[box type=’note’ fontsize=’16’] బొందల నాగేశ్వరరావు గారు వ్రాసిన మినీ నవల ‘పామరులు – పడవతాత‘ సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము. ఇది ఆరవ, చివరి భాగం. [/box]
[dropcap]మౌ[/dropcap]నం తన వంతయ్యింది పడవతాతకు. తనలో కోపం కట్టలు తెంచుకొంది. కాని ఏమీ చేయలేని పరిస్థితి. అప్పుడు అయినకు తన జనాలను కాపాడుకోవలసిన నిర్భంధం ఏర్పడింది. అవును తన జీవిత చరమాంకంలో తన వాళ్ళకు ఏదైనా మంచి చేసి తన్ను గూర్చి తన ముందు తరాల వారు మాట్లాడుకోవాలంటే ఆ జనాలను కాపాడ్డమే తక్షణ కర్తవ్యం, ధర్మం. అదే తన జీవితానికి పరమార్థం అనుకొన్నాడు పడవతాత.
అయితే ఎలా? ఆ జనాన్ని కాపాడాలి? వాళ్ళను బాంబుపెట్టి చంపాలని వచ్చిన ఆ పొడవాటి మనిషి ఆ పనిని చేయకుండా ఆపించాలి. అది యెలా జరగాలి!? తను శక్తిహీనుడు. అయినా తన జనాన్ని కాపాడుకోవాలి. ఎలా.?..ఎలా??
పడవతాత మెదడంతా ఆలోచనలతో వేడెక్కి పోయింది. అయిన ఆలోచిస్తున్నాడు. దీర్ఝంగా ఆలోచిస్తున్నాడు. చివరికో నిర్ణయానికొచ్చాడు. ఆ ఎస్.ఐ.ఆర్. తన అమాయకపు జనాలను చంపటానికి ముందే వాణ్ణే చంపేస్తే….! ఒక్కడితో పీడా విరగడై పోతుందని అనుకొన్నాడు. వెంటనే ఆ ప్రయత్నంలోకి దిగాడు.
అప్పుడెందుకో ఆకాశంలో ఉన్నట్టుండి నిండుగా మబ్బులు కమ్ముకొని వెన్నెల కాస్తా మరుగైపోయింది. అప్పటి వరకూ మౌనంగా ఒడిదుడుకులు లేకుండా వున్న నది కాస్తా రఫ్‌గా మారిపోయింది. ఆ కారణంతో పడవ కాస్త ఒడిదుడుకులతో నడుస్తోంది. తనకు తెడ్లను వేయడం కూడా కాస్త ఇబ్బందిగా మారింది!
“ఏమిటి తాతా! ఉన్నట్టుండి వాతావరణం మారిపోయింది. ఇంతసేపు వెన్నెల్లో నడచిన పడవ మబ్బేసిన కారణంతో చీకటిలో నడుస్తోంది” అన్నాడు.
“ప్రకృతి కదయ్యా! ఏ సమయంలో ఎలా మారుతుందో ఎవ్వరం వూహింలేము.”
ఓ నిముషం నడిచింది పడవ.
మళ్ళీ పడవతాతే ఆలోచనా ధోరణితో “అయ్యా! తమకు ఈతొచ్చా?” అని అడిగాడు.
“ఈతా…. రాదే! అయినా ఈత నేర్చుకోవలసిన ఖర్మ నాకేం పట్టింది?” ఎస్.ఐ.ఆర్. జవాబు.
“కాదూ… ఉన్నట్టుండి మారిపోయిన ఈ వాతావరణంలో తమకేదైనా అయితే!?”
“నాకేమీ కాదు. అలాంటిదేదైనా జరిగితే నువ్వున్నావుగా కాపాడ్డానికి”
“అది నిజమేననుకో” అని పడవతాత అంటుండగా జల్లులుగా పడుతున్న వాన కాస్త ఎక్కువ కాసాగింది.
పడవతాత మనసులోనూ ఆలోచనలు వేగంగా సుళ్ళు తిరుగను ప్రారంభించాయి. మరో గంటలో నాలుగు వందల ఓట్లకోసం ఓ గ్రామాన్నే బీడుగా మార్చాలని తన పడవలోనే ప్రయాణం చేస్తున్న యముడిని తనే తీసుకు వెళుతున్నందుకు మనసులోనే మథనసడ్డాడు. ఇక లాభం లేదనుకొన్నాడు. పడవ వెళుతున్న దిక్కును మార్చాడు పడవతాత. తనలోని శక్తినంతా కూడదీసుకొని తెడ్లను ఒడుపుగా వేస్తున్నాడు.పడవ వేగంగా వెళుతుంది.
