[box type=’note’ fontsize=’16’] ప్రాంతీయ దర్శనం సిరీస్‌లో భాగంగా గుజరాతీ సినిమా ‘భావనీ భవాయి’ని విశ్లేషిస్తున్నారు సికిందర్. [/box]
‘భావనీ భవాయి’
[dropcap]నా[/dropcap]టి గుజరాతీ సినిమా హిందీ సినిమాల ప్రభావంతో అలరారిందే. 85 ఏళ్ల చరిత్రలో వెయ్యి సినిమాలు తీసి అతిపెద్ద ప్రాంతీయ సినిమా రంగంగా పేరొందింది. ఒకవైపు హిందీ సినిమాల శైలుల్లో వ్యాపారాత్మక సినిమాలు తీస్తూనే అప్పుడప్పుడు వాస్తవిక సినిమాలు కూడా తీస్తూ వచ్చింది. అలాటి ఒక వాస్తవిక సినిమా 1980లో నిర్మించారు. భక్తీ పౌరాణిక సినిమాలు నిర్మిస్తున్న కాలంలో వాస్తవిక సినిమా, అదీ ఓ జానపద కళారూపాన్ని ఆధారం చేసుకుని నిర్మించడం, దానికి విపరీతమైన పేరు ప్రఖ్యాతులు రావడం విశేషం. బాలీవుడ్ దర్శకుడు కేతన్ మెహతా తీసిన తొలి చిత్రం కూడా ఇది కావడం విశేషమే. దీని పేరు ‘భావని భవాయీ’. అంటే జీవిత కథ. ఇదే పేరుతో ధీరూ బెన్ పటేల్ రాసిన నాటకం దీనికాధారం. భావాయీ అనేది ఒక రకమైన జానపద బృందగానం. అస్పృశ్యతా భావాన్ని ఇతివృత్తంగా తీసుకుని దీన్ని నిర్మించారు. దీంతో సినిమా రంగ ప్రవేశం చేసిన కేతన్ మెహతా, అప్పటి వాస్తవిక సినిమాల స్టార్స్ అయిన నసీరుద్దీన్ షా, స్మితా పాటిల్, సుహాసినీ మూలే, దీనా పాఠక్, ఓం పురి, బెంజమిన్ గిలానీ మొదలైన నటీ నటుల్ని తారాగణంగా తీసుకున్నాడు.
ఒక హరిజనుల (దళితుల) బృందం వలసపోతూ ఓ రాత్రి నగరంలో ఆగడంతో కథ ప్రారంభమవుతుంది. బృందంలో మాలో భగత్ అనే వృద్ధుడు (ఓం పురి) చక్రసేన్ అనే రాజు కథ పారాయణం చేస్తాడు. రాజు చక్రసేన్ (నసీరుద్దీన్ షా) తనకి వారసుడు లేడన్న బాధతో వుంటాడు. ఇద్దరు భార్యలూ బిడ్డల్ని కనలేదు. ఒక రోజు అతను దర్బారులో దుర్వాసన భరించలేక ఏమిటిదని ఆడుగుతాడు. సఫాయీ కార్మికులు పెళ్ళికి వెళ్ళడం వలన శుభ్రం చేయలేదని భటులు చెప్తారు. రాజు ఆగ్రహించి, కొరడా దెబ్బలు తినేందుకు వెంటనే వాళ్ళని పిలిపించమంటాడు. ఇంతలో రాజు వేగులు వచ్చి రాజుకు వ్యతిరేకంగా ప్రజలు కుట్ర పన్నుతున్నారని చెప్తారు. దాంతో ప్రధానమంత్రి (బెంజమిన్ గిలానీ) సలహా మేరకు పొరుగు రాజ్యం మీద యుద్ధం ప్రకటిస్తాడు రాజు. ప్రధాన మంత్రి తన రెండో భార్య (సుహాసినీ మూలే) తో కులుకుతున్న విషయం తెలుసుకోలేకపోతాడు రాజు. ఐతే రాజు యుద్ధం ప్రకటించే లోగానే అవతలి రాజు ఇదే కారణాలతో అప్పటికే యుద్ధాన్ని ప్రకటించేసి వుంటాడు. ఇలా ప్రజలు తమ మీద కుట్రలు చేస్తున్నారని రాజులిద్దరూ పరస్పరం యుద్ధాలు ప్రకటించుకుంటారు. సమస్యల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలంటే ఇంతేగా. యుద్ధంలో చక్ర సేన్ సేనలు గెల్చినా భారీ ప్రాణ నష్టం జారుగుతుంది.
ఇదే సమయంలో చక్రసేన్ మొదటిభార్య గర్భం దాల్చిందని తెలుస్తుంది. దీంతో ప్రధాన మంత్రీ, రాజు రెండో భార్యా ఇంకో కుట్ర చేస్తారు. రాజగురువుని లోబర్చుకుని అతడి చేత రాజుకి చెప్పిస్తారు. ఇప్పుడు గనుక మొదటి భార్య కన్నదంటే రాజు పరమపదించడం ఖాయమని. దీంతో ప్రాణభయం పట్టుకున్న రాజు బిడ్డ పుట్టిన వెంటనే చంపెయ్యమని ఆదేశిస్తాడు. ఈ ఆదేశాలందుకున్న సైనికులు హృదయం కరిగి ఆ పని చేయలేకపోతారు. పుట్టిన బిడ్డని ఒక కలప పెట్టెలో పెట్టి నదిలో వదిలేస్తారు.
