కాలాష్టకమ్

1
3

ముచ్చటైన మోము మూడు ముళ్ళతొ గోము
హెచ్చరించు చుండు హెచ్చు చుండు
ముందు వెనుక గనక ముందు కేగుచు నుండు
ఆగ కుండ తాను సాగు చుండు ౧

మౌన భాష తోడ జ్ఞాన మొసగు చుండు
“ఆగ కుండ నీవు సాగు మెపుడు
తడవ కూడ నెపుడు తడబాటు లేకుండ
గడియ గూడ వ్యర్థ పడగ నీక ౨

మూడు నాళ్ళ బ్రతుకు మోసపోకుమెపుడు
నచ్చకున్న యెవరు మెచ్చుకున్న
మెచ్చు కొనక యెపుడు నొచ్చు కొనక సాగి
పోవు మెపుడు వెనుక ముందు గనక ౩

కనికరమ్ము లేని కాలపురుషుడేను
వ్యర్థ పరతు వేని వ్యర్థ పరతు
జ్ఞాను లెపుడు నన్ను ధ్యానించు వారలె
నన్ను మరచు వాడు నరక మొందు ౪

దైవమైన నేనె దయ్యమైనను నేనె
నన్ను గనుము గనుము నిన్ను కూడ
నన్ను మించు వారు యెన్న నెందును లేరు
తెలుసు కొనుము నీవు తెలివి బేర్చి ౫

టక్కు టిక్కు మంచు టెక్కు చూపుచు నుందు
లెక్క పెట్టు చుందు నిక్కువమ్ము
తప్ప నట్టి లెక్క తుప్పు బట్టని లెక్క
చుప్ప నాతి లెక్క తెప్ప లెక్క ౬

మరతు వేని నన్ను మట్టు బెట్టుదు నిన్ను
మరువకున్న మేలు మరచిబోకు
కాల మొకటె సుమ్ము కడవరకు నీ తోడు
నమ్మ వయ్య నన్ను వమ్ము కాదు ౭

అందమైన అలను అపరంజి శిల నేను
ఎదురు లేని వలను యిలను నేను
సత్య సంప దౌను సత్యమ్ము నిత్యమ్ము
జీవ కోటి యందు జీవ మేను” ౮

కాల మహిమ తెలిసి కాలూను వారల
విజయ పథము యెపుడు వీడి పోదు
క్రమము తప్పకుండ కాలాష్టకము పఠించ
కాల మెపుడు నిన్ను కాచు చుండు ౯

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here