[box type=’note’ fontsize=’16’] తిరుమలేశుని సన్నిధిలో తమ అనుభవాలను, అక్కడ జరిగే పలు ఉత్సవాలను, వేడుకలను వివరిస్తున్నారు డా. రేవూరు అనంతపద్మనాభరావు. [/box]
[dropcap]స్వా[/dropcap]మి సన్నిధిలోని తిరుపతిలో రెండేళ్ళ ఎం.ఏ. పూర్తి చేయడం ఓ వరం! 1965-66 మధ్య మంచాల వీధిలో వున్నాను. 1966-67 మధ్య ఫైనల్ ఇయర్‍లో యునివర్సిటీ హాస్టల్ సి బ్లాక్‌లో చేరాను. ఆ సంవత్సరం 1966 సెప్టెంబరు 5 న నేనొక సెమినార్ పేపరు తయారు చేసి మా ఎం.ఎ. విద్యార్థులు ఉభయ సంవత్సరాల వారు, అధ్యాపకుల ముందు ప్రసంగించాను. అలా సెమినార్ ఏర్పాటు చేయదం అదే ప్రథమం. జి.యన్.రెడ్డి గారి ఆలోచన అది. భవిష్యత్తులో మేము తెలుగు అధ్యాపకులుగా చేరితే బెరుకు లేకుండా ఉండేందుకు ఈ ప్రణాళిక తయారుచేశారు.
నేను తిమ్మావజ్ఝల కోదండరామయ్య గారి ప్రియశిష్యుణ్ణి. ఆయన ఒక్కడికే కాదు, ఆచార్యులందరికీ అభిమానపాత్రుణ్ణి. ఆయన మాకు బాల ప్రౌఢ వ్యాకరణాలు పాఠం చెప్పారు. నాకు బాల వ్యాకరణం తొలి మూడు పరిచ్ఛేదాలు బి.ఏ. లోనే కంఠతా వచ్చు. అందువల్ల క్లాసులో ముందు వరుసలో కూచొని ఆయనను బాగా ఫాలో అయ్యేవాడిని. వారి సలహా మేరకు ‘బాలప్రౌఢలు సాధింపని ప్రయోగ విశేషాలు’ అనే సెమినార్ పేపరు తయారు చేశాను.
సెప్టెంబరు 5 అధ్యాపక దినోత్సవం. ఆ రోజో నా ఆరంగేట్రం. ఏ విధమైన బెరుకు లేకుండా 45 నిమిషాలు మాట్లాడాను. భవిష్యత్తులో అధ్యాపక వృత్తి స్వీకరించడానికి అలా శుభారంగం జరిగింది. ప్రొఫెసర్ జి.యన్.రెడ్డి తదితరులు అభినందించారు.
మా రూమ్‌లో నేను, ఏ.వి. సుబ్బారావు (శాతవాహన కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా తర్వాత చేరాడు) ఉండేవాళ్ళం. మా రూమ్‌కి మిగతా క్లాస్‌మేట్స్ వచ్చి నా దగ్గర వ్యాకరణ ముఖ్య సూత్రాలు చెప్పించుకునేవారు. టౌన్ లోకి వెళ్ళే సమయంలో కూడా సాహిత్య చరిత్ర చెప్పేవాడిని. మాతో చదివిన వారిలో వయసులో పెద్దవాడు బండ్లమూడి సత్యనారాయణ. మంచి పద్యకవి. ఏలూరు సి.ఆర్. రెడ్డి కళాశాలలో ట్యూటర్‌గా చేస్తూ ఎం.ఏ. చేయడానికి వచ్చాడు. తర్వాత అదే కాలేజీలో తెలుగు హెడ్‌గా రిటైరయ్యాడు. మిగతా మిత్రులలో ఉప్పలపాటి శ్రీరామమూర్తి, సి.వి.ఆర్, గుర్రెడ్డి, యస్.వి.కృష్ణారెడ్డి, ఏ.వి.నారాయణ, గంగరాజు ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకులుగా చేరారు. నేను కూడా 1967 డిసెంబరులో కందుకూరు ప్రభుత్వ కళాశాల అధ్యాపకుడిగా 1975 ఆగస్టు వరకు చేశాను. ఉషారాగ, మనోజ మద్రాసులో, భాస్కరశేషారత్నం, ఉదయిని పద్మావతి మహిళా కళాశాలలో అధ్యాపకులయ్యారు. చంద్రశేఖర్ కర్నాటక ప్రభుత్వ కళాశాలలో చేరాడు.
