నీలమత పురాణం – 14

0
5

[box type=’note’ fontsize=’16’] కశ్మీర్ ప్రాచీన చరిత్ర గురించి అవగాహన కలిగించి, భవిష్యత్తు గురించి ఆలోచనలు కలిగించాలన్న ప్రయత్నంలో భాగంగా ‘నీలమత పురాణం‘ అనువాదాన్ని తెలుగు పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ. [/box]

[dropcap]రు[/dropcap]ద్రుడు తనని ఆట పట్టిస్తున్నాడని గ్రహించిన విష్ణువు తాను కూడా నవ్వుతూ, “మీరేం కోరినా తీరుస్తాను” అన్నాడు.

రుద్రుడు విష్ణుచక్రాన్ని విష్ణువుకు అందించాడు.

అయితే తనకు విష్ణుచక్రాన్నిస్తూ ఆశీర్వదించిన శంభు, పార్వతుల విగ్రహాలను అలాగే ప్రతిష్ఠించాడు హరి. జలోద్భవుడి తల తెగి పడిన స్థలంలో తన నివాసం ఏర్పర్చుకున్నాడు. దాంతో ఋషులు, మునులు, దేవతలు, నాగులు, గంధర్వులు, అప్సరసలు అందరూ ఆ ప్రాంతానికి వచ్చారు. శివుడి నుండి చక్రాన్ని అందుకుంటున్న విష్ణువు విగ్రహాన్ని చూసి తరించారు. విష్ణువు నివాసాన్ని చూసి ఆనందించారు.

దేవతలు, గంధర్వులు, నాగులు అందరు విష్ణువు ముందు తమ తమ స్థానాలలో ఆశీనులయిన తరువాత రెండు చేతులు జోడించి కశ్యపుడు విష్ణువుని అభ్యర్థించాడు.

“దేవా ఈ దేశం మానవ నివాస యోగ్యంగా చెయ్యి. ఇక్కడ మనుషులు నివసించాలి. ఈ ప్రదేశం అత్యంత పవిత్రం, అతి సుందరంగా నిలవాలి.”

కశ్యపుడి మాటలు విన్న వెంటనే నాగులు తమ నిరసనను తెలిపారు.

“మునివర్యా, మేము మనుషులతో కలిసి జీవించం.”

వారి మాటలకు కశ్యపుడికి కోపం వచ్చింది.

“మీరు నా మాటలు పూర్తిగా వినకుండానే వ్యతిరేకతను వ్యక్తం చేశారు. సరే, మీరు మనుషులతో కలిసి బ్రతకకపోతే పిశాచాలతో కలిసి బ్రతకండి” అన్నాడు కోపంగా.

కశ్యపుడి ఆగ్రహాన్ని గ్రహించిన నీలుడు చేతులు జోడించి అభ్యర్థించాడు.

“మునిశ్రేష్ఠా, వాళ్ళకేమీ తెలియదు. వాళ్ళ మాటల్ని పట్టించుకోకండి” అని బ్రతిమిలాడాడు.

కశ్యపుడు శాంతించాడు.

“ఇసుక సముద్రంలో ఆరు యోజనాల వీచిక ఉంది. ఆ ప్రాంతంలో అతి భయంకరమైన పిశాచాలు దైత్యులతో కలసి బ్రతుకుతాయి. ఈ పిశాచాలను అదుపులో ఉంచేందుకు కుబేరుడు నికుంభ అనే ఉత్తముడిని పిశాచాలకు రాజుగా నియమించాడు. ప్రతి చైత్రమాసంలో ఇతడు పిశాచాలతో యుద్ధానికి వెళ్తాడు. ప్రస్తుతం నికుంభుడి ఆధీనంలో అయిదు కోట్ల పిశాచాలున్నాయి. ఈ అయిదు కోట్ల పిశాచాలతో నికుంభుడు దుష్టభావనలు గల పిశాచాలతో ఆరు నెలలు పోరాడుతాడు. ఈ దుష్ట పిశాచాలు కూడా అయిదు కోట్లు ఉంటాయి. పది కోట్ల పైనున్న పిశాచాలన్నీ ఈ ఆరు నెలల కాలంలో నాశనమవుతాయి. ఆశ్యయుజ మాసంలో నికుంభుడు తన అయిదు కోట్ల అనుచరులతో హిమాలయాలకు వస్తాడు. ఆరు నెలలు ప్రశాంతంగా, సంతోషంగా ఉంటాడు. ఈ రోజును నుంచి ప్రతీ ఆరు నెలలు నికుంభుడు, అతని అయిదు కోట్ల అనుచర పిశాచాలు ఇక్కడే నివాసం ఏర్పాటు చేసుకుంటాయి. అంటే మీరు ఆరు నెలలు మనుషులతో, ఆరు నెలలు పిశాచాలతో సహవాసం చేయాల్సి ఉంటుంది” అన్నాదు కశ్యపుడు.

అంటే కశ్మీరు ఆవిర్భావంతోటే జలోద్భవుడి పాలబడింది.

జలోద్భవ సంహారం తరువాత దేవతలందరూ కశ్మీరును తమ నివాసం చేసుకున్నారు. కాని అంతలోనే నాగుల అహంకారం వల్ల కశ్మీరు ఆరు నెలలు పిశాచాలను భరించాల్సి వచ్చిందన్న మాట.

ఇక్కడ మనం కాస్త ఆగి, ‘నాగులు’ అన్న పదం గురించి కాస్త లోతుగా చర్చించుకోవాల్సి ఉంటుంది.

భారతీయ పురాణాలను పరిశీలిస్తే, ఆధునిక మానవుడి ఊహకు, బుద్ధికి విరుద్ధమయిన అంశాలు కనిపిస్తాయి. అభూతకల్పనలు, కట్టు కథలు అనిపించే అంశాలుగా తోస్తాయి. నాగులు పూజలు చేయడం, భగవంతుని అభ్యర్థించడం, వానరాలు యుద్ధాలు చేయడం, సముద్రాలు దాటి ఆకాశంలో ఎగుర్తూండటం… మనుషులతో సమానంగా పోటీపడడం, రాక్షసులతో తలపడటం, పిశాచాలు, మానవులు, నాగులు కలిసి బ్రతకటం ఇలాంటి విషయాల గురించి చర్చించాల్సి ఉంటుంది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here