లుకా-ఛుప్పి : సీరియస్ విషయంతో దాగుడు మూతలు

0
4

[box type=’note’ fontsize=’16’] “కాసేపు యేమీ ఆలోచించకుండా నవ్వుకోవడానికైతే సరిపోయే చిత్రం” అంటున్నారు పరేష్ ఎన్. దోషి “లుకా-ఛుప్పి” చిత్రాన్ని సమీక్షిస్తూ. [/box]

[dropcap]ఈ[/dropcap] మధ్య హిందీ లో రకరకాల కొత్త, బోల్డ్ కథలతో ముందుకొస్తున్నాయి. ఈ వారం “లివ్ ఇన్ రిలేషన్” మీద కథ అల్లిన చిత్రం లుకా-ఛుప్పి (అంటే దాగుడు మూతలు) వచ్చింది. ఈ రోజుల్లో వివాహం కాకుండానే కలిసి వుండడం అనేది అంత ఆశ్చర్యం కలిగించే విషయంగా మిగల లేదు, అలాగని చాలా మామూలు విషయం కూడా కాదు. అలాంటి సంబధాలలో వ్యక్తుల హక్కుల గురించిన చట్టాలు కూడా వున్నాయి. దీని బట్టి ఇది మరీ అంత కొత్త సంగతి అనిపించదు. అయితే ఈ అంశం మీద న్యాయం చేసేలా చిత్రాన్ని తీశారా అని చూస్తే లేదనే చెప్పాల్సి వస్తుంది. హాస్యం మరుగున కథ అల్లడం వల్ల విసుగు అనిపించకపోయినా, కొత్తగానూ అనిపించదు, సంతృప్తికరంగానూ వుండదు.

క్లుప్తంగా కథ చూద్దాం. మథురా లాంటి వో చిన్న పాటి టవునులో లోకల్ కేబల్ టీవీ లో గుడ్డు (ఆర్యన్ కార్తీక్) వో ఏంకరు. అతనితో వో ప్రాజెక్టులో పనిచేయడానికి జేరుతుంది రశ్మి (కృతి సనన్). ఆమె తండ్రి (వినయ్ పాఠక్) వో రాజకీయ నాయకుడు. ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయని అతని పార్టీ కి అనుసంధానంగా వుండే “భారతీయ సంస్కృతీ సమ్రక్షక్ దల్” పెళ్ళి కాకుండా కలిసి తిరిగే జంటలను పట్టుకుని అవమాన పరచడం, బెదిరించడం, పీడించడం చేస్తుంటారు. (ఇప్పటికీ వేలెంటైన్ డే నాడు ఇది జరుగుతుండడం శోచనీయం). దీనికి వెనుక వో సెలెబ్రిటి తను అలాంటి సంబంధం లో వుండడమే కాకుండా సమర్థిస్తూ వ్యాఖ్యలు చేయడమే. గుడ్డు ఇంట పెళ్ళి కాని అన్న (అతనికి యే సంబంధమూ కుదరదు), స్త్రీలోలుడైన బావ, తల్లి, తండ్రి వుంటారు. వో ముస్లిం మిత్రుడు అబ్బాస్ (అపరాశక్తి ఖురానా) యెప్పుడూ చేదోడు వాదోడుగా వుంటాడు. గుడ్డు, రశ్మిలు వొకరినొకరు ఇష్టపడతారు. కాని అతను ప్రతిపాదన చేసినపుడు ఆమె వెనక్కు తగ్గి, ముందు నువ్వు యేమిటో తెలుసుకోవాలి, కొన్నాళ్ళు లివ్ ఇన్ లో వుంటేనే అది సాధ్యం అంటుంది. వాళ్ళకు ప్రాజెక్ట్ పని మీద గ్వాలియర్ వెళ్ళాల్సి వస్తుంది ఇరవై రోజుల కోసం. అక్కడ వాళ్ళు వో ఇల్లు అద్దెకు తీసుకుంటారు, భార్యాభర్తలమని చెప్పుకుని (లేదంటే ఆ దళ్ వాళ్ళు బతకనివ్వరు యెవరినీ). ఇక్కడి నుంచి వాళ్ళు రకరకాల పరిస్థితుల్లో అబధ్ధాలాడాల్సి రావడం, అది మరింత ఇబ్బందులకు గురి చేయడం ఇదంతా హాస్యంగా అల్లాడు కథకుడు. యెలాగూ పెళ్ళయిపోయింది (అలా అనుకుంటారు) కదా అని ముందు కోపం తెచ్చుకున్నా ఇరు కుటుంబాలూ ఆ సంబంధాన్ని దీవించి దగ్గరకు తీసుకుంటారు. రశ్మిలోని నిజాయితీ ఆమెను నిలవనీయదు : టెక్నికల్గా చెప్పాలంటే తాము రెండు కుటుంబాలతో కలుపుకుని వొక లివ్ ఇన్ లోనే వున్నాము అంటుంది. పెళ్ళి చేసుకోవాలంటుంది. మళ్ళీ పెళ్ళి యేమిటి అంటారు పెద్దలు. వీళ్ళు మింగలేక కక్కలేక, దొంగచాటుగా చేసుకునే ప్రయత్నం చేసి అక్కడా పట్టు బడి పోతూ వుంటారు. ఇక ఆడిన నాటకాలు చాలు అని చివర్న నిజం చెప్పేస్తారు. దానితో పాటే కొంత చర్చ. అసలు యెవరికీ సంస్కృతి గురించిన ఆలోచన లేకపోగా దాన్ని కేవలం రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారనీ, అందులోనూ పొరపాటు అంచనాలతో ముందుకు వెళ్తున్నారనీ అంటారు. ప్రస్తుతం యెక్కువ శాతం వోటర్లు యువత అయితే వాళ్ళకు కావాల్సింది యేమిటో చూడకుండా వాళ్ళను ఈ సంస్కృతి పేరుతో హింసించి దూరం చేసుకుంటున్నారని అంటారు. మొత్తానికి ప్లేటు ఫిరాయించి ఆ లివ్ ఇన్ ని సమర్థించిన సెలెబ్రిటిని తీసుకుని కేంపేను చేయడంతో సినెమా ముగుస్తుంది.

సంస్కృతి పేరుతో జరుగుతున్నవి చెప్పడం, అది రాజకీయ లబ్ధికోసం పావులా వాడటం ఇలాంటివి కొత్తగా కాకపోయినా బానే వున్నాయి. ఆ చివరి చర్చ కూడా కాస్త అర్థవంతంగానే వుంది. కాని ఇంత సినెమాలో లివ్ ఇన్ గురించిన కథ యే మాత్రం వుంది? కొన్నేళ్ళ క్రితం వేక్ అప్ సిడ్, శుద్ధ్ దేశి రొమాన్స్ లాంటి చిత్రాలు ఈ విషయంలో మెరుగు. ఆర్యన్, కృతి బాగానే చేశారు. వొక మంచి నటుడైన పంకజ్ త్రిపాఠి ని ఇందులో వో జోకర్ని చేసి పడేశారు. అపరాశక్తి ఖురానా పాత్ర తక్కువే. సాంకేతికంగా పర్లేదు. పాటలు బాగున్నాయి. కాసేపు యేమీ ఆలోచించకుండా నవ్వుకోవడానికైతే సరిపోయే చిత్రం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here