సి.వి.సుబ్బన్న అష్టావధానం:
రాయలసీమ అవధానులకు ప్రశస్తి. ప్రొద్దుటూరుకు చెందిన సి.వి.సుబ్బన్న శతావధాని బాగా ప్రసిద్ధులు. ఆయన అష్టావధానాన్ని తెలుగుశాఖ పక్షాన 1966 డిసెంబరు 18న యూనివర్శిటీలో ఏర్పాటు చేశారు. సభకు రిజిస్ట్రారు వై. విశ్వనాధం అధ్యక్షులు. ప్రముఖ సాహితీ విమర్శకులు శ్రీమాన్ రాళ్ళపల్లి అనంతశర్మ ముఖ్య అతిథి. అధ్యాపకులు పృచ్ఛకులు. ఓరియంటల్ కళాశాల అధ్యాపకులు, స్వయంగా అవధాని అయిన గౌరిపెద్ద రామసుబ్బశర్మ సమస్యనిచ్చారు. గంటలు కొట్టడానికి అధ్యాపకులు కూచోడం భావ్యం కాదని ఫైనల్ ఇయర్ విద్యార్థినైన నన్ను కూచోబెట్టారు.
అప్పటికే నేను ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి 50కి పైగా సమస్యాపూరకాలు ప్రసారం చేశాను. ఆంధ్రపత్రిక దినపత్రికలో నా కవితలు వచ్చాయి. వాటి అన్నింటిని మించి కాకినాడ నుండి వెలువడే సాహిత్య త్రైమాస పత్రిక – ఆంధ్ర సాహిత్య పరిషత్ -పత్రికలో నా సుదీర్ఘవ్యాసం ప్రచురితమైంది – దాని విషయం – ఉత్తర రామాయణము. తిక్కన, కంకంటి పాపరాజుల శైలి. స్రవంతి మాసపత్రికలో చాలా సాహిత్య వ్యాసాలొచ్చాయి. ఈ నేపథ్యంలో నన్ను గంటా తాడనకు కూచోబెట్టారు. మధ్యమధ్యలో అవధాని ధారణ చెడగొట్టడానికి గంటలు కొట్టాలి. 14 గంటలు కొట్టాను. అవధాని చివర్లో ఆ సంఖ్య సరిగ్గా చెప్పారు.
గౌరిపెద్ద వారు ఇచ్చిన సమస్య నాకిప్పటికీ బాగా గుర్తు:
“రాముని మాని రావణు ధరాసుత ప్రీతి వరించు భర్తగా“
సీతాదేవి రాముని కాదని రావణుని భర్తగా వరించడం అసంబద్ధం. మాములుగా సమస్యలో మొదటి పదాన్ని విరిచి పూరిస్తారు. సమస్య ఇచ్చినవారు పండితులు. ఆ సమస్యను ఏ విధంగాను పరిష్కరించలేరు. అందుకని అవధాని ప్రశ్నార్థకంగా పూరించవలసి వచ్చింది. ఆ పూరణ ఇలా కొనసాగింది.
శ్యామల కోమలాంగుడు ప్రసన్న ముఖాంబుజు డార్యగణ్యుడు
ద్దాము ధనుశ్ఛిదాప్రకటితస్ఫుటదుర్దమ బాహువీర్యుడున్
భూమి పుడుండ గాధిసుతమ్రోల రమారమణీయ ఏ గతిన్
రాముని మాని రావణు ధారసుత ప్రీతి వరించు భర్తగన్?
అని పూరించారు
నా అవధాన విద్యకు బీజం:
అవధానం పూర్తి అయి మా హాస్టల్ రూమ్‌కి వచ్చాం. మెస్‌లో భోం చేశాం. నా రూమ్‍మేట్ సుబ్బారావుతో నేను “సుబ్బన్న ఈ సాయంకాలం చెప్పిన పద్యాలు అన్నీ నేను ధారణ చేశాను. అవి చెప్తాను సుమా!” అన్నాను. సుబ్బారావు ‘సరే’నన్నాడు. వరుసగా పద్యాలు – సమస్య, దత్తపది, వర్ణన, నిషిద్ధాక్షరి – టకటకా చెప్పేశాను. అతడు నన్ను కౌగిలించుకున్నాడు. ఆ తర్వాతి కాలంలో నేను కందుకూరు ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకుడిగా చేరడం, అవధాన జైత్రయాత్రకు గజ్జె కట్టడం జరిగిపోయాయి. ఆంధ్రదేశంలోనే గాక, బయటి రాష్ట్రాలలోనూ అవధానాలు 1969-76ల మధ్య అనేకం నిర్వహించాను.
1967 ఏప్రిల్‌లో ఎం.ఎ. ఫైనల్ పరీక్షలు పూర్తి అయ్యాయి. వీడ్కోలు సభలో ఒకరినొకరు ఆదరాభిమానాలతో అభినందించుకున్నాం. మా అధ్యాపకులు నాకు మంచి భవిష్యత్తు ఉందని ఆశీర్వదించారు. ఆచార్య కోరాడ మహాదేవశాస్త్రి మాకు లింగ్విస్టిక్స్, ప్రాచీన సాహిత్యము రెండేళ్ళు చెప్పారు. ఆయన గొప్ప భాషా పరిశోధకులు. శ్రీరామమూర్తి ఆయనకు ప్రియశిష్యుడు. జీరెడ్డి చెన్నారెడ్డి ఆజానుబాహువు. కంచుకంఠం. మాకు సాహిత్యవిమర్శ చెప్పారు. రాయలసీమకు చెందిన ఆయన మంచి అధ్యాపకుడు.
