసుకొని వాళ్ల అక్కయ్య వండిపెట్టగా వుంటున్నాడు. నేను వాళ్ళ దగ్గరికెళ్లాను.

యూనివర్శిటీ మెయిన్ బిల్డింగులో ఎం.ఏ. తెలుగు అప్లికేషన్ తీసుకొన్నాను. డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికెట్ యిచ్చారు. వాటి కాపీల మీద ఎవరో ఒక గెజిటెడ్ ఆఫీసరు సంతకం కావాలి. నాకెవరూ తెలియదు. యూనివర్శిటీ సంస్కృత విభాగంలో రీడరు కొంపెల్ల దక్షిణామూర్తిగారు కె.టి రోడ్‌లో ఉండేవారు. వారి ఇంటికి వెళ్ళాను. ఆయన గొప్ప సంస్కృత పండితులు. చాలా సేపు ఇష్టాగోష్టిగా మాట్లాడారు. నా సర్టిపికెట్ కాపీలపై సంతకాలు పెట్టారు. ఆయన కుమార్తె భాస్కరశేషారత్నం కూడా నాతో బాటు 1965-67లలో తెలుగు ఎం.ఏ పూర్తి చేసి పద్మావతీ మహిళా కళాశాలలో అధ్యాపకురాలైంది.

1965 జూన్‌లో ప్రవేశానికి ఇంటర్య్వూ జరిగింది. యూనివర్శిటీ కళాశాలలో మెయిన్ బిల్డింగ్‌లో ప్రిన్సిపాల్ కె.నీలకంఠం ఏవో కొన్ని ప్రశ్నలు వేసి అడ్మిషన్ యిచ్చారు. 1965-జూన్ మాసాంతంలో కొత్తగా కట్టిన ఆర్ట్స్ బ్లాకులో కుడివేపు విభాగంలో తెలుగు శాఖ క్లాసులు మొదలయ్యాయి. 1965 మేలో కాబోలు తెలుగు శాఖా ఆచార్యులుగా పింగళి లక్ష్మీకాంతం రిటైరయ్యారు. జి.యన్.రెడ్డి రీడర్-ఇన్-చార్జిగా శాఖాధ్యక్షులయ్యారు. మేం 14 మంది విద్యార్థినీ విద్యార్ధులం.

గురుపరంపర:

మాకు మహనీయులైన గురువులు అధ్యాపకులు. జి.యన్.రెడ్డితో బాటు ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రి, ఆచార్య జీరెడ్డి చెన్నారెడ్డి, డా. జాస్తి సూర్యనారాయణ, డా. తిమ్మావజ్ఘల కోదండరామయ్య, పంగనామల బాలకృష్ణమూర్తి మా అధ్యాపకులు. ఎం.ఏ. ప్రిలిమ్స్ 1965-66లో పూర్తి అయింది. జి.యన్.రెడ్డి అమెరికాలో విస్కాన్సిన్ యూనివర్శిటీలో లింగ్విస్టిక్స్ అధ్యాపకులుగా పని చేసి వచ్చారు. బోధన విషయంలో ఆధునిక పద్ధతులు ప్రవేశపెట్టారు. సెమినార్లు, పర్యాటనలు మొదలుబెట్టారు. విద్యార్ధులను ‘మీరు’ అని సంభోధించేవారు.

అరుణా ‘చలం’ సందర్శనం:

తొలి సంవత్సరం మమ్మల్ని సాతనూర్ డామ్, అరుణాచలం పర్యటనకు తీసుకువెళ్ళారు. అరుణాచలంలో వానప్రస్థాశ్రమం చేస్తున్న ప్రముఖ రచయిత ‘చలం’తో ముఖాముఖీ ఏర్పాటు చేశారు. ఆయనతో మాట్లాటమే ఒక ఎడ్యుకేషన్. నేనూ వారి రచనలలో మ్యూజింగ్స్ చదివి ఉన్నాను. వాటి గూర్చి ప్రశ్న వేశాను. చలం దగ్గర ఆయన కుమార్తె ‘సౌరీస్’ కూడా ఉంది. సరదాగా పర్యటన ముగించుకొని వచ్చాము.

రామాలయ ప్రసాదాలు:

నేను వసతిగా వుంటున్న ఇల్లు మంచాల వీధికి వంద గజాల దూరంలో పురాతన కోదండరామాలయం వుంది. ప్రతి సాయంకాలం నేను, నా మిత్రుడు వెంకటేశ్వరరావు ఆ గుడికి వెళ్లేవారం. నైవేద్యానంతరం దధ్యోజనమో, పొంగలియో ప్రసాదంగా ఇచ్చేవారు. అది శుభ్రంగా తినేవాళ్ళం. కోదండరాముని మూలవిరాట్ విగ్రహం నిండైనది. ధనుస్సును ధరించిన స్వామికి ఇరువైపుల లక్ష్మణస్వామి, సీతమ్మవారి విగ్రహాలు భక్తులకు ఆనందం కలిగించేవి. అదీ ఆలయంలో జరిగే శ్రీరామనవమి కల్యాణోత్సవానికి శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ కోసం 50 ఏళ్ళ తర్వాత 2007లో ప్రత్యక్షవ్యాఖ్యానం చేస్తానని కలలో కూడా ఉహించలేదు. అప్పటికింకా ఆలయం పూర్తిగా ప్రహారీగోడతో ఉండేది కాదు. రామాలయంలో జరిగే ఉత్సవాలకు అప్పటి కార్యనిర్వహణాధికారి ఉమాపతి ముందుండి నిర్వహించేవారు. ఇప్పట్లో పనుల వత్తిడి వల్ల కార్యనిర్వహణాధికారి పరిసర ఆలయాల ఉత్సవాలకు హాజరు కాలేకపోతున్నారు. తిరుపతి జాయింట్ ఎక్జిక్యూటివ్ ఆఫీసరు మాత్రం సంవత్సరోత్సవాల ముఖ్య రోజులలో హాజరవుతున్నారు.

ఇప్పుడున్న అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ఎదురుగా యస్.వి.ఆర్ట్స్ కళాశాల ఉండేది. దానిని డబ్బారేకుల కాలేజీ అని పిలిచేవారు. సముద్రాల నాగయ్య ప్రిన్సిపాల్. గోవిందరాజస్వామి ఆలయ సమీపంలో ప్రస్తుతం మ్యూజియం వున్న ప్రదేశంలో ఓరియంటల్ కాలేజి వుండేది. అక్కడ పింగళిసూరనపై పింగళి లక్ష్మీకాంతం గారి ప్రసంగం వినడం గొప్ప మధురానుభూతి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here