మిర్చీ తో చర్చ-20: ప్రేమ – మిర్చీ… ఒకటే-2

0
3

[box type=’note’ fontsize=’16’] వేడి మిర్చీ బజ్జీలో కారాన్ని కొరకగానే కలిగే భావనను కలిగించే పచ్చిమిర్చి కారం లాంటి వ్యంగ్యంతో వేదాంతం శ్రీపతి శర్మ అందించే ఫీచర్ “మిర్చీ తో చర్చ“. [/box]

[dropcap]ఈ[/dropcap] ప్రేమ పిచ్చోడు వదలలేదు. డబ్బులు కట్టి మరల తయారయ్యాడు. ఈసారి ఎందుకో ఒక టోపీ పెట్టుకున్నాడు. సుందరం ఎందుకో మహదానందంలో ఉన్నాడు. ఒకసారి డాక్టర్ వద్దకు వచ్చిన రోగి మరోసారి మరో రోగంతో వచ్చినప్పుడు ఎంతగా ఆనందిస్తాడో అంత సంతోషంతో వచ్చి కూర్చున్నాడు. కుర్రాడు పులకించిపోయాడు.

“నా సలహా పాటించి ఓడిపోయినవాడు ఎవరూ లేరు” అన్నాడు సుందరం. “…నా వంటి మేధావి వద్ద…” అంటుండగా సింహం చెయ్యి అడ్డం పెట్టాడు.

“సార్ మీ సలహా విని, పాటించి, భంగపడి మళ్ళీ వచ్చాను” అప్పటివరకూ మెడలో మంగళ సూత్రం కట్టించుకోబోతున్న పెండ్లి కుమార్తెలా ముందుకు వంగిన సుందరం ఇప్పటికే ఈ పెండ్లి పొరపాటుగా కూడా జరగదు అన్నట్టు వెనక్కి వాలిపోయాడు.

“ఏం జరిగింది?” అడిగాడు.

“మీరు ఆ సందర్భంలో తల ఆడించమన్నారు.”

“కరెక్ట్.”

“నేను గంగిరెద్దులా తల ఆడించాను.”

“వెరీ గుడ్.”

“అమ్మాయి నన్నసలు పట్టించుకోలేదు.”

ఈసారి సుందరం చెయ్యి అడ్దుపెట్టాడు.

“నో… నో… నో… తొందరపడకూడదు. అమ్మాయి అలా చేసిందీ అంటే మరోసారి అక్కడికే వెళ్ళి, ఆ సమయంలోనే తనని చూడాలనీ, ఆమె మిమ్మల్ని కూడా చూడాలనే ఒక పవిత్రమైన ఆలోచన ఆ క్రియలో అంతర్లీనంగా, అంతర్వేదిగా జాలువారుతోందని అర్థం.”

“ఛా.”

“అవును.”

“కాదండీ. అమ్మాయి అసలు నన్ను గుర్తుపడితే కదా? అయినా నా పిచ్చిగానీ నేనెవరిని? నన్ను ఎందుకు గుర్తుపట్టాలి?”

“తప్పు. మిర్చీ తీస్కోండి.”

“ప్రేమలో ఆదుర్దా, ఆత్రత… ఇలా అన్నీ ‘అ’కారంతో ప్రారంభం అయ్యేవే ఉన్నాయి. ఆడది కూడా అంతే…”

“సార్….” సుందరం చెబుతున్నాడు, “… అమ్మాయిలు మిర్చీ వంటి వారు. సారవంతమైనవారు. అబ్బాయిలు కాప్సికమ్ వంటివారు. ఆకారమే కానీ కారం ఉందదు.”

ఎక్కడో అంతరంగంలో చిక్కుని మనసుని బాధపెడుతున్న ఓ చిక్కుముడిలా, ఎక్కడో లోపల కొండనాలుక దగ్గర తగులుకుని రగిలింపజేసిన మిర్చీ గింజలా మొహం పెట్టాడు సింహం.

“ఇది అన్యాయం సార్. ఇంతకీ నన్ను ఏం చేయమన్నారు?”

“మరల అడ్డం వెళ్ళాలి”

అతను లేచిపోయాడు. ఇద్దరం కలిసి కూర్చోబెట్టాం.

“ప్రేమలో ఇంత ఆవేశం పనికిరాదు. ప్రేమ అంటే ఏంటో తెలుసా?”

అందరం ఒకళ్ళ మొహాలొకళ్ళు చూసుకున్నాం.