జాస్తి సూర్యనారాయణ మాకు సంస్కృతం – పాణిని చెప్పారు. తర్వాతి కాలంలో 1973-1976 మధ్య అధ్యాపకుడిగా పనిచేస్తూ వారి పర్యవేక్షణలో కందుకూరి రుద్రకవి రచనలపై పరిశోధన చేసి పి.హెచ్.డి. సంపాదించాను. ఆయన మాట కటువు. ఆయన వద్ద శిష్యరికం నాకొక మార్గదర్శనం.
తిమ్మావజ్ఘల కోదండరామయ్య బహుభాషావేత్త. వ్యాకరణాన్ని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో దువ్వూరి వెంకటరమణశాస్త్రి, తిరుపతిలో వీరు అద్బుతంగా బోధించేవారు. వారు పెట్టిన జ్ఞానభిక్ష నాకు వ్యాకరణం. వారు పాఠం చెబుతున్నప్పుడు నేను వ్రాసుకున్న నోట్స్ ఆధారంగా నేను భారతి మాసపత్రికలో ‘ప్రయోగ విశేషములు’ అనే వ్యాసం ప్రచురించాను. ఆ వ్యాసం ఆయన ప్రచురించాలని భావించారేమో, నేను ముందుగా వ్రాసినందుకు బాధపడినట్లున్నారు. నా థీసిస్ వారి వద్దకు వెళ్తే మూడు నెలలు సమాధానం యూనివర్శిటీకి పంపలేదు. శాంతినికేతన్‌లో కలిసినప్పుడు నా తొందరపాటును విన్నవించాను.
స్వామి అనుగ్రహం:
రెండేళ్ళ ఎం.ఏ. పూర్తయి ఫలితాలు వచ్చాయి. నాకు 70శాతం మార్కులు వచ్చాయి. తర్వాత కొద్ది రోజులకు నాకు యూనివర్శిటీ ఫస్ట్ వచ్చినట్లు ప్రకటించారు. రెండోవాడుగా శ్రీరామమూర్తి నిలిచాడు. తిక్కవరపు రామిరెడ్డి – యూనివర్శిటీలో తెలుగు ఎం.ఏ.లో ప్రథముడిగా వచ్చినవారికి ‘గోల్డ్ మెడల్’ ఏర్పాటు చేశారు. 1967లో అది నాకు లభించడం కేవలం స్వామి అనుగ్రహమే. అదే సమయంలో యం.సుబ్బారావు అనే వ్యక్తి పేర తెలుగులో ఫస్ట్ వచ్చిన వ్యక్తికి రూ.500/- పుస్తకాలు కూడా బహుకరించారు.
తిక్కవరపు రామిరెడ్డి నెల్లూరీయులు. బెజవాడ గోపాలరెడ్దికి పిల్లనిచ్చిన మామ. ఆయన అప్పట్లో రెండు లక్షల రూపాయల విరాళం ఇస్తే 1966లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కందుకూరులో ప్రభుత్వ కళాశాల ఏర్పాటు చేశారు. అదే కళాశాలలో నేను అధ్యాపకుడిగా 1967 డిసెంబరు 16న చేరడం యాదృచ్ఛికం.
నేను ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి పూజ చేసి కొబ్బరికాయ కొట్టడం అలవాటు. ఆయన మీదనే నమ్మకం. ఎం.ఏ. ఫలితాలు రాగానే నేను హైదరాబాద్ వెళ్ళి డైరక్టరేట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆఫీసులో ఒక డబ్బాలో నా అప్లికేషన్ 1967 ఆగస్టు ప్రాంతంలో వేసి వచ్చాను.
1967 డిసెంబరు మొదటివారంలో తిరుపతిలోని మా బ్యాచ్ విద్యార్థులందరికీ ప్రభుత్వ కళాశాలలో తెలుగు శాఖలో ఉద్యోగాలు లభించాయి. శ్రీరామమూర్తిని అనంతపురం వేశారు. నన్ను కందుకూరు వేశారు. కందుకూరు అప్పట్లో నెల్లూరు జిల్లాలో భాగం. 1969లో ప్రకాశం జిల్లా ఏర్పడింది. మా కళాశాల ప్రిన్సిపాల్‌గా టి,కె. కృష్ణ స్వామి అనే సౌజన్యమూర్తి వుండేవారు. తెలుగు శాఖాధ్యక్షులుగా జంధ్యాల లక్ష్మీనారాయణశాస్త్రి పనిచేసేవారు. అప్పుడు నా వయసు నూనూగు మీసాల నూత్న యవ్వనం. 20 ఏళ్ళు పూర్తయి కళాశాల అధ్యాపకుడిగా అడుగుపెట్టాను. దాదాపు 8 సంవత్సరాలు 1975 ఆగస్టు 16న ఆకాశవాణి కడపలో ప్రసంగశాఖ ప్రొడ్యూసర్‌గా చేరేవరకు కందుకూరులోనే పనిచేశాను. ఎదుగూబొదుగూ లేని ఉద్యోగమది. డైరక్ట్ సెలెక్షన్ ద్వారా స్వామి కృపతో ఆకాశవాణిలో చేరాను.