ఆ బిడ్డ ఒక భంగీ (హారిజనుల బృంద సభ్యుడు) కి దొరికి పెంచుకుంటాడు. అతనే ఇప్పుడీ కథ చెప్తున్న మాలో భగత్. బిడ్డకి జీవో అని పేరు పెట్టాడు. భార్య (దీనా పాఠక్) తో కలిసి ముద్దుగా పెంచుకున్నాడు. ఇటు రాజగురువు మళ్ళీ ఒక సలహా ఇస్తాడు. రాజు మళ్ళీ బిడ్డల్ని కోరుకుంటే మెట్ల బావి నిర్మించాలంటాడు. రాజు అంగీకరిస్తాడు. ఏళ్ల తరబడి మెట్ల బావి నిర్మాణం జరుగుతూ వుంటుంది. ఎంతకీ నీళ్ళు పడవు. ఇటు బిడ్డ జీవో (మోహన్ గోఖలే) నూనూగు మీసాల యువకుడుగా ఎదిగి, ఉజమ్ (స్మితా పాటిల్) అనే సంచార జాతి పిల్లతో ప్రేమలో పడతాడు.
అటు అనుకోకుండా రాజ గురువుకి జీవోయే రాజుకి పుట్టిన కొడుకుగా తెలుస్తుంది. దీంతో రాజుకి ఇంకో సలహా ఇస్తాడు. బావిలో నీళ్ళు పడాలంటే రాజు 32 పురుష లక్షణాలని విసర్జించే క్రతువు చేపట్టాలని. దీనికి బలి ఇచ్చేందుకు జీవో ఒక్కడే అర్హుడనీ చెప్తాడు. దీంతో రాజు ఆదేశాలతో సైనికులు వెళ్లి జీవోని పట్టుకుంటే అతను తప్పించుకుంటాడు. అప్పుడు ఇంకో భంగీకి అసలు విషయం తెలసి, రాజు పెద్ద భార్యకి చెప్పేయాలనుకుంటాడు. దీంతో ప్రధాని అతణ్ణి బంధిస్తాడు. ఇటు జీవో ప్రేమిస్తున్న ఉజమ్‌తో కలిసి ఒక పథకం వేసి, తనని బాలి ఇవ్వాలంటే రాజు అంటరాని తనాన్ని విడనాడాలనీ, లేదంటే తను ఆత్మహత్య చేసుకుంటాననీ, అప్పుడు రాజు క్రతువు పూర్తి చేయలేడనీ సమాచారం పంపుతాడు.
ఇక రాజుకి మార్గం లేక ఒప్పుకుంటాడు. ఇంతలో క్రతువు చేపట్టే రోజు, బందీగా వున్న భంగీ తప్పించుకుని జీవోయే రాజు కొడుకని రాజుకి చెప్పేస్తాడు. రాజు ఆనందభరితుడవురాడు. బావిలో బొటబొటా నీళ్ళూరుతాయి. కథ సుఖంతమవుతుంది…
ఇలా కథ ముగిస్తున్న మాలో భగత్‌కి ఒక భంగీ అడ్డుపడి ఇలాటి తియ్యటి కథలు చెప్పి పిల్లల్ని మభ్య పెట్టవద్దని అంటాడు. తను ఇంకో ముగింపునిస్తాడు. ఈ ముగింపులో బందీగా వున్న భంగీ తప్పించుకోలేదు. జీవో బలి, క్రతువు అనుకున్నట్టే పూర్తవుతాయి. బావిలో నీళ్ళు పడవు. నిజం తెలుసుకున్న పెద్ద భార్య బావిలో పడి ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో మాలో భగత్ రాజుని శపించి అదే బావిలో ఆత్మహత్య చేసుకుంటాడు. బావిలో నీళ్లూరి పొంగి ప్రవహిస్తాయి. ఆ వరదల్లో రాజు, మంత్రులూ అందరూ చనిపోతారు. ఇంకో వైపు భారత స్వాతంత్ర్య పోరాటం ఉధృతమవుతుంది…
సింబాలిక్‌గా సాగే ఈ కథ సాంతం వ్యంగ్యంగా వుంటుంది. డార్క్ హ్యూమర్, సెటైర్లు విరివిగా వాడేస్తారు. కేవలం మూడున్నర లక్షల రూపాయలతో నిర్మించిన దీనికి దేశవిదేశాల్లో ప్రసంశలు వెల్లువెత్తాయి. ప్రసిద్ధ దర్శకుడు సుధీర్ మిశ్రా దర్శకుడుగా మారడానికి ఇదే స్ఫూర్తి నిచ్చింది.