“ప్రేమ కనబడదు. మనం పడిపోవాలి. ప్రేమ కనిపించదు. మనం కనిపించాలి. జీవితాన్ని సుడిగుండంగా తలచి మనం ఎదురీదాలి. పాలను కావాలని విరగ్గొట్టి కలలతో కళాఖండాన్ని సృష్టించాలి…”

కళ్ళు మూసుకుని అలా చెప్పుకుంటూ వెళుతున్న సుందరాన్ని చిన్నగా కదిలించాను. అతను కళ్ళు తెరిచాడు. నరసింహం అప్పటికే అక్కడి నుండి లేచాడు. కష్టంలో పట్టుకొచ్చి కూర్చోపెట్టాం.

అతను బేలగా చూశాడు.

“ఆఫ్టరాల్, నేనడిగింది ప్రేమ సాఫల్యం… ఇలా చిత్రహింస పెట్టడం మాత్రం బాలేదు.”

“మరేం ఫరవాలేదు. మిర్చీ తీస్కోండి.”

మరో మిర్చీ బజ్జీ తీసుకున్నాడు. ఉలిక్కిపడ్డాడు.

“ఏంటి సార్ ఇది? అయ్యబాబోయ్! చచ్చాను. నీళ్ళు… మంచి నీళ్ళు…”

సోఫాలో వజ్రాసనం వేసాడు సింహం. అలా ఎగరనిచ్చి అప్పుడు ఓ గ్లాసు మంచి నీళ్ళు అందించాడు సుందరం.

“నన్ను పసివాడిని చేసి కసి తీర్చుకుంటున్నారన్న మాట!”

“ఓ… ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు! శభాష్. ప్రేమికులు దెబ్బ తినడానికి ఎంత సిద్ధంగా ఉంటారో తెలుసుకోవటం మా ధర్మం!”

“మీ మొహం తగలెయ్య.”

“శాంతి. రేపే మీ సినిమా విడుదల.”

“ఛా.”

“అవును.”

“ఎలా? ఎలా అంటే ఎలా?”

“ఊహించుకో.”

అతను కళ్ళు మూసుకున్నాడు. సుందరం మంచి నీళ్ళు త్రాగాడు.

“ఓకే. అమ్మాయి బస్సు దిగుతుంది…”

“ఆకుపచ్చని చుడీదార్.”

“ఏ మాత్రం సందేహం లేదు.”

“ఎర్రని చున్నీ.”

“గన్ షాట్.”

“ప్రక్కనే ఉన్న ఎవరితోనో చక్కని చిక్కని నవ్వులు!”

“ప్రక్కన ఉన్నవారు అబ్బాయా? అమ్మాయా?”

“ప్రేమ సందేహాలు వద్దు బ్రదర్. మరో చక్కని అమ్మాయి…”

“శభాష్.”

“నో… ఆ అమ్మాయి వైపు మనసు వెళ్ళకూడదు. ప్రిసిషన్ టార్గెట్ – ప్రేమ సర్జికల్ స్ట్రైక్ లాంటిది.”

“వాళ్ళిద్దరూ మీ వైపు నడుచుకుంటూ వస్తున్నారు.”

“అయ్యో వచ్చేసారు.”

“వచ్చారా?”

“యస్. ఇప్పుడు మన మిసైల్ రెడీగా ఉండాలి.”

“అంటే?”

“ఆలోచించండి.”

“ఎదురుగా వెళ్లి డాష్ ఇవ్వాలా?”

“కాదు. అదే బస్సు ఎక్కుతున్నట్లు నటించి పరుగు తియాలి.”

“సార్! ప్రేమ లోకి దింపమంటే అందులోంచి కాఫీ కప్పులోంచి ఈగను తీసి పారేసినట్లు బయటకి లాగి పారేస్తానంటారేంటి?”

“ధీమా! ప్రేమకు అది కావాలి. జాగ్రత్తగా వినండి. పరిగెడుతున్నట్లు నటించాలి.”

“ఓ.”

“వాళ్ళు అడ్డం వచ్చినట్లు విసుక్కోవాలి. లంకె పడాలి. అటూ ఇటూ ఊగి కన్‌ఫ్యూజ్ చెయ్యాలి. నాజూకుగా ఆమెను తప్పించి, ఆ చిన్ని తాకిడికే ఒక స్పందనను సృజించి అనుకోకుండా జరిగినట్లు జరిపించి సారీ చెప్పి విపరీతంగా  బాధ పడినట్లు ప్రదర్శన ఇచ్చి జరిగిపోవాలి. ఇదీ లెక్క!”

అతడు ఆలోచిస్తున్నాడు. కాటరాక్ట్ శస్త్ర చికిత్స జరిగాక నిదానంగా కట్లు విప్పి కళ్ళు తిరిచినట్లు కళ్ళు తెరిచాడు. అప్పుడే అంతా జరిగినట్లు చిన్నగా కులికాడు. సుందరం సినిమా ఫక్కీలో నిట్టూర్చాడు.