అంతే… పడవతాత ఆ పడవను తీసుకు వెళ్ళి అంతుచిక్కని అగాధంలోని సుడిగుండంలో కలిపేశాడు. ఆ పెద్ద సుడిగుండంలో పడవ గల్లంతయ్యింది.
అప్పుడు ఈత తెలియకపోయినా ఎస్.ఐ.ఆర్. బాంబులు, తుపాకులున్న పెట్టెను విడిచిపెట్టకుండా ‘హెల్ప్….హెల్ప్’ అంటూ మునకలతో తప్పించుకోవాలని ప్రయత్నిస్తుండగా మృత్యురూపంలో వచ్చినవాడు తప్పించుకుంటే వూరికి ప్రమాదమని గబుక్కున వాడి దగ్గరికి వెళ్ళి వాడి మెడ పట్టుకొని వేలాడుతూ లోనికి గుంజుకు పోయాడు పడవతాత.
***
ఉదయం ఎనిమిది గంటలు…..
వర్షం ఆగిపోయింది. వాతావరణం ప్రశాంతంగా వుంది. ఓ ఇద్దరు చేపలు పట్టుకునే జాలరులు నది ఒడ్డుకు వచ్చారు. అక్కడ పడవతాత ఒకతని మెడ పట్టుకొని గుంజుతున్నట్టు వుండి ఇద్దరూ శవాలై ఒడ్డున తేలి పడున్న ఆ దృశ్యాన్ని చూసి షాక్కు గురైయ్యారు.
అంతే! విషయం నిముషాల మీద వూరికి తెలిసిపోయింది. ఆ విషయం తెలుసుకున్న అప్పయ్య మరికొందరు పెద్దలు మరో పడవనెక్కి ఘటనా స్థలానికొచ్చారు. పరిస్థితిని పరిశీలనగా చూశారు. అదెలా, ఎందుకు జరిగిందో కూడా వెంటనే అర్థం చేసుకున్నారు. అవును. అంతకు ముందురోజే వాళ్ళతో నారాయణ అన్న మాటలు వాళ్ళకు అప్పుడు గుర్తుకొచ్చాయి, ఓట్లు వేయమని తెగేసి చెప్పిన వాళ్ళ ప్రజలను బాంబులతో చంపించాలని నారాయణ చేసిన కుట్రేనని తెలుసుకున్నారు. రెండు శవాలను మంచం మీద వేసుకొని తీసుకువెళ్ళి వూరిజనం దర్శనార్థమై గుడి ప్రాంగణంలో కాస్సేపు వుంచి మధ్యాహ్నానికికల్లా ఖననం చేశారు…….
***
ఇది బాబూ ఆ పడవతాత చరిత్ర. మా కోసం, వూరి కోసం తన ప్రాణాలను పోగొట్టుకొన్నాడు. ఆ తరువాతే ప్రభుత్వం మా వూరిని పరిగణలోకి తీసుకొని అన్ని పనులను చేసి పెట్టింది. ఇప్పుడిక్కడ పడవలు లేవు నావద్ద వున్నది పడవతాత పడవ. అదే ఆయన జ్ఞాపకంగా నావద్ద మిగిలిపోయింది. నా కుటుంబానికి భుక్తికి ఆధారమైంది. ఇప్పుడు నాలుగైదు మోటారు లాంచీలు వున్నై.ఈ వూరు ఇప్పుడు నాగరికంగా తేలింది. ఇదో పర్యటక కేంద్రంగా వెలసిల్లుతోంది. ప్రభుత్వపు బడులు రెండున్నై. ఆసుపత్రి వుంది. మేము చేస్తున్న వృత్తులే కాక ప్రభుత్వపు పర్యవేక్షణలో రెండు మూడు కార్యాలయాలున్నై. ఇప్పుడు మా పిల్లలు పెద్ద చదువులు చదువుతున్నారు. నా కొడుకు బీ.టెక్. ఫైనల్ ఇయర్ పట్టణంలో చదువుతున్నాడు”అని చెప్పి ముగించాడు అప్పయ్య.
అంతలో కాఫీ తెచ్చి ఇచ్చింది సీత.
“తాగండి బాబూ! పొద్దుపోయింది. మిమ్మల్ని పడవతాత పడవలోనే ఆ ఒడ్డుకు తీసుకు వెళతాను” అంటు పైకి లేచాడు. ఎదరే కాలేజీనుంచి తన కొడుకు వస్తోంది గమనించిన అప్పయ్య సగర్వంగా “ఆ వస్తున్నవాడే నా కొడుకు. పట్టణంలో బీ.టెక్. చదువుతున్నాడు” అంటూ ఒడ్డునున్న పడవతాత పడవ వద్దకు నడిచాడు రీసెర్చి విద్యార్థులు రంజిత్,రమలతో.
(సమాప్తం)