“కొద్దిగా నటన తప్పదు…” సుందరం చెప్పాడు. “… అబద్ధం నుంచే నిజం కనిపిస్తుంది. మిర్చీ బజ్జీయే దీనికి తార్కాణం. పైన ఉన్న పిండిని తింటూ వెళ్ళాక, పిండినీ, మిర్చీని కలిపి కొరుకుతూ లోలోపలికి వెళ్ళిన తరువాత సహజమైన ప్రేమ తత్వంలో పిండీ వుండదు, మిర్చీ ఉండదు, అంతా మమేకం!”

“ఆకాశంలో తేలుతున్నట్లుంది సార్. కానీ ఒక సందేహం!”

“చెప్పండి. మంచి ప్రేమికులకే సందేహాలొస్తాయి. ద్వేషించేవారికి ఏ జంకూ ఉండదు.”

“బుల్లెట్ దింపారు సార్. మీరు చెయ్యమన్నది చేస్తాను.”

“వెరీ గుడ్.”

“కానీ…”

“కానీ…?”

“కానీ ఈ హడావిడిలో ఆమె క్రింద పడ్దా, నేను క్రింద పడ్డా, పక్కనే ఉన్న…”

“నో… ప్రక్కన ఉన్న ఆమె గురించి ఆలోచించకూడదు. పిట్ట కన్ను కూడా కాదు, కంటిలోని గుడ్డు కనిపించాలి.

“అలాగే సార్. క్రింద పడిపోతే?”

“నో ప్రాబ్లమ్! రొట్టె విరిగి నేతిలో కాదు, నెత్తిమీద పడ్డట్టే… ఆ భంగిమ, ఆ సందర్బం… అహా… ఊహించుకుంటేనే అమృతంలో ఈత కొడుతున్నట్లుంది!… అరె… ఏడి ఈయన?”

నరసింహం సోఫాలోంచి క్రింద పడి వాస్తు ప్రకారం స్లోపు ఇచ్చిన ఈశాన్యం వైపుకు అప్పటికే దొరలి పోతున్నాడు.

***

ఫోన్ మ్రోగింది.

“హలో!”

“సార్, సింహం! నరసింహం!”

“గుడ్. పడ్డారా? నో… నే చెప్పింది చేసారా?”

“చేసాను. మీరన్నట్లు ఇద్దరు దిగారు.”

“శభాష్.. నా మాట… ఒక్కమాట మూడు బుల్లెట్ల మూట! కమాన్! ఏమైంది?”

“స్పీడ్‌గా వెళ్ళాను.”

“సూపర్.”

“ఆమె చిత్రంగా చూసింది.”

“కింగ్. యు ఆర్ కింగ్.”

“ఆమె తప్పించుకోవాలని తన కుడివైపుకు జరిగింది. నేనూ అటే జరిగాను.”

“దట్సిట్.”

“మరల ఇటు జరిగింది. నేనూ ఇటే జరిగాను.”

“దీనిని ఆంగ్లంలో కంపల్సివ్ ఇంపల్స్ అనేసారు.”

“మరల అటు, మరల ఇటు.”

“యు రాక్‍డ్! రాక్ అండ్ రోల్ యా!”

“ఆమెకు ఏమైందో తెలియదు. నన్ను ఒక్క తోపు తోసింది.”

“తోపు కాకపోవచ్చు సింహా… అది ప్రేమ తాపం!”

“పూర్తిగా చెబుతాను. పూర్తిగా వినండి.”

“ష్యూర్.”

“నేను పడిపోయా.”

“ప్రేమలో!”

“కాదు. నా చెప్పు ఆమె చెప్పుతో పెనవేసుకుని తెగిపోయి నా వద్దకు వచ్చి వాలింది.”

“అది ప్రేమలో….”

“ఆగండి. ఆమె ప్రక్కనున్న యువతి ఆడపులి.”

“…”

“ఆ తెగిన చెప్పు తీసుకుని నా వైపు పరుగు తీసింది.”

“ఆమె అలా చెయ్యలేదు చూసారా?!”

“ఆగండి. ఆమె ఆపింది.”

“శభాష్. దటీజ్ ప్రేమ!”

“తెగని రెండో చెప్పు తీసి అది కూడా వాడమని ఆమెకిచ్చింది. నేను గబుక్కున లేచి పరుగు తీసాను.”

ఫోన్ కట్ అయ్యింది. మరల మ్రోగింది.

“యస్?”

“నేను మిమ్మల్ని మరల రేపు కలుస్తాను.”

“దేనికి? చెప్పుదెబ్బలు కొడతారా?”

“నో! ఒక రహస్యం చెప్పాలి.”

00000

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here